తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 197


రేకు: 0197-01 శంకరాభరణం సం: 02-496 నృసింహ

పల్లవి:

చేపట్టి మమ్ముఁ గావు శ్రీనరసింహా నీ-
శ్రీపాదములే దిక్కు శ్రీనరసింహా

చ. 1:

చెలఁగు వేయిచేతుల శ్రీనరసింహా
చిలకేటి నగవుల శ్రీనరసింహా
సిలుగులేని మంచిశ్రీనరసింహా నీ-
చెలిఁ దొడెక్కించుకొన్న శ్రీనరసింహా

చ. 2:

క్షీరసముద్రమువంటి శ్రీనరసింహా దైత్యుఁ
జీరిన వజ్రపుగోళ్ల శ్రీనరసింహా
చేరి ప్రహ్లాదునిమెచ్చే శ్రీనరసింహా నుతిం-
చేరు దేవతలు నిన్ను శ్రీనరసింహా

చ. 3:

శ్రీవనితతో మెలపు(గు?) శ్రీనరసింహా
చేవదేరే నీమహిమ శ్రీనరసింహా
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీనరసింహా సర్వ-
జీవదయాపరుఁడవో శ్రీనరసింహా


రేకు: 0197-02 సాళంగనాట సం: 02-497 రామ

పల్లవి:

నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక
ధరణిఁ గీరితికెక్కె దశరథసుతుఁడు

చ. 1:

యీతఁడాతాటకిఁ జంపె నీమారీచసుబాహుల-
నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ
యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె
సీతఁ బెండ్లియాడెను యీచిన్నరాముఁడా

చ. 2:

చుప్పనాతిముక్కు గోసి సోదించి దైత్యులఁ జంపి
అప్పుడిట్టె వాలి నేసినాతఁ డీతఁడా
గుప్పించి కోఁతుల నేలి కొండల జలధి గట్టి
కప్పి లంక సాధించె నీకౌసల్యనందఁనుడా

చ. 3:

రావణాదులనుఁ జంపి రక్షించి విభీషణుని
భావిం చయోధ్య నీతఁడు పట్టమేలెను
శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే
యీవల మాపాలనున్న యారామచంద్రుఁడా


రేకు: 0197-03 పాడి సం: 02-498 వేంకటగానం

పల్లవి:

అదివో చూడరో అందరు మ్రొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని

చ. 1:

రవిమండలమున రంజిల్లు తేజము
దివిఁ జంద్రునిలో తేజము
భువి ననలంబునఁ బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము

చ. 2:

క్షీరాంబుధిలోఁ జెలఁగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము

చ. 3:

పొలసిన యాగంబులలో ఫలమును
పలు తపములలో ఫలమును
తలఁచిన తలఁపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము


రేకు: 0197-04 రామక్రియ సం: 02-499 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

ఆతనిఁబో పొగడేము ఆతని శరణంటిమి
ఆతఁడే సర్వజీవుల అంతర్యామి

చ. 1:

పెక్కు బ్రహ్మాండకోట్లు పెక్కు బ్రహ్మకోట్లు
పెక్కు రుద్రకోట్లును పెక్కు యింద్రులు
వొక్కొక్క రోమకూపాల నొగి నించుకుండునట్టి
వొక్కఁడే విష్ణుఁడు వీఁడే వున్నతోన్నతుఁడు

చ. 2:

అనంత సూర్యచంద్రులు అనంత వాయువులును
అనంత నక్షత్రము లనంత మేరువులు
కొనలు సాగీ నన్నిటి కూటువఁ గూడుకొన్నట్టి
అనంతుఁడొక్కఁడే మించీ నాదిమూరితి

చ. 3:

అసంఖ్యమహిమలను అసంఖ్యమాయలు
అసంఖ్యశక్తులు వరాలసంఖ్యములు
పొసఁగ నిన్నిటిఁ దానే పుట్టించి రక్షించినట్టి
అసంఖ్యాతుఁడు శ్రీవేంకటాద్రీశుఁడు


రేకు: 0197-05 దేసాళం సం: 02-500 శరణాగతి

పల్లవి:

నీవే రక్షింతువుగాక నిన్ను నమ్మితిమి నేము
దైవమవై నీ వుండఁగ తగ మాదే బ్రదుకు

చ. 1:

కోరి వొకరాతివీరుఁ గొల్చి బతికీ నొకఁడు
పైరు వొక్కచెట్టువెట్టి బతికేననీ నొకఁడు
కూరిమిఁ బాము చేఁబట్టుకొని బతికీ నొకఁడు
శ్రీరమణుని దాసుల చేతిదేపో భాగ్యము

చ. 2:

ఇసుమంత మన్ను వట్టి యేచి బతికీ నొకఁడు
పసురము నింటఁ గట్టి బతికేననీ నొకఁడు
పసగా వేలె డినుము పట్టి బతికీ నొకఁడు
వసుధేశ నీవు గలవారి కేమి గడమ

చ. 3:

ఆకునలముఁ గసవునంటి బతికీ నొకఁడు
లోకులు పెక్కుపాయాల లోలులై బతికే రదే
యీకడ శ్రీవేంకటేశ ఇవెల్లా నీమహిమలే
చేకొని నీమరఁగు చొచ్చినవారే ఘనులు


రేకు: 0197-06 సామంతం సం: 02-501 అధ్యాత్మ

పల్లవి:

బయలుమొరంగగు పరమమాయ ఇది
నయమున లోనై వడతురు గాని

చ. 1:

కలఁడు హరి యొకఁడు కావ జగములకు
కలిగినతఁడు లేక మానఁడు
తెలిసి ఇందరికిఁ దేరిన యర్థమే
మలసి యప్పటి మరతురు గాని

చ. 2:

పుట్టినదెల్లా భోగముకొరకే
పుట్టిన భోగము పో దెపుడు
పట్టి యీమాఁటలే పలుకుదు రిందరు
మట్టులేక ఇది మరతురు గాని

చ. 3:

కర్మము శ్రీవేంకటపతి కార్యము
కర్మము దేహికిఁ గాణాచి
ధర్మ మీదేవుని దాస్యం బందురు
మర్మము లోకులు మరతురు గాని