తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 296
రేకు: 0296-01 సాళంగనాట సం: 03-554 విష్ణు కీర్తనం
పల్లవి:
ఎందరు గలిగిన నితని లోనే
ముందు వెనకలను ముఖ్యం బితఁడే
చ. 1:
భవ విదూరుఁ డాపద్బంధుఁడు హరి
వివరించి కొలువ వేల్పితఁడు
కవతో లక్ష్మీకాంతుఁ డితఁడు
రవిశశినేత్రుఁడు రక్షకుఁడు
చ. 2:
కలిదోషహరుఁడు కారుణ్యనిలయుఁడు
వలెననువారికి వరదుఁడు
తలఁపు లోనఁ గల తత్త్వం బితఁడు
సులభుఁ డితఁ డరసి చూచినను
చ. 3:
శ్రీవేంకటేశుఁడు చిత్తజగురుఁడు
యేవలఁ జూచిన నితఁడే
గోవిందుఁ డితనిఁ గొలిచితి మిదివో
తోవయుఁ గంటిమి తుదకెక్కితిమి
రేకు: 0296-02 శుద్ధవసంతం సం: 03-555 మాయ
పల్లవి:
కనుఁగొననిది హరి కల్పితము
తనకు నిందులోఁ దగినంతే
చ. 1:
నానాభేదములు నరుల గుణంబులు
నానారుచులివి నవపదార్థములు
ఔననేదేది యటు గాదనేదేది
వానివాని విధి వలసినయట్టు
చ. 2:
నడచుఁ బ్రపంచము నడుపే విధముల
నడచు మాయ లెన్నఁగరావు
విడిచేటివేఁటివి విడువనివేఁటివి
పడఁగఁబడఁగ నవి పరచినయట్లు
చ. 3:
తెగని కర్మములు దేహధర్మములు
తెగని యాసలివె దినదినము
తగు శ్రీవేంకటదైవము దాసులు
నగుదు రిన్నిటిని నటనలు చూచి
రేకు: 0296-03 వరాళి సం: 03-556 అధ్యాత్మ
పల్లవి:
అరిగాఁపులము నేము అంతర్యామివి నీకు (వు?)
యిరవై నీ చెప్పినట్టు యేమి సేతుమయ్యా
చ. 1:
గాలి ముడి గట్టినట్టు కాయము మోచితిమి
కాలము గొలచితిమి కనురెప్పల
జాలి రొప్పితిమి వట్టి సటలనే యేపొద్దు
యేల మెచ్చవింకాను యేమి సేతుమయ్యా
చ. 2:
చుక్కలు లెక్కించినట్టు చూడఁగ మా జన్మములు
వుక్కునఁ గర్మములకు నొడిగట్టితి (మి?)
తెక్కులను వెంటవెంటఁ దిరిగేము బంట్లమై
యెక్కువాయ వెట్టి మాకు నేమి సేతుమయ్యా
చ. 3:
పాలు వొంగినటువలెఁ బాయము మోచితిమి
నాలుక కెక్కినవెల్లా నమలితిమి
యీలీల శ్రీవేంకటేశ ఇంత సేసితివి
యేలినవాఁడవు ఇంకా నేమిసేతుమయ్యా
రేకు: 0296-04 శంకరాభరణం సం: 03-557 అధ్యాత్మ
పల్లవి:
మిగిలిన దేమిఁకమీఁదట దేహికి
అగపడు నొక పడెఁ డన్నంబు
చ. 1:
రతిఁ బగటి వెలుఁగు రాత్రిచీఁకటికి
సతము గాదు అది సరికి సరి
అతిభోగములకు నార్జించుటకును
చతురపు సంపద సరికి సరి
అ. 2:
అలయ పథ్యమున కౌషధము గొనుట
చలువకు వేఁడికి సరికి సరి
నిలిచిన పుణ్యము నిండుఁబాపములు
జలువు వెలువులకు సరికి సరి
అ. 3:
మహి మరణములకు మరి పుట్టుగులకు
సహజ మందరికి సరికి సరి
యిహమున శ్రీవేంకటేశ్వరుఁ డాత్మకు
సహకారి యతఁడు సరికి సరి
రేకు: 0296-05 మాళవి సం: 03-558 విష్ణు కీర్తనం
పల్లవి:
తెలుపఁగ రాదిది దేవుని మాయలు
ఫల మెఱఁగరు యీ పట్టినవెఱ్ఱి
చ. 1:
పుట్టిరి దివిజులు పురుషోత్తమునం-
దట్టే యణఁగిరి యతనందు
యిట్టే యీతని యిందరితో సరి-
వెట్టి కొలుచుటే పెనువెఱ్ఱి
చ. 2:
వుపమించి తెలిసితే నొక్కటే జగము
అపురూపపు నీసృష్టి అతిఘనము
అపరిమితపు జీవు లణువత్రులైనాను
యెపుడు శ్రీవేంకటేశ యెక్కుడు నీదాసులు
రేకు: 0165-04 నాదరామక్రియ సం: 02-315 దశావతారములు
పల్లవి:
ఎంతకత నడిపితి వేమి జోలిఁ బెట్టితివి
చింతించ లోకములు నీచేతివే కావా
చ. 1:
కౌరవులఁ బాండవుల కలహము వెట్టనేల
నేరచి సారథ్యము నెఱపనేలా
కోరి భూభార మణఁచేకొరకై తే నీచే చక్ర-
మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా
చ. 2:
చేకొని వానరులఁగాఁ జేయనేల దేవతల
జోకతో లంకాపురి చుట్టుకోనేల
కాకాసురు వేసిన కసవే రావణుమీఁద-
నాకడఁ జంపువెట్టితే నప్పుడే సమయఁడా
చ. 3:
గక్కన శ్రీవేంకటేశ కంబములో వెళ్లనేల
చొక్కముగాఁ బ్రహ్లాదుఁడు చూపఁగనేల
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక
తక్కించి నీవెడసితే తానే పొలియఁడా