ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము

శ్రీరామాయనమః

ఛందోదర్పణము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాస్తుతి

శ్రీరామాస్తనమండలీమిళితకాశ్మీరార్ద్రవక్షంబుతోఁ
బారావారతరంగసంగతలసత్పర్యంకనాగంబుపైఁ
గారుణ్యామృతపూరపూరితకటాక్షశ్రీలఁ బెంపొందు గం
భీరస్వాంతుఁ డనంతుఁ డాశ్రితజనాభీష్టప్రదుం డెల్లెడన్‌.

1


చ.

అతని దశావతారవిభవాతిశయంబున లోకమెల్ల శా
శ్వత మగుచాడ్పునన్‌ భజనసమ్యతరల్గదశాక్షరాభిశో
భితమగు వాక్ప్రపంచమది పెద్దయుఁ బ్రస్తుతి నొందనట్టిచో
నతఁడును నమ్మహాక్షరచయంబు జయంబు నొసంగుఁగావుతన్‌.

2

క.

శ్రీవల్లభుయతిగణసం
సేవితపాదారవిందుఁ జింతితఫలదున్‌
భావజగురునలఘుచ్ఛం
దోవినుతు ననంతశయనుఁ దోయజనాభున్‌.

3


క.

ఛందోరీతిగ విమల
చ్ఛందుఁ డనంతుం డొగిం బ్రశంసించి కృపా
మందిరులగు శ్రీమద్గో
విందగురుప్రభులదయఁ బ్రవీణుండగుచున్‌.

4

ఛందః ప్రాశస్త్యము

క.

విద్యలలోపల నుత్తమ
విద్య కవిత్వంబు మఱి కవిత్వము ఛందో
వేద్యము గావునఁ జెప్పెను
హృద్యంబుగఁ గవితచందమేర్పడఁ గృష్ణా!

5

సంజ్ఞాప్రకరణము

గద్యపద్యలక్షణము

గీ.

పరఁగుఁ గవితగద్యఁపద్యంబు లనఁ బాద
కల్పనంబువలదు గద్యమునకు
పాదనియతినొప్పుఁ బద్యంబు లవియు వృ
త్తములు జాతు లనఁగ నమరుఁ గృష్ణ!

6

గురులఘునిర్ణయము

క.

వృత్తంబులు గణబద్ధము
లుత్తమమగు జాతులెల్ల నొనరఁగ మాత్రా
యత్తంబులు లఘువగుఁ బురు
షోత్తమ యొక మాత్ర గురువు నొదవు ద్విమాత్రన్‌.

7


క.

వివిధముగఁ జాఁపిపలికెడు
నవియును మఱియూఁది పలుకునవియును గురువుల్‌
భువి నిలిపిపలుకు వర్ణము
లవియెల్లను లఘువులయ్యె నంబుధిశయనా!

8


క.

గురు వమరు నూర్ధ్వపుండ్రము
ధరియించినరీతి, లఘువు దనరును హరియొ
క్కరుఁడ పరతత్త్వ మనుచును
సురుచిరముగఁ జుట్టివ్రేల జూపినమాడ్కిన్‌.

9


క.

గోవిందప్రభుఁ డనినన్‌
గోవిదు లవి మూఁడుమూఁడు గురులఘువులుగా
భావింతురు గురులఘువులు
మోపఁగ మూఁడేసి నిక్కముగ గణములగున్‌.

10

గణాష్టక లక్షణము

క.

భజన సమయరతగణములు
భజన సమయరతములై సభక్తికమతిఁ బం
కజనాభు నహర్నిశమును
భజించు దిక్పాలగణవిభాతిఁ దనర్చున్‌.

11

గీ.

గురులఘువు లోలిమూఁడేసి కూడిన మన,
లాదిమధ్యావసానంబులందు గురువు
లొంద భజసలు, లఘువు లట్లొంద యరత
లనఁగ నయ్యష్టగణము లొప్పును ముకుంద!

12


క.

చను మగణము 'శ్రీనాథా'
యనిన, 'ముకుందా' యనంగ యగణము, రగణం
బన నొప్పు 'మాధవా' యన,
నొనరఁగ 'వైకుంఠ' యనఁగ నొగిఁ దగణమగున్‌.

13


క.

భగణమగు 'విష్ణుఁడ'నఁగా,
సగణితముగ జగణ మగు 'మురారి' యనంగా,
నగణము 'విభుఁ డ'నిపలికిన,
సగణము 'వరదా' యనంగ సత్కృతులందున్‌.

14


క.

గురువును లఘువును లఘువును
గురువును హవలగును, గలలు గురులఘుసంజ్ఞల్‌
వరుసను గగ లల గణముల
కరయఁగ వర్ణములు ద్విగుణమై యొప్పు హరీ!

15


క.

'శౌరి' యనిన హగణంబగుఁ,
జేరి 'హరీ' యనఁగ నుల్లసిల్లును వగణం
బారయఁ 'గృష్ణా' యనినను
ధారుణి గగ మండ్రు, లలము దా 'హరి' యనినన్‌.

16


సీ.

'కమలనాభా' నగగంబు 'కమఠరూప'
        నహ 'మసురాంతక' నాఁగ సలల

'మద్రిధర' భలంబు 'భద్రయశా' యన్న
           భగురు 'వంభోజాక్ష' మగణలఘువు,
'భువనేశ్వరా' యన్న సవ 'మఘవిద్వేషి'
           సహము 'పీతాంబర' సంజ్ఞ తలము,
'కైటభారి' రలంబు 'గజవరదా' యన్న
           నవ 'మహిశయన' నా నలలమయ్యె


ఆ.

రగణగురువు 'దేవరాజా'యనంగఁ 'బ
ద్మావతీ' యనంగ దగణగురువు
'నరహరీ' యనంగ 'నరహరి' 'నరసింహ'
నాఁగ నొప్పు నగము నలము సలము.

17

ఇంద్రచంద్రాది గణభేదములు

క.

ద్విత్రిచతుర్గురుభవముల
ధాత్రీధర రెండు [1]మడఁపఁ దక్కినగణముల్‌
మిత్రేంద్రచంద్రు లనఁ జను
మాత్రాదిగణంబు మొదల మాత్ర లిడంగన్‌.

18


క.

గలనగణము లినుఁ; డింద్రుఁడు
నలనగసలభరత, లింక నగగ నహ సలా
భల భగురు మలఘు సవ సహ
తల రల నవ నలల రగురు తగ లిందుఁ డజా!

19


గీ.

ఒక్క నెలవున నెనిమిది యొకట నాల్గు
వెండి లఘువెక్కినవి నాల్గు వీనిలోన
నగణపునరుక్తి నొక్కటి డిగియె నౌల
దొంతి పదునాల్గు నిరువదితొమ్మిదింట.

20

సంయుక్త వర్ణ గణంబులు

[2]క.

జగణము నలమగు గగములు
భగణములగు గలము నగణభావంబుఁ గనున్‌
సగము నగణ వగణములగుఁ
దగణము భలమగును సంయుతముఁ దీర్చినచోన్‌!

21


[3]క.

మొగిళులు నలమగు నిటులన్‌
నగణము సగణమగు నిటు లనంగుని తండ్రీ!
తగణము పాళు లనంగా
భగణము వాకిళ్ళు భలము వాకిళులనఁగన్‌.

22

గణ ఫలములు

.

నవ్యసుఖప్రదాయి భగణంబు, జకారము రుక్ప్రదంబగున్‌,
ద్రవ్యముఁ జేయు నా, లయకరంబు స కారము, మా శుభంబు, యా
దివ్యసువర్ణకారి, వెతఁదెచ్చును రేఫ, విభూతినిచ్చుఁ దా,
గావ్యములందు నాదినిడఁ గర్తకు భర్తకు నంబుజోదరా!

23

గణాధిదైవతములు

.

భగణము నేలుఁజందురుఁడు, భానుఁడు దా జగణంబు నేలుఁ, దా
నగణము నేలు నిర్జరగణంబుఁ, సమీరణుఁ డేలు నెప్పుడున్‌
సగణము, నుర్వియేలు మగణంబు, నొగిన్యగణంబుఁ దోయమున్‌,
రగణముఁ బావకుండుఁ, దగణంబు నభంబును నేలుఁ, గేశవా!

24

కృత్యాది వర్జనీయ గణములు నక్షరములు

క.

పుర, శర, రస, గిరి, రుద్రుల
నరయ నకచటతప లిడుట యనుచిత మయ్య

క్షరములును రసభజంబులుఁ
బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా!

25


క.

మొదలును కఖజలు చఛడలు
దధలును భయశక్షషసలు తగ వుపవర్ణా
స్పదములు గాకుండిన మే
లొదవించును స్వరములెల్ల నుత్సవకారుల్‌.

26


క.

మొదల నభంబులు రెండును
గదిసిన విభవంబు తభసగణసంగతి యొ
ప్పదు రయముల నధికశుభం
బొదవును భయములను హానినొందు నృసింహా!

27


క.

ఒనరఁగ శుభవాచకములు
ఘనతరమగు దేవవాచకంబులు నై పే
ర్చినగణములు వర్ణంబులు
ననింద్యములు కృతుల మొదల నహిపతిశయనా!

28


ప్రాసప్రకరణము

క.

ప్రాసం బగు రెండవయది
వాసనగల మొదలి వ్రాయి వడి యనఁబరఁగున్‌
బ్రాసంబు లన్ని యెడలను
బాసురముగ వడులు పాదపాదముల హరీ!

29

క.

ఆదిని గురులఘువులలో
నేది నిలిపె నదియె మొదల నిడి పాదము లు
త్పాదింపవలయు నుపజా
త్యాదుల మిశ్రములఁ దక్క నంబుధిశయనా!

30


ఆ.

కుటిలకుంతలములు నిటలంబుపైఁ దూల
నోట లేక ధేనువాటమునకు
నదె యశోదపట్టి కదలెఁ బొమ్మనినఁ బ్రా
సాది తేటపడుఁ బ్రమోద మొసఁగ.

31


ఆ.

నందనుతుఁడు నాఁగ సౌందర్యనిధి యన
నమరు బిందుపూర్వకము మొదలను
బక్షిగమనుఁ డన నధోక్షజుఁ డన సంయు
తాక్షరాది చెల్లు నసమగురువు.

32


ఆ.

అర్ధబిందుసహిత మగువర్ణమునకుఁ బ్రా
సాది యరయ నిడుదయక్కరంబు
నేఁడు మనకుఁ గల్గినాఁడు లక్ష్మీనాథుఁ
డేఁటి కింక నేఁడు మాట లనఁగ.

33


ఆ.

కుఱుచమీఁదిసున్న మఱి తేల వ్రాయఁ బ్రా
సద్వయాది నిట్లు జరగు నచ్యు
తుఁడు సమస్తవల్లభుఁడు నాఁగ నయ్యచ్యు
తుండు సకలవల్లభుండనంగ.

34

మఱియు ద్వాదశవిధ ప్రాసములు

క.

సమనామ ప్రాసము ప్రా
సమైత్రి ఋత్రిలును ప్రాది సమలఘువు విక

ల్పము బిందు వర్ధబింబ్వా
ఖ్య ముభయ సంయుక్త సంధిగత సంజ్ఞికముల్‌.

35

సమప్రాసము

క.

అరసున్నలు నెఱసున్నలు
నొరసినవర్ణములు జడ్డయును [4]బ్రాసములై
బెరసినచో సమవర్ణము
లరసి నిలుపవలయుఁ దోయజాసనజనకా!

36

1. సమప్రాసము:-

క.

వరువడిఁ బ్రాసములు సమా
క్షరసంశోభితములయినఁ, జాలును మఱి త
త్స్వరవైసాదృశ్యంబులు
పరిహరణీయంబు లందుఁ బంకజనాభా!

37


ఆ.

వీఁడె కృష్ణుఁ డల్లవాఁడె ప్రలంబారి
కొండ యెత్తె నితఁ డతండుద్రవ్వె
నొడ్డగెడవుగాఁగ దొడ్డరా జేలెడి
వీడుఁ నాఁగ బ్రాస మీడువచ్చు.

38


గీ.

ఆయుపేంద్రుని బొడఁగాంచు టేయుపాయ
మనెడు దీర్ఘాదు లచట హ్రస్వాదు లయిన
నయ్యుపేంద్రుని బొడఁగాంచు టెయ్యుపాయ
మన సమప్రాస మగు నూఁదఁజనదు రహల.

39

2. ప్రాస మైత్రి:-

గీ.

లళలు రెండును నొండొంటఁగలసి వచ్చు
నమరు నన్యోన్యమును ఋయుతాయుతములు
బిందుపూర్వమై తమలోనఁ బొందు బమలు
ప్రాసమైత్రికి నిది స్వరూపంబు దెలియ.

40


ఆ.

నీలవర్ణు గర్భగోళంబు నందు లో
కంబు లెల్ల నుండు నెమ్మితోడ
శ్రీకినొడయఁ డుజ్జ్వలాకృతి యితఁ డన్నఁ
బ్రాసమైత్రి యిట్లు పరంగుఁ గృష్ణ!

41


గీ.

తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ
బరఁగు నచ్చపుజడ్డతోఁ బ్రాసమైత్రి
యక్కృపానిధి హరిఁగని మ్రొక్కి రనఁగ
సంభృతాశ్రితుఁ డతిశయోజ్జృంభుఁ డనఁగ.

42

3. ఋ ప్రాసము:-

క.

అరయ స్వరగణ మయ్యు ఋ
కారము ఋప్రాస మనఁగఁ గదియును రేఫన్‌
జేరి తనయురముఁ దన్నిన
యాఋషిపాదంబుఁ బిసికె నచ్యుతుఁ డనఁగన్‌.

43


గీ.

తెల్లమిగ ఋకారము యణాదేశవశత
రేఫ యగుఁట బ్రాసంబయ్యె రేఫ కిట్టు
లిదియె పరవర్ణయుత మయ్యెనేని ప్రాస
మైత్రి యగుఁ గాని రేఫసంబంధి గాదు.

44

4. త్రిప్రాసము:-

గీ.

సంఖ్యఁ బలుకుత్రికారంబుఁ జనుఁ దకార
సదృశమై త్రికారప్రాససంజ్ఞ గలిగి
యాత్రివిక్రముఁ డభయప్రదాత యనఁగ
వాక్త్రిపథగోజ్జ్వలులు విష్ణుభక్తులనఁగ.

45


గీ.

ఈత్రి కారంబునకుఁ దీయ యెసఁగఁ గ్రింది
రేఫ సంప్రసారణమున ఋత్వ మయి తృ
తీయయగు నీత్రికార మర్దించి చూడ
నాతకారంబునకుఁ బ్రాసమయ్యె నచట.

46


గీ.

ఇ ఉ ఋ ఌ ల కచ్చు పరమగునేని
య వ ర లాదేశ మగునట్టి య వ ర ల లకు
నడరి ఇ ఉ ఋ ఌ లాదేశ మయ్యెనేని
యది కృతుల సంప్రసారణ మండ్రు బుధులు.

47

5. ప్రాదిప్రాసము:-

గీ.

ప్రాదియై యనశబ్దంబు ప్రాణ మగుటఁ
బరఁగ నణలకు వేర్వేఱ ప్రాసమయ్యె
క్షోణిధరుఁ డెత్తె నేనుఁగు ప్రాణ మనఁగ
దానవారాతి వ్రేతలప్రాణ మనఁగ.

