తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 215
రేకు: 0215-01 గుజ్జరి సం: 03-085 వైరాగ్య చింత
పల్లవి:
ఎన్నఁడు మానవు యీ దుర్గుణములు యేది అవుషదము యిందుకును
కన్నులఁ జూచుచుఁ జెవుల వినుచు నేఁగనియు వినియునిదె కష్టుఁడనయ్యా నేను
చ. 1:
హృదయము లోపల దేవుఁడుండఁగా నెఱఁగక భ్రమయుచుఁ గన్నచోటనే
వెదకియుఁ గానక అనుమానించేటి వేఁదురనయ్యా నేను
చెదరిన జననము దుఃఖరూపమని చెప్పగ విని యది సుఖమని కోరుచు
మది దీపము వట్టుక నూతఁబడిన మత్తునివలెనయ్యా నేను
చ. 2:
పరమగురువులదె భక్తిమార్గమిటు ప్రాణులకెల్లనుఁ బెట్టి వుండఁగా
విరసపు టింద్రియమార్గములఁ దిరుగు వీరిడినయ్యా నేను
దరి చేర్పఁగ హరినామము గలిగియు దైన్యము నొందితి సంసారములో
పరుసము చేతఁబట్టుక తిరిసేటి భ్రాంతునివలెనయ్యా నేను
చ. 3:
శ్రీవేంకటపతి యెదుట నుండఁగా సేవింపఁగ సంసారములోపల
దావతిఁ బొరలుచు వేపరుచుండేటి తగని జడుడనయ్యా నేను
కైవశమై యీ దేవుఁడే యిటు ననుఁ గరుణింపుచు రక్షింపుచునుండఁగ
పూవునుఁ బరిమళమును వలనే నే పొదలుచునుండెదనయ్యా నేను
రేకు: 0215-02 దేవగాంధారి సం: 03-086 వైరాగ్య చింత
పల్లవి:
ఎంతగాలమునకైనా యా యర్థమే కలది
యింతటిలోననే హరి నెరఁగఁగవలయు
చ. 1:
యెంచి నూరేండ్లమీఁద యెప్పుడో మరణము
ముంచి యిట్టే మోచీనదె మురికిడొక్క
యించుకంత యిందుకుఁ గానేల కోరెమో సుఖము
కాంచన మెవ్వరికిఁగా గడియించేమో
చ. 2:
కలిగిన దినములు కాఁపురానకే సెలవు
తలఁపెల్ల నాసలకంతటఁ గొలఁది (?)
ఫల మిందు నేమిగద్దో ప్రాణి ఇందేమిటివాఁడో
తెలిసి పాపఁగలేము తీరని యీ చిక్కు
చ. 3:
సేసిన కర్మము లెల్లా చెప్పరాని మోపులాయ
రాసికెక్కి యింద్రియాల పరమాయను
వేసరి యిన్నిటికి శ్రీవేంకటేశుఁ గొలిచితి
మాసినదే మణుఁగాయ మాకు నేది జన్మము
రేకు: 0215-03 సాళంగనాట సం: 03-087 అధ్యాత్మ
పల్లవి:
ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె
పన్ని పరుల జెప్పఁగఁ జోటేది
చ. 1:
కుందని నీరోమకూపంబులలో
గొందుల బ్రహ్మాండకోట్లట
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో
యిందుఁ బరులమని యెంచఁగనేది
చ. 2:
నీ కొనచూపున నెఱిఁ గోటిసూర్యు-
లేకమగుచు నుదయింతురటా
నీ కాయమెంతో నీ వునికేదో
నీకంటెఁ బరులని నిక్కఁగనేది
చ. 3:
జీవకోటి నీ చిన్నిమాయలో
ప్రోవులగుచు నటు పొడమెనటా
శ్రీవేంకటేశ్వర చెప్పఁగ నీవెంతో
ఆవలఁ బరులకు నాధిక్యమేది
రేకు: 0215-04 బౌళి సం: 03-088 వైరాగ్య చింత
పల్లవి:
ఎన్నఁడు నే నిఁక బుద్ధెరిఁగేది యీశ్వర నిను నేఁ దగిలెడిది
విన్నప మిదియే నీకే భారము వీని గెలువ నా వసమౌనా
చ. 1:
తగిలెడి నీ నయనేంద్రియములు తగఁ జూచినయందెల్లను
తగిలెడి నీ శ్రవణేంద్రియములు తగిన లోకవార్తలకెల్లా
మగుడఁగ నేరవు జన్మజన్మముల మనసు వీనికే సహాయము
తెగ వెన్నటికిని యింద్రియసంపద తీగెలు సాగుచు నొకటొకటి
చ. 2:
యెక్కెడిని నానాఁటికి మదమెంతైనా నజ్ఞానమున
యెక్కెడి నీసంసారమే హరి యెదుటనే మత్తాయి గొన్నట్లు
చిక్కడెంతయిన మోక్షమార్గమున జీవుఁడిందుకే లోలుఁడు
దిక్కమెకమువలెఁ గిందికి మీఁదికిఁ దిప్పెడిఁ గర్మము దేహమును
చ. 3:
మెఱయుచుఁ బెరిగెడి నీయాసలు గడు మీఁదమీఁద లంపటమగుచు
మఱియునుఁ బెరిగెడి పుణ్యపాపములు మలసిరాసులై పెక్కగుచు
యెఱఁగను శ్రీవేంకటేశ్వర యెంతో ఇఁక నా లోపలి దుర్గణములు
మఱఁగుచొచ్చితిని నేనిన్నాళ్లకు మరి నాభాగ్యము నీచిత్తము
రేకు: 0215-05 సామంతం సం: 03-089 అధ్యాత్మ
పల్లవి:
దేవా నీమాయ తెలియనలవి గాదు
భావభేదముల భ్రమసితిని
చ. 1:
జననం బొకటే జంతుకుల మొకటే
తనువికారములే తగఁ బెక్కు
దినములు నివియే తివిరి లోకమిదె
పనులే వేరయి పరగీని
చ. 2:
మాఁటలు నొకటే మనసులు నొకటే
కోటులసంఖ్యలు గుణము లివి
కూటము లిట్లనె గురిఁ గాముఁ డొకఁడె
మేటి వలపులకె మేరలే లేవు
చ. 3:
జ్ఞాన మొకటే యజ్ఞానము నొకటే
నానామతములు నడచీని
ఆనుక శ్రీవేంకటాధిప నీకృప
తానే మమ్మిటు తగఁ గాచీని