తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 14


రేకు: 0014-01 ముఖారిసం: 01-౦83 వైరాగ్య చింత


పల్లవి:
ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-
కందువ శ్రీహరికరుణేకాక

చ.1:
ఏఁటిజన్మమో యెఱఁగము పర-
మేఁటిదో నే మెఱఁగము
గాఁటపుకమలజుఁ గాచినయీ
నాఁటకుఁడే మానమ్మినవిభుఁడు

చ.2:
యెవ్వారు వేల్చులో యెఱఁగము సుర
లెవ్వరో నే మెఱఁగము
రవ్వగు శ్రీసతిరమణుఁడు మా-
కవ్వనజోదరుఁ డంతరియామి

చ.3:
యింకానేఁటిదో యెఱఁగము యీ -
యంకెలబాముల నలయము
జంకెల దనుజులఁ జదిపినతిరు-
వేంకటేశుఁడు మావిడువనివిభుఁడు


రేకు: 0014-02 రామక్రియ సం; 01-084 అథ్యాత్మ


పల్లవి:
వెలయునిన్నియును వృథా వృథా
తలఁపున శ్రీహరిఁ దడసినను

చ.1:
ఎడయలేనిపుణ్యము లెన్నియైనా
విడువక సేయుట వృధా వృధా
బడిబడి నే శ్రీపతి నాత్మలోఁ
దడవక యితరము దడవినను

చ.2:
యెరవులతపముల నెంతైనా
విరవిరవీఁగుట వృధా వృధా
హరినచ్యుతుఁ బరమాత్మునిని
మరచి తలఁచక మఱచినను

చ.3
దైవము నెఱఁగక తమకమున
వేవేలైన వృధా వృధా
శ్రీవేంకటగిరిచెలువునిని
సేవించక మతిఁ జెదరినను


రేకు: 0014-03 నాట సం: 01-085 నృసింహ

పల్లవి:
ఇలయును నభమును నేకరూపమై
జలజల గోళ్ళు జళిపైంచితివి

చ.1:
ఎడసిన నలముక హిరణ్యకశిపునిఁ
దొడికపట్టి చేతుల బిగిసి
కెడపి తొడలపై గిరిగొన నదుముక
కడుపు చించి కహకహ నవ్వితివి

చ.2:
రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు గురియుచును
కప్పినబెబ్బులిక సరుహుంకృతుల
దెప్పరపసురల ధృతి యణఁచితివి

చ.3:
పెళ పెళనార్చుచుఁ బెడబొబ్బలిడుచు
థళథళ మెఱువఁగ దంతములు
ఫళఫళ వీరవిభవరసరుధిరము
గుళగుళ దిక్కుల గురియించితివి

చ.4:
చాతినుప్రేవులజన్నిదములతో
వాతెరసింహపువదనముతో
చేతులు వేయిటఁ జెలగి దితిసుతుని
పోతర మణఁపుచు భువి మెరసితివి

చ.5:
ఆహోబలమున నతిరౌద్రముతో
మహామహిమల మలయుచును
తహతహ మెదుపు చుఁ దగువేంకటపతి
యిహముఁ బరముఁ మా కిపు డొసఁగితివి

రేకు: 0014-04 సామంతం సం: 01-086 వైరాగ్య చింత


పల్లవి :

ఇతరము లిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుట పరము


చ. 1:

ఎక్కడిసురపుర మెక్కడివైభవ-
మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమునుఁ బుణ్యము
గక్కునఁ జేయఁగఁ గల దిహపరము


చ. 2:

యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు-
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు
యివ్వలఁ దాఁ సుఖియించుట పరము


చ. 3:

యెందరు దైవము లెందరు వేల్పులు
యెంద రిందురును నేమిటికి
కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము


రేకు: 0014-05 భూపాళం సం: 01-087 దశావతారములు


పల్లవి:
పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?)
నీరసపుటెద్దవైననీకు నే ముద్దా

చ.1:
ఎద్దవై నన్నేల తొక్కి యేమిగట్టుకొంటివి
వొద్దనైన వచ్చి వూరకుండవైతివి
వొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక
నిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా

చ.2:
కాఁపురపుఁ బాపపునాకర్మమును ధరించి
వీఁపువగులఁగ దాకి విఱవీఁగితి
ఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకులచవి మూట-
మోపరివి నీకు నాముదము ముద్దా

చ.3:
మచ్చిరించి అల్లనాఁడు మాలవాఁడు కాలందన్ని
తెచ్చినయప్పటిధర్మ దేవతవు
యెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్ను
మెచ్చి తాఁకితివి నామేను నీకు ముద్దా


రేకు: 0014-06 శ్రీరాగం సం; 01-088 వైరాగ్య చింత


పల్లవి:
ఎందాఁక నేచిత్త మేతలఁపో
ముందుముందు వేసారితి మలిగి వేసరితి

చ.1:
ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును
నామాఁట విన దిదే నావిహరము
యేమరినాఁ దలఁపించీ నేమైనా గడించీ
సాముసేసి వేసారితి జడిసి వేసారితితి

చ.2:
యేడ చుట్టా లేడ బంధు లేడ పాందు లెవ్వరూ
తోడైనవారుఁ గారు దొంగలుఁ గారు
కూడుచీరగానిచోటై కొరగానిపాటై
వాడివాడి వేసారితి వదిలి వేసారతి

చ.3:
యెందునున్నాఁ డేమిసేసీ నెక్కడ భోగించీని
విందులకువిందయినవేంకటేశుఁడు
యిందరిహృదయములో నిరవై యున్నాఁ డతఁడు
చెంది నన్నుఁ గాచుఁగాక చెనకి వేసారితి