రెండవ కూర్పునకు

పీఠిక.

విజ్ఞానచంద్రికా మండలి వారి ప్రోత్సాహమువలన మొదటికూర్పు వేయిప్రతులును సంవత్సరములోపలనే అమ్మకమైనందునను, ప్రస్తుతము రమారమి 300 దరఖాస్తు లీ పుస్తకముకొరకై వచ్చియున్నందునను, ఇంతత్వరలో రెండవకూర్పు అచ్చొత్తింపవలసివచ్చినది. నాకు ఈసంవత్సరముగూడ బొత్తుగ సావకాశము లేకపోవుటచేత నేను చేయదలచుకొనినమార్పులను నాకుసంతృప్తియగునట్లుగా చేయలేకపోయినను నాకుగల విశ్రమకాలమునంతయును వినియోగించి రమారమి 30 పటములను క్రొత్తగచేర్చి చదువరులకు మరింతసులభముగ బోధయగునట్లు జేసితిని. చివరభాగమున నొక ప్రకరణమునుగూడ క్రొత్తగ జేర్చితిని. వృక్షశాస్త్రమును మాత్రము చదువుకొన గోరువారి కనుకూలముగ నుండునట్లు గ్రంథమును రెండుభాగములుగ విడదీసి విషయమును తదనుకూలముగ కొంతవరకు మార్పుచేసితిని.

స్కూల్ బుక్ అండ్ లిటరేచరు సొసైటీ అను సంఘమువారు ఈ గ్రంథముయొక్క మొదటికూర్పునకు రు 100 లు బహుమానమిచ్చి ప్రోత్సాహపరచినందులకు వారియెడల నాకృతజ్ఞతను చూపుచున్నాను.

ఈకూర్పులో క్రొత్తగ చేర్చబడిన పటములుకొన్ని మహారాజశ్రీ రంగాచార్యులు, ఎం. ఏ., యల్. టి., గారు అరవభాషలో వ్రాసిన వృక్షశాస్త్రముననుసరించి వ్రాయబడినవి. అందులకు వారు మిక్కిలి దయతోనంగీకరించిరి. ఈవిషయమై వారికి మనఃపూర్వకముగా కృతజ్ఞతా వందనము లాచరించుచున్నాను. ఆంధ్రజనులందరును ఈకూర్పునకుగూడ మునుపటివలె తమతోడ్పాటునుజూపి నన్నును విజ్ఞానచంద్రికా మండలి వారిని ప్రోత్సాహపరచెదరని నమ్ముచున్నాను.

ఆచంట-లక్ష్మీపతి.

చింతాద్రిపేట

20-1-1909.

మొదటికూర్పునకు

పీఠిక.

ప్రకృతిశాస్త్ర సంబంధమైన గ్రంథములు మన దేశభాషలందు లేనిలోపము అందరకును తెలిసినవిషయమే. అట్టి గ్రంథములు ఆంగ్లేయభాషయందు పెక్కు లున్నను ఆ భాషాపరిచయము లేని మనదేశస్థులకు అనుపయోగములుగ నున్నవి. ఇప్పుడిప్పుడు కేవలము దేశభాషాజ్ఞానము గలవారు సహితము పశ్చిమదేశ శాస్త్రాదులయందలి విషయములను తెలిసికొనవలయు ననెడికోరిక, గలవా రగుచున్నను, వారికి తమతమ భాషలందు ఆవిషయములను బోధించు గ్రంథము లెవ్వియు లభింపకున్నవి. ఇదిగాక, ఆంగ్లేయభాషయందలి గ్రంథములు ఆ భాషయందు తగినంత పరిశ్రమ చేసినవారికే తప్ప సామాన్య జ్ఞానము గలవారికి బోధపడవు. ఇట్టి గ్రంథములు లేని లోపమును నివారించుటకై విజ్ఞానచంద్రికా మండలివారు ప్రకృతిశాస్త్ర విషయక, గ్రంథముల నాంధ్రభాషయందు ప్రచురింప సమకట్టి, మున్ముందుగ జీవశాస్త్రమును వ్రాయమని నన్ను కోరిరి. వారి కోరికతోపాటు నాకును అట్టి యుద్దేశము చిరకాలమునుండి యున్నందున, ప్రస్తుతము సావకాశ మంతగా లేకున్నను, నా స్వల్ప విరామకాలముల నీగ్రంథరచనకై వినియోగించి దీని నీంతవరకు ముగించితిని.

ఇట్టి గ్రంథమును రచియించుటలో ముఖ్యమైన కష్టము శాస్త్రీయ పదములకు దేశభాషలందు సరియైన పర్యాయపదములు లభింపకుండుటయే. ఈ విషయమున నాశక్తికొలది శ్రమపడి గ్రంథపరిశీలన చేసియును, పండితులతో నాలోచించియును కొంతవరకు సమర్ధించితినని నమ్ముచున్నాను. రసాయన శాస్త్రసంబంధమైన పదముల విషయములో నాగరీప్రచారిణి సభవారిచే నంగీకరింపబడిన వానిని వలయు మార్పులతో వాడితిని.

ఇట్టి శాస్త్రగ్రంథములు పటములు లేకుండ సులభముగా బోధపడవు గనుక నిందు 76 పటములను మిక్కిలి శ్రద్ధతో తయారు చేయించి ఆయాస్థలములయందు వానినిమిడ్చితిని. సాధ్యమైనంతవరకు మన దేశమునందు లభించు జంతువృక్షవర్గములనే గైకొని వానికి పటములను వ్రాయించి యట్టివానిని గూర్చియే ముఖ్యముగా వర్ణించియున్నాను. జంతువులకును వృకములకును గల తారతమ్యములను గ్రహించుటకు క్రిందితరగతి జంతువుల నిర్మాణము తెలిసికొనుట యత్యావశ్యకమై యున్నందున నట్టిజంతువులనుగూర్చి యిందు వర్ణించి యున్నాను. హెచ్చుతరగతిజంతువులగూర్చి ప్రత్యేక గ్రంథమొకటి రచియింప నుద్దేశించినవాడ నగుటచే వానివిషయమై యిందు వివరింపనై తిని. ఈగ్రంథము శాస్త్రపాఠకులగు విద్యార్థులకే గాక, జనసామాన్యమునకుగూడ నుపయోగ పడునిమిత్తమై యుద్దేశింపబడి యున్నందున నట్టివా రికి సులభముగా బోధపడు ననేకాంశముల నిందు వీలుకొలది నిమిడ్చియున్నాను. సూక్ష్మజీవులగూర్చియు హెచ్చుతరగతి వృక్షములగూర్చియు వ్రాయబడిన ప్రకరణము లిందుకొరకే విస్తరించి వ్రాయబడినవి.

ఇందలిపటములు పాఠకులకు కొంతవరకు సహాయముగానుండి దారిచూపుటకు మాత్రమే యుద్దేశింపబడినవి. ఇందు వివరింపబడిన జంతువులను, వృక్షములను సంపాదించి వానిని ప్రత్యక్షముగా సూక్ష్మదర్శనిలో పరీక్షించి చూచినపిమ్మటగాని చదువరులుతృప్తి పొందరాదు.

ఈగ్రంథము వ్రాయుటలో పార్కరు, లౌసన్, మిచ్పల్, ఆలివర్, గ్రిగ్, గ్రీన్ , మొదలగు ప్రకృతి శాస్త్రవేత్తలచే రచియింపబడిన గ్రంథములు నాకు మిక్కిలి యుపకరించినవిగాన వారికి నే నెంతయు కృతజ్ఞుడ నై యున్నాను.

గ్రంథరచన కిదియే ప్రథమప్రయత్న మగుటచేతను, విషయము శాస్త్రీయమగుటచేతను, మొదట వ్రాసిన ప్రతికిని తుదకు నచ్చుపడుప్రతికిని నొక్కొకచో బోలికయే లేకపోవుట తటస్థించునటుల తేప తేప మార్పులుచేసినను వాని కన్నిటికినినోర్చి యీ గ్రంథమును తమ యచ్చుకూటములో ముద్రించుట యందేమి, అక్కడక్కడ నా కనేక సలహాలిచ్చుటయందేమి, మిక్కిలిఓపికయును, శ్రద్ధయునుజూపి నాకు సహాయ మొనర్చిన శ్రీ పరమహంస, విద్యానందస్వాములవారి కెంతయు కృతజ్ఞుడను.

మొదటినుండియు నాయుద్యమమునకు మార్గదర్శకులును, ప్రోత్సాహకులును అగు నామిత్రులు మ-రా-రా శ్రీ, కే. వి. లక్ష్మణరావు, ఎం.ఏ., గారికిని దూబగుంట-రాఘవయ్యగారికిని కృతజ్ఞతాపూర్వకములైన నావందనము లొసంగెదను.

ఈగ్రంథమునందలి పటములను మిక్కిలిశ్రద్ధతో నెప్పటికప్పుడు అచ్చున కందజేయుచు, నా కేవిధమైన శ్రమయును లేకుండ జేసినందుకు చెన్నపురి చిత్రశాలలో ఆరి తేరినవాడగు ఎమ్. పార్థసారధినాయుని మిక్కిలి కొనియాడవలసియున్నది.

ఆచంట-లక్ష్మీపతి.


చెన్నపట్టణము,

చింతాద్రిపేట,

18-12-1907.