తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 391


రేకు: 0391-01 రామక్రియ సం: 04-526 కృష్ణ

పల్లవి:

వీఁడివో కొలువున్నాఁడు విట్ఠలేశుఁడు
మూఁడు మూర్తుల తేజపు మూల మీతఁడు

చ. 1:

పంతముతో పాండవపక్షపాతి యీతఁడు
వింతలేని విదురునివిందు యీతఁడు
మంతు కెక్కిన ద్రౌపదీ మాన రక్షకుఁడీతఁడు
చెంతనే వుద్ధపు పాలి చింతామణి యీతఁడు

చ. 2:

మంద గొల్లెత లకెల్లా మంగళసూత్ర మీతఁడు
కందువ నక్రూరుని భాగ్యం బీతఁడు
నంద గోప యశోదల నవ నిధాన మీతఁడు
అందపు రుక్మిణీ మనోహరుఁ డీతఁడు

చ. 3:

దేవకీ వసుదేవుల దివ్యపద వీతఁడు
భావింప నందరి పర బ్రహ్మ మీతఁడు
కైవశమై దాసులకు కల్ప వృక్ష మీతఁడు
శ్రీ వేంకటాద్రి మీఁదిశ్రీ పతి యీతఁడు


రేకు: 0391-02 లలిత సం: 04-527 నృసింహ

పల్లవి:

ఈతని మహిమలు యెంతని చెప్పెద
చేతులమొక్కెదఁ జెలఁగుచు నేను

చ. 1:

శ్రీ నరసింహుడు చిన్మయమూరితి
నానావిధకరనఖరుఁడు
దారుణ దైత్య విదారుఁడు విష్ణుఁడు
తానకమగు మా దైవంబితఁడు

చ. 2:

అహోబలేశుఁడు ఆదిమ పురుషుఁడు
బహు దేవతా సార్వభౌముఁడు
సహజానందుఁడు సర్వ రక్షకుఁడు
యిహ పరము లోసఁగు యేలిక యితఁడు

చ. 3:

కేవలుఁడగు సుగ్రీవ నృసింహుఁడు
భావించ సుజన పాలకుఁడు
శ్రీ వేంకటేశుఁడు చిత్తజ జనకుఁడు
వేవేలకు నిలువేలుపు యితఁడు


రేకు: 0391-03 సాళంగనాట సం: 04-528 హనుమ

పల్లవి:

పెరిగినాఁడు చూడరో పెద్ద హనుమంతుఁడు
పరగి నానా విద్యల బలవంతుఁడు

చ. 1:

రక్కసుల పాలికి రణరంగ శూరుఁడు
వెక్కసపు యేకాంగ వీరుఁడు
దిక్కులకు సంజీవి దెచ్చిన ధీరుఁడు
అక్కజమైనట్టి యాకారుఁడు

చ. 2:

లలి మీరిన యట్టి లావుల భీముఁడు
బలు కపికుల సార్వభౌముఁడు
నెలకొన్న లంకానిర్ధూమధాముఁడు
తలంపున రామునాత్మారాముఁడు

చ. 3:

దేవకార్యముల దిక్కు వరేణ్యుఁడు
భావింపఁగఁ దపః ఫల పుణ్యుఁడు
శ్రీ వేంకటేశ్వరు సేవాగ్రగణ్యుఁడు
సావధానుఁడు సర్వ శరణ్యుఁడు


రేకు: 0391-04 దేసాక్షి సం: 04-529 కృష్ణ

పల్లవి:

వెన్న ముద్ద కృష్ణుఁడు వేవేల చేఁతల వాఁడు
పిన్నవాఁడై వున్నవాఁడు బిరుదైన బాలుఁడు

చ. 1:

బాలెంత చన్ను గుడిచి బండి విరురఁగఁ దన్ని
గాలి రక్కసుని ములుగఁగ మోఁది
రోలఁగట్టువడి యట్టె రూఢిగా మద్దిమాఁకులఁ
గూల దొబ్బె తొల్లి వీఁడె గుట్టు తోడి బాలుఁడు

చ. 2:

కొండ గొడుగుగఁ బట్టి గోకులమునెల్లఁ గాచి
మెండగు గొల్లెతలతో మేల మాడి
అండనే నోరు దెరచి యశోదకు లోకములు
దండిగాఁ జూపె నితఁడె దంటయైన బాలుఁడు

చ. 3:

పరమేష్ఠికి మారొడ్డి పసి బాలకులఁ దెచ్చి
ధరఁ బదారు వేలు కాంతలఁబెండ్లాడి
ఇరవై శ్రీ వేంకటాద్రి నిందరికి వరాలిచ్చి
సిరితో వెలసె నిదే చెలువపు బాలుఁడు


రేకు: 0391-05 నాట సం: 04-530 రామ

పల్లవి:

అదె వచ్చె రాఘవుఁ డాతని దాటి ముట్టె
యెదిరించరాదు మీకు నేది దెరు విపుడు

చ. 1:

భువిలోన రాముఁడై పుట్టెనట విష్ణుఁడు
అవల మీకు దిక్కేది యసురలాల
తివిరి మిమ్ము వెదకె దివ్య బాణాలాతనివి
రవళి నెందు చొచ్చేరు రాకాసులాల

చ. 2:

చలపట్టి కొండలచే సముద్రము గట్టెనట
తల చూపరాదు మీకే దైత్యులాల
వలగొని దేవతలు వానరులై వచ్చిరట
నిలువరా దిఁక మీకు నిశాచరులాల

చ. 3:

రావణుఁ జంపెనట రణములోఁ జిక్కించుక
దావతిఁ బారరో మీరు దానవులాల
యీ వేళ శ్రీ వేంకటేశుఁడితడే విభీషణుని
లావున శరణనరో లంకావాసులాల


రేకు: 0౩91-06 గుజ్జరి సం: 04-531 దేవుడు-జీవుడు

పల్లవి:

ఏలికె చెప్పినపని కెదురాడేనా
నీలీల లివియని నిండుకుండే నేను

చ. 1:

నీవు నాలోనున్నాఁడవు నే నున్నాఁడ సముఖాన
కావరపుటింద్రియాలు కాకు సేసీని
దేవర నీయప్పణో తెలియనానతీ నాకు
ఆవిధమైతేనే అపరాధము లేదు

చ. 2:

జగదీశుడవు నీవు శరజాగతుఁడ నేను
జిగి గామ క్రోధాలేల చిమ్మిరేఁచీని
నగుతా నప్పగించేవో నాకది గాదన రాదు
తగునిట్లానే యైతే తప్పులేదు మాకును

చ. 3:

పుట్టించేవాఁడవు నీవు పుట్టుగులు నాసొమ్ము
చుట్టి సుఖదుఃఖా లేల సూడువట్టీని
నెట్టన శ్రీవేంకటేశ నీనటనో మంచిదాయ
యిట్టయితే మావంక నిఁక నేరమి లేదు