జ్యోతిష్య శాస్త్రము/యోగము, కరణము అనగానేమి?

42. యోగము, కరణము అనగానేమి?

మార్చు

పంచాంగమును విభజించితే ఐదు భాగములుగాయున్నదని ముందే చెప్పుకొన్నాము. పంచాంగములో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అను ఐదు భాగములున్నా ఇవియే పంచాంగములు అని చాలామందికి తెలియదు. ఈ ఐదు భాగములలో నక్షత్రము జ్యోతిష్యమందు ముఖ్యపాత్ర పోషించుచున్నదని కూడా వెనుక పేజీలలో చెప్పుకొన్నాము. వారము అంటే ఏమిటో అందరికీ తెలుసు. ప్రతి దినము ఏదో ఒక వారము పేరు వస్తున్నది. దినము పేరును వారము అంటున్నాము. ప్రతి దినము ఒక వారమున్నట్లు, ప్రతి వారము (దినము) నకు ఒక నక్షత్రము కలదు, అలాగే ఒక తిథియ కలదు. వారము అందరికీ తెలుసు. అయితే కొందరికి తిథి నక్షత్రములను గురించి తెలియదు. నేడు కాలేజీలలో విద్యనభ్యసించిన వారికి వీటిని గురించి తెలుసుకొను అవకాశము లేదు. కనుక నేటి యువకులకు తిథి నక్షత్రములు తెలియవనియే చెప్పవచ్చును. తిథి, వార, నక్షత్రములను గురించి నేటి యువకులలో కొందరికి తెలియకున్నా పెద్దలందరికీ చాలామందికి తిథి, వార, నక్షత్రములను గురించి తెలుసు. ఇక యోగ, కరణ అనువాటి విషయమునకు వస్తే వాటి విషయము చాలామంది పెద్దలకు కూడా తెలియదనియే చెప్పవచ్చును. ఒకవేళ కొందరికి వీటి విషయము తెలిసియున్నా వాటి అసలైన భావము ఏదో తెలియదు. ఈ విషయములో నాకు కూడా సరిగా తెలియదనియే చెప్పుచున్నాను. ఎందుకనగా! యోగ, కరణ విషయములో రెండు భావములు కలవు. పంచాంగము, జ్యోతిష్యము తెలిసిన వారికి యోగము కరణము అనగా ఒక రకముగా తెలిసియున్నవి. పంచాంగములోనున్న యోగ, కరణ అను రెండు కాలక్రమమున వాటి అర్థములు, సంఖ్యలు, పేర్లు అన్నీ మారిపోయియున్నవి. మొదట జ్యోతిష్యము కొరకు తయారు చేసిన యోగ, కరణములు వేరు, నేడు కొందరికి మాత్రము తెలిసిన యోగ, కరణములు వేరని చెప్పవచ్చును. నేడు కొందరికి తెలిసిన యోగ కరణముల పేర్లు, సంఖ్యలు ఇలా గలవు.

యోగములు :- మొత్తము = 27, వాటి పేర్లు వరుసగా 1.విష్కంభము 2. ప్రీతి 3. ఆయుష్మాన్‌ 4.సౌభాగ్యము 5. శోభనము 6. అతిగండము 7. సుకర్మము 8. ధృతి 9. శూలము 10. గండము 11. వృద్ధి 12. ధ్రువము 13. వ్యాఘాతము 14. హర్షణము 15. వజ్రము 16. సిద్ధి 17. వ్యతీపాత్‌ 18. వరియాన్‌ 19. పరిఫమ 20. శివము 21. సిద్ధము 22. సాధ్యము 23. శుభము 24. శుభ్రము 25. బ్రహ్మము 26. ఇంద్రము 27. వైధృతి. ఈ 27 యోగములను కొన్ని గ్రంథములలో వ్రాసియున్నారు. వాటినే మేము సేకరించి ఇక్కడ చూపాము. ఇవి ఏవో, ఎందుకున్నాయో, వీటి ప్రయోజనమేమో నాకు మాత్రము కొంచెము కూడ తెలియదు.

ఈ యోగములు 27యని వాటి పేర్లతో కూడా వ్రాసినవారు ఇదే పద్ధతిలోనే కరణములను కూడా వ్రాశారు. వారికి తెలిసిన విధానములో కరణములు 11 యని చెప్పుచూ వాటి పేర్లను కూడా ఇలా చెప్పారు. కరణములు మొత్తము (11) పదకొండు. వాటి పేర్లు వరుసగా ఇలా గలవు. 1. బవ 2. బాలవ 3. కౌలవ 4. తైతుల 5. గరజి 6. వరాజి 7. భద్ర 8. శకుని 9. చతుష్పాత్‌ 10. నాగవము 11. కింస్తుఘ్నము.

27 యోగములతోపాటు 11 కరణములను కూడా కొన్ని గ్రంథములలో వ్రాసియున్నారు ఇవి కూడా ఎందుకున్నాయో, వీటి ప్రయోజనము ఏమిటో నాకు ఏమాత్రము తెలియదు. నా మాటను విన్న కొందరికి ఆశ్చర్యము కలిగి పంచాంగములో భాగములైయున్న యోగ, కరణములను తెలియదని చెప్పుచున్న మీరు, జ్యోతిష్యశాస్త్రమును ఎలా వ్రాయుచున్నారు? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! యోగము కరణములనగా నా భావములో వేరు అర్థము కలదనీ, అవి ఇవి కావు అని అనుకొనుచున్నాను. ఇతరులకు తెలిసిన యోగ, కరణములు నాకు తెలియవు. నాకు తెలిసిన యోగ కరణములు ఇతరులకు తెలిసియుండక పోవచ్చును. ఇతరులకు తెలిసినా, తెలియకున్నా నా భావములో యోగము అంటే కలయిక అనీ, కరణము అంటే చేయుచున్న వాడనీ లేక చేయుచున్నదనీ అర్థము. వీటిని గురించి అందరికీ తెలుపగలను.

మాకు తెలిసిన యోగము, కరణము రెండు రకములు కలవు. ఒకటి జ్యోతిష్య భావము ప్రకారము, రెండు ఆధ్యాత్మిక భావము ప్రకారము రెండు విధముల భావములు కలవు. జ్యోతిష్య భావము ప్రకారము చెప్పుకొంటే, రెండు గ్రహముల కలయికను యోగము అని అనుచుందురు. ఒకే లగ్నములో రెండు గ్రహములు కలిసిన, ఆ గ్రహముల పేరుతో దానిని యోగము అంటారు. ఉదాహరణకు బుధుడు, సూర్యుడు ఒక్క లగ్నములో కలిసినప్పుడు జరుగు కాలమును ‘‘బుధార్క యోగము’’ అంటారు. రెండు శుభగ్రహములు ఒక లగ్నములో కలిసిన వారిరువురు కలిసి ఇచ్చు మంచి ఫలితములను అనుభవించు కాలమును యోగము అని అనడము జరుగు చున్నది. బయట దృష్ఠికి పనులను చేయువానిని కరణము అంటున్నాము. కరణమైన వాడు యోగము అనుభవించును అని జ్యోతిష్యములో పూర్వము చెప్పెడివారు. ఇకపోతే బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము జీవాత్మ ఆత్మ అను రెండు ఆత్మల కలయికను యోగము అంటారు. పని జరుగుటకు కారణమైన కర్మను కరణము అంటాము. జ్యోతిష్యములో రెండు గ్రహముల కలయిక యోగమైతే, ఆధ్యాత్మికములో రెండు ఆత్మల కలయిక యోగమగును. అలాగే జ్యోతిష్యములో పని జరుగుటకు కారణమైన మనిషిని కరణము అంటాము. ఆధ్యాత్మికములో కార్యము జరుగుటకు కారణమైన కర్మను కరణము అంటాము. అయితే పంచాంగములో రెండు అంగములైన యోగ, కరణములను యోగములుగా గ్రహముల కలయికనూ, కరణముగా పని చేయుచున్న మనిషినీ లెక్కించుకోవచ్చును. పంచాంగములో తిథి, వార, నక్షత్ర అను మూడు అంగములను ఒకవైపు, యోగ కరణములను ఒకవైపు రెండు భాగములుగా విభజించు కోవచ్చును. ఎందుకనగా తిథి, వార, నక్షత్రములైన మూడు ద్వారా యోగ కరణములను తెలియవచ్చును. అందువలన యోగ కరణములకు తిథి, వార, నక్షత్రములు ముఖ్యమని చెప్పవచ్చును. తిథి, వార, నక్షత్రములను మూడులో ఎవరికీ ఎటువంటి అనుమానములూ లేవు, అవి అందరికీ తెలిసినవే. అయితే రెండు అయిన యోగ, కరణముల విషయములో కొందరు ఎవరికీ పొంతన సరిపోకుండ 27 యోగములు, 11 కరణములని చెప్పడము మాకు పూర్తి అర్థముకాని విషయము. వారు చెప్పిన యోగ, కరణములు పంచాంగములోగానీ, జ్యోతిష్యములోగానీ వాటి ఉపయోగ మేమిటో వాటిని చెప్పినవారే చెప్పవలసియుంటుంది.

ఇంతకుముందు గ్రహములను గురించి చెప్పుకొన్నాము. అందరూ చెప్పుకొనిన నవగ్రహములను చెప్పక, ప్రత్యేక ద్వాదశ గ్రహములను చెప్పుకొన్నాము. మూడు గ్రహముల తేడా ఎందుకు వచ్చిందో తొమ్మిది గ్రహములను చెప్పినవారినే అడుగవలెను. 27 యోగములను, 11 కరణములను ఎలాగైతే కాదన్నామో, అలాగే నవగ్రహములను కాదని ద్వాదశ గ్రహములు సత్యమని చెప్పాము. అంతేకాక మిగతా మూడు గ్రహములకు దశాకాలములు ఎట్లున్నాయో చెప్పుకొన్నాము. దశాకాలపరిమితివద్ద శని వర్గమునకు, గురువర్గమునకు సమానముగా 60 సంవత్సరములున్నాయని చెప్పాము. దశల కాలములను సరిచేసి చెప్పడమే కాకుండా గ్రహముల ఆధీనములో గల వాటిని చెప్పుచూ అందరూ వదలివేసిన మూడు గ్రహములైన భూమి, మిత్ర, చిత్ర గ్రహముల స్వంత ఆధీనములో గలవేవో చెప్పాము. మేము చెప్పిన పన్నెండు గ్రహముల విషయములో చాలామంది విభేదిస్తారని తెలిసి మీరు ముందు చదివినవన్నీ సత్యము కాదు అని తెలుపుటకు మాకంటే ముందు చెప్పిన వారి యోగములు 27, కరణములు 11 ఎంత సత్యమో చూడండని చెప్పాము. ఎటుచూచినా 27 యోగములు, 11 కరణములు అర్థము కాకుండపోవుచున్నవి. మేము చెప్పిన యోగములు, కరణములు సులభముగా అర్థము కాగలవు. ఇప్పుడు అందరికీ క్రొత్తగాయున్న పన్నెండు గ్రహములనుమాటనూ, అట్లే మార్పు చెందిన దశల సంవత్సరములనూ సత్యమని ప్రతి ఒక్కరూ తెలియవలెను. పన్నెండు గ్రహములను, పన్నెండు దశలను వదిలి జ్యోతిష్యమును చూచుట వలన ఎక్కువ శాతము జ్యోతిష్యము అశాస్త్రముగా కనిపించుచున్నది. అందువలన కొందరు పనిగట్టుకొని జ్యోతిష్యము మూఢనమ్మకమనీ, జ్యోతిష్యము శాస్త్రముకాదని చెప్పుచూ, దానిని సంఘ సేవగా చెప్పు కొంటున్నారు.

సృష్ఠ్యాదినుండి ఆరుశాస్త్రములు తయారైనవి. దేవుడే వాటిని మనుషులకు అందించాడని చెప్పవచ్చును. ప్రపంచములో ప్రతి విషయమును తేల్చి చూపునది శాస్త్రము. శాస్త్రసమ్మతమైనప్పుడే అది సత్యమైనదని, శాస్త్రబద్దముకానిది ఏదైనా అది అసత్యమని చెప్పుటకు దేవుడు శాస్త్రములను సృష్ఠించాడు. ప్రపంచములో షట్‌ శాస్త్రములుగాయున్న వాటిలో జ్యోతిష్యము శాస్త్రము కాదంటే ఆరు శాస్త్రములలో ఒకటైన జ్యోతిష్యము లేకుండపోయి చివరకు ఐదు శాస్త్రములు మిగిలిపోవును. ఒక శాస్త్రము లోపించితే శాస్త్రముల సమతుల్యత తగ్గిపోయి చివరకు ఏ శాస్త్రమూ లేకుండ పోవుటకు అవకాశము ఏర్పడగలదు. అప్పుడు ఏ విషయమునకూ ప్రపంచములో హద్దూ పద్దూ లేకుండాపోవును. దానితో నాస్తికత్వము ఏర్పడి చివరకు దేవుడే లేడను వాదము బయటికి వచ్చి బలపడగలదు. అటువంటి పరిస్థితి రాకుండుటకు శాస్త్రములు ఆరని గ్రహించి వాటిని తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

జ్యోతిష్యమునకు అనుకూలముగా ఉండే కొన్ని అంశములను తీసుకొందాము. అందులో గ్రహములు భూమిమీదగల ఏయే జాతులమీద అధికారము కలిగియున్నాయో తెలుసుకొందాము.

పన్నెండు గ్రహములు భూమిమీదున్న అన్ని కులములను తమ ఆధీనములో పెట్టుకొన్నాయి. ఇక్కడ గమనించుకోవలసినది ఏమనగా! సూర్యుడు క్షత్రియ కులమును ఒక్కదానినే తన ఆధీనమందుంచుకొనక, క్షత్రియులకు సమానముగాయున్న కులములన్నిటినీ తన ఆధీనములో ఉంచుకొన్నాడని తలచవలెను. రాజులు (క్షత్రియులు) మరియు బట్రాజులు ఇద్దరూ సూర్యుని ఆధీనములో ఉన్నట్లు లెక్కించుకోవలెను. అలాగే చంద్రుని ఆధీనములో బ్రాహ్మణ జాతులన్నీ వచ్చునని తెలియవలెను. శని ఆధీనములో మాదిగ కులము కాకుండా దానికి సమానమైనవన్నీ లెక్కించవలెను. రాహు ఆధీనములో ఒక్క వాల్మీకి కులము మాత్రము కాకుండా ఎరికల, యానాది మొదలగు గిరిజనులందరూ ఉన్నట్లు తెలియవలెను. ఇలా తెలియడము వలన జ్యోతిష్యము సులభమగును. ఏమి వృత్తి చేయుచున్నాడని జ్యోతిష్యములో ప్రశ్న వచ్చినప్పుడు నాల్గవ స్థానములో బుధగ్రహము శుభుడై (మిత్రుడై) యుంటే అతడు వ్యాపారము చేయుచున్నాడని లేక వ్యాపారములో రాణించగలడని చెప్పవచ్చును. ఈ విధముగా చిన్న ప్రశ్నలకు జవాబును ఇటువంటి సమాచారము ద్వారా సులభముగా చెప్పవచ్చును. అందువలన ఇప్పుడు పన్నెండు గ్రహములు ఏయే రంగులమీద అధికారము కల్గియున్నాయో చూచుకొందాము.

ఈ రంగులు తెలియడము వలన జాతకునికి అనుకూలమైన రంగుల గుడ్డలు మాత్రము అతనికి శుభమును (మంచిని) కలుగజేయుననీ, మిగతా రంగులు జాతకునికి వ్యతిరేఖ గ్రహములవైనందున ఆ రంగు గుడ్డలు ధరించితే, వాటివలన అశుభము (చెడు) జరుగునని తెలియ వచ్చును. అప్పుడు వారికి అనుకూలమైన గ్రహముల గుడ్డలనే ధరించుటకు అవకాశముండును. తమకు అనుకూలమైన గ్రహముల యొక్క రంగు వస్త్రముల మీద ఆ రంగుల అధిపతుల (గ్రహముల) కిరణములు ఎక్కువగా ప్రసరించును. అందువలన జాతకునకు గ్రహబలము గుడ్డల రంగుల వలన లభించవచ్చునని చెప్పవచ్చును. అందువలన పన్నెండు గ్రహముల ఆధీనములోనున్న రంగులను తెలుసుకోవడము మంచిది. అంతేకాక కుజగ్రహము అనుకూలమైనదైయుండి జన్మలగ్నములలో ఉండుట వలన అక్కడినుండి 4,7,8 స్థానములను చూచుట వలన ఆ జాతకునికి ఎరుపు రంగు గుడ్డల మీద ఆసక్తి ఉండునని కూడా చెప్పవచ్చును. ఇప్పుడు గ్రహముల ఆధీనములోనున్న రుచుల విషయమును గురించి తెలుసు కొందాము.

జాతకునికి అనుకూలమైన గ్రహములనుబట్టి ఆ గ్రహముల ఆధీనములోనున్న రుచుల మీద ఇష్టముండును. అందువలన కొందరు కొన్ని రుచులనే ఎక్కువగా ఇష్టపడుచుందురు. అంతేకాక శత్రు గ్రహముల రుచుల ఆహారముల వలన ఎప్పుడైనా అనారోగ్యము కల్గుటకు అవకాశము ఉండును. అట్లే అనుకూలమైన గ్రహముల ఆధీనములోని రుచుల ఆహారమువలన ఆరోగ్యముగా ఉండడము కూడా జరుగుచుండును. కొందరికి వారి శత్రుగ్రహముల రుచుల ఆహారము శరీరమునకు సరిపోదు (అలర్జీ అగును) అప్పుడు సరిపోని ఆహారములను వదలివేయడము మంచిది. అందువలన ఏ జాతకునికి ఏ రుచుల ఆహారము సరిపోవునో తెలుసు కోవడము మంచిది. ఇప్పుడు గ్రహముల లింగభేదమును గురించి తెలుసు కొందాము.

మొత్తము పన్నెండు గ్రహములలో నలుగురు పురుష గ్రహములూ, నలుగురు స్త్రీ గ్రహములూ, మిగత నలుగురు నపుంసక గ్రహములని తెలియ వలెను. ఉదాహరణకు శుక్రుడు ` స్త్రీ అని వ్రాసియుండుట వలన శుక్ర గ్రహము స్త్రీ జాతి గ్రహమేమో అనుకోకూడదు. భూమిమీద గల సమస్తమునకు పన్నెండు గ్రహములే అధిపతులని చెప్పుకొన్నాము కదా! దాని ప్రకారము భూమిమీదగల స్త్రీలకు, పురుషులకు, నపుంసకులకు గ్రహములు అధిపతులుగా ఉన్నారుగానీ, గ్రహములు స్త్రీలుగా, పురుషులుగా, నపుంసకులుగా లేరని గుర్తుంచుకోవలెను. ఇప్పుడు ఏ గ్రహము ఎవరికి కారకులో తెలుసుకొందాము.

ఈ విధముగ పన్నెండు గ్రహములు తల్లితండ్రిని మొదలుకొని జ్ఞానము అజ్ఞానము వరకు ముఖ్యమైన విషయముల మీద అధికారము కల్గియున్నవని తెలియుచున్నది. ఒక వ్యక్తికున్న పుత్రుడు మంచివాడా, కాదా? తండ్రి మాట వింటాడా, వినడా అను ప్రశ్నలకు పుత్రునికి అధికారి అయిన గురుగ్రహమును చూచి, గురుగ్రహము అనుకూలమైనదైతే పుత్రుడు అనుకూలముగా ఉండుననీ గురుగ్రహము శత్రువుగాయుంటే అతని పుత్రుడు కూడా మాట వినడని చెప్పవచ్చును. గురుగ్రహము ఉన్న స్థానమునుబట్టి వ్యతిరేఖత ఎంత అను దానిని గానీ, అనుకూలత ఎంత అను దానినిగానీ నిర్ణయించవచ్చును. అదే విధముగా జ్ఞాన విషయము లోనికివస్తే జ్ఞానము కర్మకు అతీతమైనది కదా! అటువంటపుడు కేతు గ్రహము జ్ఞానమునకు ఎలా అధిపతిగా ఉన్నదని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి మా జవాబు ఏమనగా! జ్ఞానము కర్మకు అతీతమైనదే, అది మనిషి శ్రద్ధనుబట్టి లభ్యమగును. ఇక్కడ కేతువును చూపడము దేనికంటే మనిషి శ్రద్ధ ఏ జ్ఞానమువైపు ఉన్నదో తెలుయుటకు మాత్రమే. కేతువు అనుకూలమైన గ్రహమైతే ఆ వ్యక్తి అసలైన దేవతారాధన కాని జ్ఞానము వైపు నడచుననీ, అనుకూలమైన గ్రహము కాకపోతే అతని శ్రద్ధ అసలైన నిరాకార దేవుని వైపు కాకుండా, దేవతలవైపు ఉండుననీ తెలియుటకు మాత్రమేనని తెలియ వలెను. జ్ఞానము మనిషి శ్రద్ధనుబట్టియే వచ్చునుగానీ గ్రహ బలమును బట్టి రాదు. అందువలన జ్ఞానము కర్మకు అతీతమైనదనియే చెప్పుచున్నాము. ఇకపోతే మనిషికి ఎటువంటి శ్రద్ధయున్నదో కేతువునుబట్టి తెలిసినా, వాని శ్రద్ధ ప్రకారము ఏకైక దేవుని మీదగానీ, సామూహిక దేవతలపైనగానీ కల్గు జ్ఞానము ఆటంకములు లేకుండా తెలియునా, ఆటంకములతో తెలియునా అను విషయము అజ్ఞానమునకు అధిపతిగా సూచించిన భూమిని బట్టి తెలియును. అంతేగానీ భూగ్రహము అనుకూలముగా లేనియెడల జ్ఞానము తెలియదని చెప్పుటకు వీలులేదు. జ్ఞానమార్గములో ఆటంకములను తెలియజేయునదే భూగ్రహమని తెలియవలెను. ఇప్పుడు ఏ గ్రహము వలన ఏ రోగము వచ్చునో తెలుసుకొందాము.

1. సూర్యుడు - అతిసారము, జ్వరము, వేడి అగుట, శ్వాససంబంధ రోగములు కల్గును.

2. చంద్రుడు - పాండురోగము (రక్తలేమి) కామెర్లు, జల రోగములు, నీరసము, నాసికారంధ్రములలో బాధ, స్త్రీ సంబంధ వ్యాధులు, మూత్రము సరిగా రాకుండుట.

3. కుజుడు - వరిబీజాలు (బీజము వాపు), కత్తిపోట్లు లేక కత్తి గాయములు, మశూచి, కఫము, వ్రణములు (పుండ్లు), గ్రంథుల రోగము (థైరాయిడ్‌ మొదలగునవి).

4. బుధుడు- ఉదరబాధలు, కుష్టు రోగము, వేడి, నొప్పులు, మర్మావయవముల బాధలు, దయ్యముల వలనగానీ, క్షుద్ర దేవతల వలనగానీ వచ్చు శరీర రోగములు లేక బాధలు.

5) గురువు - కన్పించని మర్మస్థాన రోగములు, శుక్ల నష్ట వ్యాధులు, కాళ్ళ మంటలు.

6) శుక్రుడు - మధుమేహము, స్త్రీల నుండి సక్రమించు సుఖవ్యాధులు, పర యువతుల కొరకు కామ వికారము, మూత్ర రోగములు, అతి మూత్రము, ఎచ్‌.ఐ.వి. రోగము, గనేరియా, సిఫిలిస్‌ రోగములు.

7) శని - మూలవ్యాధి, కీళ్ళ వ్యాధులు

8) రాహువు - మూర్చ, అపస్మారము, మశూచి, ఉష్ణరోగములు

9) కేతువు - దురద, రహస్య వ్యాధులు, క్యాన్సర్‌ 10) భూమి - అరికాళ్ళ, అరచేతుల మంటలు, కాళ్ళు చేతులు చీలుట.

11) మిత్ర- తలనొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మనోరోగములు.

12) చిత్ర - మోకాళ్ళ నొప్పులు, గుండెనొప్పి.

ఈ విధముగా ఎన్నో రోగములు పన్నెండు గ్రహముల ఆధీనములో ఉన్నవి. మనిషి చేసుకొన్న కర్మనుబట్టి కర్మప్రకారము ఆయా గ్రహముల నుండి ఆయా రోగములు వచ్చును. ఇక్కడ చెప్పిన రోగములే కాకుండ వాటికి అనుబంధమైన రోగములు ఏవైనా రావచ్చును. ఇప్పుడు గ్రహముల ఆధీనములోని రాళ్ళ విషయము తెలుసుకొందాము.

పన్నెండు గ్రహముల ఆధీనములో పైన కనపరచిన రాళ్ళు ఉన్నవి. అయితే కొందరు ఈ రాళ్ళను తమ ఉంగరములో ధరించు చుందురు. అలా ధరించుట వలన పన్నెండు రాళ్ళకు అధిపతులైన పన్నెండు గ్రహములు తమకు అనుకూలముగా ఉందురనీ, వారివలన ఏ ఇబ్బందులు కలుగవని కొందరు జ్యోతిష్యులు చెప్పడము వలన వాళ్ళు రత్నముల ఉంగరములు ధరించుచుందురు. అలా ధరించుట వలన ధరించిన మనిషికి అనుకూలమైన గ్రహముల వలన ఏ ఇబ్బందీ ఉండదు. అయితే ఆ మనిషికి శత్రువర్గములైన ఆరు గ్రహముల రాళ్ళు ఆ గ్రహముల కిరణములను ఎక్కువ ఆకర్షించుట వలన రాళ్ళు ధరించిన వ్యక్తికి ఇబ్బందులు కలుగును. అందువలన ఏ మనిషి అయినా తనకు మిత్రులుగాయున్న గ్రహములేవో తెలిసి, ఆ గ్రహములకు సంబంధించిన రాళ్ళనే ధరించడము మంచిది. శత్రువర్గ గ్రహముల రాళ్ళు ధరించకూడదు. ఇప్పుడు గ్రహముల ఆధీనములోని దిశలను తెలుసుకొందాము.

ఈ విధముగా పన్నెండు గ్రహములకు పది దిశలు ఆధీనములో గలవు. పై దిశకు కేతువు, మిత్ర రెండు గ్రహములు అధిపతులుగాయున్నవి. అట్లే క్రింది దిశకు భూమి, చిత్ర రెండు గ్రహములు అధిపతులుగాయుండుట వలన పన్నెండు గ్రహములకు పది గ్రహములు వచ్చినవి. ఇప్పుడు ద్వాదశ గ్రహముల ఆధీనములో ఏయే ధాన్యములున్నవో తెలుసుకొందాము.

పన్నెండు గ్రహముల ఆధీనములోనున్న ధాన్యములను చూచాము కదా! గ్రహముల మిత్ర శత్రు వర్గమునుబట్టి ఆరు గ్రహములు మిత్రులుగా యున్నవి. జాతకునికి జ్యోతిష్యము ప్రకారము ఏవి మిత్రగ్రహములో తెలియును కదా! మిత్రగ్రహముల ఆధీనములోని ఆరురకముల ధాన్యముల వలన ఆ వ్యక్తికి (ఆ జాతకునికి) ఆరోగ్యము చేకూరుననీ, మిగతా ఆరు శత్రుగ్రహముల ధాన్యముల వలన పోషక పదార్థములు లభించవనీ, ఆ ధాన్య ఆహారము వలన అనారోగ్యములు కల్గుననీ చెప్పవచ్చును. గ్రహము లను బట్టి సరిపడని ఆహారమును గుర్తించుకోవచ్చును. ఉదాహరణకు సూర్యుడు శత్రువర్గములోని గ్రహమైతే సూర్యుని ధాన్యమైన గోధుమలతో చేసిన రొట్టెలు, చపాతీలు, పూరీలు మొదలగు పదార్థములను తింటే అజీర్ణముగా ఉండడము, గొంతులో మంట రావడము జరుగు చుండును. అటువంటివారు గోధుమల ఆహారము సరిపోదని బియ్యము అన్నమునే తినుచుందురు. కొందరికి ఉలవలు తింటే విపరీతమైన వేడియగును. కొందరి స్త్రీలకు వేడివలన నెలకు ఒకమారు వచ్చు బహిష్టు (ముట్టు) నెలకాకనే ముందుగానే వచ్చును మరియు ఎక్కువగా వచ్చును. కొందరికి జొన్నలు తింటే సరిపడదు, విరేచనములగును. దానికి కారణము భూగ్రహము వారికి సరిపోదనీ, శత్రువుగా ఉన్నదనీ తెలియవలెను. ఈ విధముగా గ్రహములు వాటి ధాన్యమును గురించి తెలియవచ్చును. ఇప్పుడు పన్నెండు గ్రహములకు ఆధీనములోనున్న దినములను, వాటి పేర్లతో సహా చూద్దాము.

ఇక్కడ పన్నెండు గ్రహముల యొక్క వారముల పేర్లు (దినముల పేర్లు) తెలిసిపోయినవి. గ్రహముల మిత్ర శత్రుత్వములనుబట్టి ఎవరికి ఏ దినము అనుకూలమైనదో, ఏ దినము అనుకూలము కానిదో తెలుసు కోవచ్చును.

ఒక వ్యక్తికి శుభ గ్రహములు (మిత్ర గ్రహములు) ఏవో, అశుభ గ్రహములు (శత్రు గ్రహములు) ఏవో తెలియాలంటే అతని జాఫతకము తెలియాలి. అతని జాఫతకము (జాతకము) తెలియుటకు తప్పనిసరిగా అతని పుట్టిన తేదీ, పుట్టిన సమయము ఉండాలి. పుట్టిన తేదీని బట్టి ఆ దిన తిథి, వారములను తెలియవచ్చును. అలాగే పుట్టిన సమయములను బట్టి ఆ దినము యొక్క నక్షత్రమును తెలియవచ్చును. పుట్టిన తేదీని, సమయమునుబట్టి జ్యోతిష్యులైనవారు ఆ దిన పంచాంగము ప్రకారము జాఫతకమును నిర్ణయింతురు. ఆ దిన పంచాంగమునుబట్టి ఆ వ్యక్తి పుట్టిన సమయములో కాలచక్రమునందు ఏ గ్రహము ఎక్కడున్నది తెలిసి పోవును. అలా తెలిసిన దానినిబట్టి పన్నెండు లగ్నములలో పన్నెండు గ్రహములు ఎక్కడున్నది వ్రాసి చూచుకోవచ్చును. అలా వ్రాసుకొన్న దానిని జన్మలగ్నకుండలి అంటారు. పంచాంగము ప్రకారము జనన సమయములో కాలచక్రములోని సూర్యుడు తన కిరణములను కర్మచక్రముమీద ఎక్కడ ప్రసరించుచున్నాడో దానికి సరిగ్గా కాలచక్రములోనున్న లగ్నమును జన్మ లగ్నముగా లెక్కించబడును. జన్మలగ్నమును తన స్థానముగా (శరీర స్థానముగా) లెక్కించి అక్కడినుండి మిగతా గ్రహములను మిగతా లగ్నము లలో ఉన్నట్లు లెక్కించుకొనవలెను. పంచాంగము ప్రకారము ఏ గ్రహము ఏ లగ్నములో ఉన్నదీ, ఆ లగ్నములో ఏ పాదములో ఉన్నదీ గుర్తించవచ్చును. ఆ విధముగా ఒక మనిషి పుట్టిన సమయమునూ, దినమునూబట్టి ఎప్పుడైనా అతని లగ్నకుండలిని వ్రాసుకోవచ్చును. ఒక్కమారు వ్రాసుకొన్న జాతక లగ్నము అతని జీవితాంతము పనిచేయును. జీవితములో ఏ సమస్యనైనా జాతకములో ఎట్లున్నదో చూచుకోవచ్చును. జన్మ సమయములో ఏ లగ్నము నందు ఏ గ్రహమున్నదో ఆ గ్రహములు కాలగమనములో ఎక్కడ తిరిగినా ఏ లగ్నములో ఉన్నా జీవితాంతము మొదటి నిర్ణయము ప్రకారమున్నట్లే తమ ప్రభావము చూపుచుండును. ఉదాహరణకు ఒక జాతకుని జన్మ సమయముననున్న లగ్నకుండలిని తర్వాత పేజీలోని 51వ చిత్రపటములో చూస్తాము.

51వ పటము.


ఇది ఒక వ్యక్తి 25 సంవత్సరముల క్రిందట పుట్టినప్పుడు ఆ దినమున్న గ్రహములు కాలచక్రములో ఎక్కడున్నది గుర్తించడము జరిగినది. సూర్యకిరణములు కర్మచక్రములోని ఒక స్థానములో పడినప్పుడు దానికి సరిగాయున్న కాలచక్రములోని వృశ్చిక లగ్నమును గుర్తించాము. అదే వృశ్చిక లగ్నమునే జన్మలగ్నముగా చెప్పుచున్నాము. లగ్నములో ఏ గ్రహము లేకున్నా దానికి ఎదురుగా ఏడవ ఇంటిలోనున్న సూర్యుడు, శుక్రుడు ఇద్దరూ లగ్నములోని కర్మను వారి చేతులతో అందుకోగలరు. అందువలన వారు జన్మ లగ్నమైన వృశ్చికములో లేకున్నా ఉన్నట్లే అగుచున్నది. అదే విధముగా కుజ గ్రహము 4, 7, 8 స్థానములలోని కర్మను గ్రహించగలదు. కావున నాల్గవ స్థానమైన ధనుస్సునందునూ, ఏడవ స్థానమైన మీనము నందునూ, ఎనిమిదవ స్థానమైన మేషమందునూ ఉన్నట్లే లెక్కించవలయును. అలాగే గురువు మేష లగ్నములో ఉన్నందున ఆ గ్రహమునకు 5, 7, 9 స్థానములలోని కర్మను గ్రహించునట్లు చేతులు ఉండుట వలన మేషము నుండి ఐదవ లగ్నమైన సింహమునందునూ, ఏడవ స్థానమైన తులా లగ్నము నందునూ, తొమ్మిదవ లగ్నమైన ధనస్సుయందును గురు గ్రహము ఉన్నట్లే లెక్కించుకోవలెను. అట్లే శని గ్రహమునకు కూడా నాలుగు చేతులుకలవని చెప్పుకొన్నాము. ఒక చేతి చేత ప్రస్తుతమున్న కర్కాటక లగ్నములోని కర్మను గ్రహించగా, 3, 7, 10 స్థానములలోని కర్మను గ్రహించునట్లు మిగత మూడు చేతులు ఉండుట వలన శనివున్న లగ్నమునుండి మూడవ లగ్నమైన కన్యాలగ్నమందునూ, ఏడవ లగ్నమైన మకరమందునూ, పదవ లగ్నమైన మేషమందు గల కర్మను గ్రహించగలుగును. అందువలన కన్యా, మకరము, మేషములలో కూడా అన్ని గ్రహములున్నట్లే లెక్కించుకోవలెను. అలా గుర్తించుకుంటే జాతకలగ్నము ఎలాగుండునో ఒకమారు క్రిందగల 52వ చిత్రపటములో చూస్తాము.

52వ పటము.

జన్మలగ్నములో (జన్మ సమయములో) శని కర్కాటకమందు గలదు అయినా అతని చేతుల వలన కన్య, మకరము, మేషములో కూడా ఉన్నట్లు గుర్తించుకొన్నాము. అప్పుడు శని నాలుగు చోట్ల కనిపించుచున్నాడు. అయితే ఆయన వాస్తవముగా ఎక్కడున్నాడు, అతను చేతులుంచిన స్థానము లేవి అని తెలియుటకు, చేతులు గల స్థానములలో గుర్తించిన శని ప్రక్కన ఒక అడ్డగీతను గుర్తుగాయుంచాము. అడ్డగీతలున్న చోట ఆ గ్రహము చేతులున్నట్లు తెలియవలెను. ఈ విధముగా గుర్తించినప్పటికీ అది సంపూర్ణముగా ఎవరికైనా అర్థమగుటకు బయటికి కనిపించునట్లు జన్మ సమయములో లగ్నమైన వృశ్చిక లగ్నమును ఒకటవ నంబరుగా గుర్తించి, అక్కడి నుండి ప్రారంభించి తులా లగ్నము వరకు వరుసగా 12 స్థానములకు అంకెలను గుర్తించుకొనవలెను. అప్పుడు జన్మలగ్నమునుండి ఏ లగ్నము ఎన్నో నంబరుదగుచున్నదో సులభముగా తెలియుచున్నది. తర్వాత పేజీలోని 53వ చిత్ర పటములో అంకెలలో కూడుకొన్న జన్మ లగ్నమును చూస్తాము.

చివరికి ఈ విధముగా జాతకుడు పుట్టిన సమయమున గ్రహములు ఉన్నట్లు గుర్తించుకొన్నాము. మనిషి జన్మ జననముతోనే మొదలగుచున్నది. కావున జన్మ లగ్నమును ఒకటవ నంబరుగా గుర్తించుకోవలెను. ఆ దినము పన్నెండు గ్రహములు ఎక్కుడుండునో ఆ స్థానములనుబట్టి ఆ జాతకునికి జీవితాంతము ఫలితములను లెక్కించవలసియున్నది. జన్మించిన దినమున జనన సమయములో సూర్యుని స్థితినిబట్టి ఆ సమయములోని లగ్నమును జన్మలగ్నముగా గుర్తించుకొనుచున్నాము. ఆ సమయములో పుట్టిన వానిని వృశ్చిక లగ్న జాతకునిగా చెప్పుచున్నాము. కాలచక్రములో ఉన్నది మొత్తము పన్నెండు గ్రహములే అయినప్పుడు, ఇక్కడ జన్మ లగ్న కుండలిలో కనిపించుచున్నది మొత్తము ముప్పైగా ఉన్నవి. గ్రహములకున్న చేతులను
53వ పటము.


కూడా కలిపి గ్రహములుగా లెక్కించితే ముప్పై సంఖ్య వచ్చు చున్నది. మొత్తము గ్రహములున్నది = 12, ప్రతి గ్రహము ఎదురుగాయున్న ఏడిరటిలోని దానిని గ్రహించగల్గుచున్నది. కావున అక్కడ కూడా ఆ గ్రహమున్నట్లు లెక్కించితే 12+12 = 24 అగును. పన్నెండు గ్రహములలో గురు, కుజ, శని ప్రత్యేకించి రెండు స్థానములలోని వాటిని స్వీకరించును. కావున అక్కడ కూడ ఆ మూడు గ్రహములను ఉన్నట్లు లెక్కించుకొంటే 3×2=6 అగును. 24+6ను కలిపితే మొత్తము 30 సంఖ్యగా కనిపించు చున్నది. అదే విధముగా మనము గుర్తించుకొన్న జన్మకుండలిలో 30 గ్రహములు 12 లగ్నములలో కనిపించుచున్నవి. జన్మ లగ్నమున గ్రహములు ఏ స్థానములో ఉన్నవో జీవితాంతము అదే స్థానమునుబట్టి ఫలితమును ఇచ్చుచుండును. ఈ జాతకుని విషయములో ఒక ప్రశ్న వచ్చినది. అదేమనగా! ఈ జాతకుడు భవిష్యత్తులో ఏమి వ్యాపారము చేయును? అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు జవాబును జ్యోతిష్యము ప్రకారము వెదుకవలసినప్పుడు, మొట్టమొదట పన్నెండు గ్రహములలో ఏయే గ్రహములు ఇతని విషయములో మంచిగా (మిత్రులుగా) పని చేయుచున్నవో, ఏయే గ్రహములు చెడుగా (శత్రువులుగా) పని చేయుచున్నవో తెలియవలసియున్నది. జన్మ లగ్నము వృశ్చికలగ్నము కనుక సరి బేసి (2:1) అను సూత్రము ప్రకారము పన్నెండు గ్రహములను మిత్రులుగా, శత్రులుగా విభజించి చూడవచ్చును. మేష లగ్నమునకు 8, 9 లగ్నములుగా వృశ్చికము, ధనస్సుయున్నవి కావున బేసి సరి సూత్రము ప్రకారము వృశ్చిక, ధనస్సు రెండు లగ్నముల అధిపతులు ఆ జాతకునికి మిత్రులుగాయున్నారు. ఆ రెండు లగ్నముల తర్వాత రెండు లగ్నాధిపతులను శత్రువులుగా గుర్తించితే రాహువు, శని శత్రువులుగా యున్నారని తెలియుచున్నది. ఆ విధముగా వృశ్చిక లగ్న జాతకునకు మిత్ర శత్రువులు ఈ విధముగా గలరు.

ఇప్పుడు వృశ్చికలగ్న జాతకునకు శాశ్వతముగా భూమి, కేతు, గురు, కుజ, చంద్ర, సూర్యగ్రహములు మిత్రులుగా ఉన్నారనీ, అలాగే రాహు, శని, మిత్ర, చిత్ర, బుధ, శుక్ర గ్రహములు శాశ్వతముగా శత్రువులై ఉన్నారనీ తెలిసిపోయినది. ఇప్పుడు అడిగిన ప్రశ్న వ్యాపారమును గురించినది. అందువలన వ్యాపారము ఎవరి (ఏ గ్రహము) ఆధీనములో ఉన్నదని చూచిన వ్యాపారము బుధగ్రహము యొక్క ఆధీనములోనిదని తెలిసిపోయినది. వ్యాపారమునకు అధిపతియైన బుధుడు శత్రువర్గములో నున్న గ్రహమైనందువలనా మరియు బుధగ్రహము పాప స్థానమున ఉండుట వలనా, ఆ జాతకునికి వ్యాపారము సరిపోదనీ, ఒకవేళ వ్యాపారము చేసినా అందులో అతనికి నష్టమేవచ్చునని తెలియుచున్నది. అందువలన అతనికి ఏ వ్యాపారమూ సరిపోదని చెప్పవచ్చును. అయితే అతని జీవితము సాగుటకు ఏ జీవనము, (ఏ పనిని) చేయునని అడిగితే దానికి సమాధానము గా ఇట్లు చెప్పవచ్చును. ముఖ్యముగా నాల్గవ స్థానమున చంద్రుడుండుట వలన, చంద్రుడు తొమ్మిదవ స్థానాధిపతి అయినందున, చంద్రుడు పదవ స్థానమైన సింహలగ్నమును తాకుట వలన అతను తన తెలివితో జీవించు ననియూ, చంద్రుని కారణముగా తెలివిగా వాదించు లాయర్‌ పనిని చేయు ననియూ, చంద్రుడు రాజయిన సూర్యుని స్థానమును తాకుచుండుట వలన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా (ప్రభుత్వ లాయర్‌గా) పని చేయుననియూ, అలా కొంతకాలము దాదాపు 12 సంవత్సరములు పని చేసిన తర్వాత న్యాయవాది నుండి న్యాయాధిపతిగా (జడ్జిగా) పని చేయునని చెప్పవచ్చును. పదవ స్థానమును చంద్రుడు చూచుట వలన ప్రభుత్వము తరపున ముద్రణ అధికారముగల వ్యక్తిగా పని చేయునని చెప్పవచ్చును. ఈ విధముగా స్థానమునుబట్టియు, గ్రహమునుబట్టియు చెప్పవచ్చును. కర్కాటకము, సింహము రెండు రాజు మంత్రికి సంబంధించినవి కావున వాటితో సంబంధమున్న వాడు ప్రభుత్వ ధనముతో జీవించుటయేగాక శాసించు అధికారమును కల్గియుండును. చంద్రుడు నాల్గవ స్థానమునుండి పదవ దైన సింహమును తాకుట వలన ముద్రవేసి శాసించు అధికారమును పొందునట్లు చేసి జడ్జిగాగానీ, జస్టీస్‌గాగానీ నిలబెట్టును. అడిగిన ప్రశ్నను బట్టి దానికి సంబంధించిన స్థానమునూ, అలాగే లగ్నాధిపతిని ఆధారము చేసుకొని జవాబును చెప్పవచ్చును.

అతడు (జాతకుడు) పుట్టినప్పుడు తేదీని పుట్టిన సమయమును అతని తల్లితండ్రులు గుర్తించుకొని, తమ కొడుకు 25 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత ఎలా జీవిస్తాడోయని, జ్యోతిష్యున్ని అడుగుట వలన, జ్యోతిష్యుడు జాతకుడు పుట్టిన తేదీని, పుట్టిన సమయమును బట్టి ఆ సంవత్సర పంచాంగమును చూచి, పుట్టిన సమయములో గ్రహములు ఎక్కడున్నాయో తెలుసుకొని, ఆ దిన జన్మ లగ్నమును తెలుసుకోగలిగాడు. జన్మ లగ్నము తెలిసిన తర్వాత జాతకునికి అనుకూలమైన గ్రహములు ఏవో, అనుకూలము కాని గ్రహములు ఏవో తెలుసుకొని, తర్వాత అడిగిన ప్రశ్నకు సంబంధించిన లగ్నమును లగ్నాధిపతిని తెలిసి అప్పటికి జవాబును చెప్పడమైనది. జన్మ లగ్నమునుబట్టి గుర్తించిన ఒకటవ నంబరునుండి పన్నెండు నంబర్ల లగ్నములను పన్నెండు కర్మచక్ర రాశులుగా లెక్కించు కోవలెను. తర్వాతే మేషము మొదలు మీనము వరకు కాలచక్రములో గ్రహములున్నవని తెలియవలెను. పన్నెండు భాగముల స్థలములను (కుండలిని) కర్మ చక్ర రాశులుగా సంఖ్యలతో గ్రహములున్నవి. మేషాది మీనములను పేర్లుగలవి లగ్నములని తెలియవలెను. మొదట ఎవరికైన కొంత తికమకగాయున్నా బాగా యోచించి అర్థము చేసుకొంటే సులభముగా అర్థము కాగలదు. కర్మచక్రములోని పన్నెండు రాశులలో కర్మయుండును. అలాగే కాలచక్రములోని మేషము మొదలగు పేర్లుగల లగ్నములలో గ్రహములు ఉండునని ముందే చెప్పాము. అందువలన జ్యోతిష్యమును చెప్పు ఏ జ్యోతిష్యుడైనా కుండలిలోని ప్రశ్నకు సంబంధించిన స్థానమునూ అలాగే ఆ ప్రశ్నకు సంబంధించిన గ్రహమును ముఖ్యముగా చూచుకొని ఆ రెండిటి ఆధారముతోనే జవాబును చెప్పాలి. ఇప్పటి కాలములో పుట్టిన తేదీ, పుట్టిన సమయము ఉంటే 80 సంవత్సరముల తర్వాత అయినా కంప్యూటర్‌ ద్వారా జాతకలగ్నమును వ్రాసుకోవచ్చును.