తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 99


రేకు: 0099-01 శ్రీరాగం సం: 01-495 వైరాగ్య చింత

పల్లవి:
    తెలిసిన బ్రహ్మపదేశ మిదే
సులభ మనుమ నిదే చూచీఁగాక
    
చ. 1:
    పుట్టించినహరి పూరి మేపునా
గట్టిగా రక్షించుఁగా కతఁడు
కట్టడిజీవుడు కానక నోళ్లు
తెట్టఁదెరువునకు తెఱచీఁ గాక
    
చ. 2:
    అంతరాత్మ తనునట్టే మఱచేనా
చింత లో బెరరేఁచీఁగాక
పంతపు జీవుఁడు భ్రమసి సందుసుడి
దొంతులు దొబ్బుచుఁ దూరీఁగాక
    
చ. 3:
నొసల వ్రాసినవి నోమించుఁగా కతఁ-
డెసగిన శ్రీవేంకటేశ్వరుఁడు
విసుగక జీవుడు వీరిఁడిమాయల
నరురసురయి తా నలసీఁగాక

రేకు: 0099-02 బౌళి సం: 01-496 అధ్యాత్మ

పల్లవి:
    కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను
పొనిఁగి వొరులకైతే బోధించే నేను
    
చ. 1:
    ధరణిఁ గర్మము గొంత తగినజ్ఞానము గొంత
సరికి సరే కాని నిశ్చయము లేదు
వొరిమె యెంచిచూచితే నొకటివాఁడాఁగాను
సరవి దెలియ కేమో చదివేము నేము
    
చ. 2:
    యీతల నిహము గొంత యింతలోఁ బరము గొంత
చేతులు రెండు చాఁచే చిక్కుట లేదు
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను
కాతరాన కతలెల్లా గఱచితి నేను
    
చ. 3:
    దైవిక మొకకొంత తగుమానుషము గొంత
చేవలుచిగురువలెఁ జేసేను
యీవల శ్రీవేంకటేశుఁ డిది చూచి నన్నుఁ గాచె
భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను


రేకు: 0099-03 సాళంగనాట సం: 01-497 అధ్యాత్మ

పల్లవి:
    ముంచినవేడుకతోడ మొక్కుటగాక
కంచములోపలికూడు కాలఁదన్న నేఁటికి
    
చ. 1:
    వేదార్థములు నీవేవిహరించినసుద్ధులే
కాదని అవునని కొన్ని వాదములేల
యేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలే
సోదించనేఁటికి యందు సొట్టు లెంచఁనేటికి
    
చ. 2:
    కర్మము లిన్నియును నీకైంకర్యసాధనాలే
అర్మిలిఁ దారతమ్యము లడుగనేల
నిర్మితము నీ దింతే నెరసు లెంచంగనేల
ధర్మమందు నింక గజదంతపరీక్షేఁటికి
    
చ. 3:
    భక్తియింతా నొక ఘంటాపథము నీశావలే
యుక్తిఁ బాత్రాపాత్రములు యూహించనేల
ము క్తికి శ్రీవేంకటేశ మూలము నీపాదములు
సక్తులయి నమ్ముటగాక చలపదమేఁటికి


రేకు: 0099-04 దేసాక్షి సం: 01-498 అధ్యాత్మ

పల్లవి:
    అంచితపుణ్యులకై తే హరి దైవ మవుఁగాక
పంచమహపాతకులభ్రమ వాప వశమా
    
చ. 1:
    కాననియజ్ఞానులకు కర్మమే దైవము
ఆనినబద్ధులకు దేహమే దైవము
మాపననికాముకులకు మగువలే దైవము
పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా
    
చ. 2:
    యేమీ నెఱఁగనివారి కింద్రియములు దైవము
దోమటిసంసారి కూరదొర దైవము
తామసుల కెల్లాను ధనమే దైవము
పామరుల బట్టినట్టి భ్రమఁ బాపవశమా
    
చ. 3:
    ధర నహంకారులకు తాఁదానే దైవము
దరిద్రుఁడైనవారికి దాత దైవము
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము
పరులముంచినయట్టి భ్రమఁ బాపవశవమా

రేకు: 0099-05 మలహరి సం: 01-499 శరణాగతి

పల్లవి:
    ఎట్టయినా జేయుము యిఁక నీచిత్తము
కిట్టిననీ సంకీర్తనపరుఁడ
    
చ. 1:
    కొందరు జ్ఞానులు కొందరు భక్తులు
కొందరు వైరాగ్యకోవిదులు
యిందరిలో నే నెవ్వఁడఁ గా నిదె
సందడి హరి నీశరణాగతుఁడ
    
చ. 2:
    జపితలు గొందరు శాస్త్రులు గొందరు
ప్రపత్తిఁ గొందరు బలువులు
వుపమించఁగ ని న్నొకఁడా గా నిందు
కపురుల నీడీంగరీఁడ నేను
    
చ. 3:
ఆచార్యపురుషులు అవ్వలఁ గొందరు
యేచినసమయులై యేర్పడిరి
కాచేటి శ్రీవేంకటపతి నే నైతే
తాచి నీదాసులదాసుఁడను

రేకు: 0099-06 రామక్రియ సం: 01-500 వైరాగ్య చింత

పల్లవి: ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు
తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని
    
చ. 1:
    యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు
గుఱియై మాయలలోనఁ గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు
తెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె
    
చ. 2:
    తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదు
వలసితే నుండుఁ బోవు వన్నెవంటిది
తలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచేఁ బరచెడి దింతె
    
చ. 3:
    సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు
బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింత
నెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే