జగత్తు - జీవము/జీవితాంతము

జగత్తు - జీవము

3. జీవితాంతము

[మారిస్‌మేటర్లింకు వ్రాసిన "మృత్యువు" అను చిన్న పుస్తకం ఈ వ్యాసానికి ముఖ్యాధారము. మేటర్లింకుపేరు విననివారుగాని, గ్రంధములు చదువనివారుగాని ఉండరు. ఆయన మహాపండితుడు, విజ్ఞాని, తత్త్వవేత్త. ఐహికావరణాన్ని భౌతిక విజ్ఞానదృష్టితో భేదించి, పరమయోగివలె విశ్వరహస్యాల నన్వేషించిన జ్ఞాని. ఆ పుస్తకంలో ఆకర్షకమైనవిశేషమొక్కటుంది. భౌతికవిజ్ఞాన ప్రతిపాదితములైన అందులోని భావములు ఉపనిషదర్థములట్లున్నవి.ఉత్ఫుల్లజ్ఞానేంద్రియంగల జీవి ఆధ్యాత్మిక దృష్టితో చూచినా, భౌతికదృష్టితో చూచినా పరమసత్యం గ్రహింపగలడన్న సత్యం మేటర్లింకు వ్రాతలలో గోచరిస్తుంది. ఆ సత్యం "మృత్యువు" లో నిబిడీకృతమైనది.]

               "జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్యచ,
                తస్మా దపరిహార్యార్థే నత్వంశోచితు మర్హసి. (భగవద్గీత)
      
               "చావును లేమియున్ మనుజ సంతతికిన్ వ్యసనంబు, లందులో
                జావున సంభవించెడు విచార మణంగు దినక్రమంబులో." (హరిశ్చంద్ర)

               "భుచి చావున్ సుఖసుప్తివోలె బడయందో నౌనుగా కక్కటా !
                దివి చావున్ నను చావనీకుము కపర్దిస్వామి ! మృత్యుంజయా !" (కంకణము)

                పరమసుఖదాయినివి, మహా దురిత కలిత
                ఘన భవార్ణవతరణకారిణివి నీవు,
                హీనమతులట్లు భీతిల్లకెల్ల వేళ
                మృత్యు దేవత : నిన్ను బ్రేమించువాడ.

జీవిత ప్రబంధానికి పంచ మాశ్వాసాంతగద్య ; జీవితనాటకానికి తుదిరంగాంతమున వ్రాలు అవనిక ; జీవితనదీప్రవాహానికి సాగరసంగమము ; జీవితవృక్షానికి ఆకురాల్పు ; జీవితమహారాధనకు స్వస్తి; చేతన ప్రవృత్తికి పరిసమాప్తి: ఇది జీవితంయొక్క పర్యవసానము, మృత్యువు. మృత్యువంటే సామాన్యంగా మానవులు దద్దఱిల్లిపోతారు. మృత్యుభావం వారి హృదయాంతరాళంలోవ్యాపించి, దుఃఖప్రేరకమై పీడిస్తుంది. దాని నేవగించినకొలది ఆకర్షిస్తుంది; తలచి భీతిల్లిన కొలది భయోత్పాదకమౌతుంది. పారిపోజూచినవారిని వెన్నాడుతుంది ; మరచిపోనెంచువారిని గద్దించి పట్టి క్రుంగదీస్తుంది.

మృత్యుస్వరూపాన్నే మన మెరుగంగదా, మనకెందుకీ భయము ? దృఢచిత్తంతో మృత్యువునకెదురేగవలసిన సందర్భంలో దానికి వెన్నిచ్చుటకే ప్రయత్నిస్తాము. అనివార్యము, అనుల్లంఘనీయముకదా అనియైన మృత్యువునుగూర్చి నిశ్చితాభిప్రాయ మేర్పరచుకొనుటకు ప్రయత్నించము. మృత్యువు అగమ్యగోచరము. మృత్యుగాంభీర్యం అవగాహన చేసికొనుటకు జవసత్వము లుడిగే వరకు, శ్వాసోచ్ఛ్వాసములకే శక్తిలేనిసమయ మాసన్నమయేవరకు వేచియుంటాము. సాహసోద్దీపితమైన బుద్ధిగలవారమయ్యు మృత్యువునుగూర్చి యోచించుటకు జంకుతాము. దీని పర్యవసానమేమనగా: తుది ఘడియలలో తెన్నెరుగని ఉన్మత్తువలె హాహాకారములతో క్షోభించుట.

అట్లుగాక, కండబలము బుద్ధిబలము నిండుగా నున్నప్పుడే మృత్యువు నెదుర్కొనగలుగు స్థిరదృతి పెంపొందించుకొన్నచో, అవసాన సమయమున భయంకరయాతనాకల్లోలముల దగుల్కొను దుస్థితి ప్రాప్తించదు. భీతావృతమైన హృదయ అగాధములనుండి అవసానప్రార్థన ఆవేదనతో పై కుబుకనక్కరలేదు. మహోన్నత జీవితశిఖరముల నంటు ప్రసన్నభావ పరంపరలే జీవియొక్క అంత్యారాధనగా వెర్లివిరియగలవు. దుర్‌జ్ఞేయమగు జగచ్ఛక్తిని అవగాహన చేసికొనుటకై కాంక్షారహితుడై జీవిచేయు నిర్మలప్రయత్నంకన్న వేరొక దివ్యారాధన గలదా ? మృత్యు వనినంతనే సహజంగా జనించు భయోత్పాతమును విడిచిపుచ్చి, మృత్యువు నొక సామాన్యజీవితధర్మంగా పరిగణించుదము. మృత్యువునకు సంబంధించనివైనను మృత్యువునకారోపింప బడిన లక్షణాలను పరిచ్చేదించగా, ప్రధానంగా తెగిపోయేది అంత్య రోగంలోని దుర్బరావేదన. రోగములు మృత్యువుయొక్క లక్షణాలు కావు ; అవి జీవంయొక్క వికారములు. రోగాన్మాదులెట్టి బాధా పీడితులైనను, ఆరోగ్యోదయమైనంతనే బాములన్నీ మరచిపోతారు. ఆ రోగమేమృత్యువుతో సమాప్తమైనప్పుడు రోగవికారాలను మృత్యువున కంటగట్టి, దుఃఖాశ్రువులతో మృత్యువుకి నిందాభిషేకంచేస్తారు.

మృత్యుముఖంలో మానవు లణుభవించు అంత్యావేదన మానవకల్పితమేగాని, మృత్యుసంబంధమైనదికాదు. మృత్యువుకన్న అంత్యక్షణముల విపరీతయాతనే భయావహము. జీవనజ్యోతి నేకాకి నొనర్చి, నిరాధార నిరంజనమొనర్చి అచింత్యమైన అగాధములలోనికి తృటిలో విసరిపుచ్చు క్షణానికై నిస్సహాయంగా గంటలతరబడి వేచియుండుటే మహాదారుణము.

మృత్యుకోరల జిక్కినవానికి తాననువిభవించుచుండిన వ్యథల జ్ఞానంకన్న వేరుజ్ఞానముండదు. వైద్యసాహాయ్యంతో ఆ వ్యథను దీర్ఘీకరించడమే నేటిసంఘధర్మము. ఎట్టి తీవ్రసంక్షోభజనిత దురంత వ్యధలనై నను సాధ్యమైనంతవరకు పొడగించుటే ప్రధానధర్మమని వైద్యులు తలచెదరు. అహింస పరమధర్మమైనప్పటికి, దారుణక్లేశ యుతమైన అంత్యకాలాన్ని త్వరగా పరిష్కరించరు. ఈపక్షపాతం అసభ్యమని ముందొకప్పుడు తెలిసికొందురు.

మృత్యుభయాన్ని మతం ప్రవేశపెట్టినది. ఆభయం వేళ్లు తన్నినది. మతంపై విశ్వాసం క్షీణిస్తున్నప్పటికి మృత్యుభయం తగ్గలేదు. జీవితంలోని క్రూరాతిక్రూర దుర్భరావేదనలు సైతము జీవాంతమున వేచియున్న అజ్ఞాతయాతనలకన్న సాధువులని నమ్మి, వైద్యులు దీక్షతో రోగులకు ఘటికాప్రయోగం చేస్తున్నారు. దుర్భరావేదనాయుత అవసానకాలాన్ని పొడిగించు ప్రతిక్షణము పరలోకంలో జీవికై వేచియున్న దురంత దుఃఖానుభవంనుండి అపహరింపబడినట్లే భావింతురు. ఐహిక అంత్యదుఃఖము, మరణానంతర అజ్ఞాతదుఃఖము : ఈ రెండిటిలో మాయామేయమగు కాల్పనిక దుఃఖాన్ని పరిహరించుటకు యథార్థమైనదానిని అనుభంచుట కంగీకరిస్తారు. దీనివలన రెండు అనర్థములు : అవసానయాతన పొడగించుటచేత మృత్యుసంత్రాసం సహస్రాధికమౌచున్నది, ఆసన్న మృత్యుభయంచేత అంత్యావేదన పొడగించుటకు ప్రబలప్రయత్నం జరుగుచున్నది.

అయితే, ఆరోగ్యం చెడగానే జీవులు మృత్యువువాత పడతారని ఎట్లు నిశ్చయించడం ? బాధోపశమనానికి ఎట్లు చికిత్స చేయ కుండడం అని వైద్యులు ప్రశ్నింపవచ్చును ; అమితావేదనలపాలైన జీవిని జీవితాంతంవరకు కాపాడకుండినచో, చంపినట్లేకదా అన వచ్చును.

యాతనారోపితమైన మృత్యువు మహాబీభత్సంగా గోచరించుటచేత అంత్యదుఃఖాన్ని పొడగించుటే ధర్మమనిపిస్తున్నది. కాని, ఈ యాతన మృత్యుసంబంధమైనదికాదని గుర్తించవలెను. మహా త్రాసజనకమైనది జీవనిర్గమనంగాని, మృత్వ్యాగమనంకాదని తెలిసికొనవలెనేమో ! మృత్యువుని ముష్కరంగా జీవంనిరోధిస్తుంది కాని, జీవంపై మృత్యువు దండెత్తదు. సుషుప్తి కేవలవాంఛనీయము, ఆరోగ్యప్రదము. సుఖనిద్రను మూర్ఖించి త్రోసిపుచ్చినప్పుడు ఆయాసమొందుతారు. అందుచేత నిద్ర నిందార్హమా ? అజ్ఞాన మృగాళికన్న అధిక మరణదుఃఖమనుభవింపచేయుటకే మనజ్ఞాన ముపయోగమగుచున్నది. హాయిగా ప్రతిరాత్రి నిద్రావివశుడైనట్లు, కాలమాసన్నమైనంతనే ఆత్మజ్ఞానోదయమైనజీవి, ఆనందవివశుడై ఐహికబంధనములనుత్తరించును. మృత్యుస్వరూప మెరిగినవారికి సుషుప్తివలె మృత్యువుకూడ ఆనందప్రదమగుటకు సందియములేదు. మృత్యువునుండి అంత్యఘడియల యాతన నుత్తరించినప్పుడు నిర్భయంగా మరణించగలరు. పరలోకావాసం సౌఖ్యప్రదమని విశ్వసించ గలరు.

మరణపూర్వము జీవిపొందు భీకరవేదననేకాక, మరణానంతర పరలోక దుఃఖాలనుసైతము మృత్యువునకారోపించి, మృత్యు స్వరూపాన్ని బీభత్సంగా చిత్రించుకొనుట పరిపాటి. జీర్ణానికే నిర్ణీతమైన పాంచభౌతిక శరీరాన్ని దహించేది మృత్యువా ? జీవాత్మను పరలోక యాత్రకు గొనిపోవునది మృత్యువు; జీవియొక్క ప్రాణానికి విముక్తి ప్రసాదించునది మృత్యువు. శరీరాన్ని దహించేది మనము, వాపోయేది మనము. జీవియొక్క పూర్వాపరాలతో మృత్యువున కెట్టి సంబంధము లేదు. మృతకళేబర సంస్కారము పూర్తియగుసరికి మృత్యువెన్నిలోకాలు దాటిపోతుందో ? భావశిఖరోన్నతాలనుండి సమీక్షిస్తే, పుష్పావసానమునకు, శిలావిశీర్ణమునకు, మాంసక్షయమునకు ఆవంత భేదం లేదు. కాని, విశీర్ణకళేబర దృశ్యం మహాఘోరంగా, హృదయ విదారకంగా ఉంటుంది. పై సత్యం గ్రహించి సమత్వ మలవడచేసికొన్నప్పుడు మనోవైకల్య ముండనేరదు. అగ్నిజ్వాలలో పుష్పించు అమరజన్మమే మృత్యువు. కాబట్టి, ఉత్తరక్రియలగూర్చి విచారింపనక్కరలేదు. ఇక పరలోకావాసత్రాస మొక్కటే మిగులునది. పరలోక యాతనలగూర్చిన మతాభిప్రాయముల విడిచిపెట్టుటే శ్రేయస్కరము. బుద్ధిగోచరమగునట్లు నప్రమాణంగా పరలోక బీభత్సాలను నిరూపించిన మతంలేదు. మానవు డానిరూపణములను విశ్వసించి సహజ సత్యాన్వేషణనుండి విరమించుటకు, అవి అప్రతిహతములై యుండవలెను. సర్వేసర్వత్ర సత్యాన్వేషణమందు నియోగింపబడుటకే చిచ్ఛక్తిమనకు దత్తమైనది. సరళమైన తర్కంచేత విషయ నిర్ణయం చేయవలసిన అగత్యము ప్రతివిషయమందున్నది. సదాచారానికి తర్కాన్ని త్యాగం చేయమనుట ధర్మమా ? బుద్ధినిమించిన అత్యుత్తమశక్తి దైవదత్తమై మనలో గుప్తంగా నుండగా, మన ధీ శక్తినే అనివార్యంగా ఆకర్షించలేని కొన్ని విశ్వాసములను మూఢబుద్ధితో అనుకరించలేదని దైవం శిక్షిస్తే మనమేమి చేయగలము ? తను ప్రసాదించిన పరాత్పరాంశమగు జ్ఞానజ్యోతిని నిరసించి, తిరస్కరించు విషయాల నంగీకరించలేదని దైవం మందలిస్తే, మనమేమిచేయగలము ? దుర్‌జ్ఞేయమగు క్రూరచిద్విలాసానికి, ఘోరతర తంత్రానికి, దౌర్జన్యానికి బలి గావింపబడితిమని విచారించుటకన్న చేయునదేమున్నది ?

మృత్యు వంధకార బంధురము, ఆ అంధకారంలో విజ్ఞాన రశ్ములు వ్యాపించి, మృత్యు స్వరూపాన్ని విశదపరచువరకు, జీవాత్మ పర్యటింపనున్న పరలోకం భయావహమా, కాదా అను విషయం తర్కించవలసినదే.

మరణానంతరము జీవాత్మ కెట్టిగతి ప్రాప్తించును ? మత దృష్టి వినా జీవాత్మ చతుర్విద అవస్థానముల (four kinds of survival) లో ఏదో యొకటి పొందుట కవకాశమున్నదని భౌతిక విజ్ఞానం సూచిస్తున్నది. అవి, సంపూర్ణవినాశము, జీవ సంబంధ చై తన్యంతో అవస్థానము, చైతన్యరహితమైన అవస్థానము, నూతన మగు విశ్వచై తన్యంతో అవస్థానము. సాపేక్షయా వీటిలో దేనికి అధికావకాశమున్నదో విచారణీయము.

సంపూర్ణవినాశం అసంభవముగా తోచుచున్నది. అనంత్యంలో మనం బందీకృతులమై యున్నాము. అనంత్యానికి నిర్గమద్వారములు లేవు. ఒకవస్తువుగాని, ఒకభావంగాని ఈవిశ్వాన్ని, ఆకాశాన్ని, కాలాన్ని నిర్గమించి పోలేవు. మన శరీరంలోని పరమాణువుగాని, నరంయొక్క కంపంగాని, అవి నశించు ప్రదేశానికి పోలేవు. కొన్ని అర్పుదాలక్రితం తేజోవిహీనమై కృశించిన కొన్ని నక్షత్రాల మహోజ్వలకాంతి నిరంతరాకాశయానం చేస్తునే ఉన్నది. విశ్వంలో శూన్యతకు స్థానంలేదు. యోచించినకొద్దీ శూన్యత స్థానవిహీన మౌతుంది. కాబట్టి, జీవాత్మ నశించలేదు.

జీవసంబంధ చై తన్యంతో అవస్థానవిషయమై విచారించగా ప్రధానమైనది "అహం" భావము అనంత కాలాకాశంలో తనపై కేంద్రీకరించునట్లు మనదృష్టిని ఆకర్షించు ఈ "అహం" భావ విశేష మేమి ? "అహం" శరీరానుభవైక విశేషమా ? శరీరసంబంధలేని భావజనితమా ? మనస్సులేనియెడల శరీరానికి ఆత్మచైతన్య ముండగలదా ? మనశరీరం విడిచినపిదప మనస్సు ఏమగును ? మనస్సులేని శరీరాల - మృతశరీరాల - నెరుగుదుము. కాని, శరీరంలేని మనస్సు నెరుగము. ఇంద్రియరహితమైన, పోషకములైన ఇంద్రియ కరణ రహితమైన పరమబుద్ధి యుండవచ్చును. కాని, భూలోకానుభవములే జీవాధారములుగా గల మనబుద్ధి మరణానంతరము తన వ్యక్తిత్వమును గోల్పోకుండమనుచుండుట అసంభవము. "అహం" యొక్క వినాశంగూర్చి యోచించు సందర్బంలో ఈ "అహం" మన మనస్సుకాదని, శరీరం కాదని విశదమౌతుంది. "అహం" రూపంగాదు, పదార్థంగాదు - రూపపదార్థాలు నిత్య పరిణామ మొందునవి. "అహం" జీవంగాదు, ఏమనగా రూపపదార్థాలకు కారణమో కార్యమో అయియుండాలి జీవము. అయితే, అదొక బిందువా ? అది అనిర్వచనీయము. అదొక ధారణపరంపర. భావశ్రేణి ; బాహ్యశక్తులతో ప్రవృత్తించు నిత్యక్రియల సముదాయము.

సంశయగ్రస్తమై, ఊహాతీతమై, క్షణభంగురమైన "అహం" ఒక ఆభాసము. ఈఆభాసవ్యామోహితులమై జీవితసత్యాన్ని పరిగణించము. అనంతకాలాకాశంలో మన శరీరమందలి ద్రవ్యం అత్యద్బుత పరిణామమునకు లో నౌతుంది. భౌతికశరీరం విచ్ఛిన్నంకాగానే, అందులోని పరమాణువులు కొన్ని భూమిని విడిచిపోవచ్చును ; అట్టివాటిలో గొన్ని, భూమినాశ్రయించినవాటిలో గొన్ని, కాలానుసారంగా ఏపరిమళ కుసుమంగానో, సుగంధంగానో, కాంతిగానో, వాయువు గానో, నక్షత్రంగానో పరివర్తనమొంది అనంత సౌభ్యానుభూతి నొందవచ్చును. కాని, ఆవిషయాన్ని ఉదాసీనభావంతో త్రోసి పుచ్చెదము : జగజ్జీవంతో మేళగించువరకు మనధృతి వికసించి, దాని నవగాహన చేసికొని దానిని శాసించగలదన్న భావంకూడ మనకు తృప్తికరం కానేరదు ! అట్టి మహత్తర విషయాలను యోచింపనీయక, ఆదివ్య పరిణామానుభవం మనకు కాజాలదని, అయినప్పటికి సుఖప్రదంకాదని "అహం" భ్రమింపచేస్తుంది.

"అహం" అంతటితో తృప్తినొందదు. "నా మనస్సులోని మహోన్నతభాగాలు, స్వాంతంత్ర్యభాగాలు, చారుతరభాగాలు నిరంతర జీవకళతో శోభాయమానంగా అమందానంద మొందుతే నేగణించును. ఆ అనుభవాలు నావికావు. వాటిని నేనెరుగను. "నావి" అనుభావం కలిగించు బంధములను మృత్యువంతరింపచేసింది. ఆ మనోభాగాలు కాలాకాశములలో తేలుచున్నను, అతి దూరనక్షత్రాలవలె నాకవి అజ్ఞేయములు. బొందిలో బందీకృతుడనై యున్న కాలంలో నాకు ప్రాప్తించిన అనుభవాలను, జ్ఞాపకమున్న విషయాలను సత్యమని భావిస్తాను" అంటుంది "అహం".

అయితే, చైతన్యంగా పరిణమించేది మన శరీరంనుండి ఉత్పన్నమైనదని భావించుదము. ఇంద్రియ దత్తవిషయాలను మనస్సు గ్రహించి సక్రమంగా ఏర్పరుస్తుంది. ఇంద్రియ సంబంధం వర్జించి, ఇంద్రియాలను తన యధీనమందుంచుకొనుటకు అనుక్షణం ప్రయత్నిస్తుంది. కాని, ఈ ప్రయత్నములకు ఆధారములై, ప్రోత్సహించునవి శ్రోత్రత్వక్చక్షూ రసన ఘ్రాణేంద్రియములేకదా !

ఇంద్రియాలే నశించినతరువాత మనస్సు యథాపూర్వంగా ఎట్లుండగలదు ? శరీరంతర్గతమై యున్నప్పుడు తన్ను తానెరిగిన మనస్సు, శరీరాన్ని విడిచి అనంత్యంలో పర్యటించునప్పుడు తన్నెట్లు గుర్తించుకోగలదు ? వయఃపరిపాకంతోనే క్షీణించు ధారణశక్తి, శరీరరహితమై అనంతకాలాకాశంలో తిరుగాడు మనస్సు తన్నుతా గుర్తించుకొనుటకు ఉపచరించునా ?

ఇంద్రియాతీతమైన దివ్యశక్తి మనలో గుప్తమై యున్న దనవచ్చును. దానిని ధృతికూడా కనుగొనలేదు. ఆ అంతశ్శక్తిని "అహం" మాత్రమెట్లు గుర్తించగలదు ? ఆ దివ్యశక్తియే మానవుడైతే వానితోనే అది నశించిపోతుంది. కాబట్టి, జీవ సంబంధమగు చై తన్యంలో అవస్థానము అసంభవము, అచింత్యము. అదొకవేళ సాధ్యమైనప్పటికి భయావహం కానేరదు. శరీరంపోగానే, భౌతికయాతనలు అంతర్థానమగుట నిశ్చయము. ఇంద్రియ జనితములైన మానసిక నైతికవేదనలు సైతము తక్షణమే అదృశ్యమౌతాయి. నిత్యమగు ఆత్మ భూలోక జీవితకాలంలో శారీరక దుఃఖాల ప్రతిఘాతాన్నే అనుభవిస్తుంది. భగ్నప్రేమ, నిరాకృతానురాగము, అపజయము, నైరాశ్యము, కృతఘ్నత, మానహాని మొదలగునవి పంచేంద్రియములద్వారా ఆత్మను బాధిస్తాయి. శరీరవిముక్తమైన జీవాత్మ దుఃఖిస్తే శరీర స్మరణచేతనే దుఃఖించాలి, కాని, దేశకాలాతీతమైన ఆత్మ జీవాను బంధాలగూర్చి విచారించుట అసంభవము.

జీవాత్మ కేవలానందపిపాసి. అమందానందానుభూతియే తల్ల క్షణము. అట్టి జీవాత్మ దుఃఖించక విధిలేనిపక్షంలో తన సంకుచిత పరిమితికే దుఃఖించవలసియున్నది. కాని, కాలాకాశబంధవిమోచన మొందినపుడు తనపరిమితిని గుర్తించుటెట్లు ? గుర్తించి దుఃఖించు టెట్లు ? రెండును దుష్కరములే !

ఇక, చైతన్యరహితంగానో, జీవసంబంధమగు చైతన్యానికి అన్యమగు చైతన్యంతోనో, జీవాత్మ ఉత్తరజీవనం గడపవచ్చును. చైతన్యరహితమైన ఉత్తరజీవనమే సాధ్యమైతే, పరలోక సుఖ దుఃఖానుభవసందర్భంలో అది ఆత్మయొక్క వినాశానికే తుల్యమౌతుంది. అట్టి విషయంలో మృత్యువంటే భీతిల్ల నవసరంలేదు. శరీరం విచ్ఛిన్నమైపోతుంది కాబట్టి శరీరం బాధింపబడలేదు. సుఖదుఃఖ జనకమగు శరీరంనుండి విడిపోయిన మనస్సు అనంతాకాశ గాంభీర్యంలో నిర్వాణ మొందుతుంది ; జీవాత్మ పరమ సుషుప్తిని, శాంతిని పొందుతుంది అని వాదించవచ్చును. దీనికి పూర్వపక్షం లేకపోలేదు. ఎట్టి చైతన్యరహితమైన అవస్థానమని ప్రశ్నిస్తే, జీవ సంబంధ చై తన్యరహితమైనది అంటారు. జీవసంబంధ చై తన్యం అనంత్యంలో నుండుట కవకాశం లేదని తొలుతనే కనుగొన్నాము. అయితే, విశ్వచై తన్యమే లేదంటారు. అది అయుక్తము. కావున, చై తన్య రహితమైన అవస్థాన విషయమై ఇట్లు పురస్కృతమైన వాదము మిథ్యావాదము. మానవధృతిని అలజడిపెట్టు మహత్తరమైన క్లిష్టసమస్యలకు సూక్ష్మంగా ఒకలిప్తలో సమాధాన మొసగుట కేర్పడిన వితండవాదము.

ఈ సమస్య మానవజిజ్ఞాసకన్న మగోన్నతమైనది; మానవ సాహసప్రవృత్తికి అనుగుణ్యమైనది. దీనిని సాధింఞాచుటెట్లు ?

మన కజ్ఞేయమైన ఒకజీవితంగా మృత్యువుని భావించు కొందము. మరణాన్ని సైతం జననంవలె వీక్షించు సమదృష్టి నలవడ చేసికొందము. అట్టితరి, శిశుజననవార్త నాలకించుటకు కడగు కుతూహలంతో మరణ వార్తనుసైత మాలించ కలుగు మనస్థితి ఏర్పడగలదు. జరామరణరహితమై, శాంతయుతమైన నిర్జన్మము, మరణంతో పూర్తిగాని మాయామేయ చరిత్రగల భౌతికజన్మము అను ద్వివిధజన్మములు కలవని భౌతికజన్మకు పూర్వమే మన కెరిగించి, వాటిలో వాంఛనీయమైన దానిని పొందుటకు అవకాశమిచ్చి యున్నచో, భౌతికజీవితాన్ని ఎవరభిలషిస్తారు ? సత్య జ్ఞానాభ్యున్నతిని నిరోధించు ఈక్షుద్రప్రపంచంలో కాలిడుటకు ఎవరంగీకరిస్తారు ? కాగా, భూలోకావాసము నుత్తరించు మరణము నాయిత్తపెట్టు అంత్యకాలమే జీవితంలో శ్రేష్ఠతమమైన భాగము. మరణద్వారం తెఱవబడగానే నిరామయానంత్య విహారార్ధియై జీవాత్మ ఉద్గమిస్తుంది, ఆనందసాగరంలో ఓలలాడుతుంది.

ఈ సాగరంలో "అహం" గతి యేమి ? శరీరంనుండి విముక్తినొంది ఆనంత్యగర్భంలో ప్రవేశించిన "అహం" యొక్క ఒక సూక్ష్మకణం మిగిలియున్నప్పటికి అది మరల ఆనంత్యంలో వర్ధిల్లవచ్చును. ఒకచలనం, ఒక స్పందం, ఒక ప్రసారంగాని నశించలేని ఆనంత్యంలో భావముమాత్ర మెట్లు నశించును ? భూలోకంలో వివిధానుభవములచే పెంపొందిన "అహం" వలె, ఆనంత్యంలో ప్రవేశించిన "అహం" యొక్క కణము వివిధ నూత్నానుభవాలచే ప్రవర్థమానంగా పెంపొంద వచ్చును. భూలోకంలో ప్రత్యేకచై తన్యం సంపాదించగలిగినప్పుడు, "అహా"నికి పరలోకంలో విశిష్టచై తన్యమేల ప్రాప్తించరాదు ? మన కతిప్రియమైన "అహం" ఒక్కదినంలో సృజింపబడలేదే ! మరణ కాలమప్పటి "అహం" జనన సమయ మప్పటి "అహం" గాదు. "అహం" నూతన ద్రవ్యాన్ని, భావాలని లంకించుకొంది ; విచిత్ర పరిణామ పరంపరకు లోనయింది. స్వసంకల్పంచేతకాక, విధిచేత ప్రమాదములచేత సంస్కృతి నొందినది. మన కజ్ఞేయ స్వభావం గలదానికేంద్రకం ఒకభావంకన్న సూక్ష్మం కావచ్చును.

భువిలో జన్మించినపిదప వాతావరణ సంపర్కంవలన ప్రకృతి శక్తుల నిత్యప్రవృత్తివలన మాతృగర్భమందున్నప్పటికంటె విచిత్ర విశేష పరిణామమొందిన మనము, మరణానంతరం భూమిని విడిచి విశాలము, అజ్ఞాతము, ఆనందదాయకము నగు నవీన వాతావరణం జొచ్చినప్పుడు ఎట్టి అత్యద్భుత పరిణామ మొందగలమో అని ఆశించుట సమంజసమే కదా ! దేహంనుండి నిర్గమించిన జీవాత్మ ఆనంత్యంలో మిళితం కాని పక్షమందు ఒక నూతనపదార్థం సంగ్రహించి, కాలాకాశముల నతిక్రమించి, నిరంతరాభ్యుదయ మొందుటకు సందియం లేదు. భూలోకవాస మంతగా వాంఛనీయం కానప్పటికి, నేటి మహోన్నతాశయములే మన భావి పరిణామానికి ఆధారభూతం కావచ్చును. మన మహోత్కృష్టభావములే మరణ పురోగాములై పరలోకమందు మనకు స్వాగతమొసంగ సిద్ధమై యుండవచ్చును. ఆ భావముల నావరించి స్ఫటికీకరించు అనంతము మన స్వభావాను కూలంగా ఉండవచ్చును. పరలోకంజేరి అచ్చట మన జీవితాన్ని సంస్కరించు శక్తి ఎట్టిదైనను మానవశక్తికన్న ఉత్తమోత్తమమై, ఆనందదాయకమగునది కాకతప్పదు.

మనస్సునకొక్కటే దుఃఖము : ఆత్మజ్ఞానము పొందలేదని, అందుకు సామర్థ్యమైనా లేదని. శరీరంనుండి వియోగింపబడిన మనస్సునకు భూలోక దుఃఖస్మరణచే విచారం కలుగవచ్చును. కాని, ఆత్మజ్ఞానం పొందలేని అసామర్థ్యానికి జనించు దుఃఖంముందు ఈ విచారం క్షణికము, క్షుద్రము.

ఆత్మజ్ఞానానుభూతి నాశింపవచ్చునా అంటే జగత్తులో ఆత్మ జ్ఞానం లేనివస్తువుండుట కష్టము. ఏమనగా జగత్తే జ్ఞానము, జ్ఞేయము.

ఆనంత్యంలోనున్న మనస్సు స్వపరిమితని గుర్తింపజాలదు ; గుర్తించినను దాని నతిక్రమిస్తుంది. కాబట్టి పరిమితజ్ఞానజనిత దుఃఖానుభవం లేదు. అగుట, ఆత్మజ్ఞానానుభూతి నొందజాలని పరితాపానికి అవకాశం లేదు. ఆనంత్యంలో సమ్మిళితమైనంత అమందానందప్రా ప్తియే కదా !