48

6. సమలఘు ప్రాసము:-

గీ.

ఓలి రేఫతోఁగూడియు నూఁదఁబడక
తేలి తెలుఁగునఁ దమయట్టి వ్రాలతోన
సమలఘుప్రాస మగు ఱెక్కలమరఁబట్టి
విద్రిచె నసురఁ గృష్ణుఁడు దిక్కు లద్రువ ననఁగ.

49

7. వికల్పప్రాసము:-

గీ.

సానునాసికలౌ వర్గహల్లులకుఁ దృ
తీయములు వికల్ప ప్రాసమై యెలర్చు
ప్రాఙ్నగంబుపై రవిదోచెఁ నగ్ని వోలెఁ
బ్రాఙ్ముఖుండై నుతించె నీవాగ్మి యనఁగ.

50

8. బిందుప్రాసము:-

గీ.

వేర్చి పొల్లు నకారంబు బిందు వగుచు
మీఁదనున్న ధకారంబు నూఁదఁ బ్రాస
బంధమగుఁ గృష్ణుఁ డుదయించినం ధరిత్రి
యంతయును నిరుపద్రవం బయ్యె ననఁగ.

51

9. అర్ధబిందుప్రాసము:-

గీ.

సార్ధబిందువు లై తేలినట్టి పటల
కరయఁ బ్రాసంబు నిర్బిందు వైనఁ జెల్లు
వీఁపు మూఁపులు మఱి తలమోపు లయ్యె
మాట లేఁటికి మేటి తాఁబేఁటి కనఁగ.

52

10. ఉభయప్రాసము:-

క.

చూడఁగ లకారరేఫలు
గూడుడకారంబు చను నకుంఠిత గతిఁదో
డ్తోడన నుభయప్రాసము
జాడఁబడును సంయుత ప్రసంగతిఁ గృష్ణా!

53


ఆ.

పాఁడి మరగి బ్రతుకువాం డ్రిల వ్రేఁతలు
వాండ్ర వెన్న లేలఁ దండ్రి! యనఁటి

పండు కొఱకు వింత యిండ్లకు బోకు కృ
ష్ణుండ నీకు బ్రాఁతె పండ్లు నిచట.


గీ.

రలయుతాయుత ప్రాస మార్గము దలంచి
వాండ్ల లేఁ జూపు మోముఁల దీండ్లమారె
ననుచు రెండును గూర్చిన ననువుఁదప్పు
నండ్రు నిఖిలార్థవిదు లైన దండికవులు.

11. సంయుతప్రాసము:-

ఆ.

పాడు నూరు ప్రోలు బహువచనంబులై
పరఁగుచుండు నూఁది పలుకు నపుడు
తేల్చి పలుకునపుడు దీపించు సంయుత
ప్రాస మిరుదెఱఁగుల బద్మనాభ!

55


ఆ.

పాళ్ళు మనుజు లెక్క నూళ్ళు గాఁదొడఁగె న
య్యూళ్ళు మిగుల బలసెఁ బ్రోళ్ళు గాఁగ
భాగ్యవంతుఁ డేలుపాళులు నూళులు
ప్రోళు లయ్యె బ్రాతె కూళులిచట.

56


ఆ.

తెలుఁగునందు లేదు లలిఁ గ్రిందిసుడి గ్రుచ్చె
గ్రుమ్మెనాఁగ రేఫకొమ్ము గాని
ప్రాసమైత్రి చొరదు దా సంయుత ప్రాస
మగును రేఫయుతము ననుసరించి.

57


క.

ఈ క్రిందటి రేఫలుసమమై క్రాలు
చుఁదేలి ప్రాసమగు సంయుక్తం
బా క్రూర నక్ర భయమున, వాక్రువ్వ
దె గజము భక్తవత్సలుననఁగన్‌.

58

12. సంధిగతప్రాసము:-

క.

ధ్రువముగ సంధిజనితరూ
పవిశేషప్రాస మనఁగ బరఁగు పకారం

బవిరళవకార మగు న
య్య వదాఱవపా లెఱుంగ ననఁగ ముకుందా!

59


వ.

అది యెట్లనిన.

60


క.

ప్రథమాంత విభక్తులపైఁ
గథితములగు కచటతపలు గసడదవలగున్‌
బృథివి నివి గజడదబలగుఁ
బ్రథమపు సున్న లగునాంత పదములమీఁదన్‌.

61

ఉదాహరణము:-

గీ.

వాఁడు గనువాఁడు నేకొనువాఁడు డెక్కు
లాఁడు వాఁడు దపోనిధి వాఁడు వెద్ద
చిక్కెఁ గరి మ్రొక్కెఁజెలి వాక్కుఁడక్కు వెట్టె
శౌరిఁ దలఁచేనిన్‌ బిలిచె నాసంధు లిట్లు.

62


ఆ.

ఆయచేత సద్వితీయ దా నిజరూప
మయ్యు నుండుఁ బ్రథమయట్టు లుండుఁ
గ్రతువు గాచె దాశరథి కృష్ణుఁ డొకపర్వ
తమును గొడుగు భంగిఁ దాల్చెననఁగ

63


గీ.

అచ్చుమీఁదచ్చున యకార మాయజుండు
కొమ్ము గలహల్లు ప్రథమైనఁ గ్రుంకు నచ్చు
గురుఁడుపేంద్రుండు పెఱచోటఁ గ్రుంకు నొండెఁ
జను నకారంబు జనులందు జనులయందు.

64


గీ.

ఓలిఁ గర్మధారయ షష్ఠు లుత్వములుగ
నచ్చు తుద నుండ టనుములౌ నాంధ్ర సంధిఁ

గఱుకుటగచరు ల్గట్టి రక్కజపుటుదధి
వితతయశుఁ డైన రాజునానతి ననంగ.

65


గీ.

నుఱులురులు పొల్లు లౌను దెనుంగు నందు
హేమ మిది పదాఱ్వన్నె నల్మోము లతఁడు
ప్రబలి హరిఁ గొల్చియున్న వా ర్పరమ మునులు
గోటిలో నొప్పు సతికిఁ గన్గొన లనంగ.

66


గీ.

ద్విత్వమున కాదివర్ణములు తెనుఁగునందు
నూఁదకుండును వలసిన నూఁదియుండు
జానకీ వల్లభుఁడు క్షమాశాలి యనఁగ
దశరథాత్మజుఁడు స్వామి ధాత్రి కనఁగ.

67


వ.

మఱియు శబ్దాలంకారవిశేషంబులు ప్రాసంబులు నెట్టి వనిన.

68

షడ్విధ ప్రాసములు

క.

అమరఁ గడుదుష్కరము ద్వం
ద్వము త్రి చతుష్ప్రాసములును దగ నంత్యప్రా
సమును ననుప్రాసము ననఁ
గ్రమమున షడ్విధము లయ్యెఁ గంసవిదారీ!

69

1. దుష్కరప్రాసము

క.

దోఃకీలితమణి కటక యు
రః కలిత రమాభి రామ రంజిత సుజనాం
తః కరణ ఖండితారాశి
రః కందుక యనఁగ దుష్కరప్రాసమగును.

70

2.ద్వంద్వప్రాసము

క.

కంజనయన భవభీతివి
భంజన శుకశౌనకాది బహుమునిచేతో
రంజన ద్వంద్వప్రాస మ
నంజను నిప్యాటఁ బల్కిన గృతు లందున్‌.

71

3.త్రిప్రాసము

క.

తానవనీత ప్రియుఁ డన
దానవనిర్మూల నైకతత్పరుఁ డన స
న్మౌనివినుతుఁ డన నతసుర
ధేనువనం గృతులయందు ద్రిప్రాసమగున్‌.

72

4. చతుష్ప్రాసము

క.

వారణవరద నిశాటవి
దారణ వీరావతార ధరణీవలయో
ద్ధారణ విరచిత సత్యవ
ధూరణవిజయ యనఁ దగి చతుష్ప్రాసమగున్‌.

73

5.అంత్యప్రాసము

క.

అగణితవిభస్ఫూర్తీ
నిగమాగమసతతవినుత నిర్మల మూర్తీ
జగదభిరక్షణవర్తీ
యగు నంత్యప్రాస మి ట్లుదంచితకీర్తీ!

74


క.

మొదలిటిప్రాసమె కానీ
యిది యంత్యప్రాస మనఁగ నేదటకానీ
కదియింపవలయుఁ దానీ
పదనెఱిఁగిన బుధుఁడు కృతులఁ బరమజ్ఞానీ!

75

6. అనుప్రాసము

క.

విప్రప్రకరమునిప్రీ
తిప్రద సుప్రభవ యప్రతిమదోఃప్రభవా
విప్రణుత సుప్రసన్నయ
నుప్రాసప్రణవ మిది మనుప్రియచరితా!

76

యతిప్రకరణము

యతి సంజ్ఞలు

క.

విరతులు విశ్రాంతులు మఱి
విరామములు విశ్రమములు విశ్రామంబుల్‌
విరమంబులు యతు లనఁగా
విరమణములు నాఁగ వళ్ళు వెలయు మురారీ!

77

యతిపంచకము

క.

స్వరయతులు వర్గయతులును
సరసయతు ల్ప్రకటమైన సంయుక్త యతుల్‌
పొరిఁ బ్రత్యేకయతులు ననఁ
బరఁగును యతి పంచకంబు పంకజనాభా!

78

యతిపంచకభేదములు

క.

స్వరయతులు ప్రాది కాకు
స్వరనిత్యసమానయతులు వర్గయతులు ని

ద్ధరఁ బోలికవడి సంయుత
విరతి యనుస్వారయతులు వెలయు ముకుందా!

79


క.

ప్రభునామాంతవిరతియన
విభాగవిరమణము భిన్నశ్రమమును గౌ
స్తుభధర! వికల్పయతి యన
నభేదవిరమణ మనంగ నైదు తెఱంగుల్‌.

80


గీ.

స్వరప్లుతోభయవృద్ధ్యను స్వరవికల్ప
ప్రాద్యభేదసంయుత భిన్నప్రభువిభాగ
కాకు మాదేశనిత్యద్యఖండవర్గ
చక్కటెక్కటిపోలిక సరసయతులు.[5]

81


టీ.

