ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము

శ్రీరామాయనమః

ఛందోదర్పణము

ద్వితీయాశ్వాసము

శ్రీరమణ భక్త లోకమ
నోరమణ జగత్త్రయాభినుత రంజిత గౌ
రీరమణ సంభరిత వా
ణీరమణ యనంతశయన నీరజనయనా.

1

గద్యలక్షణము

క.

కనుఁగొనఁ బాదరహితమై
పనుపడి హరిగద్దెవోలె బహుముఖరచనం
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్‌.

2


గద్యము.

స్వస్తి సమస్తభువనరక్షాదక్ష శ్రీపుండరీకాక్ష భుజగపతిసింహాసనారూఢ సురనికరమకుటతటఘటితసురుచిరమణిగణ ప్రభావిభాసిత పాదపీఠ! వేద నినదానుకారి గౌరవ లలిత నూపురాలంకృతచరణ సరసిజ యుగళ నవ్య పదాంగుష్ఠ నఖ మయూఖ రేఖాయిత సురసరిత్ప్రవాహ పీతాంబరధర నూత్న మేఖలాకలిత కటితప్రదేశ చతురాననజనక నాళీకశోభితనాభి

సరోవర, యఖండబ్రహ్మాండకలాపగోపననిపుణోదర, క్షీరసాగరతనయామనోజ్ఞ గేహీకృతవిపుల వక్షస్థల కనత్కనక కటక కేయూర ప్రముఖ భూషణ భూషిత చతుర్భుజ, శంఖపంకజసుదర్శన గదాధర కిరీట కుండలాభిరామ యనవరత ప్రసన్న వదన కౌండిన్యవరద శ్రీయనంత పద్మనాభ నమస్తే నమస్తే నమః అని గద్యపఠనం బొనర్చు నుత్తములకు నుత్తమాయురారోగ్యంబు లొదవునని విశదవచనంబుల విద్వజ్జనంబు లభినుతింతురు.

3

ఛందములు

క.

సమవృత్తము లనియెడు ను
త్తమ రత్నంబులకు జన్మధామములై పెం
పమరు సముద్రమ్ముల చం
దము లై ఛందములు మహి సుదర్శనపాణీ!

4


సీ.

ఉక్తయు నత్యుక్తయును మధ్యయును బ్రతి
           ష్ఠయు సుప్రతిష్ఠయు సరళమైన
గాయత్రి యుష్ణిక్కు నాయనుష్టుప్పును
           బృహతియుఁ బంక్తియు మహితమైన
త్రిష్టుప్పు నలజగతియు నతిజగతియు
           శక్వరి మఱి యతిశక్వరియును
నష్టియు వెండి యత్యష్టియు ధృతియును
           నతిధృతియును మఱి కృతియుఁ బ్రకృతి


గీ.

యాకృతియును వికృతి యటుసంకృతియు నభి
కృతియు నుత్కృతియనఁ గీర్త్యమగుచు

జరుగు నిరువదారు ఛందంబు లేకోత్త
రాధికాక్షరముగ నబ్జనాభ!

5

ఛందోవృత్త సంఖ్య

సీ.

కరములు వేదముల్‌ కరులు రాజులు రాగ
           సంఖ్య విద్యలు నిభ చక్షురిందు
లంగాస్త్రబాహువు లక్షీందుశరములు
           గతిలోచనాంబర కమలరిపులు
నాగవేదాంబరనయనముల్‌ ఋతునిధి
           ఖాబ్దులు కరవిరించాబ్జఫణులు
గతినాగగుణశాస్త్ర కైరవాప్తులు దిగ్గ
           జాంగపర్వతలోచనానలములు


గీ.

శాస్త్రవహ్ని బాణశరతర్కములు బాహు
శైలఖేందురామచంద్ర సంఖ్య
గతిగతీందు బాహుఋతుబాహు లహినాగ
బాహువేద బాహుబాణచయము.

6


సీ.

ఋతుశైల శరగజగతి ఖేందు లక్షిభూ
           తేంద్వద్రినిధిగగ నేక్షణములు
నిగమాభ్రగుణగతి నిధిచంద్రగతులు వా
           రణఖర్తుగజదంతిరామకరులు
తర్కేందుకరమునిత్రయతర్క విధు లక్షి
           పావకాబ్ధిసముద్ర బాణబాణ
వహ్నివహ్నులు బ్రహ్మవదనాంగభుజగేభ
           ఖేందుశైలర్తులు ఛందములను

గీ.

వేఱువేఱ పుట్టు వృత్తసమూహంబు
వెండి సర్వవృత్తవితతి యరయ
ఋతుకరాద్రి శైలసితదీప్తి నయనతో
యధికృశానుచంద్రు లబ్జనయన.

7

సర్వసమవృత్తభేద సంఖ్య

చ.

ఒగిఁబదమూఁడు కోటులును నొప్పుగనల్వది రెండులక్షలున్‌
దగఁ బదునేడు వేలు నుచితంబుగ నవ్వల నేడునూటిపై
నగణితవైభవా యిరువదాఱు గదా సమవృత్తభేదముల్‌
ప్రగుణితలక్షణస్ఫురణఁ బంచినఛందము లిర్వదాఱిటన్‌.

8

సమవృత్త లక్షణము

క.

హెచ్చును గుందును బొరయక
యచ్చొత్తినయట్లు నాలుగడుగులు సమమై
వచ్చును యతినియమంబును
జెచ్చెర సమవృత్తములకుఁ జిత్తజజనకా!

9


వ.

సమవృత్తంబు లెట్టి వనిన.

10


మొదలియుక్తాచ్ఛందంబునందు శ్రీయనువృత్తము—
శ్రీ, భా, విం, తున్‌.

11


రెండవయత్యుక్తాచ్ఛందంబునందు స్త్రీ యనువృత్తము—
స్త్రీరూ, పారున్‌, ఘోరా, ఘారీ.

12


మూఁడవమధ్యాచ్ఛందంబునందు వినయం యనువృత్తము—
వినయం, బొనరింతు ననం, తునకున్‌.

13


నాలవప్రతిష్ఠాచ్ఛందంబునందు బింబమనువృత్తము—
శ్రీకలితా, స్తోకభగల్‌, పైకొనుబిం, బాకృతికిన్‌.

14

అంద సుకాంతి యనువృత్తము—
అగున్‌ సుకాంతి గూర్పఁగా, జగంబులన్‌, జగత్పతీ.

15


అయిదవసుప్రతిష్ఠాచ్ఛందంబునందు అంబుజమనువృత్తము—
పంబిభలగా, డంబరముగా, నంబుజము చెల్వం బగుహరీ.

16


అంద పంక్తియనువృత్తము—
ఒక్కభకారం, బెక్కు గగంబుల్‌,
నెక్కొనుఁ బంక్తిం, దక్కక శౌరీ.

17


ఆఱవగాయత్రీచ్ఛందంబునందు తనుమధ్యయనువృత్తము—
గోపాలుని దేవే, నాపాలికి నాఁగాఁ
బై పై తనుమధ్యన్‌, బ్రాపించుఁ దయంబుల్‌.

18


ఏడవయుష్ణిక్ఛందంబునందు [1]మధుమతియనువృత్తము—
మధురిపుఁ డనినన్‌, మధురపుననగల్‌
మధురము లగుచున్‌, మధుమతి నమరున్‌.

19


అంద మదరేఖయనువృత్తము—
రూపింప న్మగణాద్యం బై, పెంపార సగంబుల్‌
దీపించు న్మదరేఖన్‌, గోపస్త్రీ హృదయేశా!

20


ఎనిమిదవయనుష్టుప్ఛందంబునందు విద్యున్మాలయనువృత్తము—
మాద్యద్భక్తిన్మాగాయుక్తిన్‌, విద్యున్మాలావృత్తం బొప్పున్‌
చైద్యధ్వంసిన్‌ సంబోధింపన్‌, సద్యశ్శ్రేయోజాతంబయ్యెన్‌.

21


అంద చిత్రపదమనువృత్తము—
వారక భాగురుయుగ్మం, బారఁగఁ జిత్రపదాఖ్యం
జేరిన వేడ్కఁ గవీంద్రుల్‌, గోరి నుతింతురు శౌరిన్‌.

