తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 356


రేకు: 0356-01 శ్రీరాగం సం: 04-327 హనుమ

పల్లవి:

ఓ పవనాత్మజ వో ఘనుఁడ
బాపుబాపనఁగఁ బరగితిగా

చ. 1:

వో హనుమంతుడ వుదయాచలని -
ర్వాహక నిజసర్వ ప్రబల -
దేహము మోఁచిన తెగువకు నిటువలె
సాహసమిటువలెఁ జాటితిగా

చ. 2:

వో రవిగ్రహణ వో దనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపువినతాతనయాదులు
గారవింప నిటు గలిగితిగా

చ. 3:

వో దశముఖహర వో వేంకటపతి -
పాదసరోరుహపాలకుఁడా
యీ దేహముతో నిన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా


రేకు: 0356-02 ముఖారి సం: 04-328 మనసా

పల్లవి:

దిక్కులేనివారు నీవే దిక్కని కొలువఁగా
అక్కరకితఁడు దైవమందురువో నిన్నును

చ. 1:

పాలుపడి నిన్నుఁజేరి పట్టి కొలిచినవారి
జాలిపాటు తొలఁగించి జడనువాపి
మూలఁబడనీక తెచ్చి ముద్దుసేసికావఁగాను
మేలెరుఁగుబుధులెల్ల మెత్తురువో నిన్నును

చ. 2:

కొండలుఁ గోట్లునైన కోరికలు గలవారి -
యండనే కోరికలిచ్చి యాదరించగా
నిండినదాసులకెల్ల నీవే దైవ మవని
కొండమీఁదనుండినఁ బైకొందురువో నిన్నును

చ. 3:

యేకమైనమనసుతో నెవ్వరు దలచినాను
చేకొని కరుణఁ గృపసేయఁగాను
యేకాలము శ్రీవేంకటేశుఁడు మాదైవమని
లోకమెల్లఁ దామే కొలుతురువో నిన్నును


రేకు: 0356-03 వరాళి సం: 04-329 శరణాగతి

పల్లవి:

ఏదియుఁగానఁడు నేది గాదందు
ఆదిపురుష నీదాస్యమే చాలనాకు

చ. 1:

గరిమఁ గొందరికి సాకారమై నిలిచితి
గురునిరాకారమై కొందరికి
సరుసఁ గొందరికెల్లా సగుణుఁడవట నీవు
ధర నిర్గుణమవట తగిలి కొందరికి

చ. 2:

వొకటఁ గళాపూర్తి నొనరియుందువట
వొకట నిష్కళుఁడవై వుడివోవట
వొకచో జీవుల నీకొరయ భేదమట
వొకచో నె భేదమట వున్నారట నీకు

చ. 3:

అదన నిందరిలోన నంతరాత్ముఁడవట
యెదుట శ్రీవేంకటేశుఁడవట
యిదియిది యననేల యింతయును నీ మహిమ
కదిసి వీ పాదాలే కనుఁగొంటగాక


రేకు: 0356-04 లలిత సం: 04-330 నామ సంకీర్తన

పల్లవి:

మాధవ కేశవ మధుసూదన విష్ణు
శ్రీధరా పదనభం చింతమియూయం

చ. 1:

వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్నా
రామ రామ కృష్ణ నారాయణాచ్యుత
దామోదరానిరుద్ద దైవపుండరీకాక్ష
నామత్రయాధీశ నమో నమో

చ. 2:

పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య
హరి సంకర్షణ యధోక్షజ
నరసింహ హృషీ కేవ నగధర త్రివిక్రమ
శరణాగతరక్ష జయజయ సేవే

చ. 3:

మహితజనార్దన మత్స్య కూర్మ వరాహ
సహజభార్గవ బుద్ధ జయతురగ కల్కి
విహితవిజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం
అహమీ తహతద దాస్యమనిశం భజామి


రేకు: 0356-06 గుండక్రియ సం: 04-331 కృష్ణ

పల్లవి:

అందిచూడఁగ నీకు నవతారమొకటే
యెందువాఁడవై తివి యేఁటిదయ్యా

చ. 1:

నవనీతచోరా నాగరపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా

చ. 2:

పట్టపు శ్రీరమణా భవరోగవైద్య
జట్టిమాయలతోడిశౌరి కృష్ణ
పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి
యెట్టని నమ్మవచ్చు నిది యేఁటిదయ్యా

చ. 3:

వేదాంతనిలయా వివిధాచరణా
ఆదిదేవ శ్రీవేంకటాచలేశ
సోదించి తలఁచినచోట నీ వుండుదువట
యేదెస నీ మహిమే యిదేఁటిదయ్యా


రేకు: 0356-06 గుండక్రియ సం: 04-332 వైరాగ్య చింత

పల్లవి:

తలపోఁత చిత్తమునఁ దరిగానక బుద్ది
గలఁగెఁ గావనో మమ్ముఁ గర్మమా

చ. 1:

పాపజాతిమేనితోడఁ బడ్డపాటే చాలదా
ఆపదలకేల లోనాయ నిప్పుడు
దీపమైనహరిభక్తి దెలిసియింతటనైనఁ
గాపాడి పరమీవో కర్మమా

చ. 2:

చెప్పరానిసుఖములు చెప్పి చెప్పి కని కని
చప్పుడుగా లోకమునఁ జాటి చాటి
దెప్పరపుభవములఁ దిప్పుదీరైతి మిదె
కప్పుకొని కావఁగదో కర్మమా

చ. 3:

వేడుకలిన్నియు శ్రీవేంకటాద్రిరాయఁడే
కూడిన మాదైవమని కొనియాడి
యేడఁజూచిననుఁ బుణ్య మెక్కుడాయనని నమ్మి
గాడలెల్లాఁ బాసితిమి కర్మమా