తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నీ శిరస్సున దీపమెలగ

నీ శిరస్సున దీపమెలగ

గురువుగారు జ్ఞానబోధలు చేస్తు కొంతకాలము గడిపాడు. అప్పటికి కొంత జ్ఞానలోపమున్నదని గ్రహించిన జంబుకేశ్వరుడు ఒక శుభ సమయమున చిన్న శిష్యునికి కూడ ఒక దీవెన ఇచ్చాడు. అది నీ శిరస్సున దీపమెలగనాని" ఇది జ్ఞానపరముగ దీవెన అయినప్పటికి అజ్ఞాన అర్థముతో దూషణగ లెక్కిచంబడుచున్నది. ఒక ఇంటిలో ఎవరైన చనిపోయినపుడు శవము తలదగ్గర దీపము పెట్టడము ఒక సాంప్రదాయముగ జరుగుచున్నది. నీ శిరస్సున దీపమెలగ అనగానే మీ ఇంటిలో ఎవరో ఒకరు చనిపోవలెనని దూషించినట్లు అర్థమగుట వలన పై దీవెనను జ్ఞానము తెలియనివారు దూషణగనే లెక్కించుదురు. జ్ఞానార్థముతో చూచినట్లయితే ఈ విధముగనున్నది.


జ్ఞానము పొంది దానిప్రకారము ఆచరించినపుడు జ్ఞానాగ్ని మానవునందుత్పత్తి అగును. జీవుడు జన్మించుటకు జన్మించి కష్ట సుఖములనుభవించుటకు కారణమైన కర్మను జ్ఞానాగ్నియే కాల్చి వేయును. మానవుడు జన్మకర్మలనుండి బయటపడవలయునంటే అది జ్ఞానాగ్ని వలననే సాధ్యమగును. పాపపుణ్యములను కర్మను కాల్చి వేయుటకు ఒక జ్ఞానాగ్ని తప్ప ప్రపంచములో వేరేది లేదు. అందువలన భగవద్గీతయందు జ్ఞానయోగములో 37వ శ్లోకమున "యథైధాంసి సమిద్దాగ్నిర్భస్మసాత్కురు తేజర్జున, జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా" అని శ్రీృష్ణ భగవానుడు కూడ అన్నాడు. కట్టెలను కాల్చుటకు ఒక్క అగ్నికే సాధ్యమైనట్లు కర్మను కాల్చుటకు ఒక్క జ్ఞానాగ్నికే సాధ్యమగును. మానవునికి తల భాగములో గల కర్మచక్రమందు కర్మనిలువయుండును. కర్మనిలయమెక్కడ కలదో అక్కడే జ్ఞానాగ్ని కూడ ఉండి కర్మను కాల్చవలయును. కావున జ్ఞానాగ్ని కూడ తలలో గల కర్మచక్రము వద్దనే నివాసముండును. అందువలనే గొప్ప యోగుల మరియు దేవతల తల వెనుక భాగమున ప్రకాశమున్నట్లు చిత్రించిన ఎన్నో చిత్రపటములను మనము చూచుచున్నాము. కర్మను కాల్చు జ్ఞానాగ్నిని సంపాదించుకొమ్మని, అట్లు సంపాదించుకొన్నపుడు మాత్రమే కర్మనాశనమై మోక్షము పొందగలరని పెద్దలు కూడ తెలుపుచున్నారు. ఈ విధానమును అనుసరించియే తమ శిష్యునికి జ్ఞానము సంపూర్ణముగ కలుగవలెనని, జ్ఞానాగ్ని శిరస్సులో వెలుగవలెనని, జంబుకేశ్వరుడు తలచి తన పాదములకు నమస్కరించునపుడు 'నీ శిరస్సున దీపమెలగనాని' అని దీవించాడు. జ్ఞానదీపము తలయందు ప్రకాశించి అజ్ఞానము తొలగి కర్మకాలి పోవలయునని ఆనాటి వారిభావము. కాని ఈనాడు అది తిట్టుగ పరిగణించబడుచున్నది. ఆడవారు కొందరు పల్లెప్రాంతములలో ఈ వాక్యమును తిట్టుగ నేటికిని వాడుచున్నారు. తిట్లుగ వాడుచున్న చాలా వాక్యములు జ్ఞాన సంబంధమైనవని చాలామందికి తెలియకుండ పోయినది.

-***-