జిలుగు వసనాల మణిమయోజ్జ్వల మనోజ్ఞ
జిలుగు వసనాల మణిమయోజ్జ్వల మనోజ్ఞ
కాంచ నాంచిత భూషణగణము పూని
రాజవీథుల రతనాల రథము నెక్కి
వెడలు నిర్జీవ పాషాణ విగ్రహంబ!
చిమ్మ చీకటి పొగల నిశీథ మందు,
క్షుద్ర మందిరాంతర జీర్ణ కుడ్యతలము
లందు కన్నులు మూసి, యానందవశత,
యోగవిజ్ఞాన మబ్బిన యోజ, నొడలు
మరచి కులుకు దివాంధమా! మెరుగు లొలుకు
చలువరాతి మేడల చెరసాల లందు,
తళుకు బంగారు సంకెళ్ళ దాల్చి, లోక
పాలకుని బోలె మురియు నో బానిసీడ!
ఓ కుటిల పన్నగమ! చెవి యొగ్గి వినుడు!
ఏను స్వేచ్ఛా కుమారుడ నేను గగన
పథ విహార విహంగమ పతిని నేను
మోహన వినీల జలధరమూర్తి నేను
ప్రళయ జంఝా ప్రభంజన స్వామి నేను!