జ్యోతిష్య శాస్త్రము/ఇందు (హిందు)వులది జ్యోతిష్యము

44. ఇందు (హిందు)వులది జ్యోతిష్యము మార్చు

ద్వాదశ గ్రహములలో జ్ఞానమునకు అధిపతి చంద్రుడు. చంద్ర గ్రహముతోగానీ, చంద్ర కిరణములతోగానీ సంబంధములేకుండ ఎవరికీ జ్ఞానము లభించదు. త్రిమూర్తులలో ఒకడైన శివుడు భిక్షాటన చేయువాడైనా తన శిఖలో చంద్రవంకను ఉంచుకొన్నాడు. శివుడు చంద్రవంకను శిఖలో పెట్టుకోవడము అలంకారమునకని కొందరనుకొనియుండవచ్చును. అయితే శివుడు చంద్రవంకను అలంకారభూషణమునకు ఆయన చంద్రవంకను తలమీద పెట్టుకోలేదు. జ్ఞానమునకు గుర్తుగా చంద్రున్ని తలమీద పెట్టు కోవడము జరిగినది. తల జ్ఞానమునకు నిలయము. జ్ఞానమునకు చంద్రుడు చిహ్నము. అందువలన తలమీదనే చంద్రున్ని జ్ఞానగుర్తుగా శివుడు పెట్టుకొని చూపించడము జరిగినది. పూర్వము దైవజ్ఞానము గల్గినవారు అన్ని ప్రపంచ దేశములలోకెల్ల ఒక్క భారతదేశములో మాత్రము ఉండెడివారు. అందువలన కృతయుగములోనే ఈ దేశమును జ్ఞానులదేశము అనెడి వారు. చంద్రున్ని జ్ఞాన చిహ్నముగా జ్యోతిష్యములో చెప్పడమువలన జ్ఞానుల దేశమైన ఈ దేశమునకు (భారతదేశమునకు) చంద్రుని దేశమని పేరు ఉండెడిది. చంద్రున్ని ఇందువు అని పిలిచెడివారు. ఇందువు అంటే జ్ఞాని అని లేక చంద్రుడని అర్థము. అందువలన పెద్దలందరూ బాగా యోచించి కృత యుగములోనే భారతదేశమునకు ఇందూదేశమని నామకరణము చేశారు. ఆ పేరు కాలక్రమములో కొంత మార్పుచెంది ఇందు అను శబ్దమును హిందూ అని చెప్పుచూ పలుకుచున్నాము. అలా పలుకుట వలన ఇందూ దేశము కాస్తా హిందూదేశముగా వ్రాయబడుచున్నది మరియు పిలువబడుచున్నది. ఇందూ అంటే జ్ఞాని అని అర్థముకలదుగానీ, హిందూ అంటే ఆ పదమునకు అర్థమేలేదు. మేము జ్యోతిష్యశాస్త్రమును తెలిసి మరియు బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసి, మన దేశ చరిత్ర యుగపర్యంతము తెలిసి, కృతయుగములోనే జ్ఞానులదేశమని పేరుగాంచిన దేశమని ఆ దినము పెద్దలు నిర్ణయించిన ఇందూదేశము అను పేరును చెప్పుచూ, మనము ఇందువులమని చెప్పితే విషయమును గ్రహించుకొను స్థోమతలేని వారు హిందూధర్మరక్షకులమని పేరు పెట్టుకొన్నవారై ఇందూ మతము పరాయి మతము అంటున్నారు.

కృతయుగమునాడే ఈ దేశములోని వారంతా జ్ఞానులుగాయుండి ఇందువులని పేరుగాంచియున్నారు. ఆనాడు వేరే మతమంటూ లేదు. కావున ఇందూమతమని కూడా పేరులేదు. ఉన్నవారంతా ఇందువులే. అయితే కలియుగములో రెండు వేల సంవత్సరముల పూర్వము బుద్ధుని బౌద్ధమతము వచ్చిన తర్వాత దానిని బౌద్ధమంటున్నాము కాబట్టి గుర్తింపు కొరకు దీనిని కూడా ఇందూ (హిందూ) మతమన్నారు. అప్పటికే ఇందూ హిందూగా మారిపోయినది. బౌద్ధమతము బాగా ప్రచారములోనున్న రోజు లలో, అశోకచక్రవర్తియే హిందూ మతమును వీడి తనను బౌద్ధమతస్థునిగా ప్రకటించుకోగా, అశోకుని కొడుకు కూతురు శ్రీలంక, అప్ఘనిస్థాన్‌ మొదలగు దేశములలో ప్రచారము చేయగా, స్వయముగా అశోకుడే బౌద్ధమత వ్యాప్తికి కృషి చేయగా, ఆనాడు ఎందరో జ్ఞానములేని హిందువులు బౌద్ధులుగా మారిపోవడము జరిగినది. అటువంటి సందర్భములో కేరళ రాష్ట్రములో పుట్టిన శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతమును స్థాపించి హిందూమతములో నుండి బౌద్దులుగా మారిపోకుండ కొంత అడ్డుకట్ట వేశాడు. తర్వాత కొంత కాలమునకు అద్వైత సిద్ధాంతముకంటే మెరుగైన సిద్ధాంతముగా విశిష్టాద్వైత సిద్ధాంతమును తమిళనాడునుండి రామానుజాచార్యులు ప్రచారము చేశాడు. తర్వాత కొంతకాలమునకు కర్ణాటక రాష్ట్రమునుండి మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశాడు. ఈ మూడు సిద్ధాంతములు హిందూ మతములోనివే. అద్వైతులు అడ్డనామములను, విశిష్టాద్వైతులు నిలువు నామములను ముఖాన గుర్తుగా ఉంచుకోగా, ద్వైతులు కుంకుమ బొట్టును ధరించారు. అద్వైతులు విభూతిరేఖలను, విశిష్టాద్వైతులు సపేదతో తెల్లనామమునూ, గంగ సింధూరముతో ఎర్ర నామమును తమ సిద్ధాంతము లకు గుర్తుగా ఫాల భాగములో ధరించారు. ప్రస్తుత కాలములో ప్రబోధానంద యోగీశ్వరులుగా త్రైత సిద్ధాంతమును ఇప్పటికి 35 సంవత్సరముల క్రిందటే ప్రకటించి, భగవద్గీతను ముఖ్యముగా ప్రచారము చేయడమేకాక, అద్వైతము లో ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యములను చెప్పుచూవచ్చాము. వాటినే యాభై గ్రంథములుగా వ్రాశాము.

హిందూమతములో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతమును ప్రకటించిన సిద్ధాంతకర్తలు ముగ్గురూ లేరు. త్రైత సిద్ధాంతమును ప్రకటించిన మేము ప్రత్యక్షముగా బ్రతికేయున్నాము. చరిత్రను తెలిసిన మేము మనము మొదట కలియుగములోనే ఇందువులము. నేడు హిందువులుగా చెప్పు కొంటున్నాము. అయితే పెద్దలు పెట్టిన దానిని తీసివేయకూడదని హిందూ అనుచోట ఇందూ అని వ్రాస్తే, మమ్ములను ఏకంగా పరాయి మతము అనువారు నేడు హిందువులలో తయారైనారంటే, మన మతమును గుర్తించలేని గ్రుడ్డివారుగా ఎంత అజ్ఞానములో కూరుకుపోయామో! మీరే ఆలోచించండి. త్రైత సిద్ధాంతము అంటూనే ఇది త్రిత్వము అను చెప్పు క్రైస్తవులదనీ, త్రైత సిద్ధాంత భగవద్గీతను చూచి ఇది క్రైస్తవుల భగవద్గీతయని అనేవారిని చాలామందిని చూచాము. భగవద్గీత పేరును అడ్డము పెట్టుకొని పరమతమును ప్రచారము చేయుచున్నారని మమ్ములను అనేవారు నేడు హిందువులలో ఉన్నారంటే, చెప్పే జ్ఞానము ఏది అని గుర్తుపట్టలేని అజ్ఞాన దశలో నేడు హిందువులు ఉండిపోయారని అర్థమగుచున్నది. ఇట్లేయుంటే హిందూ మతము పూర్తి అజ్ఞానములో కూరుకుపోతుందనీ, అట్లు కాకుండు టకు మేము ‘‘దేవాలయ రహస్యములు’’, ‘‘ఇందూ సాంప్రదాయములు’’ అను పేర్లుగల్గిన గ్రంథములను, భగవద్గీతను ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయుచున్నా మీరు మా ఊరిలో ప్రచారము చేయవద్దండి అని వాదమునకు దిగి, చెప్పిన దానిని ఏమాత్రము వినకుండా మమ్ములను అవమానముగా మాట్లాడినవారు కలరు. ఇదంతయు సాధారణ మనుషులు ఎవరూ చేయలేదు. మమ్ములను ప్రతిఘటించిన వారందరూ, మేము హిందూ ధర్మములను రక్షిస్తామని పేరుపెట్టుకొన్నవారే అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మా కళ్ళ ముందరే ఇంత అజ్ఞాన స్థితిలోనికి పోయిన హిందువులకు పూర్తి జ్ఞానమును కల్పించి, అన్ని మతముల ముందర ఇందూ (హిందూ) జ్ఞానము గొప్పదని అనిపించుటకు కృషి చేయాలనుకొన్నాము. ఆ పద్ధతిలో నేడు మమ్ములను కూడా పరమతమని ద్వేషించినవారు కళ్ళు తెరచి హిందూ (ఇందూ) జ్ఞానము ఎంతో గొప్పదని అర్థము చేసుకొనునట్లు ఇంతవరకు భూమిమీద ఎవరూ చెప్పని గ్రంథములను వ్రాసి ఇచ్చాము. ఇప్పుడు ‘‘జ్యోతిష్య శాస్త్రము’’ అను గ్రంథమును కూడా అందిస్తున్నాము. ఈ గ్రంథమును అందివ్వడములో మీరందరూ తెలుసుకోవలసినదేమనగా! ఇంతవరకు ఒక్క హిందూ (ఇందూ) మతములో జ్యోతిష్యమున కున్న విలువ, గుర్తింపు ఏ మతములోనూ లేదు. జ్యోతిష్యమంటే ఇది హిందువులదని ప్రక్కన పెట్టుచున్నారు. ఎక్కడ చూచినా మతము అనునది ప్రజలలో జీర్ణించి పోయినది. కొన్ని దేశములలో కొన్ని తెగలవారు జ్యోతిష్యమును చెప్పుకొన్నా వారు మనవలె పంచాంగమును గ్రహములను అనుసరించి చెప్పుకోవడము లేదు. మన పంచాంగములు వారికి ఏమాత్రము అర్థము కూడా కావు. పంచాంగములు వ్రాసుకోవడము దాని ప్రకారము గ్రహములను లెక్కించుకోవడము ఒక్క హిందూమతము లోనే కలదు. అయినా ఇక్కడ కూడా (హిందువులలో కూడా) నాస్తికులు తయారై జ్యోతిష్యము మూఢనమ్మకమనువారు కలరు. మీరెందుకు అలా అంటున్నారని మేము వారిని అడుగగా జ్యోతిష్యములో మేము అడిగిన ప్రశ్నలకు సరిగ్గా ఎవరూ సమాధానము చెప్పలేదు. శాస్త్రబద్ధముకాని సమాధానము చెప్పారు. అందువలన జ్యోతిష్యము అశాస్త్రీయము, అబద్ధము, మూఢనమ్మకమని అన్నామని చెప్పుచున్నారు. వారికి మేము చెప్పు సమాధానమేమనగా! ఒక విద్యార్థి సరిగా చదువుకోకపోతే, అడిగిన దానికి సరిగా సమాధానము చెప్పకపోతే ఆ విద్యార్థిది తప్పగునుగానీ, చదువుది తప్పుకాదు. అలాగే కొందరు జ్యోతిష్యులు జ్యోతిష్యమును సరిగా తెలియక సరియైన సమాధానము చెప్పనప్పుడు వారిది తప్పగునుగానీ, జ్యోతిష్యముది తప్పెలాగగును. గణితమును తప్పుగా చెప్పితే చెప్పినవానిది తప్పగును గానీ గణితము తప్పుగాదు కదా! గణితము శాస్త్రము అది తన పరిధి ప్రకారమే నడుచును. అట్లే జ్యోతిష్యము కూడా షట్‌శాస్త్రములలో ఒక శాస్త్రము దాని విలువలు ఎప్పుడూ మారవు. అటువంటి జ్యోతిష్యము నేడు హిందువులది అని పేరు రావడము మన (హిందువుల) అదృష్టమనియే చెప్పవచ్చును ఎందుకనగా! గణితశాస్త్రముగానీ, ఖగోళశాస్త్రముగానీ, రసాయనశాస్త్రముగానీ, భౌతికశాస్త్రముగానీ జాతీయశాస్త్రములుగా ప్రపంచ మంతా ఒప్పుకొనుచుండగా జ్యోతిష్యము శాస్త్రమేకాదని హిందువులకు దానిని అప్పజెప్పడము అన్ని విధముల మంచిదే. ఇంకొక విషయము ఏమంటే బ్రహ్మవిద్యాశాస్త్రమును కూడా ఇది ఇందూ (హిందూ) మతముది అని చెప్పడము వారికి తెలియకనే మనకు మర్యాద ఇచ్చినట్లయినది. నేడు ఇతర మతములవారందరూ జ్యోతిష్యమునూ, బ్రహ్మవిద్యనూ మూఢ నమ్మకముగా పరిగణిస్తూ ఆ రెండిటిని హిందూ (ఇందూ) మతమునకు వదలివేశారు.

నేడు సూర్యచంద్ర మొదలగు గ్రహములను ఆధారము చేసుకొని చెప్పు జ్యోతిష్యము భారతదేశములో ఇందూమతము (హిందూమతము) లోనే కలదని చెప్పుచున్నాము. అయితే ప్రాచీనులైన మన పెద్దలు ఎంతో తెలివిగా ఎన్నో విషయములను కనుగొని వాటిని మనకు అందించినా, చివరకు విలువైన ఆ సమాచారమును కొంత జారవిడుచుకొన్నామని తెలియు చున్నది. అలా జారవిడుచుకొన్న వాటిలో ద్వాదశ గ్రహములుపోయి నవ గ్రహములైనవి. ఏ విధముగా ఇందూ అను మాటను జారవిడుచుకొని అందులో కొంతయినా హిందూ పదమును పట్టుకొన్నట్లు, ద్వాదశ గ్రహములను జారవిడుచుకొని చివరకు నవగ్రహములను మాత్రము పట్టు కొన్నాము. ఇప్పుడు మేము ఏ విధముగా ఇందూ ఫతమునకు (హిందూ మతమునకు) పూర్వ వైభవము తేవాలనుకొన్నామో, అలాగే పూర్వము ‘‘జ్యోతి శాస్త్రము’’ అను పేరుతోయున్న దానికి పూర్వవైభమును తెచ్చుటకు నేడు మార్గము తప్పి జ్యోతి పోయి జ్యోతిష్యము అయినట్లు పన్నెండు పోయి తొమ్మిదిగాయున్న గ్రహములైన వాటిని తిరిగి పన్నెండు చేసి జ్యోతిష్యమును తిరిగి జ్యోతిని చేయుటకు ప్రయత్నిస్తాను. జ్యోతి వెలుగులో దేనినైనా చూచి చెప్పగలుగుటకు అందరినీ తయారు చేయుటకు ప్రయత్నిస్తాము. హిందూ (ఇందూ) ఫతమునకు వదలివేసిన జ్యోతిష్యశాస్త్రమునూ, బ్రహ్మ విద్యాశాస్త్రమునూ అందరికీ ఉన్నతస్థాయిలో కన్పించునట్లు చేయుటకు ప్రయత్నిద్దాము. అందుకు తగినట్లుగా హిందువులందరూ తమ పిల్లలు పుట్టిన సమయమును వ్రాసుకొని కంప్యూటర్‌లోని సాప్ట్‌వేర్‌ ద్వారా జాతక చక్రమును అప్పటి కాలగ్రహముల అమరికను ప్రింట్‌ అవుట్‌ తీయించుకొని పెట్టుకోవలెను. మొదట ప్రతి హిందువు తమ జాతకచక్రమును తమవద్ద యుంచుకొంటే దానిని గురించి తెలుసుకొనుటకైనా కర్మచక్ర జ్ఞానమును తెలుసుకోవచ్చును. దాని అనుబంధముతో బ్రహ్మవిద్యనే తెలియవచ్చును.