తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 390


రేకు: 0౩90-01 మాళవిగౌళ సం: 04-520 రామ

పల్లవి:

రాముఁడు లోకాభిరాముఁ డుదయించఁగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను

చ. 1:

తటుకన మారీచు తలపైఁ బోయఁ గర్మము
కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకునఁ దెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను

చ. 2:

తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖర దూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిఁగె నంతటను

చ. 3:

పొరిఁ గుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చె
మరలి గండము దాఁకె మండోదరికి
పరగె నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీ వేంకటేశుచేఁతలెల్లా దక్కెను


రేకు: 0390-02 సాళంగనాట సం: 04-521 నృసింహ

పల్లవి:

జయము జయము ఇఁక జనులాల
భయములు వాసెను బ్రదికితి మిపుడు

చ. 1:

ఘన నరసింహుఁడు కంభమున వెడలె
దనుఁజులు నమసిరి ధర వెలసె
పొనిఁగె నధర్మము భూభారమడఁగె
మునుల తపము లిమ్ముల నీడేరె

చ. 2:

గరిమతో విష్ణుఁడు గద్దెపై నిలిచె
హిరణ్య కశిపుని నేపడఁచె
అరసి ప్రహ్లాదుని నన్నిటా మన్నించె
హరుఁడును బ్రహ్మయు నదె కొలిచేరు

చ. 3:

అహోబలేశుఁడు సిరి నంకమున ధరించె
బహుగతి శుభములు పాటిల్లె
యిహపరము లొసఁగె నిందును నందును
విహరించెను శ్రీవేంకటగిరిని


రేకు: 0390-03 రామక్రియ సం: 04-522 నృసింహ

పల్లవి:

గరుడాద్రి వేదాద్రి కలిమి యీపె
సిరులొసఁగీఁ జూడరో చింతామణి యీపె

చ. 1:

పాల జలధిఁ బుట్టిన పద్మాలయ యీపె
లాలిత శ్రీ నరసింహులక్ష్మి యీపె
మేలిమి లోకమాతయై మించిన మగువ యీపె
యీ లీల లోకములేలే యిందిర యీపె

చ. 2:

ఘన సంపద లొసఁగు కమలాకాంత యీపె
మనసిజుఁ గనిన రమాసతి యీపె
అనిశమఁ బాయని మహా హరి ప్రియ యీపె
ధన ధాన్య రూపపు శ్రీ తరుణి యీపె

చ. 3:

రచ్చల వెలసినట్టి రమా వనిత యీపె
మచ్చిక గలయలమేల్ఁ‌మంగ యీపె
యిచ్చట వేంకటాద్రి నీ యహోబలమునందు
నిచ్చలూఁ దావు కొనిన నిధాన మీపె


రేకు: 0390-04 సామంతం సం: 04-523 రామ

పల్లవి:

సమసె రావణుఁడు సమరములోపల
అమరులు కడు ముదమందిరి మెరసి

చ. 1:

బెరగిరి రాముని శరముల కసురలు
సురిగిరి పోట్లచురుకునను
తొరిగిరి నెత్తుటఁ దునియలు సేసిన
తిరిగిరి తరుమఁగ దిక్కులకు

చ. 2:

కూలిరి భల్లూకుల ఘోషములకు
వాలిరి వాయుజవాలహతి
వీలిరి యంగదు వివిధనాదముల
తూలిరి సుగ్రీవు దోర్బలమునను

చ. 3:

దాఁగిరి లక్ష్మణు దాకకు నులుకుచు
వీఁగిరి వనచర వితతికిని
పాఁగి శ్రీ వేంకటపతి కృపా రసమునఁ
దోఁగిరి జనులు సంతోసంబునను


రేకు: ౦౩9౦-05 శంకరాభరణం సం: 04-524 నృసింహ

పల్లవి:

ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాద వరదుఁడు
యేదెనఁ జూచినా దానె యీతఁడిది దేవుఁడు

చ. 1:


నవ్వుల మోము తోడ నరసింహ రూపు తోడ
జవ్వని తొడ మీఁదట సరస మాడ
పువ్వుల దండలు యిరు బుజాలపై వేసుకొని
వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు

చ. 2:

సంకుఁ జక్రములతోడ జమళి కోరల తోడ
అంకెలఁ గటియభయహస్తా లెత్తి
కంకణాలహారాలతో ఘన కిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపానఁ బొదిలీ నీ దేవుఁడు

చ. 3:

నానా దేవతల తోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీ వేంకటాద్రి నహో బలము నందు
తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు


రేకు: 0౩90-06 బౌళిరామక్రియ సం: 04-525 హనుమ

పల్లవి:

వీఁడివో కలశాపుర వీరహనుమంతుడు
వాఁడిమి మెరసినట్టి వజ్రపాణి యితఁడు

చ. 1:

చలపట్టి జంగచాఁచి జలధి దాఁటినవాఁడు
తల కొన్న రాముని ప్రతాపపువాఁడు
యెలమి సీతకుంగరమిచ్చి మెప్పించినవాఁడు
కలగుండు వడ లంకఁ గాలిచినవాఁడు

చ. 2:

మగిడి రాఘవునకు మణి దెచ్చినట్టివాఁడు
గగనము మోచిన కాయమువాఁడు
మొగి సూర్యునిచే శాస్త్రములు చదివినవాఁడు
పగటున మీఁది బ్రహ్మ పట్టమేలే వాఁడు

చ. 3:

యిప్పుడూఁ బ్రాణముతోనే యిల దేవుఁడైనవాఁడు
చెప్పఁగొత్తైనమహిమ జెన్నొందువాఁడు
ముప్పిరి శ్రీ వేంకటేశు మూల బలమైన వాఁడు
వొప్పగు వరా లిందరి కొసగేటివాఁడు