తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 131

రేకు: 0131-01 పాడి సం: 02-121 అద్వైతము


పల్లవి: ఇదివో సుజ్ఞానము 'సూత్రే మణిగణా యివ' గాన
       మది నితరమే లేదు మాయల యద్భావం తద్భవతి'
       
చ.1 యెదుటఁగను యీజగము యీది నీవన వెఱతును
     అది వీపరీతజ్ఞానము 'యదృష్టం తన్నష్టము' గాన
     పొదులుచుండేటి యీజగము పొసఁగ నీవు గావన వెఱతు
     యిది విపరీతజ్ఞానము 'సదసచ్చాహం' బంటివి గాన
     
చ.2 నిండిన యీజీవులు నీవేయన వెఱతును
      దండనే బద్దులు వీరు 'ద్వాసుపర్ణ' వున్నది గాన
      మెండగు యీజీవులను మీరు గారన వెఱతును
      వుండెడి వీరలు నిత్యులు వొగి 'నహమాదిశ్చమధ్యము' గాన
      
చ.3. యిది మునుపె నీచిక్కు యిందుకు ద్రిష్టం బొక్కటె
      తుదఁ దొల్లె నీదాసులు గలరు తుదఁ దొల్లియే నీవుఁ గలవు
      వెదకు మా శ్రీవేంకటపతి నిను సేవించఁగ నిను సేవించఁగను
      అదన నిన్నంటినవారల నీయంతలు సేతువుగాన
      

రేకు:0131-02 ముఖారి సం: 02-122 శరణాగతి

పల్లవి:ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు
      ఆదినంత్యములేని అచ్యుతమూరితివి
      
చ. 1:వెలయ నీగుణములు వినుతించేనంటే
      తెలియ నీవు గుణాతీతుఁడవు
      చెలరేఁగి నిను మతిఁ జింతించేనంటే
      మలసి నీ వచింత్య మహిముఁడవు
      
చ. 2:పొదిగి చేతుల నిన్నుఁ బూజించేనంటే
      కదిసి నీవు విశ్వకాయుఁడవు
      అదన నేమైన సమర్పించేనంటే
      సదరమై అవాప్త సకలకాముఁడవు
      
చ. 3: కన్నుల చేత నిన్నుఁ గనుఁగొనేనంటే
       సన్నిధి దొరక నగోచరుఁడవు
       యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవని
       వన్నెల శరణనే వాక్యమే చాలు
       

రేకు: 0131-03 పాడి సం: 02-123 అధ్యాత్మ

పల్లవి: వేఱొక భావనలేల వీనితోఁ బెనఁగనేల
తూఱినందే హరిగూర్చి తుదగంట గాక

చ.1: చూచే కన్నుల నేమిఁ జూడకుండవచ్చునా
       చూచినందెల్లా హరిఁ జూచుట గాక
       వేచిన వీనుల నేమీ వినకుండవచ్చునా
       కాచి యవే హరికథగా వింట గాక

చ.2: కోరేటి చవుల జిహ్వ గోరకుండవచ్చునా
      కోరిన చవుల హరిఁ గూర్చుట గాక
      ఆరీతి బారే మనసు అడఁచఁగవచ్చునా
      ఆరితేరి అన్నిటాను హరిఁ గంట గాక

చ.3: వొడలు మోచిన దేహి వోమకుండవచ్చునా
      వోడలు శ్రీహరిదనే వోముట గాక
      బడినే శ్రీవేంకటేశుఁ బాసివుండవచ్చునా
      యెడయ కందె సుఖియించుట గాక

రేకు: 0131-04 గౌళ సం: 02-124 అద్వైతము

పల్లవి: ఏడనుందురో తాము యెన్నికెపౌఁజులు దాఁటి-
       రాడకాడే పొడచూపే రాహా మేలు
       
చ. 1: యెలమి స్వప్నమనే యెడపుఁ జావడిలో
        వొలసి జీవుఁడు కొలువున్నపుడు
        వెలినున్న చైతన్యవిధుల దొరలచేతి-
        యలబలము గాన మాహా మేలు
        
చ. 2: ఉప్పడమయి దేహమనే పూరఁ బెద్దచావడి
       ఉప్పతిల్లి దేహి కొలువున్నపుడు
       చప్పుడుతో నింద్రియవిషయపరివారము
       అప్పుడు పారాడుదురు ఆహా మేలు
       
చ. 3: అక్కడ నిద్దురలనే అంతఃపురాల కేఁగి
       వుక్కున భోగాన నాత్మ వున్నపుడు
       యెక్కువ శ్రీవేంకటేశ యెవ్వరూ నాడకుఁ బోరు
       అక్కడా నీవే వుందు వాహా మేలు
       

రేకు: 0131-05 బౌళి సం: 02-125 అంత్యప్రాస

పల్లవి: నానావర్గముల నాఁటుకొను నొకయోగి
       మానిమీఁది తపసి సామన్యుఁ డాయోగి
       
చ. 1: పున్నమనమాసఁ గూడఁ బొదిగీ నొక్కొకయోగి
       కన్నులచూపులు సరిగాఁ దూఁచు నొకయోగి
       మిన్నునూయి చేఁతాటఁ జేఁది మెచ్చు మింగు నొకయోగి
       వెన్న సన్నముగ నూరి వీఁగు నొకయోగి
       
చ. 2: గాలి ముడియగఁ గట్టి కలుగుడిగట్టు యోగి
       నాలిమింటివిత్తు వెట్టి నగు నొకయోగి
       మూలనిధానము గని ముందు గానఁ డొకయోగి
       నేల దలకిందు సేసి నిక్కు నొకయోగి
       
చ. 3: గతజలములకెల్లఁ గట్టగట్టు నొకయోగి
       తతిఁ బూవులమాటల దడిగట్టు యోగి
       యితవైన శ్రీవేంకటేశుని మఱఁగు చొచ్చి
       గతిగనే నాతఁ డొక్కడే యోగి

రేకు: 0131-06 ముఖారి సం: 02-126 అధ్యాత్మ

పల్లవి: హరియే సకలక్రియలై తృప్తి యిచ్చుఁగాక
       యెరవులవారి చేఁతలెందాఁకా వచ్చీని
       
చ. 1: నరులకు నరులే పరలోక క్రియలు
        సిరిమోహాచారాలఁ జేతురు గాక
        తరుపాషాణపశుతతుల కెవ్వరు సేసే-
        రరయఁగ భ్రమ గాక అవి పస్తులున్నవా
        
చ. 2: కొడుకులుగలవారు కోరి పితృముఖమున
        కుడుపులు దమవారిఁ గూర్చి పెట్టఁగా
        అడరి శ్రీహరియే అన్నియుఁ దాఁ జేకొని
        తడవి వారిఁ గొంత దయఁజూచుఁ గాక
        
చ. 3: తారేడ వారేడ దైవము శ్రీవేంకటేశుఁ-
        డారయ నంతరాత్ముఁ డని తెలిసి
        ధారతో యాతనియాజ్ఞఁ దప్ప కాదివసాన
        చేరువఁ జేసేవెల్లాఁ జేయుఁడీ యాతనికి