తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 100

రేకు: 0100-01 శంకరాభరణం సం: 01-501 శరణాగతి

పల్లవి:
    శతాపరాధములు సహస్రదండన లేదు
గతి నీవని వుండగ కావకుండరాదు
    
చ. 1:
    తలచి నీకు మొక్కఁగా దయఁజూడకుండరాదు
కొలిచి బంటననఁగా కోపించరాదు
నిలిచి భయస్తుఁడనై నీయెదుట దైన్యమే
పలుకఁగఁ గావకుండఁ బాడిగాదు నీకు
    
చ. 2:
    శరణు చొరఁగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు
సరిఁ బూరి గరవఁగ చంపరాదు
అరయ జగద్రోహినౌదు నైనా నీనామము
గరిమె నుచ్చరించఁగఁ గరఁగక పోదు
    
చ. 3:
    దిక్కు నీవని నమ్మఁగా దిగవిడువఁగరాదు
యెక్కువ నీలెంకఁగాఁగా యేమనరాదు
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లాఁ జేసి వచ్చి
యిక్కడ నీదాసినైతి నింకఁదోయరాదు

రేకు: 0100-02 పాడి సం: 01-502 భక్తి

పల్లవి:
    ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి
    
చ. 1:
    ముంచిననారాయణమూర్తులే యీజగమెల్ల
అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి
    
చ. 2:
    చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమెత నీపాదరేణువే
సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి
    
చ. 3:
    చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లే దితరములు
తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి

రేకు: 0100-03 లలిత సం: 01-503 కృస్ణ

పల్లవి:
    ఏల మోసపోయిరొకో యెంచి కాలపువారు
బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా
    
చ.1:
    పనులఁగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను
దెసల దేవుఁడేయని తెలియవద్దా
సిసువు గోవర్ధనాద్రి చేతఁ బట్టి యెత్తెనంటే
కొస రీతనిపాదాలే కొలువవద్దా
    
చ.2:
    నరునికి విశ్వరూపున్నతిఁ జూపెనంటేను
నరహరి యితఁడని నమ్మవద్దా
పరగఁ జక్రముచేత బాణుని నఱకెనంటే
సొరి దీతని శరణుచొఱవద్దా
    
చ.3:
    అందరుసురలలోన నగ్రపూజ గొన్నప్పుడే
చెంది యీతనికృపకుఁ జేరవద్దా
అంది శ్రీవేంకటేశుఁ డట్టె ద్రిష్టదైవమంటే
విందులఁ బరులసేవ విడువవద్దా


రేకు: 0100-04 శుద్ధవసంతం సం: 01-504 అధ్యాత్మ

 
 పల్లవి:
    ఇంతటిదైవమవు మాకు నిటు నీవు గలుగఁగ
యెంతవారమో భాగ్య మేమిచెప్పే దిఁకను
    
చ. 1:
    తలకొని వొకకొంతధనము గనినవాఁడు
వెలలేనిగర్వముతో విఱ్ఱవీఁగీని
బలువుతో వొకరాజుఁ బట్టి కొలిచినవాఁడు
సలిగెతో నాకెవ్వరురి యనీని
    
చ. 2:
    వింతగా నొకపరుసవేది చేతఁగలవాఁడు
యెంతవారిఁ గైకోఁడు యెక్కువడంటాను
పొంత నొకమంత్రము పంపుసేయించుకొనేవాఁడు
అంతటికి గురుఁడంటానని మురిసీని
    
చ. 3:
    యెగువ నొకదుర్గము నెక్కుక యేలేవాఁడు
పగవారిఁ గైకొనక బలువయ్యీ‌ని
అగపడి శ్రీవేంకటాద్రిమీఁదనున్న నిన్నుఁ
దగ నమ్మినట్టివాఁడ ధన్యుఁడ నేను

రేకు: 0100-05 బౌళి సం: 01-505 వైరాగ్య చింత

పల్లవి:
    సుఖమును దుఃఖమును జోడుకోడెలు
అఖిలముఁ గన్నవాడు అడ్డమాడ రెపుడు
    
చ. 1:
    యెందాఁకా సంసార యెనసి తాఁ జేసేను
అందాఁక లంపటము లవి వోవు
కందువ జీవుఁడు భూమిఁ గాయ మెన్నాళ్ళు మోఁచె
అందుకొన్నతనలోనియాసలూఁ బోవు
    
చ. 2:
    అప్పటిఁ దనకు లోలో ఆఁక లెంతగలిగినా
తప్పక అందుకుఁ దగ దాహముఁ బోదు
అప్పు దనమీఁద మోచి అదె యెన్నాళ్లు వుండె
ముప్పిరి వడ్డివారక మూలనుండినాఁ బోదు
    
చ. 3:
    దైవముపై భక్తిలేక తనకు నెన్నాళ్లుండే
దావతి కర్మపుపాటు తనకుఁ బోదు
శ్రీవేంకటేశ్వరునిసేవ దన కెప్పు డబ్బె
వోవరి నందలిమేలు వొల్లనన్నాఁ బోదు

రేకు: 0100-06 సాళంగం సం: 01-506 అధ్యాత్మ

పల్లవి: మొఱవెట్టెదము మీకు మొగసాలవాకిటను
మఱఁగుచొచ్చితి మీకు మముఁ గావరో
       
చ. 1:
    యేపున మనసనియేటిమా పెంపుడు లేడు
పాపమనేయడవిఁ బడినది
రావున హరికింకరపు వేఁకకాండ్లాల
పైపైని మా కింక బట్టియ్యరో
    
చ. 2:
    అంచెల మా విజ్ఞానమనెడి కామధేనువు
పంచేంద్రియపు రొంపిఁ బడినది
మించి వైకుంఠన కేఁగేమేటి తెరువరులాల
దించక యెత్తెత్తి వెళ్లఁదియ్యరో
    
చ. 3:
    అండనే మోహంధకారమనెడి మాదిగ్గజము
దండి మీదయనేటివోఁ దానఁ బడెను
నిండి శ్రీవేంకటేశుఁడ నేటిమావటీనిచేత
గండికర్మపుకంబానఁ గట్టించరో