తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 28

రేకు: 0028-01 సాళంగం సం: 01-169 వైరాగ్య చింత


పల్లవి :

తొలుఁబాపపుణ్యాలతోడఁ బుట్టితినట
బలువైనభవములఁ బడలేనా


చ. 1:

గాముల యింటనే కాఁపనయితినట
పాముపుట్ట నుండియైన బతుకలేనా
గోమున హేయపుఁగుండకూడు నించితినట
గామిడి నేగారేతిత్తిఁగా నోపనా


చ. 2:

కట్టైనగుణములచే కట్టువడితినట
చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా
దట్టపుటాసల నేఁదాల్చితినట నా-
వెట్టకాయము మోపవెఱచేనా


చ. 3:

నిగిడినలోపల నీ వుండుదుట
పగవారికి నేఁ బగిలేనా
తగువేంకటేశ నీదయవాఁడనట యీ-
వగల నిన్నిఁట గెలువఁగలేనా

రేకు: 0028-02 శ్రీరాగం సం: 01-170 వేంకటగానం


పల్లవి :

ఈతఁడఖిలంబునకు నీశ్వరుఁడై సకల-
భూతములలోనఁ దాఁబొదలు వాఁడితఁడు


చ. 1:

గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁద
చూపట్టుకమ్మఁ గస్తూరిపూఁత యితఁడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితఁడు


చ. 2:

జలధికన్యాపాంగ లలితేక్షణములలో
కలసి వెలుఁగుచు నున్న కజ్జలం బితఁడు
జలజాసనుని వదన జలదిమద్యము నందు
అలర వెలువడిన పరమామృతం బితఁడు


చ. 3:

పరివోని సురత సంపదల నింపులచేత
వరవధూతతికి పరమమైన యితఁడు
తిరువేంకటాచలాధిపుఁడు దానె యుండి
పరిపాలనము సేయ భారకుండితఁడు

రేకు: 0028-03 సామంతం సం: 01-171 కృష్ణ


పల్లవి:

 ఎన్నఁగలుగు భూతకోటి నెల్లఁ జేసినట్టిచేఁత
నిన్నుఁ జేసుకొనుటగాక నీకుఁ నీకుఁ దొలఁగవచ్చునా


చ. 1:

 గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు
కట్టివేసినట్టి పాపకర్మ మేల తీరును
పట్టితెచ్చి నిన్ను రోలఁగట్టివేసి లోకమెఱఁగ
రట్టుసేసుఁగాక నిన్ను రాజనన్న విడుచునా


చ. 2:

 మిఱ్ఱుపల్లములకుఁ దెచ్చి మెరసి భూతజాలములకుఁ
దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును
అఱ్ఱుసాఁచి గోపసతుల నలమి వెంటవెంటఁదిరుగ
వెఱ్ఱిఁ జేయుఁగాక నీవు విభుఁడనన్న విడుచునా


చ. 3:

 పరులఇంటి కేఁగి పరులపరుల వేఁడఁజేసినట్టి-
యెరుకమాలినట్టి చేఁత లేల నిన్ను విడుచును
వెరపుమిగిలి వేంకటాద్రివిభుఁడ ననుచు జనులచేత-
నరులుగొనఁగఁ జేయుఁగాక ఆస నిన్ను విడుచునా

రేకు: 0028-04 బౌళి సం: 01-172 వేంకటగానం


పల్లవి:

 ఏమివలసిన నిచ్చు నెప్పుడైననే
యేమరిక కొలిచిన నీతఁడే దైవము


చ. 1:

 ఘనముగా నిందరికిఁ గన్నులిచ్చుఁ గాళ్లిచ్చు
పనిసేయఁ జేతులిచ్చు బలియుఁడై
తనుఁగొలువుమని చిత్తములిచ్చుఁ గరుణించి
వొనర లోకానకెల్ల నొక్కఁడే దైవము


చ. 2:

 మచ్చిక తనుఁగొలువ మనసిచ్చు మాటలిచ్చు
కుచ్చితములేని కొడుకుల నిచ్చును
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు
నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము


చ. 3:

 పంతమాడి కొలిచినఁ బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు
యెంతటి పదవులలైన నిట్టె యిచ్చు
వింతవింత విభవాల వేంకటేశుఁడిదె మా-
యంతరంగముననుండే అరచేతి దైవము

రేకు: 0028-05 పాడి సం: 01-173 వైరాగ్య చింత


పల్లవి:

 వెట్టిమోపువంటిమేను విడనాడి వీఁ
డెట్టె దాఁటిపోయె నెటువంటిజాణే


చ. 1:

 ఘెరమైనఆసల నెడికూఁకటవేరు దవ్వి-
పారవేసి యిడుమలఁ బడనొల్లక
యీరసపుసంసార మింగలము దగిలించి
యేరు దాఁటిపోయె నెటువంటి జాణే


చ. 2:

 కన్నవారిఁ దన్నుఁ బ్రేమ నన్నవారి దిగనాడి
వున్నతమైనచోట నుండఁబోయి
తన్నుఁదా వేంకటపతిదాసులఁజేరి వాఁడు
యెన్నఁడుఁ దిరిగిరాఁడే యెటువంటిజాణే

రేకు: 0028-06 లలిత సం: 01-174 వైరాగ్య చింత


పల్లవి:

 వలవని మోహావస్థలఁ బొరలెడి-
మలినం బెన్నఁడు మానును-


చ. 1:

 ఘెరదురితవికారంబుల
కారణ మెన్నఁడు దీరును
వైరముగొని తనువదలనిబంధపు -
భారం బెన్నఁడు వాయును


చ. 2:

 జడమగుజిహ్వచాపల్యముగల -
వెడమతి యెన్నండు వీడును
చెడనిజీవునకు శ్రీవేంకటపతి-
కడుచూ పెన్నఁడు గటుగును

రేకు: 0028-07 లలిత సం: 01-175 ఆధ్యాత్మ


పల్లవి:

 ఆశాబద్దుఁడనై యలసి నిన్నుఁ గడు
గాసిఁ బెట్టినవాఁడఁ గాను


చ. 1:

 ఘనకర్మపరుఁడనై కర్మరూపునిఁ జేయ
నిను దూరి భారము నీకుఁ గట్టినవాఁడఁ గాను
పనిలేని దుఃఖలంపటుఁడనై దుఃఖము
గనుపించకుమని కడువేఁడినవాఁడఁ గాను


చ. 2:

 శ్రీవేంకటగిరి దేవేశ నాకిది
గావలె ననువాఁడఁ గాను
కావలసినయవి గదిసిననవి నాకు
గావను మనుజుండఁగాను