స్వర, ప్లుత, ఉభయ, వృద్ధి, అనుస్వార, వికల్ప, ప్రాది, అభేద, సంయుత, భిన్న, ప్రభు విభాగ, కాకు, మాదేశ, నిత్య, ది, అఖండ, వర్గ, చక్కటి, ఎక్కటి, పోలిక, సరస.

స్వరయతులు

ఆ.

అగు నకారమునకు నైత్వౌత్వములు వడి
ఈకి ఋత్వమునకు నేత్వ మమరు
నుత్వమునకు నోత్వ మొనరు నీగతి స్వర
యతులు విస్తరిల్లు నబ్జనాభ!

82


క.

స్వరములు దీర్ఘము హ్రస్వము
నరయఁగ నొక్కవిధ మెన్న యతులకు సంధ్య
క్షరము లగునచ్చులందు సు
చరితా! హ్రస్వములు లేవు సంస్కృతభాషన్‌.

83

క.

అలఘుచతుస్సంధ్యక్షర
ములలో నై యౌలు దక్క మొదలిటిరెంటన్‌
దెలుఁగునను హ్రస్వదీర్ఘము
లొలయును నెఏలనంగ నొఓ లనఁగన్‌.

84


క.

క్రియ నై యౌలకు హ్రస్వ
ద్వయము లమరు నాంధ్రభాషితప్రకరలో
నయిదనఁ దగు నైదనుచో
జయకీర్తీ! యవు ననంగఁ జను నౌ ననుచోన్‌.

85

గూఢస్వరయతి

గీ.

స్వరముతుద నుండి లుప్తవిసర్గకోత్వ
మైనస్వరవిరామంబు దాసోఽహ మనగ
నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు
లనఁగ నమ్ముకుందుండు యశోఽర్థి యనఁగ.

86

ఋకారస్వరూపయతి

గీ.

క్షిత ఋకారరూపస్వరయతులు పరఁగు
ఋగ్యజుస్సామవినుతుండు కృష్ణుఁ డనఁగ
వృష్ణికులజుండు కరుణాసమృద్ధుఁ డనఁగ
హేమపీతాంబరుఁడు దేవవృషభుఁ డనఁగ.

87


క.

విలన ద్రికారమునువ
ట్రిల రీవిరమంబు శౌరి ఋషులకు శశ్వ
త్సులభుఁ డనఁగ నీయేలకుఁ
దలఁపఁగ రీతోడి విరతి తలకొన దెందున్‌.

88

గీ.

తెల్లముగ ఋకారము యణాదేశశక్తిఁ
గలుగు రేఫయిత్వమునందుఁ గదిసి యతికి
నట్టిరీకి నీయేలతో నన్వయించు
నట్టిసత్త్వంబులే దది హల్లుగాన.

89


గీ.

మును ఋకార మీ యేలతో నొనరినట్లు
చేర దొకట యణాదేశకారణమున
ఘనలకారంబ యగును ఌకారవిరతి
కౢప్తి లేదు శౌరిగుణావళికి ననంగ.

90


క.

స్వరములు కాదుల నొందిన
నరుదుగ స్వరయతులు దగును బ్రాదులు గాకు
స్వరమును నిత్యసమాసా
క్షరసంధులు రెండు నగు భుజంగమశయనా!

91


గీ.

ప్రాదినిత్య సమాసశబ్దములు గాక
పెరపదంబుల పైనచ్చు బెరసినప్పు
డన్నియును స్వరయతులగు సాంబగురుఁడు
శ్రీశుఁ డమరాన్వయాబ్ధి పూర్ణేందుఁ డనఁగ.

92

ఉపసర్గలు

క.

ధర నుపసర్గలు ప్రాన్వప
దురపాభిప్రతిసువిన్యు దుపపర్యధిసమ్‌
నిరతిపరాజపులిరువది
పరాఙపులు చొరవు తెలుఁగు బాసను నెందున్‌.

93

టీ. ప్ర, అను, అవ, దుర్, అప, అభి, ప్రతి, సు, వి, ని, ఉత్, ఉప, పరి, అధి, సమ్, నిర్, అతి, పరా, అఙ్, అపి, అను నివి యిరు వది యుపసర్గలు. వీనిలో పరా, అఙ్, అపి, అన్నవిగాక మిగిలిన పదునేడును బరస్పరసంధి యైనప్పుడు స్వరయతియైనను వ్యంజనయతియైనను బ్రయోగింపఁదగును.

వీని కుదాహరణము:-

ఉ.

ప్రాంతనిరంతరాన్విత దురంతసమస్తపరాక్రమంబున
త్యంతమదాప్తిశోభన మపాయ ముపాయము వీక్షణంబు ప్ర
త్యంత మభీష్టమధ్యయము స్వాంతము నీత ముదంచితంబుప
ర్యంతమనంగ సంధిలుఁ దిరంబుగ రెంటను బ్రాదులచ్యుతా!

94

కాకుస్వరయతి:-

క.

కాకుస్వరయతి యగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ బ్ర
శ్నా కలితదీర్ఘ మగు నితఁ
డే కవ్వడి రథముఁ గడపె నిమ్ముల ననఁగన్‌.

95


ఆ.

