తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 214
రేకు: 0214-01 ధన్నాసి సం: 03-079 వైరాగ్య చింత
పల్లవి:
కటకటా యేమిటాను కడవర గానఁడిదే
నిటలపు వ్రాఁత యెట్టో నిజము దెలియదు
చ. 1:
బాదల సంసారము పరవంజుకొని తొల్లి
యేది నమ్మి పాటువడె నీ జీవుఁడు
గాదెల కొలుచుగాఁగఁ గట్టుకొని కర్మములు
యేదెస చొచ్చీనో కాని యీ ప్రాణి
చ. 2:
కాఁపురమై తమ తల్లి కడుపున వచ్చి పుట్టె
యే పని గలిగెనో యీ దేహి
కాపాడీ నిక్షేపాలు కడునాసతోఁ బాఁతి
యే పదవిఁ దానుండునో యీ జంతువు
చ. 3:
దవ్వుల యమబాదలు దలఁచి వెరవఁడిదె
యెవ్వరి సలిగెనమ్మో యీ జీవి
రవ్వగా శ్రీవేంకటాద్రిరాయఁడు మన్నించఁగాను
యివ్వల బతికెఁగాక యెవ్వఁడోయి తాను
రేకు: 0214-02 కాంబోది సం: 03-080 అధ్యాత్మ
పల్లవి:
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది
యివ్వల విచారించవే ఇందిరారమణా
చ. 1:
వెంటఁబెట్టి కామక్రోధవితతులు చుట్టి నన్ను
తొంటి మీ పేవకు నన్ను దూరము సేసె
కంటకపుటింద్రియాలు కడు హితశత్రులై
అంటిన మోక్షముత్రోవ నంటకుండాఁ జేసెను
చ. 2:
తిప్పితిప్పి నాయాసలు తెగి వైష్ణవధర్మానఁ
దెప్పలఁ దేలకుండాను తీదీపు సేసె
వొప్పగు సంసారమిది వున్నతి నాచార్యసేవ
చొప్పు మాపి పుణ్యానకుఁ జొరకుండాఁ జేసెను
చ. 3:
మచ్చరపు దేహమిది మనసిట్టే పండనీక
తచ్చి యజ్ఞానమునకుఁ దావుసేసె
ఇచ్చల శ్రీవేంకటేశ ఇంతలో నన్ను నేలఁగ
నిచ్చలు నీకృపే నన్ను నిర్మలము సేసెను
రేకు: 0214-03 దేసాళం సం: 03-081 శరణాగతి
పల్లవి:
అనంతమహిముఁడవు అనంతశక్తివి నీవు
యెనలేని దైవమా నిన్నేమని నుతింతును
చ. 1:
అన్నిలోకములు నీయందు నున్నవందురు నీ-
వున్నలోక మిట్టిదని వూహించరాదు
యెన్న నీవు రక్షకుఁడ విందరిపాలిటికి
నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును
చ. 2:
తల్లివి దండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు
యెల్లగా నీతల్లిదండ్రు లెవ్వరందును
యిల్లిదె వరములు నీ విత్తు విందరికిని
చెల్లఁబో నీకొకదాత చెప్పఁగఁ జోటేది
చ. 3:
జీవుల కేలికవు శ్రీవేంకటేశుఁడవు నీ-
వేవలఁ జూచిన నీ కే యేలికే లేఁడు
వేవేలు మునులును వెదకేరు నిన్నును
నీవెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి
రేకు: 0214-04 శ్రీరాగం సం: 03-082 శరణాగతి
పల్లవి:
పాటించి నమ్మినవారి భాగ్యము గాదా
కోటిసుద్దులేల యిదె కోరి చేకొనేది
చ. 1:
స్వామిద్రోహియైన చండి రావణాసురుఁడు
కామించి శరణంటేను కాచేనంటివి
యేమని నీదయ యెంతు నెంతని నీమహిమెంతు
ఆమాటకు సరియౌ నఖిలవేదములు
చ. 2:
దావతి సీతాద్రోహము దలఁచి కాకాసురుఁడు
కావుమని శరణంటేఁ గాచితివి
ఆవల నీపని యెట్టు అట్టే నీమన్నన యెట్టు
యీవల నీశరణనే ఇందుసరే తపము
చ. 3:
చిక్కులిన్నీ నిఁకనేల చేరి యేపాటివాఁడైన
గక్కన నీశరణంటేఁ గాతువు నీవు
అక్కరతో నిన్ను శరణంటిమి శ్రీవేంకటేశ
యెక్కువ నీ బిరుదుకు యీడా పుణ్యములు
రేకు: 0214-05 పాడి సం: 03-083 వైరాగ్య చింత
పల్లవి:
నేఁడు దప్పించుకొంటేను నేరుపున్నదా
పేడుక(???) భోగించు తానే పెనఁగఁ జోటున్నదా
చ. 1:
తనువు మోచిననాఁడే తప్పులెల్లాఁ జేసితిని
వెనక మంచితనాలు వెదకనేది
ననిచి సంసారినైననాఁడే నిష్టూరాన కెల్ల
మునుప నే గురియైతి మొరఁగఁ జోటున్నదా
చ. 2:
సిరులు చేకొన్ననాఁడడే సిలుగెల్లా గట్టుకొంటి
తరవాతి పనులింకఁ దడవనేల
నరలోకము చొచ్చిననాఁడే పుణ్యపాపముల-
పొరుగుకు వచ్చితిని బుద్ధులింక నేల
చ. 3:
వూపిరి మోచిననాఁడే వొట్టికొంటి నాసలెల్లా
మాపుదాఁకా వేసరిన మానఁబొయ్యీనా
యేపున శ్రీవేంకటేశుఁడింతలో నన్నుఁ గావఁగా
పైపై గెలిచితిఁగాక పంతమాడఁగలనా
రేకు: 0214-06 దేసాళం సం: 03-084 వైరాగ్య చింత
పల్లవి:
ఇన్ని దేహములఁ బుట్టి యేమి గంటిమి
వున్నతపు హరిదాస్య మొక్కటే కాక
చ. 1:
హీనజంతువైననాఁడు యేనుగై పుట్టిననాఁడు
ఆనంద మొక్కటే అంగాలే వేరు
యీ నేటి యజ్ఞానము యీ జీవుల కొక్కలాగే
జ్ఞానమే యెక్కుడుఁ గాక సరిలేని దొకటే
చ. 2:
నరలోకభోగానకు నరకానుభవానకు
సరేకాని మిగులదు చనెఁ దొల్లె (?)
గరిమ నేర్పడ నందు ఘనమేమి కొంచమేమి
హరిదాసుఁడై బ్రదుకుటదియే లాభము
చ. 3:
బాలుఁడైన యప్పుడూను పండి ముదిసినప్పుడు
కాల మొక్కటే బుద్ధి కడు లేదు
ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి
యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము