తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 111

రేకు: 0111-01 లలిత సం: 02-061 శరణాగతి

పల్లవి: ఏగతి నుద్ధరించేవో యింతటిమీఁదట మమ్ము
భోగపుఁ గోరికలచే బొలిసెఁబో పనులు
    
చ. 1: పరగి నాలుకసొంపు పరసిపోయ
పరులనే నుతియించి పలుమారును
విరసపుఁ బాపముల వినికిచే వీనులెల్లాఁ
గొరమాలె మాకు నేఁటి కులాచారములు
    
చ. 2: మెుక్కలానఁ బరధనమునకుఁ జాఁచి చాఁచి
యెక్కువఁ జేతుల మహిమెందో పోయ
తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ది
ముక్కపోయ మాకు నేఁటిముందరి పుణ్యములు
    
చ. 3: యెప్పుడు నీచుల ఇండ్ల కెడతాఁకి పాదములు
తప్పని తపములెల్లాఁ దలఁగిపోయ
యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గొలువఁగా
నెప్పున నేఁ జేసినట్టి నేరమెల్లా నడఁగె

రేకు: 0111-02 ముఖారి సం: 02-062 వైష్ణవ భక్తి

పల్లవి: పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను
యేపనులు నీకు సెల విన్నియునుఁ గావా
    
చ. 1: మునుప నీవిషయముల ముద్ర మానుసులఁగా-
నునిచితివి నామీఁద నొకటొకటినే
అనిశంబు నవి చెప్పినట్లఁ జేయకయున్న
ఘనుఁడ నీయాజ్ఞ నేఁ గడచుటే కాదా
    
చ. 2: కలిమిగల యింద్రియపుఁ గాఁపులుండిన వూరు
యెలమి నా కొసఁగితివి యేలుమనుచు
అలసి వీరల నేను నాదరించక కినిసి
తొలఁగఁద్రోచిన నదియు ద్రోహమే కాదా
    
చ. 3: కుటలములఁ బెడఁబాపి కోరిన చనవులెల్ల
ఘటనఁ జెల్లించితివి ఘనుఁడ నేను
అటుగనక శ్రీవేంకటాద్రీశ నీదాసి-
నెటుచేసినా నీకు నితవేకాదా

రేకు: 0111-03 శుద్ధవసంతం సం: 02-063 ఉపమానములు

పల్లవి: చిక్కువడ్డపనికిఁ జేసినదే చేఁత
లెక్కలేని యప్పునకు లేమే కలిమి
    
చ. 1: తగవులేమి కెదిరిధనమే తనసొమ్ము
జగడగానికి విరసమే కూడు
తెగుదెంపులేమికి దీనగతే దిక్కు
బిగువుఁగూటికి వట్టిబీరమే తగవు
    
చ. 2: పతిలేనిభూమికి బలవంతుఁడే రాజు
గతిలేనికూటికిఁ గన్నదే కూడు
సతిలేనివానికి జరగినదే యాలు
కుతదీరుటకు రచ్చకొట్టమే యిల్లు
    
చ. 3: యెదురులేమికిఁ దమకేదైనఁ దలఁ పిది
మదమత్తునకుఁ దనమఱుపే మాట
తుదిపదమునకుఁ జేదొడైన(???) విభవము
పదిలపు శ్రీవేంకటపతియే యెఱుక

రేకు: 0111-04 శ్రీరాగం సం: 02-064 వైరాగ్య చింత

పల్లవి: అన్నిటికి నొడయఁడవైన శ్రీపతివి నీవు
యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపౌఁజు
    
చ. 1: జ్ఞానంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపు కామక్రోధాల వర్గము లారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు
    
చ. 2: తప్పనిగుణాలు మూఁడు తనువికారము లారు
అప్పటి మనోబుద్ధ్యహంకారాలు
వుప్పతిల్లు విషయము లుడివోని వొకఅయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌఁజు
    
చ. 3: ఆఁకలిదప్పియును మానావమానములను
సోఁకిన శీతోష్ణాలు సుఖదుఃఖాలు
మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేఁకటారఁ గడపేవా నెంచుకో మాపౌఁజు

రేకు: 0111-05 లలిత సం: 02-065 కృష్ణ

పల్లవి: ఈడనుండె నిందాఁకా నింటి ముంగిట
ఆడ నెందుఁ బోఁడుగద అప్పుడే యీకృష్ణుఁడుఁ
    
చ. 1: యేడ పూతకిఁ జంపె నింతపిన్నవాఁడంటా
ఆడుకొనేరదే వీథి నందరుఁ గూడి
వేడుకతో మనగోవిందుఁడు గాఁడుగదా
చూడరమ్మ వీఁడు గడు చుల్లరీఁడు పాపఁడు
    
చ. 2: మరలి యప్పటివాఁడె మద్దులు విఱిచెనంటా
పరువులు వెట్టేరు పడఁతులెల్లా
కరికరించఁగ రోలఁ గట్టితే నప్పుడు మా-
హరి గాఁడుగదా ఆడనున్న బిడ్డఁడు
    
చ. 3: వింతగాఁగ నొకబండ విఱిచె నప్పటినంటా
రంతు సేసేరదివో రచ్చలు నిండి
అంత యీశ్రీవేంకటేశుఁడైన మనకృష్ణుఁడట
యింతేకాక యెవ్వరున్నా రిటువంటి పాపఁడు

రేకు: 0111-06 పాడి సం: 02-066 అంత్యప్రాస

పల్లవి: విభుఁడ వింతటికి వెరవుతో ననుఁగావు
అభయహస్తముతోడి ఆదిమూలమా
    
చ. 1: పలులంపటాలచేతఁ బాటుపడి పాటుపడి
అలసితిఁ గావవే వో ఆదిమూలమా
చలమరి యితరసంసారభ్రాంతిఁ జిక్కితి న-
న్నలరించి కావవే వో ఆదిమూలమా
    
చ. 2: యెంతకైన నాసలచే యేఁగేఁగి వేసరితి-
నంత కోపఁ గావవే వో ఆదిమూలమా
సంతల చుట్టరికాల జడిసితి నిఁకఁ గావు
అంతరాత్మ నాపాలి ఆదిమూలమా
    
చ. 3: రంటదెప్పు టింద్రియాల రవ్వైతిఁ గావవే వో-
అంటిన శ్రీవేంకటాద్రి‌ ఆదిమూలమా
గెంటక ముమ్మాటికని నీకే శర-
ణంటిఁ గావవే వో ఆదిమూలమా