తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 181


రేకు: 0181-01 తెలుగు కాంబోది సం: 02-403 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

చూచి మోహించకుందురా సురలైన నరులైన
తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను

చ. 1:

భాగీరథి పుట్టిన పాదపద్మములు
భోగపు మరుని జన్మభూమి నీ తొడలు
యోగపు నవబ్రహ్మలుండిన నీ నాభి
సాగరకన్యక లక్ష్మి సతమైన వురము

చ. 2:

అందరి రక్షించేటి అభయహస్తము
కంద నసురులఁ జంపే గదాహస్తము
సందడి లోకముల యాజ్ఞాచక్రహస్తము
చెంది ధ్రువు నుతియించఁ జేయు శంఖహస్తము

చ. 3:

సకల వేదములుండే చక్కని నీ మోము
వొకటై తులసిదేవి వుండేటి శిరసు
ప్రకటపు మహిమలఁ బాయని నీ రూపము
వెకలి శ్రీవేంకటాద్రి విభుఁడ నీ భావము


రేకు: 0181-02 లలిత సం: 02-404 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

వాదులేల చదువులు వారు చెప్పినవే కావా
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా

చ. 1:

నాలుగువేదాల బ్రహ్మ నలి నెవ్వనిసుతుఁడు
వాలిన పురాణాలవ్యాసుఁ డెవ్వనిదాఁసుడు
లీల రామాయణపు వాల్మీకివసిష్ఠులు
ఆలకిం చెవ్వనిఁ గొల్చి రాతఁడే పో దేవుఁడు

చ. 2:

భారత మెవ్వనికథ భాగవతము చెప్పిన-
ధీరుఁడైన శుకుఁడు యేదేవుని కింకరుఁడు
సారపుశాస్త్రాలు చూచి సన్యసించి నుడిగేటి-
నారాయణనామపు నాథుఁడే పో దేవుఁ డు

చ. 3:

విష్ణునాజ్ఞయని చెప్పే విధిసంకల్ప మేడది
విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
“విష్ణుమయం సర్వ “ మనే వేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రివిభుఁడే ఆదేవుఁడు


రేకు: 0181-03 నాట సం: 02-405 వేంకటగానం

పల్లవి:

ఇతని కితఁడేకాక యితరులు సరియా
మితి లోకా లితని మేనిలోనే కావా

చ. 1:

కమలనాభుని భయంకరకోపముతోడ
రమణ వేరొకరివరంబులు సరియా
తమితోడఁ దల దుంచి తగినవరము లిచ్చె
అమరఁగ నరకాసురాదులకు నితఁడు

చ. 2:

కరివరదుని పేరుగలసిన తిట్లతో
పరదేవతల మంత్రపఠనలు సరియా
నిరతి శిశుపాలుని నిందకు శిక్షించి
పరలోక మిచ్చినట్టి భావము వినరా

చ. 3:

చలిమి శ్రీవేంకటేశు శరణాగతితోడ
బలిమి మించిన బ్రహ్మపట్టము సరియా
వొలిసిన ధ్రువునకు వున్నతలోక మిచ్చె
అల బ్రహ్మలోకమున కదె మీఁ దెఱఁగరా


రేకు: 0181-04 పాడి సం: 02-406 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

గొరబై మొద లుండఁగఁ గొనలకు నీరేల
దొరదైవ మితఁడే తుదఁగల ఫలము

చ. 1:

క్రతువులు హరియే కర్మము హరియే
పితరులకు హరియే పెనుఁదృప్తి
సతతమంత్రముల సారము హరియే
యితనిసేవే పో యిన్నిటి ఫలము

చ. 2:

అనలము హరియే ఆహుతి హరియే
జననీజనకుల సరవి హరే
పనివడి వేదముఁ బ్రణవము హరియే
యెనసితని పూజ యిన్నిట ఫలము

చ. 3:

యేలికె హరియే యిరవును హరియే
వాలాయము సర్వము హరియే
కాలము శ్రీవేంకటగిరి హరియే
నేల నీతని శరణే సఫలంబు


రేకు: 0181-05 లలిత సం: 02-407 అధ్యాత్మ

పల్లవి:

దొంతివిషయములాల దొరలాల
చెంత మీఁదటి బుద్ధి చెప్పరో మాకు

చ. 1:

దురితంబు లొకకొన్ని దుర్గుణము లొకకొన్ని
మరుగుటలు గొన్ని మర్మములు గొన్ని
ధర నెరుక లొకకొన్ని తగ నెరఁగములు గొన్ని
యిరవు మనపంట లివి యెందు వోయుదమో

చ. 2:

ఆస లొకకొన్ని మిథ్యాచారములు గొన్ని
వాసు లొకకొన్ని గర్వములు గొన్ని
రేసు లోకకొన్ని మీరినరుచులు నొకకొన్ని
యీసునఁ గడించితిమి యిముడఁ జోటేదో

చ. 3:

వైరాగ్యములు గొన్ని వరభక్తు లొకకొన్ని
నేరుపులు గొన్ని యిన్నియునుఁ గలిగి
యీరీతి శ్రీవేంకటేశుగతి చేరితిమి
మేర మిము మీరితిమి మీకు గతి యేదో


రేకు: 0181-06 శుద్ధవసంతం సం: 02-408 శరణాగతి

పల్లవి:

ఏవుపాయములు మాకిఁక బనికిరావు
నీవే హరి కావవే నిరుహేతుకమున

చ. 1:

యివల నింద్రియజయం బేడ నే నేడ
భువి నింద్రియములతోఁ బుట్టే నీతనువు
అవల నిశ్చలబుద్ధి అది యేడ నే నేడ
భవము చంచలమనసు పంగెమే యెపుడు

చ. 2:

యెలమిఁ గర్మవిముక్తి యేడ నే నేడ
తెలియంగఁ గర్మాధీన మీబ్రదుకు
కుళకమగు సాత్త్వికపుగుణ మేడ నే నేడ
కలియుగం బిది యిందుఁ గలవాఁడ నేను

చ. 3:

తనివోని ఘోరతప మేడ నే నేడ
అనిశంబు నీకు శరణాగతుఁడను
యెనలేని శ్రీవేంకటేశ్వరుఁడ నీబిరుదు
కనుఁగొనఁగ శరణాగతపారిజాత౦