రేకు: 0027-01 ఆహిరి సం: 01-162 వైష్ణవ భక్తి
పల్లవి : |
ఏమి నెఱఁగనిమమ్ము నెక్కువనేసి
పామరుల దొడ్డఁజేసె భాష్యకారులు
|
|
చ. 1: |
గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి
అతనికరుణచేత నన్నియుఁ గని
గతిలేకపోయున కలియుగమున వచ్చి
ప్రతిపాలించఁగలిగె భాష్యకారులు
|
|
చ. 2: |
లోకమెల్ల వెల్లిఁబోఁగా లోననే సురలఁ గాచి
ఆకుమీఁదఁ దేలిన యతనికృప
కాకరిమతములెల్ల గాలిఁబుచ్చి పర మిట్టే
పై కొనఁగఁ గరుణించె భాష్యకారులు
|
|
చ. 3: |
పంకజపుఁ జేయి చాఁచి పాదపుఁబరమిచ్చిన -
వేంకటేశుకృపతోడ వెలయఁ దానే
తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన
పంకమెల్లఁ బోఁగడిగె భాష్యకారులు
|
|
రేకు: 0027-02 కన్నడగౌళ సం: 01-163 వైరాగ్య చింత
పల్లవి : |
ఆటవారిఁ గూడితౌరా ఆటవారిఁగూడిఅన్నిచోట్ల బొమ్మ-
లాట లాడించ నధికుండైతివి
|
|
చ. 1: |
గురుతరమగు పెద్దకొట్టాములోపల
తిరుమైన పెనుమాయఁ దెరగట్టి
అరయ నజ్ఞానము లవి యడ్డముగఁ జేసి
పరగ సుజ్ఞానదీపములు ముట్టించి
|
|
చ. 2: |
తోలుబొమ్మల దొరకొని గడియించి
గాలిచేత వానిఁ గదలించి
తూలేటి రసములు తొమ్మిది గడియించి
నాలుగు ముఖముల నలువున నాడించ
|
|
చ. 3: |
నిన్నేమెత్తురుగాని నీకేమి నీలేరు
మన్నించుదాతలు మరిలేరు
యెన్నఁగఁ దిరువేంకటేశ్వర నీదాసు -
లున్నతులై నిన్ను నుబ్బించి పొగడఁగ
|
|
రేకు: 0027-03 సామంతం సం: 01-164 సంస్కృత కీర్తనలు
పల్లవి : |
బ్రువంతి బౌద్దా బుద్ద ఇతి
స్తువంతి భక్తా సులభ ఇతి
|
|
చ. 1: |
గదంతికిల సాంఖ్యాస్త్వాం పురుషం
పదవాక్య జాః పదమితిచ
విదంతి త్వా వేదాంతిన-
స్సదా బ్రహ్మ లసత్పదమితిచ
|
|
చ. 2: |
జపంతి మీమాంసకా స్త్వాం చ
విపులకర్మణో విభవ ఇతి
లపంతి నయసకలా స్సతతం
కృపాళుకుర్తా కేవలమితిచ
|
|
చ. 3: |
భణంతి వేంకటపతే మునయో-
హ్యణిమాదిప్రద మతులమితి
గుణవంతం నిర్గుణం పునరితి
గృణంతి సర్వే కేవలమితిచ
|
|
రేకు: 0027-04 సామంతం సం: 01-165 సంస్కృత కీర్తనలు
పల్లవి : |
సతతం శ్రీశం
హితం పరాత్పర మీడే
|
|
చ. 1: |
గదాధరం మేఘగంభీరని-
నదం పరమోన్నతశుభదం
మృదుతరగమనం మేదినీధరం
హృదయనిలయ మహ మీడే
|
|
చ. 2: |
నందకధరం జనార్ధనం గో-
విందం చారుముకుందం
నందగోప వరనందన కందం
యిందుర వినయన మీడే
|
|
చ. 3: |
గరుడగమన మురగశయన మధికం
పరమపదేశం పావనం
తిరువేంకటగిరిదేవ మతులం మ-
హిరమణం స్థిర మీడే
|
|
రేకు: 0027-05 ఆహిరి సం: 01-166 కృష్ణ
పల్లవి : |
ఇన్ని లాగులచేతు లివియపో కడు-
నెన్నిక కెక్కినచేతు లివియపో
|
|
చ. 1: |
గునియుచుఁ దనునెత్తుకొమ్మని తల్లిపై-
నెనయఁ జాఁచినచేతు లివియపో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన-
యునుమువంటి చేతు లివియపో
|
|
చ. 2: |
పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన౼
యిసుమంతలు చేతు లివియపో
పసులఁ గాచుచు గొల్లపడుచుల యమునలో
యిసుక చల్లినచేతు లివియపో
|
|
చ. 3: |
పరమచైతన్యమై ప్రాణుల కెల్లను
యెరవులిచ్చినచేతు లివియపో
తిరువేంకటగిరి దేవుఁడై ముక్తికి-
నిరవు చూపెడుచేతు లివియపో
|
|
రేకు: 0027-06 సాళంగనాట సం: 01-167 అధ్యాత్మ
పల్లవి : |
వాసివంతు విడిచినవాఁడే; యోగి యీ-
అసలెల్లా విడిచిన అతఁడే యోగి
|
|
చ. 1: |
గద్దించి పారెడుతురగమువంటి మనసు
వద్దని మరలించినవాఁడే యోగి
వొద్దనే కొండలవంటి వున్నత దేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాఁడే ధీరుఁడైన యోగి
|
|
చ. 2: |
ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
వంచన మునుఁగనట్టివాఁడే యోగి
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు
దంచి పారఁజల్లువాఁడే తత్త్వమైన యోగి
|
|
చ. 3: |
వెగటుకామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై
వగలుడిగినయట్టివాఁడే యోగి
నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుఁడై భక్తిఁ
దగిలి నిలుపువాఁడే ధన్యుఁడైన యోగి
|
|
రేకు: 0027-07 గుండక్రియ సం: 01-168 వైరాగ్య చింత
పల్లవి 1: |
తుదిలేనిబంధము తోడునీడై నేను
వదలినా నన్ను వదల దేమినేతు
|
|
చ. 1: |
గులిమికొలుచు దీరఁగుడువ నియ్యక కొత్త -
కొలుచు మీఁదమీఁదఁ గొలవఁగా
కలసిన కర్మపుఁగలిమిచేతఁ దృష్ణ
వెలితిగాక యిల్లువెడల దేమినేతు
|
|
చ. 2: |
అన్నియు నొకమాటే యనుభవింపఁగఁ జేసి
కొన్ని వెచ్చము లొనఁగూడించి
యిన్నిటాఁ దిరువేంకటేశ నిర్మలునిఁగా
నన్నుఁజేసి నీవు నాకుఁ గలుగవయ్య
|
|