తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 184


రేకు: 0184-01 లలిత సం: 02-421 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

ఇది యరుదను నొకఁడిది యరుదని చెప్పు
యిది యరుదని విను నెవ్వఁడూ నెఱఁగఁడు

చ. 1:

పుట్టినవానికినెల్లా భువి మరణము నిత్య-
మట్టే చచ్చినవారి కవ్వల జననము
పుట్టిననాఁడై తేను పొడగానరాదు మేను
కొట్టఁగొనఁ గానరాదు కొన్నాళ్లే కాని

చ. 2:

జీవుఁడు నిత్యుఁ డేమిటాఁ జెరుపఁగరానివాఁడు
యీవివేకము దెలిసి యేజాతివారైనా
దైవికమే నమ్మి తమధర్మములఁ బాయరాదు
సావధాన మిదియే సంసారయోగము

చ. 3:

చి త్తమా నీలోపలను శ్రీవేంకటేశ్వరుఁడు
పొత్తునఁ గూడున్నవాఁడు పొదిగి పాయకు నీవు
యెత్తి నాదేహగుణము ఇది జీవగుణ మిది
ఇత్తలాదైన గుణము యిది మఱవకుమీ


రేకు: 0184-02 ముఖారి సం: 02-422 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

నాకు నీవు గలవు హరి నాలోపలనుండి
పైకొని యిన్నియు బదుకనీవయ్యా

చ. 1:

పసిగొని రుణానుబంధము కొలఁదే
పసులునుఁ బడతులు బహుసుతులు
వసముగావు తమవంతులు దీరిన
పసగా నవియే బదుకనీవయ్యా

ప. 2:

పెనగొని భటులకుఁ బెట్టిన కొలఁదియు
పనులునుఁ గీర్తులు పంతములు
అనువులు దప్పును అవి గడమైతే
పనివడి యివియే బదుకనీవయ్యా

చ. 3:

కడుసంపదలును కాలము కొలఁదే
బడిబడిఁ జవులై ఫలియించు
యెడపక శ్రీవేంకటేశుఁ డిచ్చె నివే
పడసితి మివియును బదుకనీవయ్యా


రేకు: 0184-03 సామంతం సం: 02-423 శరణాగతి

పల్లవి:
నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకు నే శరణంటినే

చ. 1:
చలవయును వేఁడియును సటలసంసారంబు
తొలఁకు సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ
ఫలము లివె యీరెండుఁ బాపములు పుణ్యములు
పులుసుఁ దీపునుఁ గలపి భుజియించినట్లు

చ. 2:
పగలురాత్రులరీతి బహుజన్మమరణాలు
తగుమేను పొడచూపు తనుఁ దానె తొలఁగు
నగియించు నొకవేళ నలఁగించు నొకవేళ
వొగరుఁ గారపువిడె ముబ్బించినట్లు

చ. 3:

ఇహముఁ బరమునువలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి
బహువిధంబుల నన్నుఁ బాలించవే


రేకు: 0184-04 గుండక్రియ సం: 02-424 వైరాగ్య చింత

పల్లవి:

కలుగుట గలిగిననాఁడే నే ఘనపాపములకు దొలఁగీనా
యెలమి నే నిపుడే యెరిఁగితిని యిన్నాళ్లీమతిలేదు

చ. 1:

జనియించిన నే నిటకమునుపు సకలయోనిగతజన్మములు
కనుఁగొని యవె నే సారెకుఁ బలుమారు ఘనవర్ణాశ్రమధర్మములు
అనుభవించినవే సకలార్థంబులు అయిహికవిషయము లన్నియును
మనసున వాకున శ్రీహరి నొకని నే మఱచియుఁ దలఁచుట లేదు

చ. 2:

తిరిగినవే నే నాసలకొరకును దిక్కు లన్నియును నేను
యిరవుగ తొల్లియు నెఱిఁగినవే యీసంసారపుసుఖము లివి
పొరలినవే నేఁ గామినీజనుల పొందుల సుఖముల భోగములు
యెరవులదొకటే శ్రీహరిదాస్యం బిది గతియని యెరుఁగుటలేదు

చ. 3:

గడియించినవే నేఁ బూర్వకాలమున ఘనమగు సంపద లిన్నియును
నొడిగినవే నే శబ్దజాలములు నోరఁ గొలఁదు లివి యిన్నియును
తలఁబడి నే నిటు సకలోపాయపు ధర్మము లిన్నియుఁ జూచితివి
యెడపక శ్రీవేంకటేశ్వరు శరణం బిటువలెఁ జేరుటలేదు


రేకు: 0184-05 లలిత సం: 02-425 శరణాగతి

పల్లవి:

నీ వొక్కఁడవే నాకుఁ జాలు నీరజాక్ష నారాయణ
నీవే నాకు గతియని తెలిసితి నెక్కొని యితరము వృథా వృథా

చ. 1:

మీ నామోచ్చారణమే మెరసిన దుఃఖనివారణము
మీ నామోచ్చారణమే మెలఁగు శుభకరము
నానావేదశాస్త్రములు నవపురాణేతిహాసములు
మీ నామములోనే వున్నవి మిగిలిన విన్నియు వృథా వృథా

చ. 2:

నీ పాదమూలము నింగియు భువియు రసాతలము
నీ పాదమూలము నిఖలజీవపరిణామములు
దీపించిన చరాచరంబులు దివ్యులు మునులును సర్వమును
నీ పాదమూలమే మరి నెరి నితరంబులు వృథా వృథా

చ. 3:

దేవ మీతిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము
దేవ మీతిరుమే నుత్పత్తిస్టితిలయములకును ఆకరము
శ్రీవేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ
దేవ మీశరణము చొచ్చితి దిక్కులన్నియును వృథా వృథా