తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/కామ్యార్థ ఫలసిద్దిరస్తు

కామ్యార్థ ఫలసిద్దిరస్తు

దూషణరూపములో మిగిలియున్న దీవెనలను ఎక్కడైన కుగ్రామము లలో స్త్రీలు వాధించుకొనుపుడు తిట్లరూపములో వాడుచుండగ, దీవెనల రూపములోనున్న దూషణలను మాత్రము స్వాములుగనున్న పురుషులే ఎక్కువగ వాడుచున్నారు. వాటిలో అక్కడక్కడ వినిపించు కొన్ని వాక్యములను వివరించుకొందాము. మనిషికి గల గుణములు పండ్రెండు. అందులో ఆరుగుణములు చెడువి, ఆరుగుణము మంచివి గలవు. మంచి గుణములు పుణ్యమును, చెడుగుణములు పాపమును ప్రాప్తింపజేయును. పాపమును సంపాదించి పెట్టు చెడుగుణములలో ముఖ్యమైనది, మొదటిది ఆశ అనుగుణము. ఆశ అనుగుణము తన ప్రభావముతో మానవుని చేత ఏపనినైన చేయించును. ఆశ అనుగుణమును కామమని కూడ పిలుతురు. కామమును ఒక్క శృంగార విషయములో మాత్రము పనిచేయు గుణమనుకో కూడదు. ఏ విషయములలో అయిన ఆశ పుట్టితే దానిని కామమనవచ్చును. ధనము కావాలనుకోవడము కూడ కామమే అగును. ఆశ అనుగుణము చేత ధనము మీద కోర్కెకలుగడమును కామ్యార్థము అనికూడ అందురు. మొదట 'కామ్యార్థ ఫలసిద్ధిరస్తు' అనువాక్యము మానవునికి పాపమును చేకూర్చునదై చెడును ఆచరింపజేయు దూషణగ ఉండెడిది. అదెట్లనగా!


పూర్వము ఒకానొక ఊరిలో గుణంజయ అను వ్యక్తి ఉండెను. అతని పేరు గుణంజయ అయినప్పటికి అతనేమి గుణములు జయించిన వాడుకాదు. అట్లని సాధారణ వ్యక్తి కూడ కాదు, గుణములలో లోతుగ కూరుకుపోయిన మనిషి అతను. ఆశ అను గుణము మరి తీవ్రముగ పనిచేయుచుండెను. ఎల్లపుడు తనకు ఇతరుల సొమ్ము సులభముగ కావాలని కోరుకునే మనిషి. అతనికి దైవజ్ఞానమంటే ఏమిటో తెలియదు. దైవజ్ఞానముగల ఒక పెద్ద స్వామీజీ గుణంజయగల ఊరికి వచ్చాడు. ఆ ఊరిలోని వారందరు ఆస్వామీజీ దర్శనమునకు పోయి ఆయన వద్ద కొంత జ్ఞానము తెలుసుకొని వచ్చుచుండిరి. ఆ స్వామీజీ మహత్యమును కొందరు గొప్పగ చెప్పుకొనుచుండగ గుణంజయ స్వామీజీని గురించి విన్నాడు. గుణంజయ వినుచుండగ ఒకడు మరొకనితో ఈవిధముగ అనుచుండెను. "నాకు ఎంతో కాలమునుండి జ్ఞానము తెలుసుకోవాలను కోర్కె ఉండెడిది. స్వామిగారి దగ్గరకు పోయిన వెంటనే నన్నుచూచి నీకోర్కె నెరవేరుతాదని దీవించాడు. ఆయన దీవించినట్లే ఆయన ద్వారా నాకు తెలియనిది తెలిసింది. నాకోర్కె నెరవేరినది" అని చెప్పాడు. ఆ మాటలువిన్న గుణంజయ కూడ స్వామి వద్దకు పోతే తనకున్న కోర్కెలు నెరవేరుతాయనుకొన్నాడు. వెంటనే స్నానము చేసి ముఖాన విభూది మెడలో పూసలమాల వేసుకొని, భక్తునివలె కనిపించు ఎర్రగుడ్డలు కట్టుకొని, స్వామి వద్దకు పోయి సాష్ఠాంగదండ ప్రమాణము చేశాడు. అతనిని చూచిన స్వామీజీ "కామ్యార్థ ఫలసిద్ధిరస్తు" అని దీవించాడు. జ్ఞానము తెలియని గుణంజయ అది దీవెనే అనుకొన్నాడు. సంపూర్ణ జ్ఞానియైన స్వామీజీ అతని అంతరంగములో గల కోర్కెను గ్రహించి ఆమాట చెప్పాడు. స్వామిగారి దగ్గరకు వచ్చినపుడు గుణంజయ మనస్సులో ఎవడైన చాలాధనము తీసుకొనిపోవు యాత్రికుడు ఒంటరిగ కనిపిస్తే వానిని ఏమర్చి వాని ధనమును సులభముగ కొట్టివేసి తాను ధనికుడు కావాలని కోర్కె ఉండెడిది. నీవు కోరుకున్న కొర్కె ఫలితము నెరవేరవలెనని స్వామీజీ దీవించాడు. గుణంజయ కోరుకొన్న కోర్కె తనకు మంచిగ తోచినప్పటికి పాపము తెచ్చిపెట్టునదే కావున అది చెడు కోర్కె. చెడే జరగవలెనని చెప్పిన స్వామీజీ వాక్యము గుణంజయకు దీవెనగ కనిపించినప్పటికి అది నిజముగ దూషణయేనని అతనికి తెలియదు.


కోరుకొన్న కోర్కెలు జన్మాంతరమున నెరవేరునని చెప్పినట్లు గుణంజయ కోర్కె స్వామీజీ వాక్యము ప్రకారము మరుజన్మలో నెరవేరినది. అది ఏవిధముగ నెరవేరిందంటే! గుణంజయ మరుజన్మలో ధనంజయ అను పేరు కల్గియుండెను. ఒకరోజు అతను రైలు ప్రయాణము చేయుచుండెను. తనతో ప్రయణము చేయువారిలో ఒకరితో ధనంజయకు రైలులో పరిచయమేర్పడినది. వారు చాలాదూరమునుండి ఒకరోజంత ప్రయాణము చేయుటవలన మరియు ఒకే స్టేషన్‌లో ఇద్దరు దిగవలెను కావున కొంత ఎక్కువ స్నేహముగ ఉండిరి. సాయంకాలము ఆరుగంటల సమయములో రైలుమార్గమున గల వంతెనలో లోపమేర్పడుట వలన రైలును వంతెన ఇవతలనే ఆపివేశారు. మార్గము రిపేరు చేయుటకు ఆరాత్రంత సరిపోవునని తెల్లవారిన తర్వాతనే రైలు బయలుదేరునని రైల్వే సిబ్బంది తెలిపారు. ధనంజయ అతని సహప్రయాణికుడు దిగవలసిన స్టేషన్‌ తర్వాత వచ్చు స్టేషన్‌ అగుటవలన మరియు వారి గమ్యము కేవలము నాలుగు కిలోమీటర్లే అగుట వలన వారు ఆ కొద్ది దూరమును నడచి చేరుకోవాలనుకొన్నారు. వారు నడువవలసిన మార్గము కాలిత్రోవ అగుటవలన, అదియు అడవి మార్గమగుట వలన తోటి ప్రయాణికుడు ధనంజయతో నావద్ద ఐదులక్షల డబ్బున్నది దారిలో దొంగలుండరు కదా అని అడిగాడు. మనమొస్తామని ఎవరికి తెలుసు? నీ దగ్గర డబ్బున్నదని ఎవరికి తెలుసు? చీకటి పడకముందే ఊరు చేరవచ్చును అని జవాబుగ ధనంజయ అన్నాడు. దగ్గర కదా వెళ్లి పోవచ్చును లేకపోతే రాత్రంత రైలులో జాగారము తప్పదని అనుకొన్నవారు చివరకు కాలినడక పోవాలనుకొన్నారు. ఇద్దరు రైలుదిగి నడువను ప్రారంభించారు. ఒక కిలోమీటరు నడచిన తర్వాత ధనంజయ తలలో ఆలోచనలు మెదలసాగెను. పూర్వము కోరుకున్న కోర్కె ప్రకారము స్వామీజీ ఇచ్చిన దీవెన ప్రకారము అతనిలో ప్రేరేపణ మొదలైనది. ఇతని దగ్గర డబ్బున్నది నాకొక్కనికే తెలుసు, ఈమార్గములో ఇతను నావెంట వచ్చునది నాకొక్కనికే తెలుసు, ఇతని నుండి డబ్బును ఎదోవొక విధముగ లాగేసుకుంటే ఒక్కమారుగ ధనికుడునై పోవచ్చుననుకొన్నాడు. దాని కొరకు నడుస్తూనే ప్రణాళికను తయారుచేసుకోసాగాడు. అంతలోనే అతనికొక ఆలోచన తలలో మెరిసింది. అది అడవి మార్గము కావున చాలారకముల చెట్లుగలవు వాటిలో విషముష్ఠి చెట్లు దానికి కాయలుండడము కనిపించిది. ఎర్రగ అందముగ కనిపించు ఆ కాయను అతనిచేత తినిపిస్తే తనపని నెరవేరుతుందనుకొన్నాడు. వెంటనే ధనంజయ తోటి ప్రయాణికునికి కాయను చూపి ఈ కాయ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు, ఈ కాయ పేరు ముష్ఠికాయ, దీనిని తినుట వలన ముష్ఠిబలమేర్పడుతుంది. వృద్దాప్యము వరకు మగతనము తరగక ఉంటుంది. దీనివలన సంపూర్ణ ఆరోగ్యము ఏర్పడుతుంది. మన అదృష్టముకొలది ఈ చెట్టు కనిపించింది, దీనిని తప్పక తిందామని చెప్పగ ఆమాటకు ప్రయాణికుడు కూడ ఒప్పుకొన్నాడు. మిగతవారికంటే నాలో మగతనము తక్కువ ఉందని ఆ ప్రయాణికునికి మొదటినుండి అనుమానముండుట వలన మగతనమును గురించి చెప్పగనే సరేనని కాయను తినుటకు ఆసక్తిని కనబరిచాడు.


ఇదే మంచి సమయమని తలచిన ధనంజయ వెంటనే చెట్టెక్కి బాగా ఎర్రగ కనిపించిన ఒక కాయను త్రుంచి క్రిందికి వేశాడు. తాను కూడ మరొక కాయను తీసుకొని క్రిందికి దిగివచ్చి ముందు ఒక కాయను పగలగొట్టి అందులోని విత్తనములను తీసివేసి గుజ్జును ప్రయాణికుని చేత తినిపించాడు. తర్వాత తానుకూడ కాయను పగులగొట్టి తినునట్లు నోటిలో పెట్టుకొని మూత్రవిసర్జన కొరకు ప్రక్కకు పోయి నోటిలోని గుజ్జును క్రిందకి మూసివేసి తిన్నట్లు నోటిని కదలించుచు ప్రయాణికుని ముందుకు వచ్చెను. ధనంజయ తింటున్నాడా లేదా అని గ్రహించని ప్రయాణికుడు తాను మాత్రము కాయనంతటిని తినెను. తిన్నతర్వాత తిరిగివారు ప్రయాణము సాగించిరి. ఒక కిలోమీటరు కూడ నడువకనే ప్రయాణికునికి మత్తు మొదలైనది. సారాత్రాగిన మత్తువలె ఉండుటవలన అతను తూలుతూ నడువసాగెను. కొద్దిసేపటికే మత్తు ఎక్కువై నడువలేక కూర్చుండెను. ధనంజయకూడ మత్తున్న వానివలె నటిస్తు క్రొత్తగ తిన్న వారికి మొదట కొంత ఎక్కువ మత్తుకనిపిస్తుంది ఏమి పరవాలేదు ఐదునిమిషములు కూర్చొని పోదామని చెప్పి అతనిని కూర్చండబెట్టెను. పాపము ప్రయాణికునికి మరిమత్తు ఎక్కువగుట వలన కూర్చున్న చోటునే పడుకొనెను. పడుకొన్న వాడు నిద్రలోనికి జారుకోగా ధనంజయ కోర్కెనెరవేరింది. అదే అదనుగ ప్రయాణికుని వద్దగల సూట్‌కేస్‌ను తీసుకొని దాని తాళములను కూడ అతనివద్ద వెదకి తీసుకొన్నాడు. వెంటనే సూట్‌కేస్‌ను తెరచి అందులోని డబ్బును తీసుకొని తనవద్దగల సంచిలో వేసుకొని తిరిగి సూట్‌కేస్‌ను మూసి అతనివద్దనే పెట్టి తాళములు కూడ అతని జేబులో వేసి అక్కడినుండి పోయెను. ప్రయాణికుడు విషముష్ఠి కాయను తినుటవలన మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలో కొంతసేపుండి అరగంటలోపలే చనిపోయెను.


గుణంజయ కోరుకొన్న కోర్కె స్వామి దీవించిన దీవెన ప్రకారము మరుజన్మమున ధనంజయరూపములో నెరవేరింది. కాని జరిగిన కార్యములో పాపము కర్మరూపమై ధనంజయ తలలో కర్మమందు చేరి పోయినది. గుణంజయరూపములో పొందినది దీవెనరూపములోనున్న చెడును చేకూర్చు తిట్టని తెలిసినది. ఇక్కడ జ్ఞానము లేకపోవుట వలన తిట్టును దీవెనగ అర్థము చేసుకోవడము జరిగినదని తెలియుచున్నది.

-***-