తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 182


రేకు: 0182-01 సామంతం సం: 02-409 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

సమబుద్ధే యిందరికి సర్వవేదసారము
సముఁడిందరికి హరి సాధన మోయయ్యా

చ. 1:

చీమకుఁ దనజన్మము చేరి సుఖమై తోఁచు
దోమకుఁ దనజన్మము దొడ్డసుఖము
ఆమనియీఁగకు సుఖ మాజన్మమై తోఁచు
యేమిటా నెక్కువసుఖ మెవ్వరి కేదయ్యా

చ. 2:

జంతురాసులకు నెల్లా జననము లొక్కటే
అంతటాను మరణము లవియొక్కటే
చెంత నాహారనిద్రలు స్త్రీసుఖా లొక్కటే
ఇంతటా నిందుకంటే నెవ్వ రేమి గట్టిరయ్యా

చ. 3:

ఇందులోన నెవ్వరైనానేమి శ్రీవేంకటపతి-
నందముగాఁ దలఁచిన దది సుఖము
యెందుఁ జూచిన నీతఁ డిందరిలో నంతరాత్మ
చందముగా నెవ్వరికి స్వతంత్ర మేదయ్యా


రేకు: 0182-02 బౌళి సం: 02-410 అధ్యాత్మ

పల్లవి:

కరుణానిధివి గాన కాచితేనేమో కాని
సరికి బేసికి నిన్ను జరయఁ జోటున్నదా

చ. 1:

కాయములోపలి నిన్నుఁ గని మని కొలువక
ఆయపుఁగర్మమె బ్రహ్మ మని వుంటిని
చీయని నాచేఁతకు నే సిగ్గువడుండుట గాక
ఆయమేమైనా నిన్ను నడుగఁ జోటున్నదా

చ. 2:

సకలచైతన్యుఁడవై సరి నాలో నుండఁగాను
వికటపు విషయాలవెంటఁ బారితి
వొకరు రక్షించఁగా వేరొకరిపాలైన నాకు
తుకతుకలేకాక దూరఁగఁ జోటున్నదా

చ. 3:

పట్టి శ్రీవేంకటగిరిఁ బ్రత్యక్షమై యుండఁగాను
ఇటు నటుపై వైకుంఠ మేల కోరేను
దిట్టనై నానేరమి నే తెలిసి నవ్వుట యింతే
ఇట్టె నీచిత్తము గాక యెంచఁగఁ జోటున్నదా


రేకు: 0182-03 శంకరాభరణం సం: 02-411 అధ్యాత్మ

పల్లవి:

ఇన్నిటా నొరయక యెఱు కేది
వెన్నుని కృపఁగా వెలసేది

చ. 1:

కోపము మతిలోఁ గుందినపుడువో
పాపము లన్నియుఁ బాసేది
తీపుల యాసలు దీరినపుడువో
తాపత్రయములు దలఁగేది

చ. 2:

ఘనకర్మంబులు గడచినపుడువో
వెనుకొను భవములు విడిచేది
మునుకొని యింద్రియములు వీడినఁబో
పనివడి విరక్తి బలిసేది

చ. 3:

ఆఁకటిరుచు లివి యణఁగినపుడువో
చేకొని సుఖమునుఁ జెందేది
యీకడ శ్రీవేంకటేశ్వరు శరణము
పైకొనిననుఁబో బదికేది


రేకు: 0182-03 సాళంగనాట సం: 02-412 శరణాగతి

పల్లవి:

సకలోపాసకులకు నందును సగుణంబే ప్రమాణము
సకలమునీంద్రులు పూజించే యీసాకారమె ప్రమాణము

చ. 1:

సగుణంబని నినుఁ గొందరు సరి నిర్గుణమని కొందరు
వగలఁ బెక్కుగతిఁ జదివిన కొలఁదుల వారికి వారే వాదింతురు
అగణితస్వతంత్రుఁడవు గాన అల వాల్మీకి ఇట్టిట్టనకే
అగు "నిర్గుణాయ గుణాత్మనే" యని ఆనతి ఇచ్చుటే ప్రమాణము

చ. 2:

సోహం బని కొందరు "దాసోహం" బని కొందరు
సాహసవృత్తుల రెండుదెరంగుల సకలవివేకులు భజింతురు
దేహధారియై "దాసోహం" బని తేరి శుకుఁడు మీలోఁ గలసె
సోహపుభావన సర్వజగత్తులఁ జూపినదే ప్రమాణము

చ. 3:

ఆరుశాస్త్రముల నారుమతంబుల నారుగర్మములనైనాను
యీరీతుల మిము శరణని కొలువక యెవ్వరి కుపాయము లేదు
నారదాదులగు భక్తు లిందరును నానాగతు లరసి చూచి
సారపు శ్రీవేంకటపతి మీకే శరణనుటే ప్రమాణము


రేకు: 0182-04 లలిత సం: 02-413 వైరాగ్య చింత

పల్లవి:

ఇల జాణతనము లిన్నిటికిఁ గలదు
తలఁపే కుళై తగిలీఁ గాని

చ. 1:

మఱవదు దేహము మహిఁ దన గుణములు
గుఱి నాహారము గొనునెపుడు
మఱవ నింద్రియములు మర్మ్శస్థలములు
మఱచితి నిను నేమరులో కాని

చ. 2:

చెదరదు కర్మము సేసినంతయును
పొదిగి జీవమును భోగించును
చెదరదు సంసారశీతలబంధము
మదిఁ జెదరెడి నామరులేకాని

చ. 3:

తొలఁగవు మాయలు తొడరి ప్రపంచము
కలవలెఁ బెనగొని కదిసీని
బలు శ్రీవేంకటపతికృపచే నాకు
తొలఁగె భవము లెటు దూరీనో మరులు


రేకు: 0182-05 మాళవి సం: 02-414 శరణాగతి

పల్లవి:

హరి నెఱఁగని జన్మ మది యేలా ఆ-
సరుస నాతఁడులేని చదువేలా

చ. 1:

దయదొలఁగినయట్టి తపమేలా
భయములేనియట్టి భక్తేలా
ప్రియముమానినయట్టి పెనఁగేలా మంచి-
క్రియావిరుద్ధపు కీర్తనలేలా

చ. 2:

ఫలములేనియట్టి పనులేలా కడుఁ
గలిమిలేనియట్టి గర్వమేలా
బలిమిలేనియట్టిపంతామేలా శౌరి-
దలఁచలేని యట్టితనువది యేలా

చ. 3:

తన కమరని దొరతనమేలా
చనవులేనియట్టి సలిగె యేలా
యెనలేని శ్రీవేంకటేశ్వరుని శరణని
మనఁగలిగినమీఁద మరి చింతలేలా