తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 191


రేకు: 0191-01 రామక్రియ సం: 02-462 రామ

పల్లవి:

వినవమ్మ జానకి నీవిభుఁ డింతసేసినాఁడు
యెనసి యీరఘుశ్రీరాముఁ డికఁ నేమి సేసునో

చ. 1:

వానరులదండు గూడి వారధి కొండలఁ గట్టె
ఆని లంక చుట్టిరా నదే విడిసె
కోనలఁ ద్రికూటమెక్కె గొడగు లన్నియుఁ జెక్కె
యే నెపాన రఘురాముఁ డిఁక నేమి సేసునో

చ. 2:

కోరి ఇంద్రజిత్తుఁ జంపె కుంభకర్ణు నిర్జించె
ఘోరదానవులనెల్ల కూలఁగుమ్మెను
మారణహోమము సేసె మతకమింతాఁ జెరిచె
యీరసాన రఘురాముఁ డిఁక నేమి సేసునో

చ. 3:

లావున రావణుఁ జంపె లంక విభీషణు కిచ్చె
చేవల నోసీత నిన్నుఁ జేకొనెను
భావించి శ్రీవేంకటాద్రిఁ బట్టము దాఁ గట్టుకొనె
యీవలనావల నాతఁ డిఁక నేమి సేసునో


రేకు: 0191-02 శంకరాభరణం సం: 02-463 నృసింహ

పల్లవి:

ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను
కొంత నాకుఁ దెలుపరో గురువులాల

చ. 1:

తనువూ హరియే తలఁపూ హరియే
వినికి మనికియును విష్ణుఁడే
కనుఁగొను చూపులు కమలనాభుఁడే
యెనసి జీవునిశక్తి యేడనేడ నున్నదో

చ. 2:

లోకమెల్ల మాధవుఁడే లోనెల్లఁ గేశవుఁడే
వాకును కర్మము శ్రీవైకుంఠుఁడే
చేకొని చైతన్యమెల్ల శ్రీనారాయణుఁడే
యీకడ నే ననువాఁడ నేడ నుండువాఁడనో

చ. 3:

వెనకను కృష్ణుఁడే వెస ముం దచ్యుతుఁడే
కొనమొదలు నడుము గోవిందుఁడే
యెనయఁగ శ్రీవేంకటేశుమయ మింతాను
అనుగు నాస్వతంత్ర మది యేడనున్నదో


రేకు: 0191-03 లలిత సం: 02-464 సంస్కృత కీర్తనలు

పల్లవి:

కలిగె మాకు నిది కైవల్యం
కలకాలము హరికథాశ్రవణం

చ. 1:

అచింత్య మద్భుత మానందం
ప్రచురం దివ్యం పావనం
సుచరిత్రం శ్రుతిశోభితం
అచలంబిదివో హరికీర్తనం

చ. 2:

నిరతం నిత్యం నిఖిల శుభకరం
దురితం హర భవదూరం
పరమ మంగళం భావాతీతం
కరివరదం నిజ కైంకర్యం

చ. 3:

సులభం సుకరం శోకనాశనం
ఫలదం లలితం భయహరణం
కలితం శ్రీవేంకటపతిశరణం
జలజోదరనిచ్చ స్తోత్రం


రేకు: 0191-04 బౌళి సం: 02-465 అధ్యాత్మ

పల్లవి:

ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు
మఱి తెలివికంటే మఱుపే శుభము

చ. 1:

లంపటా లెఱఁగము లవలవ లెఱఁగము
పంపుల బాల్యమే పరిణామము
యింపులు నెఱఁగము యెగ్గులు నెఱఁగము
జంపుల నిదురే సకలసౌఖ్యము

చ. 2:

ఆస లివెఱఁగము అలమట లెఱఁగము
మూసిన గర్భమే మును సుఖము
వాసులు నెఱఁగము వంతులు నెఱఁగము
వేసట పుట్టని విధమే సుఖము

చ. 3:

పాపము లెఱఁగము బంధము లెఱఁగము
శ్రీపతి దాస్యమే శేఖరము
యేపున శ్రీవేంకటేశ్వరు శరణమే
తీపులు మఱపేటి దివ్యానందము


రేకు: 0191-05 లలిత సం: 02-466 నామ సంకీర్తన

పల్లవి:

కలిగె నిదె నాకు కైవల్యము
తొలుత నెవ్వరికి దొరకనిది

చ. 1:

జయ పురుషోత్తమ జయ పీతాంబర
జయ జయ కరుణాజలనిధి
దయ యెఱంగ నే ధర్మము నెఱంగ నా-
క్రియ యిది నీ దివ్యకీర్తనమే

చ. 2:

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్దన
పరమ మెఱంగను భక్తి యెఱఁగను
నిరతము నాగతి నీ దాస్యమే

చ. 3:

నమో నారాయణ నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే


రేకు: 0191-06 శంకరాభరణం సం: 02-467 అధ్యాత్మ

పల్లవి:

హరియు నొక్కఁడే గురి ఆత్మలో నొక్కటే గురి
విరివి నెంత చదివినా వేరుగాఁ బొయ్యీనా

చ. 1:

అందరిచూపులు నొక్కటైనందుకు గురి
యెందూఁ గొండ కొండేకాక యితరముగాఁ జూచేరా
అందరిరుచులు నొక్క టైనందుకు గురి
చెంది తీపు తీపే కాక చేఁదుగాఁ జేకొనేరా

చ. 2:

వొప్పుగా నందరివూర్పు లొక్కటైనందుకు గురి
కప్పుర మదేకాక కస్తూరిగా మూఁకొనేరా
యెప్పుడూ నిందరి వినికేకమైనందుకు గురి
తిప్పి తిట్టు తిట్టేకాక దీవెనగా వినేరా

చ. 3:

యీరీతి నిందరిచిత్త మేకమైనందుకు గురి
మేరతో సూర్యోదయము మించి రేతిరయ్యీనా
తేరి శ్రీవేంకటపతి దేవుఁడైనందుకు గురి
కోరినవారి వరాలే కొంగుపైఁడి గాదా