తిక్కన సోమయాజి/ఎనిమిదవ యధ్యాయము


ఎనిమిదవ యధ్యాయము

కవిపండితగోష్ఠి.

మనుమసిద్ధిభూపాలుని పరిపాలనకాలమున నప్పటప్పట పాండ్యులవలనను, దాయాదులవలనను. శత్రురాజులవలనను, తొందరలును, బాధలును గలుగుచున్నను. తిక్కన విద్యా విషయమునఁ జేసిన పరిశ్రమను జూచినప్పుడుమాత్ర మతని మహిమ యిట్టిదని గోచరము గాక మానదు. ఆంధ్రదేశమున నొకభాగ మగుపాకనాటివిషయమును మనుమసిద్దిరాజు పరిపాలనము సేయుచుండ నాంధ్రప్రపంచమున జగత్పూజ్యంబగుపాండిత్యకవిత్వ సామ్రాజ్యంబు ననుభవించుచున్నవాఁ డాతనిమంత్రి యగుతిక్కనామాత్యుఁడే. ఇట్టిసామ్రాజ్య మీతఁ డనుభవించుటయెట్లు సాధ్యపడియెనా యని కొందఱాశ్చర్య పడవచ్చును. ఆశ్చర్యమేల?

"మ. అమలోదాత్తమనీష నేనుభయకావ్యప్రౌఢిఁ బాటించు శి
     ల్పమునం బారగుడం గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
     తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
     న్నమకుం గొమ్మనమంత్రికి౯ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడ౯."

అను పద్యములోఁ దిక్కన తానుభయభాషాకవిత్వకళాపా రఁగుఁ డైనట్లు వ్రాసికొన్నది. తానట్టివాఁడగుట యథార్థమై యుండుటచేతనేగాని తనడంబమును లోకమునకుఁ బ్రకటించుకొనుటకై కాదు. తిక్కన డంబము చూపువాఁడు గాఁడు. ఈ సత్యము నెఱింగినవాఁడు గనుకనే సమకాలికుఁ డైన కేతనకవి

"క. అభినుతుఁడు మనుమభూవిభు
    సభఁ దెనుఁగున సంస్కృతమునఁ జతురుండై తా
    నుభయకవి మిత్రనామము
    త్రిభువనముల నెగడ మంత్రితిక్కఁడు దాల్చె౯."

అని యాతని కుభయకవిమిత్రుఁ డనుబిరుదముగల దనితెలిపియున్నాఁడు. ఇది యొకసామాన్యపుబిరుదము గాదు. ఇం దెంతు మహిమ గలదు. 'కవిపంచాననుఁడు, కవిరాజు, కవిసార్వభౌముఁడు, కవిలోకచక్రవర్తి' మొదలుగాఁగల కొన్నిబిరుదములవలె దుర్గర్వమును, దుస్స్వభావమును, అసహిష్ణుత్వమును బ్రేరేపించి తగవులను బుట్టించి సౌజన్యమును రూపుమాపునట్టి మిథ్యాబిరుదములవంటిది గాదు. మిత్రశబ్ద మెప్పుడును ప్రేమను దెలుపుచుండును. ఉభయకవిమిత్రుఁ డనఁగా సంస్కృతాంధ్రకవులను బ్రేమతోఁ జూచువాఁ డనియర్ధము. ఇతనికవితాసామ్రాజ్యము ప్రేమాపూర్ణమగుటం జేసి కవిలోకమున కాశ్రయమై జగత్పూజ్యం బయ్యెను. ఇతఁ డాంధ్రకవితాసామ్రాజ్యపట్టాభిషిక్తుఁడై కవిప్రపంచమును ప్రసన్న దృష్టితో వీక్షించెను. అప్పుడు కవిప్రపంచ మానందాబ్దినోల లాడుచు నిట్లు వినుతించెను.

"సీ. సుకవీంద్రబృందరక్షకుఁ డెవ్వఁ డనిన వీఁ
             డనునాలుకకుఁ దొడ వైనవాఁడు
    చిత్తనిత్యస్థితశివుఁ డెవ్వఁడనిన వీఁ
             డనుశబ్దమున కర్థ మైనవాఁడు
    దశదిశావిశ్రాంతయశుఁ డెవ్వఁ డనిన వీఁ
             డనిచెప్పుటకుఁ బాత్ర మైనవాఁడు
    సకలవిద్యాకళాచణుఁ డెవ్వఁ డనిన వీఁ
             డనిచూపుటకు గుఱి యైనవాఁడు

    మనుమసిద్ధిమహీశ సమస్తరాజ్య
    భారధౌరేయుఁ డభిరూపభావభవుఁడు
    కొట్టరువుకొమ్మనామాత్యు కూర్మిసుతుఁడు
    దీనజనతానిధానంబు తిక్కశౌరి."

ఈవినుతి కవిప్రపంచము కేతనరూపమున మూర్తీభవించి చేసినదిగాఁ దలంపవలయునుగాని కేవలము తనంతటఁ దానుగాఁ గేతన చేసినదని మనము గ్రహింపరాదు. ఇతరులు చేయుస్తోత్రపాఠముల కుబ్బిపోయి యహంకరించి తమ నిరంకుశాధికారమును జాటి తమ యాధిక్యమును గన్పఱచుకొన వలయు నని వ్యర్థాభిలాషతో దంభాచార్యవృత్తిని వహించి కవిప్రపంచముపై భుజాస్ఫాలనము సేయుచు దండయాత్రలు సలుప నుత్సహించెడు దుష్కవులమార్గమును గొనక యీతఁడు సత్కవులమార్గమును గొని 'బుధారాధనవిధేయుఁడ, బుధారాధనవిరాజి' నని నమ్రభావమును దేఁటపఱచుచుఁ దన కవితాసామ్రాజ్యాభిషిక్తపదవిని సంరక్షించుకొనియెను. వివిధ విద్యాపరిశ్రమవేదియుఁ గవిసార్వభౌముని పుత్త్రుఁడును గావున మనుమసిద్ధి తిక్కన యధిష్ఠించిన విద్యాగురుపీఠముయొక్క మాహాత్మ్యము ననుభవపూర్వకముగా నెఱింగినవాఁడే గావున వినయవిధేయతలను జూపుచుఁ బూజింపుచుండెను. ఇట్లు పాండిత్యకవిత్వ సామ్రాజ్య పట్టాభిషిక్తుఁడై వైదికమార్గనిష్ఠమగు వర్తనము గలవాఁడై క్రతుదీక్షఁ బూని భూసురబృందమున కానందము సంఘటించి విహువిధాధ్వరములనుగావించి త్యాగశీలుఁడై బహువిధదానములను జేసి ఋత్విక్కులను దృప్తులను గావింపుచుఁ దనయశము నాంధ్రప్రపంచమున దశదిశలకుఁ బఱపుచుండెను. వైదికమతోద్దరణమునకై చతుర్ముఖుఁడు తిక్కనరూపమున నవతరించినవాఁడని యాంధ్రలోకము విశ్వసించి బ్రహ్మపీఠము నొసంగెను. నిర్వచనోత్తరరామాయణము రచించి మనుమసిద్ధి కంకితముచేసిన పదిసంవత్సరములలో దిక్కనసోమయాజి యాంధ్రదేశమున నిట్టిమహెన్నతపదవిని బొందెను. ఏవేళను నీతని పవిత్రగృహమున వేదఘోషము వినంబడుచునే యుండును. ఆకాలమున నాంధ్రదేశములోని వేదవేత్తలు మంత్రవేత్తలు నీమహానుభావుని సందర్శింపఁకుండ నుండ లేదు. అట్లే కవిపండితకోటియు విక్రమ సింహపురమునకు నేగుదెంచి యీకవి బ్రహ్మను సందర్శింపకుండ నుండ లేదు. ఈకాలముననే యీతఁడు విజయసేనము మొదలగుకావ్యములను రచించెనుగాని యవి యన్నియు భారతము ప్రక్కను దిపిటీముందరదీపములై ప్రకాశింపక కాలక్రమమున నశించిపోయి నామమాత్రావశిష్టములై యున్నవి. తిక్కన సోమయాజి యిట్టివాఁ డగుటచేతనే కేతనకవి దశకుమారచరిత్రమునం దిట్లభివర్ణించి యున్నాఁడు.

"సీ. సరసకవీంద్రుల సత్ప్రబంథములొప్పఁ
          గొను నను టధికకీర్తనకుఁ దెరువు
    లలిత నానాకావ్యములు చెప్పు నుభయభా
          షలయందు ననుట ప్రశంసత్రోవ
    యర్థిమైఁ బెక్కూళ్ల నగ్రహారంబులఁ
          గా నిచ్చు ననుట పొగడ్తపొలము
    మహితదక్షిణ లైనబహువిధయాగంబు
          లొనరించు ననుట వర్ణనము దారి

    పరుని కొక్కని కిన్నియుఁ బ్రకటవృత్తి
    నిజములై పెంపు సొంపారి నెగడునట్టి
    కొమ్మనామాత్యుతిక్కని కొలదిసచివు
    లింక నొక్కరుఁ డెన్నంగ నెందుఁ గలఁడు."

తిక్కన సోమయాజి శ్రీమంతుఁడు ; నిరర్గళధీమంతుఁడు; అధ్వరాబ్జదిననాధుఁడు; నీతిచాణక్యుఁడు; కృతిపతి; కృతికర్త; శౌర్యత్యాగ విఖ్యాతశాలి; మన్మక్ష్మాపాల మంత్రిమాడుణిక్యుడు; దండాధీశుఁడు; బ్రహ్మవేత్త, ఇన్నిలక్షణము లొక్కనియందే పట్టియుండుటవలనఁ గేతనయొక్కఁడే గాఁడు కేతనను బుట్టించినదైవము సయితము మెచ్చుకొనకమానఁడు. ఆకాలము నందుఁ గవిత చెప్పి తిక్కనసోమయాజుని మెప్పించుట కష్ట సాధ్యమై యుండెను. అందులకై యనేకులు ప్రయత్నించిరి. భోజరాజీయమును విరచించిన యనంతామాత్యకవి ముత్తాతయగు బయ్యనమంత్రి కవిత్వముచెప్పి తిక్కనసోమయాజిని మెప్పించి 'భవ్యభారతి' యనుబిరుదమును బొందె ననిభోజరాజీయమునందలి యీక్రిందిపద్యమువలన విదితమగుచున్నది.

"చ. క్షితిఁ గ్రతుకర్తనా వినుతి చేకొని పంచమవేదమైన భా
     రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించి నట్టి యు
     న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చి భవ్యభా
     రతియనఁ బేరుఁగన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే."

కేతనకవి గూడ,

“గీ. కవిత చెప్పి యుభయకవిమిత్రు మెప్పింప
    నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
    బరగుదశకుమార చరితంబుఁ జెప్పిన
    ప్రోడ నన్ను వేఱ పొగడ నేల?"

అని యాంధ్రభాషాభూషణ మన గ్రంథమునందుఁ జెప్పి యున్నాఁడు. ఆకాలమునందు కవులు తిక్కనసోమయాజివలన మెప్పు నొందినఁ దమజన్మసార్థకమైనట్లుగాఁ దలంచుచుండిరి. అట్టివారిలోఁ గేతనకవి యొక్కఁడు. ఇతఁడు కేవలము ధనాపేక్షచేఁ తిక్కనసోమయాజిని స్తోత్రపాఠములు చేసి కృతి నిచ్చిన వాఁడు గాఁడు. వేగీదేశమున వెఱ్ఱిరాల యనునగ్రహారమునకు నగ్రణియును గౌండిన్యగోత్రుఁడును, మారయకును సంకమాంబకును దనూజుఁడును, బండారు కేత దండాధీశుని మఱదియు, నధ్యయనపరుఁడును, మూలఘటికాన్వయుఁడును, ప్రోలనార్యు నియనుఁగుఁ దమ్ముఁడును, సంస్కృతాదిభాషా కావ్యకర్తృత్వమున నుతిఁగన్నవాఁడును, అభినవదండినావినుతి గన్నవాఁడును, విఖ్యాతయశుఁడు నైన కేతనార్యుని రప్పించి యాసనార్ఘ్యపాద్యతాంబూలాంబరా భరణదానాద్యుపచారంబులఁ బరితుష్టహృదయుం జేసి, 'ఆర్యా! నీవుసంస్కృతాద్యనేక భాషాకావ్యరచనావిశారదుండ వగుట జగత్ప్రసిద్దంబు గావున నొక్క కావ్యంబు రచియించి నన్నుఁ గృతిపతిం జేయవలయు' నని సగౌరవంబుగాఁ బ్రార్థించినందునఁ గేతన తనకావ్యకన్యకుఁ దిక్కన తగినవరుం డనిభావించి సంస్కృతమున దండి రచియించిన దశకుమారచరిత్రము సంచితభావరసో దయాభిరామమ్ముగా రచియించి యంకితము చేసే నని దశకుమారచరిత్ర పీఠికవలన వేద్యమగుచున్నది. ఈదశకుమారచరిత్రము నీతఁడు తిక్కన మెచ్చుకొను నంతరసమంతముగానే రచియించెను. ఇయ్యది తిక్కనభారతమునకుఁ బూర్వముననే రచియింపఁ బడిన దనుటకు సందియము లేదు. మనుమసిద్ది పదభ్రష్టుఁడై కాకతీయునిఁ బ్రాపువలనఁ బునరభిషిక్తుఁ డగుటకుఁ బూర్వమే యీకావ్యము రచియింపఁ బడినదనుట కావిషయ మెద్దియునిందుఁ దెలుపఁబడకుండుటయే ముఖ్యకారణము. తిక్కననుగూర్చి సమకాలికుఁ డైనకేతనపలికిన పలుకులు విశ్వసనీయములని శ్రీయుతులు జె. కృష్ణరావు గారు వ్రాసిన వాక్యములనే నే నీదిగువ నుదాహరించుచున్నాను.

"బోద్ధారో మత్సరగ్రస్తాః" అనువచనంబురీతి సాధారణంబుగఁ బండితప్రకాండులు పరస్పర కావ్యరత్నంబుల నసూయాక్షిరోగ నిష్పీడిత దృక్కుల నరసి నెరసులఁ గొన్నిటి నారోపించుటచేఁ దృప్తి వహించి తద్రత్నంబుల నాత్మశేముషీశాణోపలంబుల నొరసిన నానెరసులు నుగుడ గుణంబులుగా నెక్కడఁ బరిణమించునో యని యట్లు సేయ నొల్ల కుందురు. ఈపరస్పర వైముఖ్యంబు కృతిరత్నంబుల యెడనగాక తఱచుగాఁ గృతిరత్న నిర్మాతలయెడం గూడ వ్యాప్తం బగు. "సమకాలమువారల మెచ్చరేకదా" యన్న ట్లీస్వభావము సమకాలికులయందును మఱికొంత మెండు. ఇందునకుఁ దార్కాణము లెన్నియేనిఁ జెప్పం జొప్పడు. తొల్లి భవభూతి బాణుని 'హటాదాకృష్ణానాంకతిపయపదా నాంరచయితాజనః' అని యాక్షేపించి నట్లును, 'నీయీకాపు కవిత్వపుమాటలు బాపనకవివరుని చెవికిఁ బ్రమదం బిడునే' అని రామకృష్ణుఁడు రామరాజభూషణుఁ దిరస్కరించి నట్లును ఆంగ్లేయకవీంద్రులలో నగ్రగణ్యుం డైన షేక్సిపియరును బెంజాన్సను లోనగువారు వేదు రని భావించినట్లును గ్రంధములచేఁ దెలియవచ్చుచున్నది. కాఁబట్టి కవీంద్రు లొండొరుల దోషంబులఁ బ్రకాశింపఁజేసి గుణంబుల నాచ్చాదింతు రనియు నొకవేళ గుణంబులఁ బ్రకాశింపఁ జేసియున్న వానిని సత్య మనినమ్మవచ్చు నీవిచారమునకు ఫలము. ఏలయీవిషయ మింతపెంచి వ్రాసితి నన్నఁ దిక్కనచరిత్రమునకు ముఖ్య సాధనము లైనయతని సమకాలికుల యభిప్రాయంబులు విశ్వసనీయంబులే యని చూపుటకై వ్రాసితిని."

తిక్కనసోమయాజి సామర్థ్యము తత్కృతాంధ్ర భారతమువలసనే మనకుఁ దేటపడుచున్నందునఁ గేతనవర్ణనలు నూటికిఁ దొంబదితొమ్మిదిపాళ్లు సత్యము లనిమనము విశ్వసింప వచ్చునని తెలుపుచుఁ బైవారియభిప్రాయముతో నేకీభవించు చున్నాఁడను.