రేకు: 0268-01 లలిత సం:03-389 శరణాగతి
పల్లవి : |
చంకగుదియ యిదే శరణార్తి నే నిదే
తెంకి నా భావము దేవుఁడే యెరుఁగు
|
|
చ. 1: |
కోరెడి చిత్తము కోరక మానదు
వైరాగ్యము నే వదలను
యీరీతి దినములు యిట్లనే కడచీ
తేరిన పను లిఁక దేవుఁడే యెరుఁగు
|
|
చ. 2: |
తగు సంసారము తనువునఁ బెనఁగీ
వెగటై మోక్షము వెదకేను
పగటున రెంటాఁ బరగిన జీవుఁడు
తెగువలుఁ దగులమి దేవుఁడే యెరుఁగు
|
|
చ. 3: |
పంచేంద్రియములు పారీ నిక్కడ
పెంచఁ బెద్దనై పెరిగేను
అంచెల శ్రీవేంకటాధిపుఁ గొలిచితి
దించని యీమాయ దేవుఁడే యెరుఁగు
|
|
రేకు: 0268-02 లలిత సం: 03-390 శరణాగతి
పల్లవి: |
ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దుగునుసుతా
వోడక నీదండ చేరి వున్నారమయ్యా
|
|
చ. 1: |
ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
యే సుఖదుఃఖములుఁ దా మెరఁగనట్టు
వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక
యీసుల పుణ్యపాపము లెఱఁగమయ్యా
|
|
చ. 2: |
యేలినవారు వెట్టగా నేపునఁ దొత్తులు బంట్లు
ఆలకించి పరుల బోయడుగనట్టు
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా
యేలని యేమియుఁ గోర నెరఁగమయ్యా
|
|
చ. 3: |
చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁగలవాఁడు.
యేతులఁ గలిమిలేము లెరఁగనట్టు
ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండఁగాను
యీతల నే వెలుతులు నెరఁగమయ్యా
|
|
రేకు:0268-03 బౌళి సం: 03-391 మనసా
పల్లవి: |
బాపురే వోప్రాణి బాపురె వోమనసా
వోపనస వెందుకైనా నొడఁబడేవు
|
|
చ. 1: |
మురికి దేహమొకటి మోచుక నీ ఎప్పటిని
మురికి దేహసతుల మోవఁగోరే ఎప్పటిని
కరకు హేయము గొంత కడుపున నించుకొని
తిరిగి హేయమేకాను (?) తినఁబోయే వప్పటి
|
|
చ. 2: |
పసిఁడి కమ్ముడుపోయి పరులఁగొలిచి మరిఁ
బసిఁడి సొమ్మంటాఁ బైఁ బెట్టఁ గోరేవు
పిసరుఁ బాపపుణ్యాలఁ బెడఁగేలు గట్టించుక
విసువక అవియే కావించఁబోయే వప్పటి
|
|
చ. 3: |
పంచభూతములచేతఁ బట్టువడి కమ్మరాను
పంచభూతాల దేహుల బంధులంటాఁ దగిలేవు
అంచెల శ్రీవేంకటేశుఁ డాతుమలో నున్నవాఁడు
యెంచుక తెలిసియును ఇట్టె మరచే వప్పటి
|
|
రేకు: 0268-04 భూపాళం సం: 03-392 అధ్యాత్మ
పల్లవి: |
నారాయణ నే నస్వతంత్రుఁడను నాకా పనిగా దేవియును
ధారుణి లోపలఁ బుట్టించితివి తరువాతి పనులు నీకే సెలవు
|
|
చ. 1: |
శ్రీపతి నీకే సమర్పితంబై శేషంబైనది యాతుమ దొల్లే
యేపున విషయములందులోఁ దగిలి యేమయిన నీకే సెలవు
చూపరఁ బసురము తొరలు వోయినను సొమ్ముగలుగువాఁడే పరవంజుక
పైపైఁ దానే వెదకి తెచ్చి కాపాడఁగ నతనికి భారముగాన
|
|
చ. 2: |
యీడులేక శ్రీహరి నీవుండెడి యీ దేహపు నీపరికరమూఁ
బాడిగఁ బంచేంద్రియములు పట్టుక బడిఁ దిప్పెడి నీకే సెలవు
వోడక యధికులు తమ దాసులు మరివొకరిపంపు లటు సేయఁగను
చూడరు తమబలములనే విడిపించుక తామే రక్షింతురు గాని
|
|
చ. 3: |
శ్రీవేంకటపతి నీవే నన్నిటు సృష్టించిన జీవుఁడనింతే
కావిరి నజ్ఞానము నన్నిటువలెఁ గప్పిన నది నీకే సెలవు
ధావతిఁ దలిదండ్రులు తమ బిడ్డల తనువులఁ బంకము లంటినను
యేవిధముల నీరార్చి పెంతు రటు ఇన్నిట నీవే గతినాకు
|
|
రేకు:0268-05 ధన్నాసి సం:03-393 వైష్ణవభక్తి
పల్లవి: |
అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు
కందర్పజనక నాకుఁ గలిగితి విన్నిటా
|
|
చ. 1: |
ఘనకుండలములు నీ కథలు నాచెవులకు
ననుపైన రుచులు నీ నామములు నాలుకకు
అనువై నీకు మొక్కఁగ నంటిన నొసలిమన్ను
పనివడి నీకు పట్టబద్ధ(ంధ?)ము
|
|
చ. 2: |
మంచి నిర్మాల్యపుదండ మంగళసూత్రము నాకు
కాంచనపురాసి నీ చక్కని రూపు నామతికి
పంచామృతములు నీ పాదతీర్థము మేనికి
పంచినముద్ర అదే వజ్రాంగిజోడు
|
|
చ. 3: |
సకలబంధులు నీ దాసానదాసులే నాకు
అకలంక జన్మఫల మన్నిటా నీకృప నాకు
ప్రకటపు శ్రీవేంకటపతివి నాయాతుమలో
మొకరివై యుండి నన్ను మోహించఁజేసితివి
|
|
రేకు: 0268-06 భూపాళం సం: 03-394 ఆధ్యాత్మ
పల్లవి : |
పాపముఁ బుణ్యముఁ బరకట నున్నది.
చేపట్టుము నీ చేతిదీ ప్రాణి
|
|
చ. 1: |
నాలుక కొనలనె నానుచునున్నది.
గాలపు నిజమునుఁ గల్లయును
వాలుచును తాసువలె నున్నదిదే
తాలిమి ధర్మాధర్మములు
|
|
చ. 2: |
చేతుల కొనలను చేఁతై యున్నది.
జాతిగ నరకము స్వర్గమును
ఆతల వేదోక్తమైన కర్మములు
దాతనే పిడికిటఁ దగిలెను వెదకు(?)
|
|
చ. 3: |
మనసు కొట్టఁగొన మాయయు నున్నది.
వెనక శ్రీవేంకటవిభుఁడు నదే
తనరిన యాతని దాస్యము నున్నది.
విని చేకొందువు వెదకవో నీవు
|
|