తిక్కన సోమయాజి/మొదటి యధ్యాయము
తిక్కనసోమయాజి
మొదటి యధ్యాయము
"సీ. సుకవీంద్ర బృందరక్షకుఁ డెవ్వఁ డనిన వీఁ
డనునాలుకకుఁ దొడ వైన వాఁడు,
చిత్తనిత్యస్థితశివుఁ డెవ్వఁ డనిన వీఁ
డనుశబ్దమున కర్థ మైనవాఁడు,
దశదిశావిశ్రాంతయశుఁ డెవ్వఁ డనిన వీఁ
డని చెప్పుటకుఁ బాత్ర మైనవాఁడు,
సకలవిద్యాకళాచణుఁ డెవ్వఁ డనిన వీఁ
డని చూపుటకు గుఱి యైనవాఁడు,
గీ. మనుమసిద్ధిమహీశ సమ స్తరాజ్య
భారధారేయుఁ డభిరూప భావభవుఁడు
కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మిసుతుఁడు
దీనజనతానిధానంబు తిక్కశౌరి."
(కేతన)
"మ. తన కావించినసృష్టి తక్కొరులచేతం గాదు నా నేముఖం
బునఁ దాఁ బల్కినఁ బల్కు లాగమము లై పొల్పొందు నా వాణి న
త్తనునీతం డొకరుండు నాజను మహత్వాప్తిం గవిబ్రహ్మ నా
వినుతింతుం గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్."
(ఎఱ్ఱాప్రెగ్గడ)
తిక్కన వంశము. మంత్రిభాస్కరుఁడు
బ్రహ్మర్షి యగు గౌతమునిపావనగోత్రంబున మావెన మంత్రి జనించెను. మావెనపూర్వులు కొట్టరువుగ్రామంబునఁ బెద్దకాలము నివసించినవా రగుటంజేసి వారికి గొట్టరువువా రని యింటిపేరు గలిగినది. కొట్టరువు మావెనమంత్రికిఁ గేతనయు నాతనికి భాస్కరమంత్రియు జనించిరి. ఆకాలమునం దాఱ్వేలనాటిలోఁ (గుంటూరుమండలము) బ్రఖ్యాతి కెక్కిననియ్యోగి బ్రాహ్మణ కుటుంబములలో మంత్రిభాస్కరుని కుటుంబమొక్కటి. కొట్టరువు వంశమున భాస్కరమంత్రి యుదయించి పండ్రెండవశతాబ్ద్యంతమునఁ బూర్వచాళుక్యచోడ చక్రవర్తులకుఁ బ్రతినిధులై వేఁగీదేశ మని వ్యవహరింపఁబడెడు నాంధ్రభూభాగమును బరిపాలించుచున్న చందవోలురాజుల యధికారముక్రిందను గుంటూరిసీమను బరిపాలించి విఖ్యాతిఁగాంచెను. ఆకాలమునఁ బూర్వచాళుక్యచోడచక్రవర్తికి నామమాత్రప్రతినిధియై పృథ్వీశ్వరమహారాజు ధనదుపురము (చందవోలు) రాజధానిగా విక్రమ సింహపురము మొదలుకొని సింహాచలము పర్యంతము నాంధ్రదేశమును బరిపాలించు చుండెను. పృథ్వీశ్వరుఁడు చాళుక్యచోడచక్రవర్తికి లోఁబడినవాఁ డని చెప్పుకొనఁబడుటయెగాని క్రీ. శ. 1299. వఱకును స్వతంత్రుఁడై పరిపాలనము చేసెను. అతనిక్రిందియధికారులలో నొక్కఁ డై గుంటూరిసీమను బరిపాలించినవాఁడు మంత్రి భాస్కరుఁడు. తిక్కనసోమయాజి గూడ తననిర్వచనోత్తర రామాయణములో
"సార కవితాభిరాము గుంటూరి విభుని
మంత్రి భాస్కరు మత్పితామహునిఁ దలఁచి"
అని మంత్రిభాస్కరుని గుంటూరివిభుని గాఁ జెప్పి యుండెను. మంత్రిభాస్కరుఁ డొకసామాన్యకరణమే గాని ప్రాభవము గలవాఁడు గాఁడనియు, అతఁడొకగొప్పకవియును గాఁ డనియు, తనవంశగౌరవమును దెలుపుకొనుట కై తిక్కన యట్లు చెప్పుకొనె ననుభావమును దేఁటపఱచుచు భాస్కరోదంత మను విమర్శగ్రంథమునఁ బరిహాసపూర్వకవ్యాఖ్యానము చేయఁ బడియెను. [1] కాని తదితరవిషయములను న్యాయైకదృష్టితోడను నిష్పక్షపాతబుద్ధితోడను బరిశీలించి చూచి నప్పుడుమాత్రము మన మాయభిప్రాయముతో నేకీభవింపఁ జాలము. అమలాచారుఁ డనియును, సాహిత్యవిద్యాపారీణుఁ డనియును, శాపానుగ్రహాశక్తియుక్తుఁ డనియును, ధర్మమార్గపథికు డనియును, అర్థార్థిలోకావన వ్యాపారవ్రతుఁ డనియును, గౌరీపతి శ్రీపాదప్రవ ణాంతరంగుఁ డనియును, విబుధశ్రేయస్కరుఁ డనియును అభినవదండినా వినుతి గాంచిన కేతనమహాకవి తనదశకుమార చరిత్రము నందు మంత్రిభాస్కరుని నభివర్ణించి యుండుటంజేసి మనమాతని నసామాన్యపురుషుఁ డనియే గ్రహింపవలసి యుండును. ఈమంత్రి భాస్కరుఁడు రామాయణమును మొదట రచింపఁగా నది యేకారణముచేతనో ఆరణ్యకాండము తక్క తక్కినకాండము లన్నియు శిధిలము లై పోవుట చేత హుళక్కి భాస్క రాదికవులు వానిం బూరించి రనియు, ఆరామాయణమే భాస్కరరామాయణ మనుపేరఁ బరగుచున్న దనియు నాంధ్రులచే విశ్వసింపఁ బడుచున్నది. కాని యిది యెంతవఱకు విశ్వాసపాత్రమో చెప్పఁ జాలము. భాస్కర రామాయణముఁ గూర్చిన యథార్థకథన మింకను మఱుఁగుననేయున్నది. అయ్యది భావిపరిశోధనముల మూలమునఁ దెలిసికొనవలసి యున్నది.[2]
కొమ్మనదండనాథుడు
మంత్రిభాస్కరునకు మహాసాధ్వి యగుకొమ్మమాంబ గర్భమున నల్వురు పుత్త్రు లుద్భవించి యఖండ యశోధనులై వర్థిల్లిరి. వీరిలోఁగడపటివాఁ డైన కొమ్మనామాత్యుఁడు మంత్రి భాస్కరుని పిమ్మట గుంటూరిసీమను బరిపాలించెను. తనమహా భారతములోని విరాటపర్వమునందు తిక్కనకవి తనతండ్రిని,
"సీ. మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్ర
మహితుండు భాస్కరమంత్రి తనయుఁ
డన్న మాంబాపతి యనఘులు కేతన
మల్లన సిద్ధ నామాత్యవరుల,
కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ
మ్మన దండనాధుఁడు మధురకీర్తి,
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప
విత్రశీలుఁడు సాంగవేదవేది."
