రేకు: 0263-01 సామంతం సం: 03-361 వైరాగ్య చింత
పల్లవి : |
ఎక్కడనున్నాఁ బోదు యేతులైనఁ బోనీదు
వొక్కటి కొక్క బంధము వూహింప నెక్కుడు
|
|
చ. 1: |
బుడిబుడి మాయలఁ బొరలేటి దేహికి
కడవరాని బంధము కాంతలు
యెడపడ కందుకంటే నెక్కుడైన బంధము
కడునాసఁ బొరలించు కనకము
|
|
చ. 2: |
బాలులకు వృద్ధులకు పాయపు వివేకులకు
తేలించే బంధములు దినరుచులు
మూలనున్నాఁ బోనీదు ముంగిటనే వేసేది
వేళ గాచిన బంధము విద్యాగర్వము
|
|
చ. 3: |
పాయ దేజంతువులైనాఁ బశుపక్షులకునైనా
బాయటి గీముల కట్టుఁబాటు బంధము
యేయెడ శ్రీవేంకటేశ ఇంక నీదాసులకైతే
చాయై చెప్పినట్టు సేసు సకలబంధములు
|
|
రేకు: 0263-02 మలహరి సం: 03-362 శరణాగతి
పల్లవి : |
దైవమా యేమి సేతు తలఁప నీవే దిక్కు
భావించి చదువఁబోయి పశుబుద్ధినైతి
|
|
చ. 1: |
కననా సంసారము కడలేని భారమౌట
కనినాఁ దొలఁగరాదు కాలురులు
విననా యీ దేహము విరసపు హేయమౌట
వినినా జిగురుఁ గండె విడిపించరాదు
|
|
చ. 2: |
తెలియనా ఇంద్రియాలు ద్రిష్టపు విరోధమౌట
తెలిసినాఁ బోఁగువలెఁ దెంచరాదు
పలుకనా పాపములు పాయని బంధములని
పలికినాఁ గొన్న వెఱ్ఱి పట్టితోయరాదు
|
|
చ. 3: |
యెఱఁగనా యీలోకమిది మాయమయమని
యెఱిఁగినాఁ బడ్డవోఁద మెక్కరాదు
మెఱయ శ్రీవేంకటేశ మేనిలోననే వుండి
మఱియును నన్నునేల మన్నన సేసితివి
|
|
రేకు: 0263-03 పాడి సం: 03-363 వైరాగ్య చింత
పల్లవి : |
మించిన తలపోఁత్రలే మీఁద మిక్కిలి
కొంచెము (మొ?) దొడ్డో సరికోరి ఇందుకందుకు
|
|
చ. 1: |
చేసేటి పుణ్యములకు చెందేటి పాపములకు
యీసుల సరికి సరి ఇందుకిందుకు
వాసులఁ బుట్టుగులకు వడి మరణాలకును
ఆసల సరికి సరి అందుకందుకు
|
|
చ. 2: |
దినదిన సుఖాలకు తీదీపు దుఃఖములకు
యెనసి సరికి సరి ఇందుకిందుకు
అనుఁగుఁ బున్నమలకు అమాస చీఁకట్లకు
అనయము సరికి సరందుకందుకు
|
|
చ.3: |
శ్రీవేంకటేశ యిట్టే జీవులకు నేది గతి
యేవి చూచిన సరికి సరిందుకిందుకు
వేవేగ నీ శరణని వెలసి బ్రతికితిమి
యే వల్లలేదు సరి యెందుకం (కెం?)దుకు
|
|
రేకు: 0263-04 సాళంగనాట సం: 03-364 దశావతారములు
పల్లవి : |
హరి యిచ్చిన వరము లటువలెఁ గావుగా
తిరమై వివేకులెల్లాఁ దెలిసేటి దిదియే
|
|
చ. 1: |
శిరసులు తుంచితుంచి చిచ్చులోన వేలిచి
వరములు వడసె రావణుఁ డెన్నైనా
నిరతి రాముని చేత నిమిషములోననే
వరములన్నియు నెందో వరతిపాలాయ
|
|
చ. 2: |
వీరఘోరతపముల వెలయ బాణాసురుఁడు
కోరి చేకొన్నవరాలు కోటానఁగోటి
వూరకే కృష్ణునిచేత నొక యిసుమంతలోనే
తోరమైన వరములు తుత్తునియలాయ
|
|
చ.3: |
వట్టిజాలిఁ బొరలక వరుస విభీషణుఁడు
జట్టిగ రఘుపతికి శరణనెను
నెట్టన నాతనిఁ గాచె నేఁడూ నున్నాఁడదె
యిట్టే శ్రీవేంకటాద్రి నిచ్చీ వరములు
|
|
రేకు: 0263-05 మాళవి సం: 03-365 ఉత్సవ కీర్తనలు
పల్లవి : |
వీఁడు గదే శేషుఁడు శ్రీవేంకటాద్రి శేషుఁడు
వేఁడుక గరుడనితోఁబెన్నుద్దైన శేషుఁడు
|
|
చ. 1: |
వేయివడిగెలతోడ వెలసిన శేషుఁడు
చాయమేని తళుకు వజ్రాల శేషుఁడు
మాయని శిరసులపై మాణికాల శేషుఁడు
యే యెడ హరికి నీడై యేఁగేటి శేషుఁడు
|
|
చ. 2: |
పట్టపు వాహనమైన బంగారు శేషుఁడు
చుట్టు చుట్టుకొనిన మించుల శేషుఁడు
నట్టుకొన్న రెండువేలునాలుకల శేషుఁడు
నెట్టన హరిఁబొగడ నేరుపరి శేషుఁడు
|
|
చ. 3: |
కదిసి పనులకె ల్లఁ గాచుకున్న శేషుఁడు
మొదల దేవతలెల్లా మొక్కే శేషుఁడు
అదె శ్రీవేంకటపతి కలమేలుమంగకును
పదరక యేపొద్దూ పానుపైన శేషుఁడు
|
|
రేకు: 0263-06 శ్రీరాగం సం: 03-366 వైరాగ్య చింత
పల్లవి : |
ఎక్కడి విరతి మాకు నిహమెల్లాఁ దగులు
మక్కళించి మక్కళించి మాయకింతాఁ దగులు
|
|
చ. 1: |
పుట్టినప్పుడే పాపపుణ్యములు దగులు
అట్టె దేహమున కన్నమూఁ దగులు
గట్టిగా నీరెండూనై తే కర్మమూఁ దగులు
యెట్టునుఁ బోరాదు మాయకింతాఁ దగులు
|
|
చ. 2: |
మనికి సంసారియైతే మమతలుఁ దగులు
పెనగఁగఁ బెనగఁగా బిడ్డలూఁ దగులు
అనువై యీలంపటాన కాసలెల్లాఁ దగులు
మన సొక్కటొక్కటై మాయకింతాఁ దగులు
|
|
చ. 3: |
అరయ శ్రీవేంకటాశుఁ డాత్మలోనే తగులు
శరణన్నవారికి విజ్ఞానము దగులు
గరిమ నిందువల్లనే ఘన మోక్షమూఁ దగులు
మరిగినప్పుడే సుమ్మీ మాయకింతాఁ దగులు
|
|