తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 112

రేకు: 0112-01 శ్రీరాగం సం: 02-067 అద్వైతము

పల్లవి: ఏఁటిమాట లివి విన నింపయ్యీనా మది-
నేఁటవెట్టి దాసుఁడౌ టిదిసరియా
    
చ. 1: జీవుఁడే దేవుఁడని చెప్పుదురు గొందరు
దైవముచేఁతలెల్లాఁ దమ కున్నవా
ఆవలఁ గొందరు కర్మ మది బ్రహ్మ మందురు
రావణాదు లవి సేసి రతికెక్కిరా
    
చ. 2: మిగులఁ గొందర దైవమే లేదనెందురు
తగ నీప్రపంచమెల్లాఁ దనచేఁతలా
గగన మతఁడు నిరాకార మందురు గొంద-
రెగువఁ బురుషసూక్త మెఱఁగరా తాము
    
చ. 3: యెనిమిది గుణములే యితని వందురు గొంద-
రనయము మిగిలిన వవి దమవా
యెనయఁగ శ్రీవేంకటేశ్వరుదాసులై
మనుట నిత్యముగాక మరి యేమినేలా

రేకు: 0112-02 రామక్రియ సం: 02-068 భక్తి

పల్లవి: అన్నిటా శ్రీహరిదాసుఁడగు వానికి
కొన్ని దైవములఁ గొలువఁగఁ దగునా
    
చ. 1: విహితకర్మముసేసి వెదకేటి హరి నిట్టె
సహజమై కొలచేటి సరసునికి
గహనపుఁ గర్మాలు కడమలైన నేమి
మహిఁ గనక్రాదికి మరి పైఁడి వలెనా
    
చ. 2: పలుదానములకెల్ల బలమైన హరి నిట్టె
బలుపుగ జేకొన్న భక్తునికిని
నెలకొని యాతఁ డన్నియునుఁ జేసినవాఁడె
తెలిసి సూర్యునిఁ జూడ దీపాలు వలెనా
    
చ. 3: వేదవేద్యుఁడు శ్రీవేంకటపతినామ-
మాదిగాఁ బఠియించే యధికునికి
ఆదైన చదువులు అఱచేతి వతనికి
మేదినిఁ దిరుగాడ మెట్లు వలెనా

రేకు: 0112-03 మలహరి సం: 02-069 వైరాగ్య చింత

పల్లవి: ఈహీ శ్రీహరిఁ గంటే యింత లేదుగా వట్టి-
దాహపుటాసల వెఱ్ఱి దవ్వు టింతేకాకా
    
చ. 1: పలుమారు నిందరిని భంగపడి వేఁడేది
యిలపై దేహము వెంచేయిందు కింతేకా
కలికికాంతలచూపు ఘాతలకు భ్రమసేది
చెలఁగి మైమఱచేటి చేఁత కింతేకా
    
చ. 2: పక్కన జన్మాలనెల్లాఁ బాటువడేదెల్లాను
యెక్కడోసంసారాన కిందు కింతేకా
వొక్కరిఁ గొలిచి తిట్టు కొడిగట్టేదెల్లాను
చక్కుముక్కు నాలికెపై చవి కింతేకా
    
చ. 3: గారవాన ధనములు గడియించేదెల్లాను
ఆరయ నాదని వీఁగేయందు కింతేకా
చేరి శ్రీవేంకటపతి సేవకుఁ జొరనిదెల్లా
భారపుఁ గర్మపుబాధఁ బట్టువడికా

రేకు: 0112-04 బౌళి సం: 02-070 భక్తి

పల్లవి: ఎంత బాఁప నా సోద మింత గలదా
అంతయు నీమహిమే హరిభట్లూ
    
చ. 1: సూరిభట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి
వారబియ్య మెత్తియెత్తి వడదాఁకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారవట్టీ
కేరికేరి నగవయ్య క్రిష్ణభట్లూ
    
చ. 2: దేవరొజ్ఝ లొకవంక దిక్కులలోఁ బొలగూడు
దీవెనతో నారగించి తీపుమరిగి
యీవలఁ బెట్టినవారికేమైనా నొసఁగీని
వేవేలు మాయల విష్ణుభట్లూ
    
చ. 3: సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా
నామనితో విందువెట్టీ ననుదినము
హోమపు విప్రులసొమ్ము లొడిసి తాఁ బుచ్చుకొని
వేమరు శ్రీవేంకటాద్రి వెన్నుభట్లూ

రేకు: 0112-05 గుండక్రియ సం: 02-071 వైరాగ్య చింత

పల్లవి: అటుగన నే రోయఁగఁ దగవా
నటనల శ్రీహరి నటమింతే
    
చ. 1: చిడుముడి మూఁగిన జీవులలోపల
కడఁగి నే నొక్కఁడ నింతే
విడువక పక్షులు వృక్షము లిలపై
వెడఁగు భోగములు వెదకీనా
    
చ. 2: తనువుల వెూచిన తగుప్రాణులలోఁ
గనుఁగొన నొకమశకమ నింతే
మునుకొని కీటకములుఁ జీమలు నిల
చెనకి దొరతనము సేసీనా
    
చ. 3: శ్రీవేంకటపతిసేవవారిలో
సోవల నొకదాసుఁడ నేను
భావించి సురలు బ్రహ్మాదు లతని-
దైవపు మాయలు దాఁటేరా

రేకు: 0112-06 రామక్రియ సం: 02-072 అద్వైతము

పల్లవి: సేయనివాఁ డెవ్వఁడు చేరి చిల్లరదోషాలు
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే
    
చ. 1: దేవుని నమ్మినయట్టి దేహియట యాతనికి
యీపల నెంతటిపాపమేమి సేసును
భావించి యన్ని నేరాలు పరిహరించు నతఁడే
ఆవటించు సూర్యునికి నంధకార మెదురా
    
చ. 2: పూజింపించుకొనేవాఁడు భువనరక్షకుఁడట
తేజముతో దురితాలు తెంచఁగలేఁడా
రాజు సేసిన యాణాజ్ఞ రాజుకంటే నెక్కుడా
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు
    
చ. 3: చేతనాత్మకుఁడట శ్రీవేంకటేశ్వరుఁడు
జాతిలేని జీవునికి స్వతంత్ర మేది
కాతరపు జన్మానకుఁ గార్యకారణ మేది
యేతున గరుడనికి నెదురా పాములు