తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 196


రేకు: 0196-01 దేవగాంధారి సం: 02-492 శరణాగతి

పల్లవి:

నీయంత నీవే యెరిఁగి నిచ్చ నన్నుఁ గాతు గాక
మాయలలోఁ బొరలే దిమ్మరివాఁడ నేను

చ. 1:

నీ సరివాఁడనా నిన్ను దూరేవాఁడనా
దాఁసుడనై కొలిచిన తనుధారిని
వేసరించ నోపుదునా వెరపించఁగలనా
మాసిన పాపాలలోని మైల సోఁకినాఁడను

చ. 2:

విన్నవించేవాఁడనా వీడుజోడువాఁడనా
అన్నిటా శరణుచొచ్చినట్టి జీవిని
యెన్నిటి కుత్తరమిచ్చే యేపని సేసి మెప్పించే
మున్నిటి కర్మములకు ముంగిట నున్నాఁడను

చ. 3:

యెదురాడేవాఁడనా యెలయించేవాఁడనా
సదరాన నీకు మొక్కేజంతువ నేను
ఇదివో శ్రీవేంకటేశ యెరుక నీ వొసగఁగా
పొదిగి నీమహిమలు పొగడుచున్నాఁడను


రేకు: 0196-02 సాళంగనాట సం: 02-493 అధ్యాత్మ

పల్లవి:

ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను
చెచ్చెరఁ దగవు లింకఁ జెప్పఁగదరో

చ. 1:

నిలిచినది జగము నిండినది భోగము
కలిగె జీవుల కొక్కకాణాచి
వలయశాసనాలు వడి నాల్గు వేదములు
చలపట్టి జాణలు చదువుకోరో

చ. 2:

పారినవి మనసులు పట్టినది జననము
పోరు దీరెఁ గర్మముల పొలమేర
కోరికలె సాక్షులు గుట్టలు త్రిగుణములు
వూరుఁ బేరుఁ దెలుసుక వొడఁబడరో

చ. 3:

దక్కినది ధర్మము తప్పనిది భాగ్యము
లెక్కించ నుదుటివ్రాలె లిఖితములు
యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటికి మూలము
చిక్కులు వాపె నితని సేవించరో


రేకు: 0196-03 రామక్రియ సం: 02-494 అన్నమయ్య స్తుతి

పల్లవి:

వెఱ్ఱులాల మీకు వేడుక గలితేను
అఱ్ఱువంచి తడు కల్లంగరాదా

చ. 1:

ముడిచివేసిన పువ్వు ముడువ యోగ్యముకాదు
కుడిచివేసిన పుల్లె కుడువఁగాఁ గాదు
బడినొకరు చెప్పినఁ ప్రతి చెప్పఁబోతేను
అడరి శ్రీహరి కది అరుహముగాదు

చ. 2:

గంపెఁ డుముక దినఁగా నొక్క వరిగింజ
తెంపునఁ గలసితే తెలియనెట్టు వచ్చు
జంపులఁ బలవరించఁగ నొక మంచిమాట
ఇంపైతే హరి యందుకిచ్చునా వరము

చ. 3:

వుమిసిన తమ్మలో నొకకొంత కప్రము
సమకూర్చి చవిగొని చప్పరించనేల
అమరఁగ ఛాయాపహారము సేసుక
తమమాట గూర్చితే దైవము నగడా

చ. 4:

చిబికివేసిన గింజ చేతఁ బట్టఁగనేల
గబుక కెంగిలిబూరె గరడుగఁగ మరి యేల
తొబుక కవిత్వాల దోషాల బొరలితే
దిబుకార నవ్వఁడా దేవుఁడైనాను

చ. 5:

మించుచద్దికూటి మీఁద నుమిసినట్టు
మంచి దొకటి చెప్పి మరిచెప్పనేరక
కంచుఁ బెంచు నొక్కగతి నదికితే ముట్టు-
పెంచువలెనే చూచు పెరుమాళ్లు వాని

చ. 6:

పుచ్చినట్టి పండుబూఁజి లోననే వుండు
బచ్చన కవితలు బాఁతిగావు యెందు
ముచ్చుఁ గన్నతల్లి మూల కొదిగినట్టు
ముచ్చిమి నుతులేల మొక్కరో హరికి

చ. 7:

వుల్లిదిన్న కోమ టూరకవున్నట్టు
జల్లెడ నావాలు జారిపోయినట్టు
కల్లలు చెప్పి యాకథ కుత్తరము లీక
మెల్లనే వుండితే మెచ్చునా దైవము

చ. 8:

నేతి బీరకాయ నేయి అందులేదు
రాతివీరునికి బీరము ఇంచుకా లేదు
ఘాత బూరుగుఁబండు కడుపులోన దూది
యేతుల నుడుగులు యెక్కునా హరికి

చ. 9:

ఇరుగువా రెరఁగరు పొరుగువా రెరఁగరు
గొరబైన మాటలు గొణఁగుచు నుందురు
పరులఁ గాదందురు బాఁతిగారు తాము
విరసు లట్టివారి విడుచు దేవుఁడు



చ. 10:

యెన్నఁగ శ్రీవేంకటేశుఁ దాళ్లపాక
అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ-
నున్నతితో బాడిరొకఁ డెవ్వఁడో తాను
సన్న నొరసునట సమ్మతా హరికి


రేకు: 0196-04 లలిత సం: 02-495 వైష్ణవ భక్తి

పల్లవి:

చిరకాలధర్మములు చివుకు దవ్వఁగఁబోతే
హరిమఱుఁగు చొచ్చితి మాతఁడే రక్షించెను

చ. 1:

భువిఁ దొల్లి లేరా పుణ్యము సేసినవారు
జవళిశాస్త్రములెల్లాఁ జదివినవారు లేరా
దివి కెక్కి దేవతలై తేరినవారు లేరా
యివల నే మివి సేసి యెవ్వరిఁ బోలేము

చ. 2:

తగఁ దొల్లి వినమా తపము సేసినవారి
జిగి నన్నియజ్ఞములు సేసినవారి వినమా
మిగులా సిద్దివడసి మించినవారి వినమా
యెగువ నే మింతకంటే యెక్కుడు సేసేమా

చ. 3:

పెక్కుమతములు చూచి బెండుపడ్డవారు లేరా
పక్కన నన్నివిద్యలాఁ బరగినవారు లేరా
వోక్కఁడే శ్రీవేంకటేశుఁ డుల్లములో నుండఁగాను
యెక్కుడితనిఁ గొలువ కెవ్వరిఁ బోలేము