తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 333

రేకు: 0333-01 గుండక్రియ సం: 04-190 మనసా


పల్లవి :

అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము
యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా


చ. 1:

యీడనే సంసార మీదే యింద్రజాలమై యుండఁగ
యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము
పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ
వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను


చ. 2:

నటన దినదినము నాటకమై యుండఁగాను
సటవట నాటకాలు సారెఁ జూచేము
ఘటన మాయలెదుటఁ గనుకట్టై వుండఁగాను
అటమటపువిద్యలు అన్నియుఁ జూచేము


చ. 3:

పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను
కోపుల నాటలవారిఁ గోరి చూచేము
యేపున శ్రీవేంకటేశు డిటు మమ్ము భ్రమపాపె
నాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను

రేకు: 0335-02 గుజ్జరి సం: 04-191 శరణాగతి


పల్లవి :

ఇతరోపాయములెల్ల యీసందివే
అతిశయపదమైతే హరిదాస్యఫలమే


చ. 1:

కర్మము సేయ నేరరా కడఁగి సన్యాసులు
కర్మము విడిచి మోక్షముఁ బొందిరి
ధర్మమెరఁగనివారా తత్వపుయోగీంద్రులు సర్వ-
ధర్మము విడిచి హరిఁ దమలోనే కనిరి


చ. 2:

దానాలు సేయనేరరా తగిలి యోగీంద్రు లన్ని
మాని హరిజపమే నెమ్మడిఁ జేసిరి
నానావిధు లెరఁగరా నాఁడు విభీషణాదులు
శ్రీనాథు శరణని చిరదేహులైరి


చ. 3:

సతతసంగములెల్ల జన్మబంధహేతువని
మతిమంతులైనవారు మానిరిగాక
హితవైన శ్రీవేంకటేశ్వరుని శరణని
బ్రతుకరా యిందు నందుఁబ్రపన్నులెల్లను

రేకు: 0333-03 సౌరాష్ట్రం సం: 04-192 అన్నమయ్య స్తుతి


పల్లవి :

హరియవతారమె ఆతఁడితఁడు
పరమ సంకీర్తనఫలములో నిలిపె


చ. 1:

వున్నాఁడు వైకుంఠమున నున్నాఁడు యాచార్యునొద్ద
వున్నతోన్నతమహిమ నన్నమయ్య
వున్నవి సంకీర్తనాలు వొట్టుక లోకములందు
పన్నిన నారదాదులు పైపైఁ బాడఁగను


చ. 2:

చరియించు నొకవేళ సనకాదిమునులలో
హరిఁ బాడుఁ దాళ్ళపాక అన్నమయ్య
తిరమై యాళువారల తేజము దానైయుండు
గరుడనంతముఖ్య ఘనులంగడిని


చ. 3:

శ్రీ వేంకటాద్రిమీఁద శ్రీపతికొలువునందు
ఆవహించెఁ దాళ్ళపాక అన్నమయ్య
దేవతలు మునులును దేవుఁడని జయపెట్టఁ
గోవిదుఁడై తిరిగాడీఁ గోనేటిదండను

రేకు: 0333-04 రామక్రియ సం: 04-193 మాయ


పల్లవి :

ఉండినట్టే వుండును వుండకున్న మానును
అండనే శ్రీహరిమాయ నమరినలోకము


చ. 1:

యేదైనా మంచిదే యెట్టయినా మంచిదే
సేద దేరినట్టి పూర్ణచిత్తునకును
కాదు గూడదనరాదు కలస్వభావమునకు
ఆదినుండి హరిమాయ నత్తినడి లోకము


చ. 2:

యెండైనా మంచిదే యెంతనీడైనా మంచిదే
పండినజ్ఞానభక్తుల ప్రసన్నులకు
నిండె నిండదనరాదు నిచ్చనిచ్చఁబ్రకృతికి
కొండవంటిహరిమాయ గురియైనలోకము


చ. 3:

పాపమైన మంచిదే బలుపుణ్యమైన మంచిదే
శ్రీపతిని శరణన్నజీవునికిని
వోప నోపేన రాదు వొద్దిక శ్రీవేంకటేశు
చేపట్టినమాయలోనఁ జిక్కినది లోకము

రేకు: 0333-05 శంకరాభరణం సం: 04-194 శరణాగతి


పల్లవి :

నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు
యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను


చ. 1:

కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను


చ. 1:

దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
ఆవలఁ బాదాన లోక మణఁచితివి
నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను


చ. 1:

అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను

రేకు: 0333-06 శుద్ధవసంతం సం: 04-195 శరణాగతి


పల్లవి :

కటకటా యీ ప్రాణి గతిగనుట యెన్నఁడో
అటు నావశము గాదు హరి నీచేఁ గాని


చ. 1:

పాపము నెరుఁగుదు బంధము నెరుఁగుదు
మాపుదాకా నివి నేను మానలేఁగాని
కోపము దుర్గుణమని కొంత గొంత యెరుఁగుదు
తీపుల యాసలఁ బడి తిప్పలేఁగాని


చ. 2:

చూతును దుఃఖాలవారిఁ జూతును బుట్టేవారి
యీతల నాకు వెరపు యించుక లేదు
గాతల నామనసెల్లఁ గల్పించినట్లవును
చేతనైనా చెప్పినట్టు సేయలేఁగాని


చ. 3:

నావంకఁ గడమ గాఁక నా గురుఁడు తొల్లె నన్ను
శ్రీవేంకటేశుఁడ నీచేతికిచ్చెను.
దైవమొక్కఁడవే నీ దాసానుదాసుఁడనైతి
యేవిధులు నే నెరఁగ నిటు నిన్నేకాని