అను పద్యములో నభివర్ణించి యుండుటచేత కొమ్మన దండనాథుఁ డనికూడఁ దేటపడు చున్నది. దండనాథుఁ డనసేనాధిపతి. గుంటూరివిభుఁ డనియు, దండనాయకుఁ డనియు వర్ణిం పఁబడిన కొమ్మనామాత్యుని సామాన్యకరణముగా వాకొనుట మిక్కిలి శోచనీయము. మఱియును కేతనమహాకవి కొమ్మనామాత్యుని శౌచమున గంగాత్మజన్ముఁ డనియును, శౌర్యమున గాండీవధన్వుఁ డనియును, సూర్యవంశక భూపాల సుచిరరాజ్యవనవసంతుఁ డనియును వర్ణించి యుండుటగూడ నతఁడు దండనాయకుఁడుగ నుండె నని ధ్వనింపఁ జేసి తిక్కన సోమయాజి వర్ణనమును బలపఱచు చున్నదిగాని సామాన్య కరణముగా నుండె నని సూచింపు చుండలేదు. కొమ్మనా మాత్యుఁడు పృథ్వీశ్వర మహారాజుకాలములో గుంటూరున దండనాయకుఁడుగా నుండి యామహారాజు పండ్రెండవ శతాబ్ద్యంతమున విక్రమసింహపు రాథీశ్వరుఁ డైనమనుమసిద్ధిరాజు కుమారుఁడైనతిక్కరాజుతో యుద్ధము చేసి వానిచేఁ జంపఁబడి నందునఁ దరువాత దాను సూర్యవంశ్యు లైన తెలుఁగు చోడరాజుల కొల్వులోఁబ్రవేశించి ప్రఖ్యాతుఁడై యుండును. అట్లు గానియెడల కేతనకవి కొమ్మనామాత్యుని 'సూర్యవంశక భూపాలసుచిర రాజ్యవనవసంతుఁ' డని యూరక వర్ణింపఁడు. అతని మూడవఁ యన్న యగు సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకు మంత్రియు సేనాపతియు నై యుండుటచేత కొమ్మనామాత్యుఁడు గాని వాని మరణానంతరము కుమారుఁడు తిక్కనగాని గుంటూరు మండలమును విడిచి నెల్లూరునకుఁ బోయి యుందురు. కొమ్మనామాత్యుని మూఁడవయన్న యగుసిద్ధనామాత్యుఁడు తిక్క రాజున కాప్తమంత్రియు సేనాపతియు నై యుండె నని దశకుమార చరిత్రములోని,
"ఉ. స్థాపితసూర్యవంశ వసుధాపతినాఁ బరతత్వధూతవా
ణీపతినా నుదాత్తనృపవీతి బృహస్పతినా గృహస్థగౌ
రీపతినా గృపారససరిత్పతినాఁ బొగఁ డొందె సిద్ధిసే
నాపతి ప్రోడ తిక్కజననాథ శిఖామణి కాప్తమంత్రియై."
అనుపద్యములో విస్పష్టముగా వివరింపఁబడి యున్నది. సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకుఁ మంత్రిగా నుండె ననితెలిపెడి శాసన మొకటి నెల్లూరుమండలమునఁ గలదు.[3] సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకు మంత్రియు సేనాపతియు నై యుండ వానితమ్ముఁడైన కొమ్మనామత్యుఁ డెక్కడనో గుంటూరున నూరును బేరును లేకుండఁ గరిణీకముఁ జేసికొనుచుఁ గూరుచుండెననుట విశ్వాసపాత్రము గాదని వేఱుగ నొక్కి వక్కాణింప నక్కర లేదు. మంత్రిభాస్కరుని వంశము పదుమూఁడవ శతాబ్దిలో బ్రఖ్యాత మైనదనుట సత్యమునకు విరుద్ధముగాదు. మంత్రిభాస్కరునితండ్రి కేతన కమ్మనాటిని బరిపాలించిన త్రిభువన మల్లదేవచోడునకు మంత్రిగ నుండె నని తెలియుచున్నది. మంత్రి భాస్కరుని పుత్త్రులైన కేతన మల్లన మంత్రులు కమ్మనాటి చోడులకొల్వులోఁ బ్రఖ్యాతులై యుండిరి. మంత్రిభాస్కరుని మూఁడవకుమారుఁ డైన సిద్ధన తిక్కరాజున కాప్తమంత్రిగను సేనాపతిగ నుండెను. భాస్కరుని నాలుగవ కుమారుఁడు కొమ్మన గుంటూరునకు