తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 190
రేకు: 0190-01 లలిత సం: 02-456 వేంకటగానం
పల్లవి:
ఎట్టు వలసినఁ జేయు మిన్నియు నీచిత్తమె
నెట్టన(నె?) నొకఁడనా నీవే యింతాను
చ. 1:
వేవేలు నీకు విన్నవించేదేమి తొల్లే
సావధానముగ సర్వసాక్షివి నీవు
ఆవల నాకిటు సేయుమని చెప్పేదేమి నేను
దైవికమైనట్టి స్వతంత్రుఁడవు నీవు
చ. 2:
తగిలి నిన్ను నాలో ధ్యానించేదేమి తొల్లె
జగతి నీవు పూర్ణచైతన్యుఁడవు
జిగి నీనామము నోరఁ జిక్కించి నుడిగేదేమి
మగుడి శబ్దాక్షరమంత్రరూపుఁడవు
చ. 3:
చేవమీర సిరులఁ బూజించేదేమి నిన్ను
శ్రీవేంకటేశ నీవు శ్రీపతివి
దేవదేవ నిన్ను నీవే తేఁకువెల్లా నెంచుకొని
కావుము నీవొక్కఁడవే కరుణానిధివి
రేకు: 0190-02 బౌళి సం: 02-457 అంత్యప్రాస
పల్లవి:
ఈతనిమూలమెపో యిలఁగల ధనములు
యీతఁడు మాకు గలఁడు యెంత లేదు ధనము
చ. 1:
విరతి మాధనము విజ్ఞానమే ధనము
మరిగిన తత్వమే మా ధనము
పరము మా ధనము భక్తే మా ధనము మా-
కరిరాజవరదుఁడే కైవల్యధనము
చ. 2:
శాంతమే మా ధనము సంకీర్తనే ధనము
యెంతైనా నిశ్చింతమే ఇహధనము
అంతరాత్మే మా ధనము హరిదాస్యమే ధనము
యింతటా లక్ష్మికాంతుఁ డింటిమూలధనము
చ. 3:
ఆనందమే ధనము ఆచార్యుఁడే ధనము
నానాటఁ బరిపూర్ణమే ధనము
ధ్యానమే మా ధనము దయే మా ధనము
పానిన శ్రీవేంకటాద్రిపతియే మా ధనము
రేకు: 0190-03 బౌళి సం: 02-458 అంత్యప్రాస
పల్లవి:
నీమాయ కల్లగాదు నిజము దెలియరాదు
కామించి హరి నీ వొక్కఁడవే నిజము
చ. 1:
చచ్చేటి దొకమాయ హరి బుట్టేదొకమాయ
మచ్చుమేపులసిరులు మాయలో మాయ
వచ్చేటి దొకమాయ వచ్చిపోయ్యే దొకమాయ
కచ్చుపెట్టి హరి నీ వొక్కఁడవే నిజము
చ. 2:
పొద్దువొడచేది మాయ పొద్దుగుంకే దొకమాయ
నిద్దురయు మేల్కనేది నిండుమాయ
వొద్దనే సుఖము మాయ వొగి దుఃఖ మొకమాయ
గద్దరి శ్రీహరి నీ వొక్కఁడవే నిజము
చ. 3:
కూడేటి దొకమాయ కూడి పాసే దొకమాయ
యేడ నేర్చితి శ్రీవేంకటేశుఁడ నీవు
వేడుక నీశరణంటి విడిపించు మీమాయ
వోడక వెదకితి నీ వొక్కఁడవే నిజము
రేకు: 0190-04 దేసాళం సం: 02-459 వేంకటగానం
పల్లవి:
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ
సురత బిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ
చ. 1:
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవరాయ సకలవినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ
చ. 2:
గొల్లెతల వుద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లు వెదజాణరాయ చల్లఁ బరిమళరాయ
చెల్లుబడి దర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ
చ. 3:
సామసంగీతరాయ సర్వమోహనరాయ
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్నుఁ గోరితే గరుణించితివి నన్ను
శ్రీమంతుఁడ నీకు జయ శ్రీవేంకటరాయ
రేకు: 0190-05 బౌళి సం: 02-460 అధ్యాత్మ
పల్లవి:
అన్నిటా శాంతుఁడైతే హరిదాసుఁడు దానే
సన్నుతిఁ దానేపో సర్వదేవమయుఁడు
చ. 1:
అత్తల మనసు యింద్రియాధీనమైతేను
చిత్తజుఁడనెడివాఁడు జీవుఁడు దానే
కొత్తగాఁ దనమనసే కోపాన కాధీనమైతే
తత్తరపు రుద్రుఁడునుఁ దానే తానే
చ. 2:
భావము వుద్యోగముల ప్రపంచాధీనమైతే
జీవుఁడు బ్రహ్మాంశమై చెలఁగుఁ దానే
కావిరి రేయిఁబగలు కన్నుల కాధీనమైతే
ఆవలఁ జంద్రసూర్యాత్మకుఁడు దానే
చ. 3:
కోరికఁ దనబ్రదుకు గురువాక్యాధీనమైతే
మోరతోపులేని నిత్యముక్తుఁడు దానే
ఆరయ శ్రీవేంకటేశుఁ డాతుమ ఆధీనమైతే
ధారుణిలో దివ్యయోగి తానే తానే
రేకు: 0190-06 సాళంగనాట సం: 02-461 శరణాగతి
పల్లవి:
ఇహమెట్టో పరమెట్టో ఇఁక నాకు
సహజమై హరియే శరణము నాకు
చ. 1:
చిత్తమిది యొకటే చింత వేవేల సంఖ్య
పొత్తుల హరిఁ దలఁచఁ బొద్దులేదు
జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు
చ. 2:
చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు
చ. 3:
వీనులివి రెండే వినికి కొలదిఁలేదు
వూని హరిభక్తి విన బుద్ధిలేదు
యీనటన శ్రీవేంకటేశుఁడిటు చూచినను
తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు