తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 319

రేకు: 0319-01 సామంతం సం: 04-106 శరణాగతి


పల్లవి :

పరమాత్మ నాజాడ భావించ నిట్టిది, నీవు
నిరుహేతుకాన నాకు నీవు బుద్దియ్యఁగదె


చ. 1:

అపరాధములు పెక్కు లటు నాయందున్నఁగాని
వుపమఁ బుణ్యముత్రోవ లూహించలేను
విపరీత పాపములు వేవేలు సేసినఁగాని
చపలగర్వము మాని శరణనలేను


చ. 2:

పలులంపటాలఁ బడి బడలినఁగాని, నాకు
పలవి నిన్నుఁ దలఁచేభక్తి లేదు
పులుసు నంజినఁగాని భూమిలో మిక్కిలి తీపు
తలపోయ నోటీకి నితవు గానరాదు


చ. 3:

వేవేలు నేరాలు సేసి వెరపు పుట్టినఁగాని
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరదు మతి
వావిరి లోకపుమాయవలలఁ జిక్కినఁగాని
వేవేగ వెడలి ముక్తి వెదకఁడు జీవుడు

రేకు: 0319-2 గుజ్జరి సం: 04-107 శరణాగతి


పల్లవి :

శ్రీపతి నీ సేవ చిత్తము గోరదు
పాపముల వెంటనే పారీ నయ్యా


చ. 1:

తెగనికర్మము దేహములు గోరు
వగలయీపీఁగ వ్రణాలు గోరు
నగుచుఁ దొల్లింటి నా పూర్వకర్మములు
పొగరుభోగములే పొందించె నయ్యా


చ. 2:

సాకిరివయసు సంసారము గోరు
చీకురువాయులు జీడిమాను గోరు
దీకొని నాతోడి తీరనింద్రియములు
కైకొని మర్మములు గలఁచీ నయ్యా


చ. 3:

వేదవిజ్ఞానము విరతియే కోరు
నీదాసుఁడైతేనే నీశరణు గోరు
యీదెస శ్రీవేంకటేశ నీవు నాలో
పాదైయుండి నన్ను బ్రదికించే నయ్యా

రేకు:0319-03 లలిత సం: 04-106 అధ్యాత్మ


పల్లవి :

అతనిభజియించరో ఆతుమలాల శ్రీ-
పతి యితనికరుణే ఫలమింతేకాని


చ. 1:

సంగమే భంగమే సుండి సకలవిరక్తులాల
వెంగలివిషయములే విషము సుండీ
అంగపుబందువులెల్ల అంటుబంధములు సుండీ
సంగతి హరి యొక్కఁడే సతమింతేకాని


చ. 2:

మోహమే దాహముసుండి మోక్షోపాయకులాల
సాహస సంసారమే నిస్సారము సుండి
దేహము గొన్నాళ్ళకు సందేహమై తోఁచు సుండి
శ్రీహరి సేవోక్కటే వచ్చినదింతేకాని


చ. 3:

కోపమే తాపముసుండి కోరని సాత్వికులాల
రూపులేని భోగమెల్ల రుణము సుండి
కైపుసేసి యన్నిటాను గడిచిశ్రీవేంకటేశు-
నోపి శరణని మనేదక్కటే సుండి

రేకు: 0319-04 మాళవి సం: 04-109 దశావతారములు


పల్లవి :

ఆతఁడోపో మాయేలిక ఆతఁడే జగన్మూల-
మాతఁడే శ్రీవేంకటాద్రి యందు మీఁది దైవము


చ. 1:

కమలవాసిని యైన కాంతఁ బెండ్లాడినాఁడు
కమలములో బిడ్డఁ గన్నవాఁడు
కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు
కమలనాభుఁడేపో కలుగు మాదైవము


చ. 2:

జలధి బంధించి లంక సంహరించినవాఁడు
జలధిచొచ్చినదైత్యుఁజంపినవాఁడు
జలధిసుతునకు వరుస బావైనవాఁడు
జలధి శయనుఁడేపో చక్కని మాదైవము


చ. 3:

కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు
కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు
కొండలకు నెక్కుడైన గురుతు శ్రీవేంకటాద్రి-
కొండరూపు దానేపో కోరిన మాదైవము

రేకు: 0319-05 నాట సం: 04-110 కృష్ణ


పల్లవి :

వొద్దునీవు నాకెదురా వోరి కంసుఁడా
కొద్దిగాదు పెనఁగఁగ గోవిందుతోఁ గంసుఁడా


చ. 1:

పెరిగీ రేపల్లే నదె బిరుదునీవైరి వాఁడే
వొరసి నన్నేలపట్టే వోరికంసుఁడా
విరసాన వెరవను విష్ణుమాయను
గొరబైనవెడబుద్ధి గొలుపద వోరా


చ. 2:

వెదకీ నీవైరి వాఁడె వీరదానవులనదె
వుదుటు నాతోనేల వోరికంసుఁడా
చిదుమనా నిన్నిపుడే సెలవీఁడుగా కతఁడు
పెదవుల చేటింతే పేదవానికోపము


చ. 3:

వెన్నలుఁ బాలారగించి వేసఁవాడె సత్వగూడ-
నున్నవాఁడు, నిన్నుగెల్వ నోరి కంసుఁడా
వెన్నుఁడు శ్రీవేంకటాద్రి విభుఁడు లోకులఁగాచె-
నన్నిటాఁ గృష్ణావతార మందఁబట్టి నేఁడు

రేకు:0319-06 సామంతం సం: 04-111 గురు వందన, నృసింహ


పల్లవి :

ఈతఁడే ద్రిష్టవరము లియ్యఁగాఁ గాఁక
ఆతలీతలీ సుద్దులవి నమ్మఁగలమా


చ. 1:

హరి రూపెరుఁగుదుమా అరసి ఇంతకతొల్లి
సొరది శ్రీవేంకటేశుఁ జూచి కాక
గురుమంత్రము నేర్తుమా గోవిందుఁడితని నామ
మురుటై లోకాలనెల్ల నుండఁగా గాక


చ. 2:

వైకుంఠ మెరుఁగుదుమా వర్ణించి ఇంతకతొల్లి
దీకొని శ్రీవేంకటాద్రిఁ దిరిగి కాక
యేకడ దేవతల నేమెందునైనాఁ గంటిమా
చేకొని హరిదాసులఁ జేరి మొక్కే కాక


చ. 3:

పుట్టు నేఁ గంటినా పొంచి శ్రీవేంకటపతి
వొట్టి నాయంతరాత్మె యుండఁగాఁగాక
కొట్టఁగొనపర మేడ కొంచెపు దేహి నేనేడ
అట్టె యాతనికి శరణని కొలిచి కాక