వలదు కృష్ణ యెఱుఁగవా మున్ను నన్ను నీ
వా విరుద్ధభాష లాడ నేల
లోన నెట్టియలుకలో నాఁగఁ గాకుస్వ
రోక్తి రెంటఁ జెల్లు నొగి ధరిత్రి.

96


గీ.

వరుసదీర్ఘాంతసంబుద్ధి వచనయతుల
కమరుఁ గాకుస్వరంబు పరమసహస్ర
నామశోభిత గోపకృష్ణాయనంగ
నమరవందిత గోపకృష్ణా యనంగ

97

నిత్యసమాసయతి:-

గీ.

పదము విభజించి చెప్పఁ జొప్పడని యవియు
నన్యశబ్దంబుఁగొని విగ్రహంబుఁ జెప్పు

నవియు నిత్యసమాసమై యతిశయిల్లు
నట్టిసంధుల నచ్చు హల్లైన విరతి.

98


గీ.

నాస్తియనక మహి ననంతసంపదలు నా
రాయణుం డొసంగు రమ్యమగుర
సాయనంబు బుధుల కతఁ డన్న నిత్యస
మాసయతుల రెంట నంటియుండు.

99


వ.

ఈ నిత్యసమాసయతి పేరఖండయతి.

100


గీ.

అఱయనంగను బోవుట కర్థమైన
సంధి నిత్యసమాసోక్తి జరగు రెంట
నసురవీరుల నెల్ల నుక్కఱ వధించె
భానుకులుఁడు రావణుని నేపఱిచె ననఁగ.

101


వ.

అట్లు మఱియును.

102


గీ.

ఏని యనుపదంబుతో నాదిపద మంది
సంధి నిత్యయతుల జరగుచుండు
నెట్టి క్రూరకర్ముఁడేని సద్గతి నొందు
నిన్ను నాత్మఁ దలఁచె నేని కృష్ణ!

103


గీ.

కదియు వడులు స్వరము కైవడిఁ గాదులు
ఋత్వమునకు నెత్వమెనయు చోటఁ
గృష్ణుఁ డాజిఁ గంసు గెడపె నండ్రార్యులు
కూర్మరూప విమలకోమలాంగ!

104

వర్గయతి:-

క.

తలకొని కచటతపంబులు
తలనొక్కొకవ్రాయి తొలఁగఁ దమతమ నాల్గున్‌

విలసిల్లు వర్గయతు లనఁ
గలికల్మషతిమిరతపన ఘననిభవర్ణా!

105

పోలికవడి

క.

వెలసిన పు ఫు బు భు వర్ణం
బులు పోలికవడి ముకారముగ నిడఁ దగు ని
మ్ముల హరిచరణసరోరుహ
ములు నాహృత్సరసియందుఁ బొదలు ననంగన్‌.

106

సరసయతి

ఆ.

ణనలు చెల్లుఁ గమలనాభ యొండొంటికి
నయహ లమరియుండు హస్తివరద
శషస లొందు నండ్రు చఛజఝంబులతోడ
సరసయతు లనంగ జలధిశయన!

107

సంయుక్తయతి

క.

ఏ నిను వేఁడెద లక్ష్మీ
క్ష్మానాయక నీవు నన్నుఁ గైకొని యిష్టం
బైనవి యొసఁగుము శుభల
క్ష్మా! నీవాఁడ నన నొప్పు సంయుక్తయతుల్‌.

108


క.

ఒక్కడుగున విశ్రాంతులు
పెక్కగుచో సంయుతములు పెనుపకమును జ
డ్డక్కరమునఁ దానెత్తిన
యక్కరమే యునపవలయు నన్నిటఁ గృష్ణా!

109


క.

వడినెలవులలోఁ జేరువ
యెడ నొకసంయుతము నౌలయెడ నొకటినిఁ దా

రిడిరేని కవులు తప్పుట
యొడఁబడదు పృథగ్యతిప్రయోగముల హరీ!

110

ఉదాహరణము

 ద్విరదగతి రగడ.
క్ష్మావలయ మంతయు విషాణమున నెత్తుకిటి
మహిమ దలపోయ నక్కజ మనుచు నిట్లనక
క్ష్మావలయ మంతయు విషాణమున నెత్తుకిటి
సత్త్వ మరు దన నొప్పు సంయుక్తయతి చెడక.

111


అట్ల మఱియొకవిధంబగు రగడ.
ఱంపమున వ్రచ్చుగతి వ్రచ్చె నఖముల రిపుని
వక్షము నృసింహుఁ డని రాయువడి సొరదు కృతి
ఱంపమున వ్రచ్చుగతి వ్రచ్చె నఖముల రిపును
రంబు నరసింహుఁ డనఁ గ్రాలు సంయుక్తయతి.

112


గీ.

అప్రసిద్ధముల్‌ ఙఞలు శబ్దాదియందు
ఞాజసంయుక్తి తద్భవవ్యాజమునను
నణలతోఁ బొందు విరతి యాజ్ఞప్తి యనఁగ
జలరుహోదరాశ్రితులు సుజ్ఞాను లనఁగ.

113


గీ.

యజ్ఞమునకు జన్న మాజ్ఞప్తి కానతి
యాజ్ఞ కాన సంజ్ఞ కరయ సన్న
విన్నపంబు వెండి విజ్ఞాపనమునకు
జ్ఞాకుఁ దద్భవంబు నా ధరిత్రి.

