తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 359
రేకు: 0359-01 లలిత సం: 04-345 శరణాగతి
పల్లవి:
నీవే కాచుటగాక నేరుపు నాయందేది
చేవల వేఁపమాను చేఁదు మానీనా
చ. 1:
వొరసి దుర్గుణములనుమానిన నాచిత్తము
మరలి మంచిగుణాన ముట్టుపడీనా
హరి నిన్నుఁ దలఁచక యడవిఁబడిన మరి (తి?)
దరిచేరి నిన్ను మతిఁ దలఁచఁబోయీనా
చ. 2:
పాలుమాలి యింద్రియాల బారిఁబడ్డ పుట్టువిది
ఆలరి వైరాగ్యసుఖ మందఁబోయీనా
నీలవర్ణ నినుమాని నిత్యసంసారైన నేను
కాలమందే నిన్నెరఁగఁ గలనా నేను
చ. 3:
గరిమ సుజ్ఞానము గలిగిన సాత్విక -
మరయ వేరొకచోట వణఁగీనా
యిరవై శ్రీవేంకటేశుఁడ నీకరుణబ్బె
శరణాగతుఁడ నాకు స్వతంత్రమా
రేకు: 0౩59-02 ముఖారి సం: 04-346 భగవద్గీత కీర్తనలు
పల్లవి:
ఇందుకు విరహితములిన్నయు సజ్ఞానమని
చందమున గీతలందుఁ జాటీనిదివో
చ. 1:
మానావమానములు మాని డంబు విడుచుట
పూని హింసకుఁ జొరక యోరుపు గలుగుటయు
ఆని మతిఁ గరఁగుట యాచార్యోపాసన
తానెప్పుడు శుచియౌట తప్పని విజ్ఞానము
చ. 2:
అంచల సుస్థిరబుద్ది యాత్మవినిగ్రహము
అంచితవిషయనిరహంకారాలు
ముంచినజన్మదుఃఖములు దలపోయుట
కంచపుసంసారము గడుచుటే జ్ఞానము
చ. 3:
అరిమిత్రసమబుద్ది యనన్యభక్తియు
సరినేకాంతమును సజ్ఞనసంగ విముక్తి
ధర నధ్యాత్మజ్ఞానతత్వము దెలియుట
గరిమలందుట శ్రీవేంకటపతి జ్ఞానము
రేకు: 0359-03 లలిత సం: 04-347 దశావతారములు
పల్లవి:
ధ్రువవరదునివలె తుదకెక్కుఁగాక మరి
యివల గర్మఫలంబు లేవైన సతమా
చ. 1:
కరి రాజ వరదునకు కడఁగి శరణంటేను
కరిఁగాచినట్లనే కాఁచుగాక
పరదైవముల కెంత భంగపడి మొక్కినా
అరసి రావణు కొసంగి నట్లనే కాదా
చ. 2:
శ్రీపతినే అడిగినను జిగి నజామిళువలె
చేపట్టి సిరుల రక్షించుఁగాక
ఆపోక కౌరవుఁడు హరిపరాజ్ముఖుఁడైన
పైపైనే సంపదలు పార్థుచేఁ బడవా
చ. 3:
శ్రీవేంకటేశుఁడిచ్చేయీవరంబులే
వోవలను ద్రిష్టమై యుండుఁగాక
భావించ నితరములు పరలోకములయందు
కైవశంబగు ననే కథల వలెఁగాదా
రేకు: 0359-04 బౌళి సం: 04-348 మాయ
పల్లవి:
ఏమిసేయుదు నింతయు నీ మాయ
సామజవరద నా చందమిది
చ. 1:
జలము లోపలనున్నచందురు నీడవలె
నలుగడలఁ గదలీ నా మనసు
పెలుచు మేఘములు గప్పిన సూర్యునివలె
వెలుఁగదు నాలోని విజ్ఞానము
చ. 2:
కడఁగి యాకసమున గాలి యణఁగినట్లు
వడిఁగానరాదు నా వైరాగ్యము
ముడిగి ముత్తెపుఁ జిప్పముత్యము విధంబున
జడిసీ నాలోని సాత్వికము
చ. 3:
యిప్పుడిట్టె శ్రీ వేంకటేశ నీ కృపవలె
వుష్పతిల్లె నిజభక్తి యొక్కటై నీపై
కప్పిన నీ సేవవలెఁ గన్న నిధానమువలె
అప్పసమై నిలిచె బ్రహ్మానందము
రేకు: 0359-05 బౌళిరామక్రియ సం: 04-349 శరణాగతి
పల్లవి:
ఎన్నఁడు నేఁగందు నిందు నిందిరాపతి నీవే
కన్ను లెదుటనుండి కరుణింతుగాక
చ. 1:
పొడమినయట్టై నిన్ను పొంచికొలిచేనంటే
కడు నాకప్పుడు వివేకము చాలదు
అడరి యంతటిమీఁదనైనాఁ దెలియఁబోతే
వడి జవ్వన మదము వశమిందుగాదు
చ. 2:
వెనక నేఁ బ్రౌడనై విరతిఁ బొందేనంటే
ధనవాంచ నేమియుఁ దడవనీదు
తనువు ముదిసి నీకుఁ దపముసేసేనంటే
వోనర నేమిటికి వోపికలేదు
చ. 3:
శ్రీ వేంకటేశ యీ సిలుగులఁబెట్టనేల
కైవశమై నీవు గలిగుండఁగా
నీవే కృపసేసి నేఁడిటుగావకున్న
పావనమైన యీ పదవెందుఁగద్దు
రేకు: 0359-06 సామంతం సం: ౦4-350 దశావతారములు
పల్లవి:
ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు
కందువ నిధానమవై కలవుగా నీవు
చ. 1:
అరసి ధ్రువుని గాచినట్టి వీవు
కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచిన నీవు
కరిరాజు శరణంటేఁ గాచిన నీవు
కరతలామలకమై కలవుగా వీవు
చ. 2:
గట్టిగా విభీషణుఁగాచిన నీవు
అట్టె ద్రౌపదిఁ గాచినప్పటి నీవు
చెట్టవట్టి బలిఁగాచిన నీవు నాకు
కట్టిన ముడుపవై కలవుగా నీవు
చ. 3:
కమ్మర సుగ్రీవునిఁ గాచిన నీవు నేఁడు
కిమ్ముల లోకములు రక్షించే నీవు
నెమ్మది శ్రీ వేంకట నిలయ నీవు మాకు
కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు