జగత్తు - జీవము

2. జీవము

దిగ్వలయాన్ని చిక్కని చీకట్లు ఆవరించుకొన్న నిశాసమయంలో గగనాభిముఖుండై నానావర్ణదీపికలవలె వెలుగొందు తారకా నివహాన్ని తదేకధ్యానంతో చూస్తే మానవునిహృదయము విపరీత యోచనా పరంపరకాలవాలవవుతుంది. విశాలాకాశంలో సూక్ష్మకణాలట్లు గోచరించు నక్షత్రాలగూర్చి యోచించు సమయంలో సృష్టి విచిత్రాలు మనోరంగమున దృశ్యములవలె పరుగిడుతాయి. అప్పుడు, ధరాతలంపై అసంఖ్యాక జీవసంచయాల జన్మవృత్తాంతము, జీవకోటికి ప్రాప్తింపనున్న భవిష్యద్గతి తెలిసికోవడానికి చిత్తం కుతూహలమొందుతుంది. బహుక్లిష్టమైన ఇట్టి వివాదవిషయాల కిదమిద్ధమని సమాధానమీయలేక పోయినను బుద్ధికుశలతచే జీవులయందగ్రస్థాన మలంకరించిన మానవుడు తన సూక్ష్మగ్రహణశక్తి నుపయోగించి ప్రకృతి రహస్యాలను భేదింప నుంకించి కొంతవర కుత్తీర్ణుడగుచున్నాడు.

నిర్మలాకాశంలో గోచరంగాను, అసహాయనేత్రానికిగోచరంగాను ఉన్న నక్షత్రసముదాయంలో మనభూమికన్న చిన్నవి కొలదిమాత్రమే గలవు. లక్షలకొలది భూగోళాలని అవలీల కుక్షి యందిడుకొను నక్షత్రాలు నభోమండలంలో అత్యధికంగాఉన్నాయి. కోటానకోట్ల ప్రపంచాలని అతి సులభంగా గ్రసింపగల బృహత్తారకలుగూడ అచ్చటచ్చటున్నాయి. నక్షత్రసంఖ్య దురూహ్యము. భూలోక సమస్తసముద్రతీరాలపై ఎన్ని ఇసుకరేణువులున్నవో, సుమారన్ని తారక లీజగత్తులో గలవనవచ్చును. విశాలాకాశంలోని వీనిద్రవ్యము (Matter) తో సరిచూచిన మనభూమి ఎంత అల్పమో ఊహింప వచ్చు.

ఆకాశసంచారం చేస్తూన్న తారాకావళిలో కొన్ని కృత్తిక, మృగశిరవలె గణముగా ఏర్పడి పరస్పరసాహాయ్యమున చరిస్తున్నాయి ; సంఖ్యాధికము నిస్సంగపాంథ సందోహమువలె పరిభ్రమిస్తూంది. ఈ అనంతవిశ్వమందు తిరుగుచుండుటచేత ఒక నక్షత్రము ఇంకొకనక్షత్ర ప్రాంతానికైన వచ్చుట బహుదుర్లభము. ఆకాశంలో ఏకాకియై గమించు ఒక్కొక్కతార అపారసముద్రంలో ఒంటరిగా ప్రయాణించు ఓడవలెవుంది. విశ్వార్ణవమున యాత్ర సాగించు తారకానౌకలలో చాల దగ్గరగానున్న ఏరెండింటికై నను నడుమ దశలక్ష యోజనములుండుటచేత పరస్పరంగా అవి కనుచూపు మేరకు వచ్చుటే కష్టము.

కాని కొన్ని మహార్బుదములకు పూర్వము ఒక అపూర్వ విషయము సంభవించినదని కొందరు విజ్ఞానుల అభిప్రాయము. ఒక బృహత్తర ఆకాశంలో తనదారినదిపోతూ సూర్యుని కనుచూపు మేరకు వచ్చుట తటస్థించింది. మన సముద్రాలలో సూర్యచంద్రు లేవిధంగా కెరటాలుద్భవింపజేస్తున్నారో అట్లే ఈ తారగూడ పరస్పరాకర్షణశక్తిమూలంగా సూర్యద్రవ్యాన్ని కలచి తరంగాలని కల్పించి ఉండవలెను. స్వల్పరాశియగు చంద్రునిచే కలుగు చిన్న కెరటాలవలెగాక, అవి అత్యద్భుతంగానుండి ఉండవలెను. ఆతార సూర్యుని సమీపిస్తుండగా పరస్పరాకర్షణశక్తి అధికమవుచూ ఆ తరంగాలనుండి ఒకటి ప్రళయతరంగ (Tidal wave) మై, సూర్యోపరిభాగాన్ని క్రమ్మి అపరిమితాకృతిని దాల్చి ఉండవచ్చును. ఆ తార సూర్యుని సమీపిస్తున్నంతకాలము ఆ ప్రళయతరంగము వృద్ధియగుచునే ఉండవలెను ఇట్లు క్రమక్రమంగా సూర్యసమీపానికి వస్తూన్న నక్షత్రం తిరుగుమోమయేసరికి పరస్పరాకర్షణశక్తి మితి మీరి ప్రళయశక్తియౌటచే, అపరిమితాకృతినున్న సూర్యదవ్యం చిందరవందరై సముద్రతరంగ ఫేనమట్లు ఆశకలాలని చిమ్మి ఉండవలెను. తార తనదారినిపోగా దానినాశ్రయించి వెన్నాడలేని ద్రవ్య ఖండాలు సూర్యునికి దూరంగానుండి, గ్రహాలై, సూర్యునిచుట్టూ నిత్యప్రదక్షణాలు చేస్తున్నాయి. వాటిలో మనభూమి ఒకటి.

సూర్యుడు, నక్షత్రాలు మిక్కిలి వేడిగానున్న అగ్ని గోళాలు. మనభూమిపై నున్న జీవంవంటి జీవం పుట్టడానికికాని పెరగడానికికాని వీలులేనంత తాపక్రమం (Temperature) కలిగి ఉన్నాయి. రవి నుండి పై కెగసిన గ్రహాలు ప్రారంభదశలో అత్యధిక తాపక్రమం గలవే ; కాని క్రమంగా అవి చల్లబారి, అంతరుష్ణాన్ని కోలుపోయి, యిప్పుడు వేడిమికై సూర్యోష్ణప్రసారంపై ఆధారపడ్డాయి. కాల క్రమాన్న, పునరుత్పత్తి మరణాలు తప్ప వేరొక కార్యనిర్వహణానికి సామర్ధ్యంలేని చిన్న క్రిమికీటకాది రూపంలో భూమియందు జీవం ప్రారంభమైంది. నిరాడంబరమగు యిట్టి ప్రారంభదశనుండి వెలువడిన జీవవాహిని మహత్తర క్లిష్టపరిస్థితుల దగిలి పెంపొంది, రస బంధురములై, వాంఛాసముంచితములై, మాధురీధురీణములై, అధ్యాత్మిక చింతానికేతనాయతమతమ్ములు వర్తిల్లు జీవులకు తావలమై పరిణమించింది.

సూక్ష్మవాలుకాకణప్రాయమగు భూమిపై నివసించు మనం కాలాకాశ సంచరిత వసుధను కుక్షియందిడుకొన్న జగత్తుయొక్క యాధార్ధ్యప్రయోజనాలను విమర్శింప పూనుకొంటున్నాం. కాలమంటే స్పష్ట్యాది మానవచరిత్రనంతటిని క్షణకల్పంగా తోపించు ఊహా గమ్యమైన దీర్ఘ పరంపరగా ఉంది. ఆకాశమంటే అనంతమై తారకాగ్రహాలను పరస్పరమగణిత దూరస్థములు కావించి ఏకాకులట్లు భ్రమింపజేస్తూంది. విశ్వద్రవ్యమంటే అపరిమితమై మన భూద్రవ్యానికి చెప్పరానన్నిరెట్లు అధికంగా ఉంది. కావున విశ్వద్రవ్యంలో అణుప్రాయంకన్న సూక్ష్మమై, కాలమహార్ణవంలో ఆకాశవిభాగంచే ఏకాకియై స్పురించు భూమిపై నున్న మనకు విశ్వవిమర్శనం భయోత్పాదకం కాకతప్పదు. విశ్వద్రవ్యం జీవాన్ని నిరాదరించి, జీవాభి వృద్ధికి విముఖమైనట్లు తెలిసినప్పుడు భయకంపితులమౌట సహజమే ! ద్రవ్యంతప్ప శూన్యాకాశంలో అధికభాగం జీవం గడ్డకట్టుకొని పోవునంత శీతలంగానుంది. జీవం తాకడానికికూడ వీలులేనంత మహోగ్రంగా ద్రవ్యముంది. జీవప్రతికూలమగు టేకాక జీవవినాశక సామర్థ్యంగల పలువిధములగు కిరణప్రసారాలు (Radiations) ఆకాశంలో వ్యాపించి నక్షత్రగ్రహమండలాలను అశ్రాంతం మర్దిస్తూన్నాయి. కాగా, జగత్తు జీవానికి విరోధం వహించినట్లు గోచరిస్తూంది.

కేవలం పొరపాటున కాకపోయిన ప్రమాదవశంగా యిట్టి విశ్వంలోనికి మనం విడివడితిమని కొందరి విజ్ఞానుల అభిప్రాయం. విశ్వంలో ప్రమాదాలు వాటిల్లుచుంటాయి. ఈ రీతిగా చాలకాలం విశ్వం పరిఢవిల్లినదంటే ఊహింపదగు ప్రతిప్రమాదం సంభవించడానికి అవకాశముంది. జాత్యంధువులట్లు ఆకాశంలో నిరంతర సంచారమొనర్చు కోటానకోట్ల నక్షత్రాలకు పలువిధములైన ప్రమాదాలు కలుగవచ్చును. కాని గ్రహకూటోద్భవానికి కావలసిన ప్రత్యేకప్రమాదం కొద్దితారకలకే వాటిల్లుతుందని ఒక సిద్ధాంతం. జగత్తులో గ్రహకూటాలసంఖ్య అతిస్వల్పమని గణితజ్ఞులపరిశీలనం. నక్షత్ర గ్రహకూటాలలో గ్రహకూటాలే ముఖ్యమైనవి. భూమిపై నున్న జీవంవంటి జీవం భూమివంటి గ్రహాలందే ఉత్పత్తికాగలదని ప్రకృతజ్ఞానం సూచిస్తూంది. అట్టి గ్రహాలలోనైన జీవోత్పత్తికి యుక్తమగు భౌతికస్థితులు (Physical conditions) మొదట సమకూడాలి ; ద్రవ్యం ద్రవరూపంలో నుండగల యుక్తతాపక్రమం ప్రధానం. దుర్భరోష్ణప్రసక్తములైన నక్షత్రాలు జీవోత్పాతకములు కానేరవు. పరమశూన్యం (absolute zero) కంటె 4 అంశాలు (degrees) హెచ్చు తాపక్రమం - అనగా ఫారన్‌హైట్ మానం [1] పై సుమారు 484 అంశాల శీతలాధికత || - గల ప్రదేశాలకును, అంతకెక్కుడు శీతలాధికతకలిగి దుగ్ధపధా (Milky way) నికి ఆవలనున్న అత్యంత విస్తీర్ణప్రదేశాలకును, ఒకింత ఉష్ణమొనగూర్చు తారావళిని ఆకాశవిక్షిప్త విస్తారాగ్ని సముదాయాలుగా భావింప వచ్చును. ఈ అగ్ని గోళాలకు అతిదూరాన దురూహ్యమై అత్యధిక శీతలాధికతగల చలిన్ని, వాటికతిసమీపంగా ఘనపదార్ధాలని కరగించి మరగించు వేలకొలది అంశాల ఉష్ణోగ్రతగల వేడిమిన్ని గలవు.

ఇట్టి ప్రతివహ్ని గోళానికి నిశ్చితదూరాన ఉండి, దాని నావరించుకొన్న సమశీతోష్ణమండలం (temperate zone) లోనే మన మెరిగిన జీవంవంటి జీవం మనగలదు. చిత్రం 1 లో "అ" అగ్ని గోళం. "క గ చ", "జ ట డ" వృత్తాలకు నడుమన్నున్న ప్రదేశమే సమశీతోష్ణమండలం. ఈ మండ లోపరిప్రదేశమైన "ప బ మ"లో జీవం గడ్డవారుతుంది ; మండలాంతరమైన "త ద న" లో జీవం దహించుకొనిపోతుంది. జీవానికనుకూలమైన యిట్టి మండలాల మొత్తం ఆకాశంలో శతకోటి సహశ్రాంశంకన్న అత్యల్పంగాఉంది.

దీనియందైన జీవోద్భవం మిక్కిలి అపురూపమే. మన సూర్యుని వలె యితర సూర్యులు గ్రహాలని విరజిమ్ముట అసాధారణం అవుట చేత లక్షనక్షత్రాలలో ఒక్కటైన జీవోత్పాదకమండలంలో భ్రమణ మొనర్చు గ్రహాన్ని బడయుట కష్టమౌతుంది.

కావున మనజీవంవంటి జీవానికి తావిచ్చుటకే ప్రధానంగా విశ్వముద్దేశింపబడ్డదను విషయం అవిశ్వసనీయం. అట్లేయైనచో విశ్వంలోగల ద్రవ్యపరిమాణానికి తత్ఫలపరిమాణానికి గల పరస్పర సంబంధం యుక్తంగా ఉండెడిది.

అనుగుణమైన భౌతికావస్థలు తమంత తాము జీవోత్పత్తికి చాలునో చాలవో మనకు తెలియదు. క్రమక్రమంగా భూమి చల్లారిన కొలది సహజంగానేకాక అనివార్యంగా జీవం ఉద్భవించిందని ఒక పక్షంవారి అభిప్రాయం. ఒక ప్రమాదవశాన్న విశ్వంలో భూమి జన్మించినపిదప, భూమి పై జీవముద్భవించడానికి మరియొక ప్రమాదం అత్యావశ్యకమైనదని వేరొక పక్షంవారి ఉద్దేశం. అంగారం (Carbon), జలంలోగల ఆమ్లజని (Oxygen), ఉదజని (Hydrogen) గాలియందధికంగానున్న నత్రజని (Nitrogen) మొదలగు సామాన్య రాసాయనికపరమాణువులే (atoms) ప్రతి జీవపదార్ధంలోను గోచరిస్తూన్నాయి. జీవమేర్పడ్డానికి కావలసిన నానావిధ పరిమాణువు లన్నీ భూమి జన్మించినదాదిగా దానియందుండి యుండును.; ఈపరమాణుసముదాయం "జీవకణం" (Living cell) లో ఉన్న విధంగా ఒకప్పుడు కూడి ఉండవచ్చును. అయిననూ, వివిధపరమాణువుల అసాధారణ సంసర్గంతోనే జీవం ఏర్పడిందా, లేక, యీ అసాధారణ సంసర్గానికి "జీవశక్తి" (Vital Force) తోడపడటంచేత జీవకణం ఏర్పడిందా ? అనగా కల్పనాధురీణుడగు విజ్ఞాని తన స్వాధీనంలో నున్న పరమాణువులతో జీవాన్ని సృష్టింపగలడా ? ఈప్రశ్నలకు సరియైన సమాధానం లేదు. అవి నిర్ణయించగలిగినట్లైతే జగత్తందలి యితర ప్రపంచాలలో జీవముందో లేదో ఊహించడానికి అవకాశముంటుంది. అప్పుడెట్టి భావ పరివర్తనం కలుగునో చెప్పలేం.

సామాన్య పరమాణువులతో జీవపదార్థాలు ఏర్పడుతూన్నను మిక్కిలి పెద్ద అణువులు [2] (Molecules) గా ఏర్పడు సామర్థ్యంగల పరమాణువులే వానియందు బహుళంగా నున్నాయని రాసాయనిక వ్యవచ్ఛేదం (chemical analysis) వల్ల తెలుస్తూంది. పెద్ద అణువులుగా నేర్పడు లక్షణం చాల పరమాణువులకు లేదు. ఆమ్లజని O2, O3 అణువులుగను, ఉదజని H2, H3 అణువులుగను. ఈ రెండును కలిసి H2 O (నీరు), H2 O2 గను ఏర్పడుతున్నాయి. వీటిలో ఏ అణువునందును నాలుగుకన్న ఎక్కువ పరమాణువులు లేవు. వీటికి నత్రజని (nitrogen) కలిపినను ఒక అణువువునందుండు పరమాణువులసంఖ్య అంతగా హెచ్చదు. కాని, అంగారాన్ని చేర్చినప్పుడు గొప్పమార్పు కలుగుతుంది ఆమ్లజని, ఉదజని, నత్రజని, అంగారముగల అణువులలో వందలు, వేలకొలది పరమాణువు లున్నాయి. ఇట్టి అణువులతోడనే ప్రధానంగా జీవరాశు లేర్పడుతున్నాయి. ఈఅణువులతో జీవశక్తి కలియుటచేత జీవమేర్పడిందని గత శతాబ్దం క్రిందటివరకు భావిస్తూండేవారు. కాని, తన పరిశోధనాగారంలో రసాయనిక సంయోగం (chemical synthesis) వలన యూరియా అను అల్పాచమానంలోనున్న ఒక పదార్థాన్ని వోయిలరు (Wholer) తయారుచేసేడు. అప్పటినుండి, శరీరసంబంధమైన మరికొన్ని పదార్థాలని తయారుచేయడానికి సాధ్యమయింది. కావున, జీవశక్తి కారణంగా సంభవిస్తూన్న వని భావింపబడిన కొన్ని దృగ్విషయాలు నేడు రసాయనికశాస్త్ర సూత్రాలనో, పదార్థ విజ్ఞాన (Physics) సూత్రాలనో అవలంబిస్తూన్నట్లు తెలిసింది. అదిగాక, ఇతర పరమాణువులతో గలసి మిక్కిలి పెద్ద అణువులేర్పడుచూ, జీవపదార్థాలలో ప్రధానంగా గాన్పించు అంగార పరమాణువే గాని, జీవపదార్థాలకు నిర్జీవపదార్థాలకు గల భేదకారణం జీవశక్తికాదను నమ్మకం బలం కాజొచ్చింది.

అంగారపరమాణువునకిi అసామాన్య సామర్థ్యముండడం చేతనే విశ్వంలో జీవోత్పత్తి సాధ్యమైనట్లు కనిపిస్తూంది. లోహా (metal) లకును, లోహేతరా (non-metal) లకును సుమారు మధ్యనుండుటచేత రాసాయనికంగా అంగారం కొంత ప్రాముఖ్యం వహిస్తూన్నను, ఇతర పరమాణువులని బహుళంగా బంధించు సామర్థ్యం దాని కెట్లలవడిందో దానిభౌతికనిర్మాణంవలన నేటికిని తెలియదు. దాని పరమాణుభారం 12, పరమాణు క్రమాంకం 6. మూలపదార్థాలపట్టీ (Table of elements) లో అంగారాని కిరు పార్శ్వాలనున్న బోరను (Boron) నత్రజని పరమాణువులకు అంగార పరమాణువునకు గల భేదం స్వల్పమే. బోరను పరమాణువులో కన్న ఒకకక్షీయ ఎలక్ట్రాను అధికంగాను, నత్రజని పరమాణువులో కన్న ఒకటి తక్కువగను అంగార పరమాణువులో నున్నాయి. కాని, ఈ స్వల్పభేదమే జీవోత్పాదక సామర్థ్యానికి హేతువై యుంటుంది. ఈ హేతువు ప్రకృతిరహస్యాలలో ఒకటైయుండుట నిశ్చయం. కాని, అంగారానికి మహత్తర లక్షణాలెట్లు సంప్రాప్తమైనవో గణితశాస్త్రం నేటివరకు పెకలించలేదు.

పరమాణు క్రమాంకం 26 గల ఇనుము (iron) పరమాణువులో అయస్కాంతత్వం (magnetism) పుష్కలంగా నుంది. 27, 28 పరమాణుక్రమాంకాలుగల నికెలు (nickel) కోబాల్టు (cobalt) లలోగూడ ఈ లక్షణం కొలదిగానుంది. ఇతర పరమాణువులలో సుమారు లేదని చెప్పవచ్చును. కాబట్టి, 26, 27, 28, పరమాణుక్రమాంకాలుగల మూలపదార్థాలే అయస్కాంతత్వమును పొందినట్లుంది. 83 మొదలు 92 వరకు పరమాణుక్రమాంకాలుగల పదార్థాలే రేడియో ధార్మికత (Radio-activity) ను కలిగినట్లుంది.

కొన్ని సూత్రాల ననుసరించి విశ్వం వర్తిల్లుతూంది. ఈ సూత్రాలప్రకారంగా నిశ్చిత పరమాణుక్రమాంకం గల మూల పదార్థాలు నిశ్చితమగు ప్రత్యేకగుణాలను ప్రదర్శిస్తున్నాయి. 6, 26 నుండి 28, 83 నుండి 92 కక్షీయ ఎలక్ట్రానులుగల పరమాణువులు క్రమంగా జీవము, అయస్కాంతత్వము, రేడియోధార్మికత అను ప్రత్యేక లక్షణాలను కనుపరుస్తున్నాయి.

అనంత శక్తియుక్తుడగు సృష్టికర్త ఒకేజాతి నియమాలకు బద్దుడయేడనుకొనడానికి అవకాశంలేదు. అగణ్యములైన ఇంకే జాతి నియమాల ననువర్తించునట్లైన ఈ జగత్తును నిర్మించి ఉండవచ్చును. ఇంకొకసూత్రజాలాన్ని ఎన్నుకొన్నప్పుడు కొన్ని కొన్ని పరమాణువులకు కొన్నికొన్ని అసాధారణగుణా లలవడియుండును. ఆ పరిస్థితులలో జీవంగాని, అయస్కాంతత్వంగాని, రేడియోధార్మికతగాని ఏ పరమాణువులో కాన్పింపకపోవచ్చును. కావున, అయస్కాంతత్వము రేడియోధార్మికతవలె జీవంగూడ విశ్వాన్ని శాసించు సూత్రాలఫలితమై ఉండవచ్చునని రసాయనశాస్త్రం సూచిస్తూంది.

అహంకారపూరితుడైన మానవుడు జీవోత్పత్తి కనుకూలించుటచేతనే ఈ సూత్రాలను సృష్టికర్త ఎంచుకొన్నాడని ప్రతిపా దింపవచ్చును. సృష్టికర్తను సుగుణాడ్యుడైన మానవునిగా భావించినంతకాలం ఈ వాదాన్ని సమర్థింపలేము. కాని, మానవాధిక్యతను క్షణకాలం మరచినట్లైతే జీవోద్భవం కొరకే ఈసూత్రాలు నిర్మింపబడ్డాయనడానికి కించిదవకాశమైనలేదని గ్రహింపవచ్చును. సృష్టి రహస్యాలభేదించునప్పుడు జీవశాస్త్రం (Biology) కన్న పదార్థ విజ్ఞానమే ముఖ్యంగా కనిపిస్తూన్నందున అయస్కాంతత్వము రేడియోధార్మికతకొరకే ఈనియమాలను సృష్టికర్త ఎంచుకొన్నాడనవచ్చును. విశాలదృష్టితో చూచినప్పుడు విశ్వంలో జీవానికిగల ప్రాముఖ్యం స్వల్పాతిస్వల్పమని తెలియకతప్పదు ; అప్పుడు జీవం పట్ల సృష్టికర్త పక్షపాతం వహించేడనుకొనుట హాస్యాస్పదమని విశదమౌతుంది.

ఇంత విస్మయజనకంగా మనం జన్మించినట్లు విజ్ఞానం తెలియచేస్తూంది. ఇక, జీవోద్దేశమెరిగి, జీవకోటికి ముందెట్టి అవస్థ ప్రాప్తింపనున్నదో కనుగొనప్రయత్నించినప్పుడు భయమధికమౌతుంది. యధోచితమైన వేడివెలుగులు గల ప్రదేశాలందే మనజీవం వంటి జీవంజనించి వర్ధిల్లుతుంది. సూర్యునినుండి యుక్తమైనతేజోష్ణ ప్రసారాలు భూమిపై పడుతున్నాయి గనుక మనం జీవిస్తున్నాం. ఆ యుక్తపరిమాణం ఏమాత్రమిటునటు చలించినట్లైతే ధరనుండి జీవం అదృశ్యం కావలసిందే ! అట్టి మార్పు సులభనంభవమన్న విషయం విషాదకరం.

సూర్యుని ఆవరించుకొన్న సంకుచితమగు సమశీతోష్ణ మండలంలో తిరుగుతూన్నా భూమిపైనున్న మనకు మును ముందొక "హిమయుగం" (ice age) సంప్రాప్తించేటట్లుంది. సాగర న్యాయంగా గడ్డవారువరకు సూక్ష్మవాలుకాకణం ఒకదానిని పట్టుకొని ఊగులాడడం, మానవౌన్నత్యమంతా తుట్టతుదకు నశిస్తుందన్న జ్ఞానంతో క్షుద్రరంగంపై లిప్తకాలంపాటు సాటోపంగా సంచరించడం, మనమీవిశ్వరంగంలో ప్రవేశించేమోలేదో అన్నట్లు మనతో పాటు మానవప్రభావమంతా సమాప్తమొందడం - ఇదా జీవము ?

  1. తాపక్రమాన్ని కొలవడాని కుపయోగించు ఉపకరణాన్ని "తాపక్రమాపక" (Thermometer) మంటారు. నీటిని ఘనీభవించి మంచుగచేయు తాపక్రమం "హిమస్థానం" (Freezing Point) అను ఒక ప్రధానస్థానంగను, నీరు మరగి ఆవిరికాగల తాపక్రమం "తప్తస్థానం" (Boiling Point) అను రెండవ ప్రధాన స్థానంగను తీసుకొని యీరెండిటి మధ్యనున్న అంతరాన్ని సమానభాగాలు చేసేరు. ఈ భాగాలనే అంశములంటారు. సెంటిగ్రేడు, రూమరు, ఫారన్‌హైటు అను మూడు మానాలుకలవు. పై అంతరాన్ని సెంటిగ్రేడు, రూమరుమానాలలో క్రమంగా 100.80 అంశాలుచేసి, హిమస్థానాన్ని "0" (సున్న) అని, తప్తస్థానాన్ని "100". "80" అని వరుసగా గుర్తించేరు. ఫారన్‌హైటు మానంలో హిమస్థానంవద్ద "32" న్నూ, తప్తస్థానంవద్ద "212" న్నూ గుర్తించి అంతరాన్ని 180 అంశాలుచేసేరు. ఒకే అంతరాన్ని వివిధభాగాలు చేయడంచేత 100 సెం. = 80 రూ. = (212-32) లేక 180 ఫా. రోగార్తులకు జ్వరం కనుగోడానికి సామాన్యంగా ఫారన్‌హైటు మానంగల తాపక్ర మాపకం వాడుకలోనుంది. ||ఋణసంజ్ఞకల మానానికి "శీతలాధికత" అని వాడబడింది.
  2. ఘన, ద్రవ, వాయురూపాలలోనున్న ద్రవ్యమంతా మూలపదార్థాల (Elements) తో ఏర్పడుతుంది. అట్టి మూలపదార్థాలు 92 కలవు. వాటిలోనివి కొన్ని ఆమ్లజని, బంగారం, రాగి, పాదరసం, వెండి. ఏమూలపదార్థాన్నైనా మన సామర్థ్యంకొద్ది తుత్తునియలు చేయగా పరమాణువుకన్న సూక్ష్మంగా ధాగింపలేము. ఒక మూలపదార్థంలోని పరమాణువులు మరియొకదాని పరమాణువులతో కలిసి అణువు లైనప్పుడు నూతనపదార్థమొకటి ఏర్పడుతుంది. ఆమ్లజనిపరమాణువులు ఉదజని పరమాణువులతో కలిసి నీటి అణువులౌతున్నాయి. జలాణువులు ఆమ్లజని, ఉదజని పరమాణువుల గుణాలుకాక పూర్తిగా క్రొత్తగుణాలను ప్రదర్శిస్తూన్నాయి. రెండు వాయువుల సంయోగంవల్ల ద్రవం జనిస్తూంది. సోడ్యము (Sodium) నీటిలోవేస్తే మండుతుంది : క్లోరీను (Clorine) విషవాయువు. కాని యీరెండిటి కలయికచే తినుబండారాలలో అత్యావశ్యకమైన ఉప్పు తయారౌతుంది.


    పరమాణువు కేవలం అవిభాజ్యంకాదు. దానిలో విద్యుద్ఘటికలున్నాయి. అది నిర్మాణంలో సూర్యమండలాన్ని పోలింది. పరమాణువులో ఎన్ని ధన విద్యుత్కణాలైన ప్రోటాను (Proton) లు కలవో అన్ని ఋణవిద్యుత్కణాలైన ఎలక్ట్రాను (Electron) లు కూడ కలవు. ధనవిద్యుత్కణాలన్నీ సౌరమండల సూర్యునివలె కేంద్రం (Center) లో ఉంటాయి. ఎలక్ట్రానులలో కొన్ని కేంద్రాన్ని ఉండగా మిగిలినవి గ్రహాలవలె కక్ష్యలలో తిరుగుతూంటాయి. మూలపదార్థంయొక్క ద్రవ్య రాశి (Mass) ని ప్రోటానులసంఖ్య తెలియచేస్తుంది. దానినే "పరమాణుభారం" (Atomic weight) అంటారు. కక్ష్యలలో భ్రమించు ఎలక్ట్రానులసంఖ్యపై ఆపదర్ధంయొక్కగుణాలు ఆధారపడిఉన్నాయి. ఆసంఖ్యనే "పరమాణుక్రమాంకం" (Atomic number) అంటారు. ఆమ్లజని పరమాణువులో 16 ప్రోటాన్లు. 8 ఎలక్ట్రాన్లు కలిసి కేంద్రబీజం కాగా మిగిలిన 8 ఎలక్ట్రాన్లు కక్ష్యలలో తిరుగుతున్నాయి. కావున దానిపరమాణుభారం 16. పరమాణుక్రమాంకం 8. ఇట్లే, బంగారు పరమాణుభారం 197. పరమాణుక్రమాంకం 79 అన్నప్పుడు, బంగారు పరమాణువులో 197 ప్రోటానులున్నాయని 79 ఎలక్ట్రానులు కక్ష్యలలో తిరుగుచుండగా మిగిలిన 118 (197-79) కేంద్రబీజంలో ఉన్నాయని తెలుస్తుంది.