తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 223


రేకు: 0223-01 సామంతం సం: 03-126 అధ్యాత్మ

పల్లవి:

ఒడఁబడఁ గదవో వో మనసా
పెడరేఁచి యతఁడే పెనఁగీఁ గాక

చ. 1:

అంతయుఁ జూచిన హరి సంకల్పమే
చింతలు సిలుగులు జీవులవి
భ్రాంతిపట్టి యిఁకఁ బదరఁగ నేఁటికి
చెంత నతఁడు దయసేసీఁ గాక

చ. 2:

ఘన విశ్వకుటుంబిని (?) కమలాక్షుఁడే
జననమం (మా?)త్రములే జంతులవి
గొనకొని యిందుకుఁ గోరిక లేఁటికి
వొనరించి యతఁడె వొసగీఁగాక

చ. 3:

సిరు లందించఁగ శ్రీవేంకటేశుఁడు
పరగు భోగములె ప్రాణులవి
మరుగక యీమేలు మఱవఁగ నేఁటికి
గరిమ నీతఁ డెపుడు గలిగీఁగాక


రేకు: 0223-02 దేవగాంధారి సం: 03-127 అన్నమయ్య స్తుతి

పల్లవి:

అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను
మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా

చ. 1:

నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక-
అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య
పన్ని యాతనినే చూచి పాతకులమైన మమ్ము
మన్నించవయ్య వో మధుసూదనా

చ. 2:

సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్ళపాకన్నయ్య
అంకెల నీసన్నిధినే అదిగోవయ్య
అంకించి నే వారివాఁడనని దుష్టుడనైనా నా-
సంకె దీరఁ గావవయ్య సర్వేశ్వరా

చ. 3:

పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు
ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య
యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను
నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా


రేకు: 0223-03 సాళంగనాట సం: 03-128 శరణాగతి

పల్లవి:

తప్పదు యీయర్థము ధరణిలోన
వొప్పుగ యేకచిత్తాన నుండవచ్చు నిఁకను

చ. 1:

కాకాసురు దోషము కడకుఁ బరిహరించి
చేకొంటివి శరణంటే చేరి మగుడ
యీకడ మా నేరములు యింతకంటే నెక్కుడా
నీకే నే శరణంటి నీవు మమ్ముఁ గాతువు

చ. 2:

అమ్మున వేసినవాఁడు అట్టె దండము వెట్టితే
నిమ్ముల నిహపరము లిచ్చితివి
యెమ్మెల మావంకనై తే నింతేసిచేఁతలు లేవు
నెమ్మి నీకే మొక్కితిమి నీవే మమ్ముఁ గాతువు

చ. 3:

పరులఁ గొలిచి వచ్చి ప్రాణాచారాలు పడితే
సిరుల వరాలిచ్చేవు శ్రీవేంకటేశా
వొరులఁ గొలువము నే మొగి నీ పాదాలే నమ్మి
నిరతిఁ గొలిచితిమి నీవే మమ్ముఁ గాతువు


రేకు: 0223-04 కాంబోది సం: 03-129 అధ్యాత్మ

పల్లవి:

ఏడ పెద్దల మెట్టైతిమో మరి
తోడనే నవ్వేము దొరకొని మమ్మును

చ. 1:

పంచేంద్రియములఁ బట్టగ లేమట
యెంచఁగ వివేక మెన్నటికీ
అంచెల మమతల నణఁచఁగలేమట
పొంచిన బుద్దులు భువి నెన్నటికి

చ. 2:

వెడవెడ నాసలు విడువఁగ లేమట
యెడయని ధైర్యం బెన్నటికి
తొడుసగు బంధముఁ దుంచఁగ లేమట
బెడిదపు తనలో బిరుదెన్నటికి

చ. 3:

కామక్రోధములఁ గడవఁగ లేమట
యీమానుషములు యెన్నటికి
కామించ శ్రీవేంకటపతి గలఁడట
నేమపుతపముల నే మెన్నటికి


రేకు: 0223-05 లలిత సం: 03-130 అధ్యాత్మ

పల్లవి:

ఇదిగాన తన ధర్మ మించుకా వదలరాదు
వుదుటున హరివారై వుండవలెఁగాని

చ. 1:

జాతిచండాలము దీరు జన్మాంతరములను
యేతులఁ గర్మచండాల మెన్నఁడూ బోదు
యీతల స్వర్గము చొరనియ్యకుండఁగాఁ ద్రిశంకుఁ-
డాతలఁ దాఁ బ్రతి స్వర్గమందు నున్నాఁ డదివో

చ. 2:

ఆస్తికులయినవారు అట్టె రామునిఁ గూడిరి
నాస్తికు లసురకుఁ బ్రాణము లిచ్చిరి
ఆస్తికనాస్తికుఁడై తా నం దెవ్వరివాఁడూఁ గాక
కస్తిఁబడి వాలి వృథాకలహానఁ బొలిసె

చ. 3:

యింక నొక్కటి గలదు యెదుటనే వుపాయము
అంకెల శ్రీవేంకటేశుఁడందే వున్నాఁడు
సంకెదీర నీతనికి శరణుచొచ్చి వరాలు
పొంకముగాఁ జేకొనేరు భూ జనులు నేఁడును


రేకు: 0223-06 శంకరాభరణం సం: 03-131 నామ సంకీర్తన

పల్లవి:

నలినాక్ష నీకు నమస్కరించిన-
ఫలము వొగడ నిఁక బ్రహ్మకు వశమా

చ. 1:

పూర్వదోషములఁ బోఁదోలి మఱియు
సర్వాపచారము క్షమియించి
గర్విత మదముల కసటు వాపి నను
నిర్వహించె నిదె నీనామము

చ. 2:

నేఁడునుఁ జేసిన నేరము లణఁచి
వేఁడి కర్మముల విడిపించి
వాఁడి దుఃఖముల పడిఁ బరిహరించె
నాఁ డెఱఁగఁగ నీ నామము

చ. 3:

వుమ్మడి సుఖముల నొనరించీ మాకు
సమ్మతి శుభములు జయమొసఁగీ
యిమ్ముల శ్రీవేంకటేశ్వర యిదివో
నెమ్మది రక్షించె నీనామము