దండనాధుఁడుగ నుండెను. కొమ్మనామాత్యునిపుత్త్రుఁడు కవితిక్కన మనుమసిద్దిరాజునకు మంత్రిగనుండెను. సిద్ధనామాత్యుని కుమారుఁడు ఖడ్గతిక్కన సిద్ధి రాజునకు మంత్రిగను సేనాపతిగ నుండెను. ఇట్లు తండ్రులును కొడుకులును మనుమలును మంత్రిత్వాది పదవులను వహించి యుండఁగా మంత్రిభాస్కరుఁడు సామాన్యగృహస్థుఁ డని నమ్మించుట కై ప్రయత్నించుట మిక్కిలి శోచనీయము. ఆకాలమునఁ బ్రఖ్యాత మైన మంత్రిభాస్కరునివంశము తామర తంపరవలె వర్దిల్లుచుండెను. వాని నల్వురు పుత్త్రులకును సంతానము గలదు. మంత్రిభాస్కరుని మనుమలలోఁ జరిత్రమునఁ బ్రసిద్ధి గాంచినవారు సిద్ధనామాత్యుని పుత్త్రుఁ డగుతిక్కనయును కొమ్మనామాత్యుని పుత్త్రుఁ డగు తిక్కనయును నిరువురును మాత్రమె. కొమ్మనామాత్యుఁడు లౌకికాధికార ధూర్వహుం డగుటయెగాక వైదికాచార నిష్టాపరుఁ డై యుండె ననికూడ పవిత్రశీలుఁ డనియును, సాంగవేదవేది యనియును తిక్కన వర్ణించిన దానినిబట్టి విస్పష్టమగు చున్నది. ప్రాచీనకాలమున ద్రోణాచార్యాది ద్విజవర్యులు బ్రాహ్మణధర్మమును క్షత్రియ ధర్మమును రెంటినిగూడ సమర్థించుకొని నట్లుగా మంత్రి భాస్కరుఁడును వానికుమారులును మనుములును గూడ సమర్జించుకొనుచు వచ్చిరి.
- ↑ ఈ విమర్శగ్రంథము శ్రీయుత కాశీభట్ల బ్రహ్మయ్యగారిచే వ్రాయఁ బడినది.
"ఏ కాలమునందు మంత్రిభాస్కరుఁ డుండె నని ప్రతిపక్షులు తలంచు చున్నారో యాకాలమున గుంటూరును బరిపాలించు చున్న ప్రభుఁ డొకఁడుగలఁ డని శాసనములవలనఁ దెలియ వచ్చుచున్నది. ఆకాలమున గుంటూరురాజ్యమునకుఁ బాలకుఁడు శ్రీమన్ మహామండలీక గుంటూరి యురయరాజు. అతనిమంత్రి బొల్లన. సేనాని రాయనిప్రెగ్గడయు నై నట్లుగా బెజవాడ మల్లేశ్వరస్వామివారి యాలయస్తంభమునఁ గలశాసనము వలనఁ దెలియవచ్చు చున్నది. ఈశాసనమును బట్టి చూడఁగా గుంటూరు పాలకుఁడు గాని, మంత్రికాని, సేనానికాని మంత్రి భాస్కరుఁడు కాఁడని తోఁచుచున్నది." అనికాశీభట్ల బ్రహ్మయ్యగారు తమభాస్కరోదంతమను విమర్శన గ్రంథము నందు వ్రాసి యున్నారు. ఈశాసనము క్రీ. శ. 1216 వ సంవత్సరమున వ్రాయఁ బడినది. ఈశాసనము వ్రాయఁబడినకాలమునఁ దిక్కభూపాలుఁడు జయంగొండచోళమండలము లోని పేరూరు నాడును బరిపాలించు చున్నవాఁడు. మంత్రిభాస్కరుని మూఁడవకుమారుఁడగుసిద్ధనామాత్యు డాతనికాప్తమంత్రిగ నుండె నని దెలిసికొని యున్నారము. కాఁబట్టి మంత్రిభాస్కరుఁ డింతకుఁ బూర్వము గొన్ని వత్సరముల క్రిందట నుండి యుండెను. అప్పు డీతఁడు గుంటూరునకుఁ బాలకుఁడు గా నుండె నని నమ్ముట కేవిధమైన యభ్యంతర ముండును ? (ఆం|| చ|| పే. 67-68)
- ↑ ఈ భాస్కర రామాయణమునుగూర్చి ఆంధ్రులచరిత్రములోఁ పదుమూఁడవ ప్రకరణములో 'సాహిణీకుమారుఁడు భాస్కరరామాయణము' అనుశీర్షికక్రిందను విశేషముగా జర్చింపఁబడి యున్నది
- ↑ See Nellore Inscriptions published by Messers Butterworth and Venugopal chetti.