తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 224
రేకు: 0224-01 దేసాక్షి సం: 03-132 పోలికలు
పల్లవి:
జాలి మోహినీగజము సంసారమిది
లోలుఁడఁ గాకపోదు లోకము సహజము (?)
చ. 1:
నేరమెల్లా జీవునిది నేరుపెల్లా దేవునిది
దారదప్పి విఱ్ఱవీఁగఁ దనకేల
కారణ మాతఁడు దాఁ గార్యమాత్ర మింతే
శూరుఁడై రెంటాఁ జొరక చూచుటే సుఖము
చ. 2:
ప్రకృతి కాతుమ దాను పరమాత్ముఁ డాతఁడు
తకపికలై మురియఁ దనకేల
సకలము నాతఁడు సత్తామాత్రము దాను
వొకటీఁ గోరక వూరకుండుటే సుఖము
చ. 3:
సేవించఁ దనకుఁ గద్దు శ్రీవేంకటేశుఁ డాతఁడు
దావతిఁ గర్మపుఁబాటు తనకేల
శ్రీవిభుఁ డాతఁడు దాను చేతన మాత్ర మింతే
కేవల మాతనివాఁడై గెలుచుటే సుఖము
రేకు: 0224-02 నాట సం: 03-133 రామ
పల్లవి:
బాపుబాపు రాఘవ నీ ప్రతాపమేమని చెప్ప
పైపై నీపేరు విని పారేరు రాకాసులు
చ. 1:
వాలినెత్తురు నీటను వాఁడి పదనిచ్చినమ్ము
కూలిచె నొక్కమాటునఁ గుంభకర్ణుని
యీలకొని మాయామృగ మెమ్ముల నొరసినమ్ము
రాలించె నుత్తరగోపురముపై గొడగులు
చ. 2:
తొడికి మింటి తాపలు తుంచి దూప దాఁకినమ్ము
జడధి మరుదేశాల జల మింకించె
యెడయక కౌశికుని యజ్ఞము గాచినమ్ము
అడరి రావణుని పూర్ణాహుతిగఁ జేసెను
చ. 3:
బెరసి యే పొద్దును నీ పిడికిటిలోనియమ్ము
సురల భయముఁ బాపి సూటికెక్కెను
ఇరవై శ్రీవేంకటాద్రి నిటు రామచంద్రుఁడవై
పరగఁగ నీయమ్ము పగయెల్ల నీఁగెను
రేకు: 0224-03 లలిత సం: 03-134 శరణాగతి
పల్లవి:
పలుమారు వాదమేల పంతమేమి వచ్చె నీకు
చలమో ఫలమో సాధించుకోరయ్యా
చ. 1:
ధరమీఁదఁ జేయఁబోతే తగు పుణ్యములు లేవా
హరిదాసుఁడయ్యే పుణ్యమందుటఁ గాక
సురలు బ్రహ్మాదులును చూడఁగా నే పొడవున
తిరమై యున్నారో తెలుసుకోరయ్యా
చ. 2:
మాపుదాఁకా సలిగెలు మహిమలు లేవా
శ్రీపతిదాసులై యంత చెల్లదుఁ గాక
చేపడిన మాత్రమున చేటులేని పదవుల
యేపున నెవ్వరున్నారో యెరుఁగరయ్యా
చ. 3:
యేవలఁ గొలువఁబోతే నెందరు దైవాలు లేరు
శ్రీవేంకటేశువలె రక్షించరుఁ గాక
కోవరమై యేఁటనేఁటాఁ గోరి వరములకుఁగా
కావించి పరుష వచ్చేకత చూచుకోరయ్యా
రేకు: 0224-04 శుద్ధవసంతం సం: 03-135 అధ్యాత్మ
పల్లవి:
నగుఁబాట్లకు లోనై నడచుఁగాక
అగపడి పరసుఖమందఁబోయీనా
చ. 1:
కడిగేది వొకచేత కష్టమే దినదినము
కుడిచేది వొకచేతఁ గోరినవెల్లా
యెడయక తన సిగ్గు యెరఁగని యీ దేహి
అడరి హరిమహిమల వెరిఁగీనా
చ. 2:
వొద్దనుండి రాతిరెల్లా వొడలేమి నెరఁగఁడు
పొద్దు వొడచినమీఁద భోగమే కోరు
కొద్దిమాలినట్టి తనఘోరము విచారించఁడు
సుద్దులైన హరిభక్తి సోదించీనా
చ. 3:
అనుభవించేది నిచ్చా నంగనల మాంసమే
అనిశము సేయఁబొయ్యే వాచారములే
తనివోక మనసులో తనవెఱ్ఱి గానఁడు
ఘనుఁడు శ్రీవేంకటేశుఁ గానబొయ్యినా
రేకు: 0224-05 దేవగాంధారి సం: 03-136 పోలికలు
ధర్మాధర్మము లాల దైవము లాల
నిర్మిత మాతఁడే కాని నే నేమీ నెఱఁగ
చ. 1:
పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను
నెట్టన నున్న పనులు నే నెఱఁగ
వెట్టివాఁడ నేనింతే విష్ణుఁడు నా కేలికె
చుట్టిన నడుమంత్రాల సుద్దులూ నెఱఁగ
చ. 2:
లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను
చేకొని కర్మములలో చేఁతలెరఁగ
సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుఁడాతఁడు
దాకొని నేఁ దలఁచేటి తలఁపూ నెఱఁగ
చ. 3:
అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ
పంతాన నాలోపలి భావ మెరఁగ
యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటివాఁడ నేను
చెంతల నానందమిది చెప్పనేమీ నెఱఁగ
రేకు: 0224-06 శంకరాభరణం సం: 03-137 శరణాగతి
పల్లవి:
పట్టి పిసుక నిఁక బనిలేదు
గుట్టు దెలిసితే గులగులలు
చ. 1:
ఆలకించితే నంతా హేయమె
సోలి భోగములు సుజ్ఞానికి
మేలు దెలుసుకొని మెచ్చెదమంటే
నాలికెఁ గడచితే నరకములు
చ. 2:
యెంచి చూచితే నింతా నెరవె
పొంచి ప్రపంచము పుణ్యునికి
దించక తిరిగే తిమ్మటలన్నియు
అంచల వెఱ్ఱుల అలమటలు
చ. 3:
పట్టినదెల్లా బ్రహ్మానందమె
గట్టిగ శరణాగతునికిని
యిట్టె శ్రీవేంకటేశు కరుణ నిఁక
పుట్టినప్పుడే భోగ్యములు