ఆనంత్య స్వభావమెట్టిది ? ఆనంత్యం రెండువిధాలుగా గోచరిస్తున్నది. ఒకటి బుద్ధిగోచరమౌచున్నది. రెండవది ఇంద్రియ గోచరమౌచున్నది. బుద్ధితః, కాలాకాశ పరిమితిలేని జగత్తులో నిమగ్నమైయున్నాము. ఈజగత్తునకు అద్యంతములు లేవు. దీని కొక లక్ష్యమున్నట్లు లేదు ; ఉండినట్లయితే గతించిన అనంతకాలంలో సాధించి ఉండెడిది. ఒక గమ్యస్థానం లేదు ; ఉండినట్లయితే ఈపాటి చేరి ఉండెడిది. ఈ అసంఖ్యాఖ భువనాలుగాని, మానవులుగాని విశ్వక్రమాన్ని ఏవిధంగాను మార్చలేరు. జగత్తున కొకభావం లేకపోతే ముందెన్నడు భావించలేదు. భావ మున్నట్లయితే, అనాదిగా అది నిశ్చలావస్థలో నుండెడిది. భావికాలంలో చేయదలచుకొన్న ప్రయోగాలనన్నీ భూతకాలంలో చేసి ఉన్నది. గతించిన అనంతకాలంలో సంభవింపని వేవియును రానున్న అనంత కాలంలో వాటిల్లుతాయనుకొనుటకు అవకాశం కనిపించదు. చై తన్య మయమై యుండనియెడల ముందెన్నడును చై తన్యయుతం కాలేదు. ఇవి బుద్ధిగోచరమైన ఆనంత్యలక్షణములు.

కాని అట్టి ఆనంత్యంలో కోట్లకొలది భువనాలు గోచరించు చున్నవి. ఈ భువనగోళాలు కాలాకాశ పరిమితములై ఉన్నవి. జన్మించడం, మరణించడం, పునర్జన్మించడమే వాటి నైజము భువనాలు జగత్తుయొక్క అవయవములు. ఆద్యంత రహితమైన జగత్తుయొక్క అవయవములు ఆద్యంతసంయుక్తమై ఉన్నవి. ఈ జగద్బాగములనే మనమెరుగుదుము. అవి ఎంత అసంఖ్యాకంగా ఉన్న వంటే, మన స్వల్పదృష్టిలో యావజ్జగత్తుని అవి నింపుతున్నవి. గమ్యస్థానం లేని జగత్తు గమ్యస్థానంగల అవయవ భూయిష్టమై ఉన్నది. ఆశయరహిత మనుకొన్న జగత్తును పరిశీలించగా అత్యంత కుతూహలంతో ఒక విశిష్టాశయాన్ని పాలించుచున్నట్లున్నది. ఇట్లు, ఇంద్రియగోచరమైన జగత్తు బుద్ధిగోచరమైన జగత్తునకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఆ గాంభీర్యం తరచినకొద్దీ మన అజ్ఞానం స్పష్టమౌతున్నది. ఈ రెండు జగత్తులును అభేద్యములే !

ఈ అభేద్యతలో మన మేమౌతాము ? పరిమితకళేబరాన్ని త్యజించినంత మనల నేజగత్తు కబళింపనున్నది ? బుద్ధిగోచరమైన ఆనంత్యంలో మిళితమైపోతామా ? లేక నిరంత పరివర్తనమునకు లోనై యున్న అసంఖ్యాక క్షణభంగుర భువనగోళాలలో చిక్కుపడతామా ? నిరంతరం జరామరణ మొందు ఈలోకాలను విడిచి ఆద్యంతరహితమై, జరామరణమెరుగని నిశ్చలసమాధి పొంద గలమా ? దుఃఖాకరమైన భవచక్రం విడిచిపెట్టి నిరామయము, ప్రశాంతము, అనంతము అగు చై తన్యం పొందగలమా ? ఇంద్రియ బుద్ధులలో ఏది సూచించిన అవస్థ మనకు ప్రాప్తించ నున్నది ? అనంత విశ్వాన్ని శోధించు సందర్భమున బుద్ధి, ఇంద్రియములు కూడ కేవల మనుపయుక్తములైన ఉపకరణములా ? తాత్కాలిక క్షుద్రోపకరములా ?

బుద్ధిగోచర జగత్తునకు, ఇంద్రియగోచార జగత్తునకు గల వ్యత్యాసము అతి స్వల్పమని రవంతవికసించిన మన బుద్ధినే విశదమౌతుంది. అనంతకాలంనుండి మనుచున్న జగత్తులో ప్రతిప్రయోగము చేయబడినదంటే, గణనాతీతమైన గతసంవత్సరములలో సంఘటింపని విషయాలు గణనాతీతమైన భవిష్యద్వ త్సరములలో సైతము వాటిల్ల నేరవంటే, కాలానంత్యానికి లేని ప్రాబల్యం మన ఊహ ఆరోపించినది. ఆనంత్యంలో నున్నవన్నియు కాలంవలె అనంతమైనవే : జగత్తులో సంభవించు సంయోగములు సంఘట్టనలుకూడ అనంతమైనవే : అనుక్షణం జగత్తు చై తన్యం సంగ్రహించుచుండవచ్చును. జగదాశయము జగన్మహత్వములో మరుగుపడింది. రాత్రి దృగ్గోచర మగు అసంఖ్యాక నక్షత్రాలను సముద్రములో నీటిచుక్కవలె పరిణమింపచేయు అనంతభువనాలలో ప్రయోగాలు జరుగుచునే ఉండ వచ్చును. నేటివరకు సంభవింపనిది అకస్మాత్తుగా ఒక్కత్రుటిలో వాటిల్లవచ్చును. తత్ప్రయోగ ఫలితంగా, ప్రమాద ఫలితంగా మనం లాభం పొందవచ్చును. జగచ్చైతన్యోపలబ్ధికి మన భావములు యథాశక్తి దోడ్పడుచుండవచ్చును. ఆశా కిరణ మిందు గోచరిస్తున్నది. జగత్ప్రణాళికలో మానవుడెట్టి నిరర్థకు డై నప్పటికి, తానూహించి గుర్తించగల అమానుష శక్తులకున్న స్థానమే మానవుని కుండితీరవలయును. ఆనంత్యంలో అల్పాధిక భేదంలేదు. ఆనంత్యంలో మనస్సొక ప్రధానస్థానం వహించిన దనుట అతిశయోక్తి కానేరదు.

పరమము, నిగూఢము, సమగ్రము, పరిణామ రహితము, జ్ఞానమయము అగు బుద్ధిగోచర ఆనంత్యం యథార్థమైనను, నిరంతర పరిణామమొందుచున్న ఇంద్రియగోచర ఆనంత్యం యథార్థమైనను, ఏదో ఒక ఆనంత్యంలో నిర్వాణమొందవలసియున్న మనగతి యోచింపవలెను.

ఇంద్రియగోచరమైనది తారామయ ఆనంత్యము, భువన సంకుల ఆనంత్యము. అందులో పరమాణువులు, గ్రహాలు, సూర్యులు, నక్షత్రాలు, నెబ్యులాలు మొదలగు వస్తుసముదాయమే గోచరిస్తున్నది. వీటి నిరంతర సంయోగవియోగములు, ఆకర్షణ ప్రతిహననములు, సంకోచవ్యాకోచములు గమనించి, తన్మూలంగా అపరిమితాకాశాన్ని అనంతకాలాన్ని విభజించి గణింప యత్నిస్తున్నాము. పరిశీలించగా ఈ అనంత్యంలో జీవంయొక్క లక్షణాలే గోచరిస్తున్నవి. చై తన్యం గోల్పోయి ఆనంత్యంతో మేళగింప నున్నను, నామరహితమై, ద్రవ్యరహితమై ఆత్మరహితమైన ఒక విశేషవస్తు ప్రాయంగా "అహం" కాలాకాశాతీతమైన అగాధంలో ముగినిపో నున్నను. ఈ ఆనంత్యంలో మనగతి యేమౌనని ప్రశ్నించుకొనుట నిరర్థకంగాదు. బహుజగద్భూయిష్టమైన విశ్వంయొక్క చరిత్ర నన్వేషిస్తున్నాము. విశ్వచరిత్రము మనచరిత్రమే !

ఆ ఆనంత్యంలో మనం దుఃఖిస్తామా ? ఈకళేబరమున్నంత వరకే మంచిచెడ్డలు, సుఖదుఃఖాలు అనుభవానికి వస్తవి. కళేబరం పోగానే, భౌతిక దుఃఖ సంపర్కమే నశిస్తుంది. అయినను మన ఆత్ర మాగదు. లోకంనుండి లోకానికి శరసన్నిభంగా పోవుచు, భువనాంతరాళాలలో అల్లల్లాడుచు, ఆత్మజ్ఞానం లేని దుర్‌జ్ఞేయంలో తన్ను తానెరుగని మనస్సు భౌతిక దుఃఖవాసనచే పరితపించునా ? అధవా, మనశ్శరీరాలు రెండును లయమైపోయినను వాటికి హేతు భూతమైన శక్తిద్రవ్యాలు రెండును ఏదో రూపంతో ఉండకతప్పదు. వాటిగతి మన గతియేకదా ! మరణానంతరమున జగత్తుయొక్క పరిణామమే మన పరిణామము. భౌతిక రూపంలో అవస్థానమొంద జాలమని "మనకేమి?" అనరాదు. ఆనంత్యంలోనే మనం అను నిత్యం మనుచున్నాము. సర్వము అందుండవలసినదే !

అనినంతనే ఒక ప్రశ్న పరంపర బయలుదేరుతుంది.

మరణానంతరం మనం ప్రవేశించు జగత్తు అధిక బాధాకరమైన క్రొత్తప్రయోగాలకు ఆటపట్టగునా ? ఐహికమే దుఃఖభాజన మైనప్పుడు పరంమాత్రమేల సౌఖ్యప్రదంకావలెను ? ఆనంత్యంలోని నిరంతర సంయోగాలు భౌతిక దుఃఖాలకన్న విషాన్వితంగా ఉండ నేరదని విశ్వాసపూర్వకంగా ఎవరు చెప్పగలరు ? ఇతరగోళాలలో సమగ్ర చై తన్యము, ప్రసన్న భావ ప్రపత్తిగలవా ? ఐనచో, భూలోక శాసనమగు భావము వాటినుండి లాభమేల పొందకున్నది ? ఏకభావ జనితములగు భువనాల అన్యోన్య సంప్రతింపుల కవకాశమే లేదా ? మన ఏకాకిత్వంయొక్క మాయయేమి ? మన భూమియే ఉచ్చస్థితి వహించినదా ? ఇంతకన్న ముందంజవేయజాలకున్న జగద్భావము ఎట్టి తిమిరాన్ని పరిచ్ఛేదింప ప్రయత్నిస్తున్నది ? ఈతిమిర మాత్మోత్పన్నమా ? ఆనంత్యానికీ అభేద్యప్రశ్నలు ఎవరు వేసియున్నారు ? ఆదిని నక్షత్రాలలో ప్రారంభింపబడిన మహత్ప్రయోగాలు, తత్సంపాదిత బలపూర్వకంగాను, భూమిపై విత్తులట్లు ఆకాశంలో సూర్యులను విక్షేపించిన ప్రకృతి స్వభావానుగుణంగాను, భయానక ఫలితాలను గణించకయే యంత్రవత్ జరిగిపోతున్నావా ? అజ్ఞాన తిమిరావృతులమైయున్న మనము, సూక్ష్మదృష్టి సామర్థ్యమే లేని మనము, విశ్వమేధాశక్తి ప్రసాదించిన క్షుద్రభావలేశంతో నిరామయ విశ్వాన్ని సమీక్షించి, అసగ్రమని నిర్ణయించి, ఆత్మవంచకులమైపోతున్నామా ?

ఈ ప్రశ్నలకు సమాధానమెట్లీయగలము ? భావప్రపంచజనక మైన దానినే గ్రహింపలేని మనభావములు ఆనంత్యాన్ని ఎట్లుభేదించి అవగాహన చేసికొనగలవు ? దృష్టిప్రసాదకమైనదానినే చూడలేని మన దృక్కులు అగోచరాన్ని ఎట్లు భేదించగలవు ? యథార్థానికి మనం కాంతినే చూడలేము. అనంతగోళాలలో దేనిపైబడిన కాంతి పరావర్తనమొంది మనకంటజొచ్చునో ఆద్రవ్యాన్నే చూడగలము. లేదేని, అనేక ప్రచండభాను విక్షిప్తమై, అమిత శక్తిపూర్ణమైన ఆకాశము, అపరిమితజవంతో పరుగులెత్తి దిగ్వలయం వ్యాపించు తేజఃకిరణసమూహాలను గ్రసించి లయమొనర్చు అగాధ గాఢాంధ కార మయమైయుండక, కాంతి లతావ్యాప్తమైన మహోజ్జ్వల తేజ స్సాగరమై యుండెడిది -

మన పరిమిత జీవితానికి అపరిహార్యమైన జ్ఞానంలోపడి అట్టిట్టల్లలాడెదము. అగోచరమైన అనంతాన్ని పొందకుండ మన ఇంద్రియములే నిరోధించుచున్నవి. మనుష్యులమై యున్నంత కాలము ఈఅనంత విశ్వతత్త్వాన్ని రవంతైనా బోధపరచుకొనుటకు సాధ్యం కానట్లున్నది. మన పరిమితభావానికి మహోత్కృష్టాశయాలుగా తోచినవాటికై హృదయపూర్వకంగాప్రయత్నించి, అనంతంలో ప్రయత్నములు నశించనేరవని నమ్ముటే జన్మసాఫల్యము.

పై అసాధ్యప్రశ్నలు భయోత్పాదకములు కాకుండుగాక ! మరణానంతరమున మన భవిష్యత్సందర్భంలో ఈ విషమప్రశ్నల కుత్తరం కనుగొనవలసిన ఆవశ్యకతలేదు. విశ్వము నిరంతర పరిణామ మొందుచున్నను లేకున్నను, యావద్విశ్వంగాని, అందలి భాగాలుగాని దుఃఖభాజనమౌట కుత్పన్నము కాలేదు. విశ్వమందొక బిందువును వేధించినను భువనాలను వేధించినట్లే ; భువనాలను వేధిస్తేవిశ్వం తనఅంగములను, తన్మూలంగా తనను వేధించికొనినట్లే !

విశ్వమే ఆత్మశాసనము, ఆత్మాధికారము కావలసియున్నది. లేనిచో, అన్యాధికారానికి అంజలి ఘటింపవలెను. అది అసంభవము. విశ్వము దుఃఖభాజనమైతే, దుఃఖభాజన మగుటకే నిశ్చయించుకొన్నది. విశ్వమందు ఉన్మాదం రేకెత్తినట్లు మనకు గోచరిస్తే విశ్వ నియమాలకు వ్యతిరేకంగా మనబుద్ధి పరుగిడుచున్నదనియే అర్థము. ఊహాతీతమైన విషయాలను గ్రహింపనేరక తబ్బిబ్బైనదనియే భావము ! విశ్వమందు సర్వమానందానుభూతిలో నున్నది. లేక, యాతన, దుఃఖము, రణరణకము ఎరుగని నిర్మలావస్థలో నున్నది. భూలోకానందము మాత్రమేమి ? యాతన, దుఃఖము, రణరణకము లేకపోవుటేకదా !

ఆనంత్యసందర్భంలో సుఖదుఃఖాలను గూర్చి భావించుటే అజ్ఞానము. సుఖదుఃఖవిషయమై మనం పెంపొందించుకొను భావములు మనల నతిక్రమింపజాలనంత భంగురమైనవి. మానవజాతికి ప్రత్యేకమైనవి, ఈ కళేబరంతో రాలి నశించునవి. జన్మసమయమున మన నరాలకొక ప్రమాదం సంభవించినది. తన్మూలంగా స్వల్ప దుఃఖాలకే అవి సంక్షోభిస్తవి. లేదేని, ఐహిక దుఃఖంలో సుభాన్ని పొందగల సామర్థ్యమే సమకూడేది. ఐహికచింతనంలో ఉపద్రవములు, మరణములు, విపత్తులు, తీవ్రసంతాపములు తప్ప మనకు వేరొండు గోచరించవు. శీతలమును, తమోవృతమునైన ఏకాంత అంతర్నక్షత్రాంతరాళములను తలచి కంపించెదము. ఒకసారి కఱడుగట్టుచు, వేరొకసారి మహాగ్నిజ్వాలల కాహుతియౌచు, ఇంకొకసారి పరస్పరం డీకొనుచున్న భ్రమణాయమాన భువనగోళాలు మనభూమికన్న దుఃఖాస్పదమైనవని భావించెదము. జగత్తు యొక్క మేధాశక్తి మతిభ్రష్టయైన నిష్ఠురశాసకమని, తీవ్రోన్మాదియై ఆత్మవేధనయందుత్సాహియైనట్లూహించెదము. చండభానునికన్న సహస్రాంతం పెద్దలైన నక్షత్రాలకు, గణితమందలి అంకెలుగాని, భాషలోని మాటలుగాని పరిమాణ స్వభావములను నిర్వచించలేని నెబ్యులాలకు మన జ్ఞానక్షణికత, నరాల దౌర్బల్యము ఆరోపించెదము. ఆరోపించి, ఆమహోగ్రతాపంలో, ఆ విపరీత శీతలంలో, జీవం వర్థిల్లజాలదని విశ్వసించెదము. మన చర్మానికి కొద్ది కండరముల (papillae) చేర్పుతో, చక్షురాదీంద్రియముల లేశ పరివర్తనముతో ఆమహోగ్రోష్ణమే నవనవోన్మేషవసంత శీతలంకాగలదని, ఆనిశ్శబ్దమే మధురమనోహర దివ్యగానం కాగలదని, ఆ నిశీధమే మహోజ్జ్వల విశ్వ తేజస్సు కాగలదని తెలిసికొనుట సమంజస మేమో ! ఈ ఆగంతుక జీవితమే భయానక విపత్తని, ఆనందాను భూతిని నిరోధించు కాలాకాశముల ఛేదించి మనస్సును జగదానంద సాగరంలో జొరనిచ్చునది మృత్యువేయని భావించుట ఉచితమేమో ! బృహత్పరిమాణంగల నక్షత్రగోళాల లయము, నాశనము, జ్వాలా తప్తము, అన్యోన్యసంఘర్షణము, చూర్ణీకరణము : ఇవన్నియు మహత్ప్రయోగారంభములు. అత్యద్భు తాశోదయములు, అనంత దుర్‌జ్ఞేయజనిత అమందానందములు. ఈ గోళములు కఱుడు గట్టితేనేమి. మహాగ్నిజ్వాలలో భస్మమైతేనేమి, ఒండొరులు వెన్నాడితేనేమి, జనంతో పరిగిడితేనేమి ? మానవశరీరంలోవలె విషాదకరంగా సంయోగింపబడక స్వేచ్ఛగానున్న మనస్సు ద్రవ్యము నిర్మలానంద మొందక తప్పదు. జననము, పునర్జననము తప్ప మరణ మచ్చట లేదు.

ఈ భువనము లొకనాడు సమగ్రనిశ్చలావస్థలో స్తంభీ భూతమైపోయిన పోవుగాక ! అంతటితో వాటికి విపత్తు, వైఫల్యము, మరణము వాటిల్లినదనికాదు ; ఆనంత్యంలో అక్షీణమైన అతిమాత్ర ప్రమాదముల నేవగించి సుందరము, మహోత్కృష్టము, ప్రశాంతము అగు నిశ్చలసమాధి పొందినట్లు. నిశ్చల సమాధియే పరమావధికదా !