తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 120

రేకు: 0120-01 శంకరాభరణం సం: 02-115 వైరాగ్య చింత

పల్లవి: చీచీ వో జీవుఁడా చింతించుకో జీవుఁడా
ఆచందాన కీచందము అరుహమా జీవుఁడా
    
చ. 1: వుత్తముఁడయిన హరి వుండేటి యాతుమలోన
తత్తరపుఁ గాంతలను తలపోసేదా
వొత్తి నారాయణనామ ముచ్చరించే నోరను
రుత్త యధరపుఁదోలు రుచిగొనేదా
    
చ. 2: పొందుగాఁ గోవిందునిఁ బూజించేటి చేతులను
సందడిఁ జన్నులమీఁద జాఁచబొయ్యేదా
కందువ దేవునిరూపు కనుఁగొనే చూపులు
ముందరి మర్మపుటంగములమీఁదఁ బెట్టేదా
    
చ. 3: వేవేలు విష్ణుకథలు వినియేటి చెవులను
ఆవటించి యాడసుద్దులాలకించేదా
శ్రీవేంకటేశ్వరుని సేవించే యీజీవనము
భావించక విషయాల పాలు సేసేదా

రేకు: 0120-02 దేసాక్షి సం: 02-116 వేంకటగానం

పల్లవి: ఇంతదేవుఁ డింక వేఁడీ యెంచి చూపుఁడా
చెంతనుండితే రక్షించు చేకొని కొలువరో
    
చ. 1: వేసితే వేయురూపులు విశ్వరూప మితఁడు
శ్రీసతీశుఁ డిందరిలో శ్రీమంతుఁడు
భాసురపు భూమి మోచే బలవంతుఁ డిన్నిటాను
దాసులైతే మన్నించు నీదైవముఁ గొలువరో
    
చ. 2: గుట్టున బ్రహ్మాండాలు కుక్షిలో నించినవాఁడు
అట్టె దేవతల మొర లాలించేవాఁడు
చిట్టకపు దానవుల చించి చెండాడేటివాఁడు
ఇట్టే శరణంటేఁ గాచు నీతనిఁ గొలువరో
    
చ. 3: కాలముఁ గర్మము మాయ గల్పించినయట్టివాఁడు
ఆలించి సర్వజీవుల అంతర్యామి
వాలి శ్రీవేంకటపతై వరములిచ్చేటివాఁడు
యేలీలఁ గొల్చిన మెచ్చు నీవిభుఁగొలువరో

రేకు: 0120-03 భూపాళం సం: 02-117 అధ్యాత్మ

పల్లవి: అప్పుడు చూచేదివో అధికుల నధముల
         తప్పక యెచ్చరి యిదే తలఁచవో మనసా
         
చ. 1: కొండలవంటి పనులు కోరి ముంచుకుంటే నూర-
         కుండి కైకొననివాఁడే యోగీంద్రుఁడు
         నిండిన కోపములకు నెపముల గలిగితే
         దండితోఁ గలఁగని యాతఁడే ధీరుఁడు
         
చ. 2: సూదులవంటి మాటలు సారిదిఁ జెవి సోఁకితే
         వాదులు వెట్టుకొననివాఁడే దేవుఁడు
         పాదుకొన్న సంసారబంధము నోరూరించితే
         ఆదిగొని మత్తుఁడు గానెట్టివాఁడే పుణ్యుఁడు
         
చ. 3: గాలాలవంటి యాసలు కడుఁ దగిలి తీసితే
         తాలిమితోఁ గదలనాతఁడే ఘనుఁడు
         మేలిమి శ్రీవేంకటేశుమీఁద భారము వేసుక
         వీలక తనలో విఱ్ఱవీఁగువాఁడే నిత్యుఁడు

రేకు: 0120-04 మలహరిసం: 02-118 వైరాగ్య చింత

పల్లవి: కొనమొద లేదో గుఱిగాన రొరులు
        మునుకొను సంసారమోహాంధమందు
        
చ. 1: తలఁచును బ్రహ్మాండతతులకు నవ్వల
        తలఁచేటి జీవుఁడు తా నణువు
        అలరిన యాసల ననలునుఁ గొనలును
        వెలసీ సంసారవృక్షములోన
        
చ. 2: పుట్టునుఁ బొదలును భువి బహురూపుల
        పుట్టేటి యాతఁడు పారి నొకఁడే
        వొట్టుక యీఁదును వుభయకర్మముల
        చట్టెడు సంసారసాగరములను
        
చ. 3: తగులు నన్నిటా తనుభోగంబుల
        తగిలేటి పురుషుఁడు తా ఘనుఁడు
        నిగిడి శ్రీవేంకటనిలయుఁడు గతైతే
        అగపడ సంసారానందమందు

రేకు: 0120-05 ఆహిరి సం: 02-119 అధ్యాత్మ

పల్లవి:కలిదోషములాల కడు నేల మీరేరు
       యిలధరుఁ డుండగాను యిఁకనేఁటి సుద్దులు
       
చ. 1: జగములేలెడువాఁడు సర్వాంతరాత్ముఁడు
        జిగి నింక నీకీబుద్ధి చెప్పనోపఁడా
        నిగిడి పుట్టించేటివాఁడు నిండుక వుండేటివాఁడు
        తెగని కర్మములెల్ల తిద్దకేల మానును
        
చ. 2. దనుజులఁ గొట్టేవాఁడు ధర్మము నిలిపేవాఁడు
        పనిగొన్న దురితాలు పాపనేరఁడా
        కొనమొదలైనవాఁడు గురి దానైనవాడు
        వునికి మనికి సేయకూరకుండీనా
        
చ. 3 స్వతంత్రుడైనవాఁడు స్వామియైనవాఁడు
        గతియై దాసులనెల్లఁ గానకుండీనా
        యితఁడే శ్రీవేంకటేశుఁ డిందిరాపతైనవాఁడు
        సతతము మాకు నిట్టే సంపద లొసఁగఁడా

రేకు: 0120-06 దేసాళం సం: 02-120 అద్వైతము

పల్లవి:వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
        వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా
        
చ. 1. అరయ జీవులకెల్లా నభేదమైతే
       గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము
       సారిది నాతుమలోన సోహంభావనయైతే
       సరి మునుల దేవపూజలు చెల్లవు
       
చ. 2.సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే
       బహుయాగాది కర్మాల పస లేదు
       మహిలోని జననాలు మరణాలు మాయమైతే
       విహితాచారాలు సేయ విధే లేదు
       
చ. 3 ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప
       యిటు పురుషసూక్తాదు లివి మరేల
       అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే
       సటలాడుకొనేడి రాక్షసమత మవును