114

రేఫయుతయతి

గీ.

ఆంధ్రలిపిఁ జొప్పడదు ఋకారాన్వితంబు
క్రొత్తగాదు కృష్ణుని వెన్న మ్రుచ్చి మనఁగ

గీ.

స్రుక్కఁ డతఁ డాజి నెట్టి విరోధి నైనఁ
గ్రుమ్ము నన రేఫయుతయతి గూడుఁ గాన.

115

అనుస్వారయతి

గీ.

భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ
ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ!
నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక!
మాకు నిటనాల్గు చెల్లు సంపదలరాజ!

116

మకారయతి

గీ.

యరలవలు శషసహలు నాదిబిందు
యుతములై మకారవిరామయుక్తిఁ దనరు
మారుతాత్మజుఁ డరిదిసంయమి యనంగ
మదనజనకుఁడు దనుజసంహరుఁ డనంగ.

117

ఎక్కటియతి

క.

ధర నెక్కటివళ్లైతగు
ళరమఱవలు వానిలోఁ దొలంగక(జెలంగును) లాకున్‌
సరి ళా యన విశ్రమవే
ళ రమాధిప రెండునుం గలసి వర్తించున్‌.

118


గీ.

మరునితండ్రి లోకమహితుండు యాదవ
రాజసింహ మూర్తి రక్షకుండు
ఱాఁగవేలు పనఁగ ఱంపిల్లు నెక్కటి
వళ్ళు నాఁగ నిట్లు వనజనాభ!

119


గీ.

ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక
ద్వివిధ మగుఁ బ్రభునామాంతరవిరమణంబు

మహి నయోధ్యకు రాజు రామన యనంగ
నతనిపట్టపుదేవి సీతమ యనంగ.

120


గీ.

సంఖ్యకుం బరిమాణసంజ్ఞకుఁ దనర్చు
శబ్దములపై విభాగోక్తి సరణి సంఘ
టించినప్పుడు యతులు రెండేసియగు ను
పేంద్రుఁ డిచ్చునర్థము మోపెఁడేసి యనఁగ.

121


క.

అంచితతిలకము శౌరి ధ
రించె ననఁగ జగణమధ్య రేఫవిరతి యౌ
నంచితతిలకము హరి ధరి
యించె ననఁగ భిన్న విరతి నిత్వమువచ్చెన్‌.

122


గీ.

అట ఇకారాంతపదముమీఁదటి దికార
మది యనంగ నవ్వల భిన్న యతికిఁ జెల్లు
దివిజవిభవంబు శౌరిచేతిది యనంగ
నసురనాశంబు హరిచేతియది యనంగ.

123

వికల్పయతి

గీ.

హయుతమై పొల్లుల వికల్పయతులు చెల్లు
దేవకీనందనుఁడు జగద్ధితుఁ డనంగ
హలధరుఁడు సంగరాంగణోద్ధతుఁ డనంగ
నవని మోచినయవి కకుబ్భస్తులనఁగ.

124

యుక్తవికల్పయతి

గీ.

నలి ఙకారహ ల్లితరానునాసికాఖ్యఁ
గదిసి తత్పంచమముగా వికల్పవిరతిఁ
గలుగుఁ జక్రి వల్లవసుదృఙ్మథుఁ డనంగఁ
గమలనేత్రుండు సకలదిఙ్మహితుఁ డనఁగ.

125

క.

ప్రకట పకార వకార
ద్వికమునకుం జను నభేదవిరతి నిశాట
ప్రకర మెరిసె రామునిపా
వకశరమున జనకసుత నెపంబున ననఁగన్‌.

126


గీ.

చెల్లుబడివళ్ళు ప్రాసము ల్చెప్పఁబడియె
నిందుఁ బూర్వప్రయోగంబు లెఱిఁగి యెవ్వి
బహుళమై తోఁచెనవి యొనర్పంగవలయు
నవ్యకావ్యప్రియోక్తుల నలిననాభ!

127


క.

వరగణవర్ణము దీర్ఘ
స్వరమగుచో గణయుగంబు చను యతుల సుధా
కరకరగుణగతి శరరుచి
గిరిగజరుద్రాదిసంజ్ఞ కేశవనాథా!

128


క.

ఎన్నిట యతి రావలె నని
రన్నిట సంస్కృతమునందు నగు విచ్ఛేదం
బెన్నిట యతిరావలె నని
రన్నిటఁ దెలుఁగునకు మొదలియక్షర మమరున్‌.

129


గద్యము.

ఇది శ్రీవాణీప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యతనూభవ సుకవిజనవిధేయ అనంతనామధేయ ప్రణీతంబైన ఛందోదర్పణమునందు గద్యపద్యాదికావ్యలక్షణంబును గురులఘునిర్ణయంబును గణనిరూపణంబును బ్రాసయతి విశేషంబులును బరిగణనసంజ్ఞయు నన్నది ప్రథమాశ్వాసము.

  1. నుడుప; నిలుప. అని పా.
  2. అర్థము సంశయముగా నున్నది.
  3. అర్థము సంశయముగా నున్నది.
  4. పా. దీర్ఘమునున్‌
  5. 81వ పద్యము ప్రక్షిప్తము