రేకు: 0285-01 మలహరి సం: 03-488 గురు వందన
పల్లవి : |
సకలముఁ జదివిన శాస్త్రము లెఱిఁగిన
శుకధ్రువాదు లిటు చూపినది
|
|
చ. 1: |
భవభవములకును ప్రకృతులు వేరే
భువి నామరూపములు వేరే
యివల నీదాస్యం జెప్పుడు నొకటే
కలిసిన నీ మాయఁ గడిచినది
|
|
చ. 2: |
మతము మతమునకు మార్గము వేరే
అతిసంశయములు అవి వేరే
గతి నీ శరణము గలిగిన దొకటే
యితవగు మోక్షం బిచ్చేది
|
|
చ. 3: |
జాతి జాతి యాచారము వేరే
ఆతల మోక్షంబది యొకటే
శ్రీతరుణీశ్వర శ్రీవేంకటేశ్వర
చేత మాగురుఁడు చెప్పినది
|
|
రేకు: 0285-02 ముఖారి సం: 03-489 నామ సంకీర్తన
పల్లవి : |
తొల్లిటివారికంటే దొడ్డ నేను పాతకాన
బల్లిదుఁడవగుటకుఁ బ్రతాపమిదివో
|
|
చ. 1: |
నరహరి యచ్యుత వో నారాయణా
గురుఁడు నిన్నుఁ గొండించెఁ (?) గోరి నే వింటి
గరిమ నొక్కతప్పున కాకికిఁ బరమిచ్చితి
సిరులఁ బెక్కుతప్పులు సేసితి నేమిచ్చేవే
|
|
చ. 2: |
మందరధరుఁడ వో మధుసూదనా
అందరు నిన్నొకమాఁట ఆడఁగా వింటి
నింద కొకటి బొంకితే నీవు ధర్మజుఁ గూడితి
వంది పెక్కుబొంకుల నాయందుఁ గూటమెంతో
|
|
చ. 3: |
శ్రీవేంకటేశ్వర శ్రీసతీమనోహర
సేవ నీదాసులే నిన్ను చేతఁ జూపేరు
మోవ నొక్క శునకము మొర యాలించితివట
వేవేలు జన్మాలెత్తితి యీవిధ మెట్లాలించేవో
|
|
రేకు: 0285-03 వరాళి సం: 03-490 వైష్ణవ భక్తి
పల్లవి : |
ఇది చాలదా మమ్ము నీడేర్చను
అదన నెవ్వఁ డెరుఁగు నటమీఁది పనులు
|
|
చ. 1: |
ఇట్టె పంచసంస్కారా లెచ్చోట నుండినాను
పట్లైనవారే మాకుఁ బ్రమాణము
మట్టుగ నీరూపనామము లెందు నుండినాను
కట్టఁగడవారైన ఘనపుణ్యులు
|
|
చ. 2: |
పలుక వైష్ణవవేషభాష లెందు నుండినాను
వలనుగ మాకు సహవాసయోగ్యులే
తలకొన్న దాసానుదాస్య మెందు నుండినాను
అల కర్మదూరులైన నంతరంగులు
|
|
చ. 3: |
యెక్కువ సంకీర్తన మెచ్చోట నుండినాను
అక్కడ పరమపద మది భాగ్యము
చక్కఁగ వేదశాస్త్రసమ్మతము నిదియే
పక్కన శ్రీవేంకటేశు పరమార్థము నిదే
|
|
రేకు:0285-04 రామక్రియ సం: 03-491 విష్ణు కీర్తనం
పల్లవి : |
అన్నిటి మూలం బతఁడు
వెన్నుని కంటెను వేల్పులు లేరు
|
|
చ. 1: |
పంచభూతముల ప్రపంచ మూలము
ముంచిన బ్రహ్మకు మూలము
పొంచిన జీవుల పుట్టుగు మూలము
యెంచఁగ దైవము యితఁడే కాఁడా
|
|
చ. 2: |
వెనుకొని పొగడేటి వేదాల మూలము
మునుల తపములకు మూలము
ఘనయజ్ఞదుల కర్మపు మూలము
యెనలేని దైవ మితఁడే కాఁడా
|
|
చ. 3: |
అగపడి సురలకు నమృత మూలము
ముగురు మూర్తులకు మూలము
నగు శ్రీవేంకటనాథుఁడే మూలము
యెగువ లోకపతి యితఁడే కాఁడా
|
|
రేకు: 0285-05 లలిత సం: 03-492 రామ
పల్లవి : |
అవధారు రఘుపతి యందరినిఁ జిత్తగించు
యివల నిండెఁ గొలువిదె నడె సముఖా
|
|
చ. 1: |
రామ రాఘవ రామభద్ర రామచంద్ర
శ్రీమదయోధ్యాపతి సీతాపతి
ప్రేమ నారదుఁడు వాఁడీఁ బెక్కు రంభాదు లాడేరు
మోమెత్తి కపులెల్లా మొక్కేరదివో
|
|
చ. 2: |
యినవంశకులజాత ఇక్ష్వాకుతిలకా
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుఁ డదె
వెనక లక్ష్మణుఁడు సేవించీ వింజామర
|
|
చ. 3: |
కందువఁ గౌసల్యాగర్భరత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాసా
సందడిఁ గుశలవులు చదివేరు వొకవంక
చెంది నీ రాజసము చెప్పరాదు రామా
|
|
రేకు:0285-06 దేసాళం సం: 03-493 దశావతారములు
పల్లవి : |
అక్కటా రావణు బ్రహ్మహత్య నీకు నేడది
పుక్కిటి పురాణలింగపూజ నీకు నేడది
|
|
చ. 1: |
గురుహత్య బ్రహ్మహత్యఁ గూడీ ద్రోణాచార్యు వంక
హరి నీ కృప నర్జును కవిలేవాయ
యెరవుగాఁ గల్లలాడి యేచిన ధర్మజునకు
పరగ నీ యనుమతిఁ బాపము లేదాయను
|
|
చ. 2: |
అదివో రుద్రుని బ్రహ్మహత్య వాయఁ గాసి యిచ్చి
పొదలిననీ వతనిఁ బూజింతువా
అదనఁ బార్వతిదేవి కాతఁడే నీ మంత్రమిచ్చె
వదరు మాటల మాయావచనాలేమిటికి
|
|
చ. 3: |
తగిలి నీ నామమే తారకబ్రహ్మమై
జగము వారి పాపాలు సంతతముఁ బాపఁగాను
మిగుల శ్రీవేంకటేశ మీకు నేడ పాతకాలు
నగుఁబాటు లింతేకాక నానాదేశముల
|
|