తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 355


రెకు: 0355-01 సాళంగం సం: 04-321 నామ సంకీర్తన

పల్లవి:

మాధవ భూధవ మదనజనక
సాధురక్షణచతుర శరణు శరణు

చ. 1:

నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ -
నారసింహా కృష్ణ నాగశయన
వారాహ వామన వాసుదేవ మురారి
శౌరి జయజయతు శరణు శరణు

చ. 2:

పుండరీకేక్షణ భువనపూర్ణగుణ
అండజగమన నిత్య హరి ముకుంద
పండరిరమణ రామ బలరామ పరమపురుష
చండభార్గవరామ శరణు శరణు

చ. 3:

దేవ దేవోత్తమ దివ్యావతార నిజ -
భావ భావనాతీత పద్మనాభ
శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ
సావయవసారూప్య శరణు శరణు


రేకు: 0355-02 లలిత సం: 04-322 మనసా

పల్లవి:

దొరకినయప్పుడే తుదగాక
మరుగకుమెన్నఁడు మరి మనసా

చ. 1:

తనుభోగంబులఁ దనిపినపిమ్మట
వెనుకొని హరిఁ దడవేనంటే
దినమునుఁ దను నింద్రియములచల మిది
తనియుట యెన్నఁడు దగు మనసా

చ. 2:

తిరమగునాల దీరినపిమ్మట
తెరలి విరతిఁ బొందే నంటే
మరలని యాశామయ మీచిత్తము
విరతి యెన్నఁడిఁక వెడ మనసా

చ. 3:

ముదిసినపిమ్మట మొగి శ్రీవేంకట -
సదయుఁ గొలుతు నిచ్చలునంటే
హృదయము శ్రీవేంకటేశునినెల విది
యిదిగనుటెన్నఁడు యీమహి మనసా


రేకు: 0355-03 లలిత సం: 04-323 శరణాగతి

పల్లవి:

తెలిసియుఁ దెలియదు దేరిన చిత్తము
నలినాక్ష గోవింద ననుఁగావవయ్యా

చ. 1:

యేఁకట నినుగొలిచి యితరుల వేఁడనేల
వేఁకపుటాసల నాలోవెలితిగాక
చీఁకటివాసినమీఁద చీఁదరగొనఁగనేల
మాఁకువంటివెడబుద్ది మాన దిదేమయ్యా

చ. 2:

పొంచి నీదాసుఁడనై యల్పుల వేఁడఁబోనేల
చంచలగుణములనాజాలిగాక
అంచలఁ దెరువుకని యడవిఁబడఁగనేలా
యించుకంత యేవవుట్ట దేమిపాపమయ్యా

చ. 3:

మతిలో నీవుండఁగాను మాయలఁ బొరలనేలా
వెతకి తెలియని నావేఁదురుగాక
గతియై శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను
తతి నాతపమనేఁడు దరిచేరెనయ్యా


రేకు: 0355-04 గుండక్రియ సం: 04-324 వేంకటగానం

పల్లవి:

తెలియనివారికిఁ దెరమరుఁగు
తెలిసినవారికి దిష్టంబిదియే

చ. 1:

కన్నులయెదుటనుఁ గాంచినజగ మిది
పన్నిన ప్రకృతియు బ్రహ్మమునే
యిన్నిట నుండఁగ నిదిగాదని హరిఁ
గన్న చోట వెదకఁగఁబోనేలా

చ. 2:

అగపడి యిరువదియైదై జీవునిఁ
దగిలినవెల్లాఁ దత్వములే
నగవుల నిదియును నమ్మగఁ జాలక
పగటునఁ దమలో భమ్రయఁగ నేలా

చ. 3:

అంతరంగుఁడును నర్చావతారము
నింతయు శ్రీవేంకటేశ్వరుఁడే
చెంతల నీతనిసేవకులకు మరి
దొంతికర్మములతోడ సిఁకనేలా


రేకు: 0355-05 వరాళి సం: 04-325 వైరాగ్య చింత

పల్లవి:

ఏలొకో కర్మమా యిందుకుఁ బాలైతిని
పాలుపడిన యీ జలభ్రమణమువలెను

చ. 1:

ధరలోఁ బుట్టినప్పుడే తలఁచ నీ యాత్మ
మరుగఁడు పరమైతే మరచీఁగాని
అరిది దుర్భాషల నలవడ్డనాలికె
హరినామములయందు నలవడదు

చ. 2:

జవకట్టి పూర్వవాసనల సంసారమే
చవియే తాఁగాని ముక్తి చవిగాదు
భువిఁగల విషయాలఁ బుంగుడయ్యీఁగాని మతి
వివరించి దైవమును వెదకలేదు

చ. 3:

శ్రీవేంకటేశుకృపచేత నింతేకాని
వావాత నివి గైవశము గావు
భావమిప్పుడితని పాదాలు చేరికాని
యేవుపమలనుఁ గాన మిన్నాళ్లును


రేకు: 0355-06 ముఖారి సం: 04-326 వైరాగ్య చింత

పల్లవి:

చవి నోరి కేడఁ దెత్తు సంప దేడఁదెత్తు వీని
సవరించుటే నాసంప దిదిగాదా

చ. 1:

పచ్చడా లెక్కడఁ దెత్తు పట్టుచీర లేడఁ దెత్తు
వెచ్చనిండ్లేడఁ దెత్తు వెంట వెంటను
తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట
వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా

చ. 2:

దొరతన మేడఁ దెత్తు దొడ్డసొమ్ము లేడఁ దెత్తు
యెరవులసిరుల నేనేడఁ దెత్తు
వెరవున నేనెవ్వరిని వేసరించఁజాలక
దరిచేరుటే దొరతనమిదిగాదా

చ. 3:

తోడఁబుట్టువుల నేడఁ దోడితెత్తుఁ జుట్టాల -
నేడఁ దెత్తు సుతులపొందేడఁ దెత్తును
వేడుకైనపొందు శ్రీవేంకటేశుఁ దలఁచుటే
ఈడులేనిబంధుకోటి ఈతఁడెకాఁడా