తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 199


రేకు: 0199-01 నాట సం: 02-508 నృసింహ

పల్లవి:

ఇదె వీఁడె కంటిమమ్మ యేతులవాఁడు
కదలే సూర్యచంద్రుల కన్నులవాఁడు

చ. 1:

సెలవి నవ్వులవాఁడు చేకత్తిగోళ్లవాఁడు
పలుపేగుల జంధ్యాల పంతాలవాఁడు
యెలమిఁ జెలిఁదొడపై నిడుకొన్నట్టివాఁడు
చెలఁగిన ఘననారసింహుఁడటే వీఁడు

చ. 2:

కొండగద్దెమీఁదివాఁడు గొప్పకిరీటమువాఁడు
దిండుపైఁడిచీరకాశ(సె?) తెక్కులవాఁడు
రెండురూపులొకటైన రీతుల మాయలవాఁడు
అండఁ బ్రహ్లాదవరదుఁ డాతఁడటే వీఁడు

చ. 3:

భవనాసి పొంతవాఁడు భావించఁ దెల్లనివాఁడు
ఇవల శ్రీవేంకటాద్రి నిరవైనాఁడు
జవళిపంతాలవాఁడు శంఖుచక్రములవాఁడు
తివిరిన అహోబలదేవుఁడటే వీఁడు


రేకు: 0199-02 బౌళి సం: 02-509 కృష్ణ

పల్లవి:

పరమ పురుషుఁడీ బాలుఁడట
హర విరుంచులు మొక్కేరదివో వాకిటను

చ. 1:

దేవుఁడితఁడు సర్వదేవతల కొడయఁడు
వేవేలు వేదములచే వేద్యుఁడితఁడు
దేవకీదేవికి వసుదేవునికిఁ గొడుకాయ
యీవిధము నోఁచిరి వీరెంత భాగ్యవంతులో

చ. 2:

అంతటాఁ దానున్నవాఁడు అరయ స్వతంత్రుఁడు
అంతయు నాదియులేని ఆదిమూరితి
వంతుకు యశోదకు నవ్వల నందగోపునికి
దొంతరకొడుకైనాఁడు తొల్లి వీరే పుణ్యులో

చ. 3:

ఇందిరావల్లభుఁడు ఇహపరనాయకుఁడు
కందువ శ్రీవేంకటాద్రిఁ గాపున్నవాఁడు
మందగొల్లెతలకెల్ల మరఁది దానైనాఁడు
ఇందరు నిందరే వీరి కెన్నటి సంబంధమో


రేకు: 0199-03 లలిత సం: 02-510 కృష్ణ

పల్లవి:

ఎన్నఁడు గలుగు మరి యీభాగ్యము
సన్నిధాయ నితనికి శరణనరే

చ. 1:

అదె చంద్రుఁ డుదయించె నచ్యుతుఁడు జనియించె
అదనఁ గంసునిజన్మ మస్తమించెను
పొదలిరి దివిజులు పొలిసిరి రాక్షసులు
సదర మీ శిశువుకు శరణనరే

చ. 2:

పాండవకులము హెచ్చె బాలకృష్ణుఁడిదె వచ్చె
చండి దుర్యోధనుమూఁక జల్లన విచ్చె
దండి గోకులము నిండె ద్రౌపది తపము వండె
చండ్రప్రతాపున కిట్టె శరణనరే

చ. 3:

రేపల్లె పుణ్యము సేసె శ్రీవేంకటేశుఁడు డాసె
గోపికల మనసుల కొఱత వాసె
కోపుల ధర్మము దక్కె గోవర్ధనగిరి నిక్కె
చాపలమేఁటి కితని శరణనరే


రేకు: 0199-04 ముఖారి సం: 02-511 వైష్ణవ భక్తి

పల్లవి:

అతఁడే గతియని యంటే నన్నిటా మాన్యుఁడు
ఇతరాలు మానఁగానే యీతనికే శలవు

చ. 1:

శ్రీరమణుని నిత్యసేవకులకుఁ దొల్లె
వేరులేని కర్మముల వెట్టి మాన్యము
ఆరీతి నితనిభక్తులైన చనవరులకు
ఆరితేరి పుణ్యపాపా లడ్డపాటు లేదు

చ. 2:

తక్కక యితనిముద్ర ధరించిన దాసులకు
చొక్కుల భవబంధాల సుంక మాన్యము
లెక్కించ నితనికైన లెంకలకు బొడుకల-
కొక్కట విధినిషేధా లూహింపలేవు

చ. 3:

సరుస శ్రీవేంకటేశు శరణాగతులకును
పరగ మాయల దొడ్డిబందె మాన్యము
పరమమైన యితని పళ్లెముకూటివారికి
ధరలో నేమిటివంకాఁ దప్పులే లేవు


రేకు: 0199-05 సామంతం సం: 02-512 శరణాగతి

పల్లవి:

నీ చేతఁలోవారము నీవారము
యేచి నీకే చేత మొక్కే మిదియే మావ్రతము

చ. 1:

ఇన్నిటాఁ బూర్ణుఁడవు నీ వెరఁగని యర్థమేది
విన్నపము నేఁ జేసే విధమేది
మన్నించిన నీమన్ననే మహిమలో మాబ్రదుకెల్ల
వున్నతి మీదాసిననే దొక్కటే మావ్రతము

చ. 2:

ఘనదేవుఁడవు నీకుఁ గడమలు మరియేవి
గొనకొని నే నిన్నుఁ గొసరేదేమి
పొనుగక యేలితివి పుట్టిన మాపుట్టుగెల్ల
ననిచి నిన్ను నమ్మిన నమ్మికే మావ్రతము

చ. 3:

శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తగించనిది యేది
భావించి నేఁ బొందని భాగ్య మేది
యేవల మాపరభారా లింతయు నీకెక్కినది
ఆవటించి నే నీశరణన్నదే మావ్రతము


రేకు: 0199-06 దేసాక్షి సం: 02-513 వైరాగ్య చింత

పల్లవి:

కనియుండి భ్రమసితిఁ గట్టా నేను
యెనలేక గురియైతి నిట్టే నేను

చ. 1:

తోలునెముకలు గట్టి దొరనంటా మురిసేను
అలుబడ్డల మరఁగు ఆహా నేను
గాలి యాటించుకొని కాలములు గడపేను
వోలిఁ బుణ్యపాపమందు వోహో నేను

చ. 2:

మంటివంక బదుకుతా మదియించి మురిసేను
ఇంటిముంగిటనే వుండి యీహీ నేను
వొంటివాఁడనై వుండి వూరఁగలవెల్లాఁ గోరే
వొంటిన యాసల తోడ నూహూ నేను

చ. 3:

నూలికోకఁ గట్టువడి నున్ననై నే మురిసేను
యీలాగు నాబదుకెల్ల యేహే నేను
పాలించి శ్రీవేంకటాద్రిపతి నాకుఁ గలుగఁగ
ఆలరినై గెలిచితి హైహై నేను