తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 279

రేకు: 0279-01 రామక్రియ సం: 03-453 విష్ణు కీర్తనం


పల్లవి :

బలువుఁడు నాతఁడే బంధువుఁడు నాతఁడే
తలఁ చాతనికి మొక్కఁ దగులింతే నేము


చ. 1:

దైవమే భారకుఁడు ధరణి రక్షించుటకు
భావింప నరులచేఁత్ర పనిలేదు.
శ్రీవల్లభుఁ డతఁడు నేసినట్టల్లా నవును
వావాత ననుభవించేవారమింతే నేము


చ. 2:

హరియే స్వతంత్రుఁడు అన్నిపనులుగాఁ జేయ
పరుల వుద్యోగాలు పనిలేవు
సురనాథుఁ డాతఁడు చూచినట్టల్లా నవును
వరుసతోఁ దిరిగాడేవారమింతే నేము


చ. 3:

సకలేశుఁడే కర్త జగములు గాచుటకు
ప్రకటించ నేర్పులు పనిలేవు
వొకట శ్రీవేంకటేశుఁ డొనరించినట్లవును
సుకియించి పొగడేటి సుద్దులింతే నేము

రేకు: 0279-02 బౌళి సం: 03-454 అధ్యాత్మ


పల్లవి :

వద్దిక నోపము వట్టి స్వతంత్రము
వొద్దిక శాంతితో నుండేమయ్యా


చ. 1:

నడవక మానవు నానాజగములు
కడఁగిన హరిసంకల్పానను
వుడుగ కిందు నా వుద్యోగమేఁటిది
నడుమనే కనుఁగొని నవ్వేమయ్యా


చ. 2:

కలుగక మానదు కాఁగల భోగము
కలిమిఁ బురాకృత కర్మమిది
అలసి యిందు నా యాస లేమిటికి
కలిగిన పాటే కానీవయ్యా


చ. 3:

తగులక మానదు తన సంసారము
వెగటగు మాయావిలాసము
అగపడి శ్రీవేంకటాధిపు కృపచే
తగిన పాటినే తనిసేమయ్యా

రేకు: 0279-03 దేవగాంధారి సం: 03-455 శరణాగతి


పల్లవి :

ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక
పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా


చ. 1:

నాలికె వొక్కటే నీ నామము లనంతము
పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా
వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు
పోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా


చ. 2:

వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు
వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా
గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో
పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా


చ. 3:

యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన
కామించి నీడాగు మోచి గతిగ నేను
యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు
దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా

రేకు: 0279-04 సామంతం సం: 03-456 భక్తి


పల్లవి :

గరిమల నెరఁగరుఁ గాక మానవులు
సిరులఁ దియ్యని నోరఁ జేఁదు మేసేదా


చ. 1:

హరినారాయణ యనియెడి నోరను
ధర నితరుల పేళ్లు దడవుటెట్టు
సరవితో వేదములు చదివేటి నోరను
పరులమీఁది పదాలు పాడేదా


చ. 2:

మునుప శ్రీపతికి మ్రొక్కిన చేతుల
అనరుహులకు దండమనుట యెట్టు
మునుకొని పూవులు ముడిచిన సిరసున
కనలి కట్టెలు మోచి కాకయ్యేదా


చ. 3:

బలిమి శ్రీవేంకటపతిఁ గొలిచినవారు
తెలియ కల్పులఁ గొల్పి తిరుగుటెట్లు
జలధి దాఁటేవాఁడు సరి నోడ వుండఁగ
వలవని జోలితో వదరు వట్టేదా

రేకు: 0279-05 బౌళి సం: 03-457 శరణాగతి


పల్లవి :

వేళ లేదు జాడ లేదు వీని తోడిదే పాటు
కూళఁడనై తిరిగేను గుణమేది నాకు


చ. 1:

వేగిరించి పెరరేఁచి వేసరించీఁ బనులు
సాగి ముందరఁ బొలసి చలపట్టీ సిరులు
జాగు సేసి వచ్చి వచ్చి చవి చూపీఁ బాయము
యేగతి నిన్నుఁ దలఁతు నేది బుద్ధి నాకు


చ. 2:

తన్నుఁదానే వచ్చి వచ్చి తగిలీ లంపటము
వున్నతి భోగముల నోరూరించీ సుఖము
కన్నచోనే యెలయించి కదిమీ సంసారము
యెన్నఁడు నిన్నుఁ దలఁతు నెఱుకేది నాకు


చ. 3:

తాలిమితో మీఁద మీఁదఁ దరవయ్యీఁ గర్మము
నాలితోడ సన్నసేనీ నవ్వు నవ్వి మర్మము
యేలితివి శ్రీవేంకటేశ్వరుఁడ నన్ను నీవు
సీలాన నీ వాఁడనైతిఁ జెప్పనేది నాకు

రేకు: 0279-06 లలిత సం: 03-458 అధ్యాత్మ


పల్లవి :

అంతర్యామీ వో అంతర్యామీ
బంతి నాకేమిగల్లా నా పాలివాఁడవు గావా


చ. 1:

దొంతులై అన్ని యోనులాఁ దొల్లి నేఁ బుట్టేటినాఁడే
అంతరాత్మవైనవాఁడ వటు నీవేకా
ఇంతట విడిచేవా నన్నింద్రియాలఁ గట్టివేసి
పొంతఁ జూచేవిటు నాకుఁ బొత్తులకాఁపవుగా


చ. 1:

తొడరి స్వర్గనరక దుఃఖసుఖములనాఁడు
అడరి కర్మసాక్షివటు నీవేకా
విడువ వెప్పుడు నన్ను విషయాలఁ జిక్కినాఁడ
కడ నూరకుండనేల కన్నవాఁడవు గావా


చ. 1:

నీ చేతఁగానిది లేదు నీవు నాకుఁ బ్రాణమవు
కాచుటకు నీకంటే నొక్కరు వచ్చేరా
చేచేత శ్రీవేంకటేశ చేరి నీకు శరణంటి
యేచి నన్ను మన్నించితివిది నీ తేజముగాదా