తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 358


రేకు: 0358-01 గుండక్రియ సం: 04-339 వైరాగ్య చింత

పల్లవి:

నాఁటకమింతా నవ్వులకే
పూఁటకుబూఁటకుఁ బొల్లైపోవు

చ. 1:

కోటివిద్యలునుఁ గూటికొఱకె పో
చాటువ మెలఁగేటి శరీరికి
తేటల నాఁకలిదీరినపిమ్మట
పాటుకుఁ బాటే బయలైపోవు

చ. 2:

మెఱసేటిదెల్లా మెలుఁతలకొరకే
చెఱలదేహములజీవునికి
అఱమరపుల సుఖమందినపిమ్మట
మొఱఁగుకుమొఱఁగే మొయిలై పోవు

చ. 3:

అన్ని చదువులును నాతనికొరకే
నన్నెరిఁగిన సుజ్ఞానికిని
యిన్నిట శ్రీవేంకటేశుదాసునికి
వెన్నెలమాయలు విడివడిపోవు


రేకు: 0358-02 గుండక్రియ సం: 04-340 శరణాగతి

పల్లవి:

ఎన్నిటికెన్నిటికని యెక్కడఁ దగిలెదము
మన్నించు దేవ మాకుఁజాలు

చ. 1:

ముఖరమై మాఁకులకు మొదలఁబోసిననీరు
శిఖలకుఁ దనువెక్కి చిగిరించినయట్టు
నిఖిలప్రయోజనాలు నీమూలమేకాన
మఖపతి మీసేవే మాకుఁజాలు

చ. 2:

వరుసలనిన్నిటా వన్నె బంగారమే
పరపరివిధముల పలుసొమ్ములైనట్లు
నిరతిఁ గర్మఫలాలు నీమూలమేకాన
మరుగురుఁడవు నీవే మాకుఁజాలు

చ. 3:

వెలయ శ్రీవేంకటేశ వివిధజంతువులకు
అలవిలేనిభూమే యధారమైనట్లు
నెలవు దేవతలకు నీవేలికవుగాన
మలసి నీశరణమే మాకుఁజాలు


రేకు: 0358-03 రామక్రియ సం: 04-341 మాయ

పల్లవి:

మాయలో మోహమున మరచితివిదే హరి
వేయింటికి వింటే వివేకమా

చ. 1:

అంతటికినొడయఁడు అఖిలజీవులలోన
అంతర్యామి శ్రీహరియట
యింతటిలో నీకు హితబంధువులు వేరి
వింతవారెవ్వరు నీకు వివేకమా

చ. 2:

అరయ నక్షరవాచి యతఁడట యిలలోనఁ
బరమమంత్రాలెపో పలుకులెల్ల
నిరతపునుతి యేది నిందయేది యిందులోన
వెరవెరఁగవుగాక వివేకమా

చ. 3:

మొదలను నడుమను ముగిసినర్థములందు
యెదుటను శ్రీవేంకటేశుఁడట
యిది యది యననేల యిచ్ఛాద్వేషమేల
వెదకుము సమబుద్ధి వివేకమా


రేకు: 0358-04 రామక్రియ సం: 04-342 జానపదము

పల్లవి:

సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత -
చందమాయఁ జూడరమ్మ చందమామపంట

చ. 1:

మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్నుఁగొనచూపులపంట
వినువీధినెగడినవెన్నెలలపంట

చ. 2:

వలరాజుపంపున వలపువిత్తినపంట
చలువై పున్నమనాఁటి జాజరపంట
కలిమికామినితోడ కారుకమ్మినపంట
మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట

చ. 3:

విరహులగుండెలకు వెక్కసమైనపంట
పరగ చుక్కలరాసిభాగ్యముపంట
అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట
యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట


రేకు: 0358-05 ఆహిరి సం: 04-343 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

ఎన్నఁడు విజ్ఞానమిఁక నాకు
విన్నపమిదె శ్రీవేంకటనాథా

చ. 1:

పాసినఁ బాయపు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసినఁ దొలఁగవు కోరికలు
గాసిలి చిత్తముగలిగినన్నాళ్ళు

చ. 2:

కొచ్చినఁ గొరయవు కోపములు
గచ్చులగుణములుగలనాళ్ళు
తచ్చినఁ దలఁగవు తహతహలు
రచ్చల విషయపురతులన్నాళ్లు

చ. 3:

వొకటికొకటికివని వొడఁబడవు
అకట శ్రీవేంకటాధిపుఁడ
సకలము నీవే శరణంటే యిఁక
వికటములణఁగెను వేడుకనాళ్ళు


రేకు: 0358-06 బౌళి సం: 04-344 వైరాగ్య చింత

పల్లవి:

ఎంత వెఱ్ఱిఁ గొండదవ్వి యెలుకఁ బట్టెద నేను
పంతపు శ్రీహరి నాభ్రమ వాపవే

చ. 1:

పడనిపాట్లఁ బెక్కుపనులఁ దిరుగుటెల్ల
కుడిచేపట్టెఁడు గూటికొర కింతే కా
కడదాఁకాఁ జెలులతోఁ గాఁపురము సేయుటెల్ల
వొడలు మరచియుండే వొక్క నిమిషానికా

చ. 2:

ఘనమైన గృహములు గట్టుకొనుటెల్లాను
తనువు మోచేయంతటికే కా
తనివోని మతిలోని తలపోఁత లెల్లాను
యెనసిన బదుకు తా నెంచుటకే కా

చ. 3:

యింతలోని పనియని యెరఁగని చేతఁలెల్లా
సంతకూటముల యీసంసారానకా
చెంతలశ్రీవేంకటేశ చేరి నీకే శరణంటే
యింతక మున్నిటినేర మేమనేవో కా