తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 200


రేకు: 0200-01 మాళవిగౌళ సం: 02-514 శరణాగతి

పల్లవి:

నీవు సర్వగుణసంపన్నుఁడవు నే నొకదుర్గుణిని
మానవు నన్నొక యెదురుచేసుకొని మనసుచూడనేలా అయ్యా

చ. 1:

యేలినవాఁడవు నీవు ఇటు నేఁ గొలిచినవాఁడ
పోలింపగ నీవే దేవుఁడవు భువి నే నొకజీవుఁడను
పాలించేవాఁడవు నీవు బ్రదికేవాడను నేను
తాలిమి నన్నొక సరిచేసుక నను దప్పులెంచనేలా అయ్యా

చ. 2:

అంతర్యామివి నీవు అంగమాత్రమే నేను
చింతింపఁగ నీవే స్వతంత్రుఁడవు జిగి నేఁ బరతంత్రుఁడను
ఇంత నీవే దయఁగలవాఁడవు యెప్పుడు నే నిర్దయుఁడను
చెంతల నన్నొక మొనసేసుక నాచేఁత లెంచనేలా అయ్యా

చ. 3:

శ్రీవేంకటేశ్వరుఁడవు నీవు సేవకుఁడను ఇటు నేను
అవలనీవల దాతవు నీవు యాచకుఁడను నేను
నీవే కావఁగఁ గర్తవు నేనే శరణాగతుఁడను
కైవశమగు నను ప్రతివెట్టుక నాకథలు యెంచనేలా అయ్యా


రేకు: 0200-02 నాట సం: 02-515 ఉత్సవ కీర్తనలు

పల్లవి:

వెడలె వెడలె నదె వీధులవీధుల
తొడికి దైత్యులనుఁ దుంచఁగను

చ. 1:

కోటిసూర్యలొకకూటువ గూడుక
చాటువ మెరసేటి చక్రము
గాఁటపు వేవేలు కాలరుద్రులటు
నీటునఁ దొలఁకేటి నిబిడచక్రము

చ. 2:

ప్రళయకాలముల బడబాగ్నలొలుకు-
చలమరి ప్రతాపచక్రము
కలకలరవముల కాలభైరవులు
కలసి మెలంగేటి గండచక్రము

చ. 3:

యమసహస్రము లనంత మేకమై
సమరము గెలిచేటి చక్రము
అమరుచు శ్రీవేంకటాధిపు కరమునఁ
దెమలకయుండేటి దివ్యచక్రము


రేకు: 0200-03 బౌళి సం: 02-516 ఉత్సవ కీర్తనలు

పల్లవి:

మొక్కెద మిదివో మూఁడుమూర్తులును
వొక్కరూపమై వొనరెఁ జక్రము

చ. 1:

చెండిన రావణు శిరోమాలికల
దండల పూజల తఱచుగను
మెండుగఁ గంసుని మెదడు గంధముగ
నిండ నలఁదుకొని నిలిచెఁ జక్రము

చ. 2:

చించి హిరణ్యకసిపు పెనురక్తపు-
అంచనర్ఘ్య పాద్యమ్ములను
పంచజన ఘనకపాలపు టెముకను-
పంచవాద్యములఁ బరగు చక్రము

చ. 3:

బలు మధుకైటభ ప్రాణవాయువుల
అలరిన నైవేద్యంబులను
యెలిమిని శ్రీవేంకటేశు హస్తముల
వెలసి నిలచె నిదె విజయచక్రము


రేకు: 0200-04 సాళంగం సం: 02-517 అధ్యాత్మ

పల్లవి:

చేకొంటి నిహమే చేరిన పరమని
కైకొని నీవిందు కలవే కాన

చ. 1:

జగమునఁ గలిగిన సకలభోగములు
తగిన నీప్రసాదములే యివి
అడపడు నేఁబదియక్షరపంఙ్క్తులు
నిగమగోచరపు నీమంత్రములే

చ. 2:

పొదిగొని సంసారపుత్రదార లిల
వదలని నీదాసవర్గములే
చెదరక యేపొద్దుఁ జేయు నాపనులు
కదిసిన నియ్యాజ్ఞాకైంకర్యములే

చ. 3:

నలుగడ మించిన నాజన్మాదులు
పలుమరు లిటు నీపంపు లివి
యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విఁక
వలసినప్పుడీ వరములు నాకు


రేకు: 0200-05 లలిత సం: 02-518 మాయ

పల్లవి:

కానవచ్చీఁ గానరావు కమలాక్ష నీమాయ
తానే వెంటవెంటఁ దగిలీ నిదివో

చ. 1:

తొల్లి నీవు గలవు తోడనే నేఁను గలను
యెల్లగా నీప్రపంచము యింతాఁ గలదు
కొల్ల యెద్దు లెప్పటివే గోనెలే కొత్తలైనట్టు
చల్లని నేనొకఁడనే జన్మములే వేరు

చ. 2:

వేదములు నాటివే వినుకులు నాటివే
ఆదినుండి చదివే నదియే నేను
వేదతో వెన్నవట్టి నేయి వెదకఁబోయినయట్టు
దాదాత నాతెలివి యితరుల నడిగేను

చ. 3:

వైకుంఠమూ నున్నది వరములు నున్నవి
యీకడ శ్రీవేంకటేశ యేలితి నన్ను
కైకొని పువ్వు ముదిరి గక్కనఁ బిందెయైనట్టు
నీకు శరణనఁగాను నే నేడేరితిని


రేకు: 0200-06 దేసాళం సం: 02-519 శరణాగతి

పల్లవి:

కడనుండి చూచే నీకుఁ గనికరమైతేఁ గన
బడి నన్నుఁ గావు నీతో బలిమేలే

చ. 1:

వొడలు మోచినయది యొకయపరాధము
అడరి సంసారినౌటె యపరాధము
బడి నిని పఱచిన పాట్లఁ బడకపోడు (దు?)
యెడనీకు మొరవెట్ట నిఁకఁ జోటేదయ్యా

చ. 2:

అన్నపానములు గొన్న దది యొక్కనేరమి
వున్నతి సంపదఁ బొందు టొకనేరమి
యిన్నియు ననుభవించి యిఁక నొల్లనంటేఁ బోదు
విన్నపాలు సేసి నీతో విసుగఁ జోటేది

చ. 3:

మదిలో నీవుండగాను మఱచిన దొకకల్ల
అదనఁ గర్మాధికారనౌ టొకకల్ల
యెదుట శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గాచితివి
తుద కెక్కితిమి యింకఁ దొలఁగఁగవలెనా