తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 185


రేకు: 0185-01 గుండక్రియ సం: 02-426 తిరుపతి క్షేత్రం

పల్లవి:

దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా

చ. 1:

ధర్మార్థకామ మోక్షతతులు నీ సోబనాలు
అర్మిలి నాలుగు వేదాలదె నీ దరులు
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీలోఁతు వో కోనేరమ్మా

చ. 2:

తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు
జగతి దేవతలు నీ జలజంతులు
గగనపుఁ బుణ్యలోకాలు నీదరి మేడలు
మొగి నీ చుట్టు మాఁకులు మునులోయమ్మా

చ. 3:

వైకుంఠనగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీవేంకటేశుఁడే నీ వునికి
దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా


రేకు: 0185-02 కాంబోది సం: 02-427 అద్వైతము

పల్లవి:

నన్నెరఁగలేనయ్యో నాయంతర్యామై
వున్నతపు హరి నాలో నున్నాఁడట

చ. 1:

యిల నేడుజానల మేనిందులోనివాఁడ నింతే
తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపొయ్యీని
కలువరేకులంతేసి కన్నులవాఁడ వింతే
సొలసి చూపాకాశమే చూరగొనీని

చ. 2:

వెడ వెంట్రుక దూరేటి వీనులవాఁడ నింతే
కడలేని శబ్దము లొక్కట వినేను
నడుమ నే నల్లెఁడంత నాలికెవాఁడ నింతె
వుడివోని సుద్దు లెల్లా నుగ్గడించేను

చ. 2:

లచ్చనఁ బదారంగుళాల ప్రాణ మింతే
కుచ్చి కాలపుదినాలు గొలచీని
కొచ్చిన శ్రీవేంకటేశు కొలువుడుబంట నింతే
పచ్చి యింద్రియాల కెల్లాఁ బంపు సేసేను


రేకు: 0185-03 సామంతం సం: 02-428 వైరాగ్య చింత

పల్లవి:

నిక్కమైన నాలోని నెలవు గానలేను
దిక్కు నీవే హరి నాతెలి వేఁటితెలివి

చ. 1:

నీటిలో మునిఁగి వచ్చి నిర్మలుఁడ ననుకొందు
గాఁటమై యావేగి లేచి కానందును
తేటల ఆ దేహమే దిష్టము ఆనేనే
పాటిలేని భావపు నాబదు కేఁటిబదుకు

చ. 2:

యెన్న నొక బంటు నేలి యేలికే నే ననుకొందు
పన్ని నే నొకరిఁ గొల్చి బంట నందును
మున్నిటి నామనసె మొదలి నాపుట్టుగే
యిన్ని వికారాల నాయెరు కేఁటియెరుక

చ. 3:

కాంచనము చేతనుంటే కలవాఁడ ననుకొందు
పెంచి యొకవేళ నేఁ బేద నందును
కంచుమాయఁ బొరలఁగాఁ గాచితి శ్రీవేంకటేశ
కొంచిన యిన్నాళ్లు నాగుణ మేఁటిగుణము


రేకు: 0185-04 మాళవి సం: 02-429 కృష్ణ

పల్లవి:

అరు దరుదు నీమహి మతిమానుషము చూడ
పురుషోత్తమను దివ్యపుర జగన్నాథా

చ. 1:

పసులఁ గాచే దేడ బ్రహ్మ నుతియించు టేడ
సిసువౌ టేడ నాలుగుచేత లేడ
కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు టేడ
వసమా నిన్నుఁ బొగడ వరజగన్నాథా

చ. 2:

జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ
తనివెన్న ముచ్చి మేడ దైవికమేడ
పని బండిబోయిఁడేడ బాణుని నరకు టేడ
వినఁ గత నీమహిమ విష్ణు జగన్నాథా

చ. 3:

కమ్మి రోలఁ గట్టు టేడ గరుడవాహన మేడ
దొమ్మి భద్రసుభద్రుల తోఁబుట్టు వేడ
చిమ్ముల నిలగిరిని (?) శ్రీవేంకటాద్రిమీఁద-
నుమ్మడి నిరవుకొంటివో జగన్నాథా


రేకు: 0185-05 మాళవిగౌళ సం: 02-430 శరణాగతి

పల్లవి:

కలియుగ మెటులైనాఁ గలదుగా నీకరుణ
జలజాక్ష హరి హరి సర్వేశ్వరా

చ. 1:

పాపమెంత గలిగినఁ బరిహరించేయందుకు
నాపాలఁ గలదుగా నీనామము
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు
చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు

చ. 2:

ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను
సరిఁ గావఁగద్దుగా నీ శరణాగతి
గరిమఁ గర్మబంధాలు గట్టిన తాళ్ళు వూడించ
నిరతిఁ గలదు గా నీ భక్తి నాకు

చ. 3:

హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య
సతమై కలదుగా నీసంకీర్తన
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ
గతి గలదుగా నీకమలాదేవి


రేకు: 0185-06 గుండక్రియ సం: 02-431 నామ సంకీర్తన

పల్లవి:

జయమంగళము నీకు సర్వేశ్వరా
జయమంగళము నీకు జలజవాసినికి

చ. 1:

శరణాగతపారిజాతమా
పొరి నసురలపాలి భూతమా
అరుదయున సృష్టికి నాదిమూలమా వో-
హరి నమో పరమపుటాలవాలమా

చ. 2:
సకలదేవతాచక్రవర్తి
వెకలివై నిండిన విశ్వమూర్తి
అకలంకమైన దయానిధి
వికచముఖ నమో విధికి విధి

చ. 3:

కొలచినవారల కొంగుపైఁడి
ములిగినవారికి మొనవాఁడి
కలిగిన శ్రీవేంకటరాయా
మలసి దాసులమైన మాకు విధేయా