తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 297


రేకు: 0165-05 నాదరామక్రియ సం: 02-316 వేంకటగానం

పల్లవి:

పరులకైతే నిదే పాపము గాదా
పురిగొని నీవంకఁ బుణ్యమాయఁ గాక

చ. 1:

పరమపురుష నీవు పట్టినదే ధర్మము
అరసి నీవు చెల్లించినదే సత్యము
ధరలోన నీరెంటికి తండ్రితో విరోధించఁగ
దొరసి ప్రహ్లాదునకు దోడైనదే గురుతు

చ. 2:

నారాయణుఁడ నీవు నడిపినదే తగవు
ఆరూఢి నీ వౌన్ననదే ఆచారము
సారెకుఁ దమయన్నతో చండిపడి పెనగఁగ
కోరి సుగ్రీవు వహించుకొన్నదే గురుతు

చ. 3:

శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి
చేవతో నీ వొడఁబరచినదే మాట
కావించి తాతతోఁ బోరఁగా నీవు చక్రమెత్తి
ఆవేళ నడ్డమైనందుకు అర్జునుఁడే గురుతు

రేకు: 0166-01 నాదరామక్రియ సం: 02-317 వైష్ణవ భక్తి


పల్లవి :

ప్రపన్నులకు నిది పరమాచారము
విపరీతాచారము విడువఁగవలయు


చ. 1:

భగవదపచారము భాగవతాపచారముఁ
దగులక దేవతాంతరము మాని
నగధరు శరణము నమ్మి యాచార్యుని
బగివాయనిదే పరమవైష్ణవము


చ. 2:

దురహంకారము దుఃఖము సుఖమునుఁ
బొరయక ప్రాకృతులపొంతఁ బోవక
దరిశనాభిమానాన ధర్మము వదలక
పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము


చ. 3:

ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి
యెపుడూఁ దీర్థప్రసాదేచ్ఛ తోడ
నిపుణత శ్రీవేంకటనిలయుఁడే గతియని
ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము

రేకు: 0166-02 రామక్రియ సం: 02-318 అధ్యాత్మ


పల్లవి :

జతనము జతనము సర్వేశు నగరిది
బతుకుఁదోవ యిదె బడకరము


చ. 1:

హృదయములోపల నీశ్వరుఁడున్నాఁడు
పదిలము మనసా బడకరము
తుద నల కామాదులఁ జొర నియ్యక
పదరక కావుము బడకరము


చ. 1:

యెంచుకొననిదే యేలిక మిము నిఁక
పంచభూతములాల బడకరము
మించిన పురి తొమ్మిదివాకిళ్లనుఁటికి
దైవమొక్కఁడే తగిలిన గుఱుతు


చ. 1:

కాయపు గుణములు కలిగినవే భువి-
నీ యెడ జీవుఁడు యిటు గలఁడే
ఆయమిందుఁ గా దవునన నెవ్వరు
కాయజగురుఁ డొక్కఁడే ప్రేరకుఁడు


చ. 1:

అంతరంగమే యాత్మజ్ఞానము
వింతగు వెలుపల వెడమాయ
చింతించి రక్షించ శ్రీవేంకటేశుఁడు
మంతుకెక్కె నిఁక మతకములేల


రేకు: 0297-04 సాళంగం సం: 03-563 విష్ణు కీర్తనం

పల్లవి:

ఒక్కఁడే దైవం బున్నతుఁ డీతఁడు
తక్కిన తలఁపులు తప్పుఁదెరువులు

చ. 1:

పురుషుల కెల్లాఁ బురుషోత్తముఁడు
సురేంద్రాదులకు సురేంద్రుఁడు
హరునికి నజునికి నవ్వలిమూరితి
హరి ఇతఁడే పరమాత్ముఁడు

చ. 2:

వేదాంతంబుల వేద్యుఁ డీతఁడు
ఆదికినాదియు నన నితఁడే
మేదిని నరులకు మేదినీశ్వరుఁడు
యేదెసఁ జూచిన నీశ్వరుఁ డితఁడే

చ. 3:

యెక్కువల కెల్ల నెక్కువ యీతఁడు
మక్కువ మరునికి మరుఁ డితఁడు
యిక్కడ శ్రీవేంకటేశుఁడై మిగుల
పక్కన నిదివో ప్రత్యక్ష మితఁడు


రేకు: 0297-05 శ్రీరాగం సం: 03-564 విష్ణు కీర్తనం

పల్లవి:

ఓహో నిలిచిన దొకటిదియే
శ్రీహరి సాకారచింతనము

చ. 1:

పంచమవేదపు పద్మాక్షునామము
అంచెఁ బాపహర మౌషధము
పంచలఁ బీతాంబరు శరణాగతి
ముంచిన యజ్ఞానమునకు దీపము

చ. 2:

విందులకుడుపులు విష్ణుకీర్తనము
చందపు వైకుంఠ(ము?) సంబళము
పొందుగ నచ్యుతుఁ బూజించు పూజలు
కిందటఁ గొనకెక్కెడి నిచ్చెనలు

చ. 3:

కట్టిన ముడుపగు ఘన కృష్ణభక్తి
ముట్టిన పాపవిమోచనము
యిట్టే శ్రీవేంకటేశ్వరు కృప యిది
పట్టినవారికి బలువగు కొమ్ము(మ్మ?)


రేకు: 0297-06 శంకరాభరణం సం: 03-565 మాయ

పల్లవి:

వేదము దీర్చదు వేరే శాస్త్రములు
యేదియుఁ దీర్చదు యిది నీమాయ

చ. 1:

నీ వల్ల బ్రదికిరి నిండు దేవతలు
నీవల్ల నసురలు నెఱిఁ జెడిరి
ఆవల నిందరి కాత్మవు నీవే
చేవదేరె నీ చిక్కులే భువిని

చ. 2:

నెమ్మిఁ బాండవుల నీవారంటివి
కమ్మర విడిచితి కౌరవుల
యిమ్ముల నీవావి యిద్దరికొకటే
తెమ్మలాయ నీ తీరని చిక్కు

చ. 3:

జగమున నీదే స్వతంత్రమెల్లా
నెగడిన జీవులు నీవారు
తగు శ్రీవేంకటదయివమ యిన్నియు
తెగి నీదాసులు తెలిసిన చిక్కు