22

 అంద ప్రమాణియనువృత్తము—
సరోజనాభుఁ డచ్యుతుం డరాతిభంజనుం డనన్‌
జరేఫలన్‌ గలంబులన్‌, ధరం బ్రమాణి యొప్పగున్‌.

23


తొమ్మిదవబృహతీచ్ఛందంబునందు హలముఖియనువృత్తము—
చిత్తజాతునిగురునికై యెత్తుఁ డంజలు లనినచో
సత్తుగా రనసములొగిన్‌, బొత్తుగా హలముఖి యగున్‌.

24


క.

వదలక పంక్తిచ్ఛందము
మొదలుగ నిటమీఁది ఛందముల కందముగా
నుదయించు వృత్త సమితికి
విదితంబుగ వళులు వలయు విధురవినయనా!

25


పదియవపంక్తిచ్ఛందంబునందు రుగ్మవతియనువృత్తము—
రూపితరీతిన్‌ రుగ్మవతీసం
రూపభమంబుల్‌ రూఢి సగంబుల్‌
ప్రాపుగ భూతవ్రాతయతు ల్గా
శ్రీపతిలీలన్‌ జెప్పఁగ నొప్పున్‌.

26

భ, మ, స, గ. (దీనిపేరు రుగ్మవతియని కవిజనాశ్రయము.)

 అందు మత్తయనువృత్తము—
మొత్తం బారు న్మభములు నిత్యో
దాతంబై సస్ఫురితగకారా
యత్తం బై షణ్మితయతి నొందున్‌
మత్తావృత్తంబగు మహిఁ గృష్ణా!

27

అంద ప్రణవమనువృత్తము—
ఆరంగా మనయగసంయుక్తిన్‌
సారోదంచితశర విశ్రాంతిన్‌
శ్రీరాజుం బొరసిన నత్యంత
స్ఫారంబై చను ప్రణవం బుర్విన్‌.

28

మ, న, య, గ. (దీనికే బణవమనిపేరు. క.జ.)

అంద మయూరసారి యనువృత్తము—
చూతమా యశోదసూను నంచున్‌
వ్రేత పల్కుఁదర్క విశ్రమంబుల్‌
భాతిగా రజంబుపై రగంబుల్‌
జాతిగా మయూరసారిఁ జెప్పున్‌.

29

ర, జ, ర, గ. (దీనిపేరే మయూరభాషిణి.)

 అంద శుద్ధవిరాటియనువృత్తము—
శ్రీమంతుండగు చిన్న కృష్ణునిన్‌
ధీమంతు ల్ప్రణుతింప బాణవి
శ్రామంబున్‌ మసజంబు గంబునై
రామా శుద్ధవిరాటి యొప్పగున్‌.

30

మ, స, జ, గ.

అంద మణిరంగమనువృత్తము—
శ్రీమనస్సరసీరుహమిత్రున్‌
బ్రేమ మొప్పఁగ బేర్కొనుచోటన్‌
రామనస్త్రవిరామరసాగల్‌
కోమలంబు లగు న్మణిరంగన్‌.

31

ర, స, స, గ.

తోదకమనువృత్తము—

తోరపువేడుకఁ దోదకవృత్తా
కారముగాఁ ద్రిభకారగగంబుల్‌
నీరజనాభుని నెమ్మినుతింపన్‌
జారువిరామము షణ్మితి నొందున్‌.

32

భ, భ, భ, గ,గ.

అంద పదునొకండవత్రిష్టుప్ఛందంబునందు ఇంద్రవజ్రయనువృత్తము—

సామర్థ్యలీలన్‌ తతజద్విగంబుల్‌
భూమిధ్రవిశ్రాంతులఁ బొంది యొప్పున్‌
ప్రేమంబుతో నైందవబింబవక్త్రున్‌
హేమాంబరుం బాడుదు రింద్రవజ్రన్‌.

33

త, త, జ, గ,గ.

అంద ఉపేంద్రవజ్రయనువృత్తము—

పురారిముఖ్యామరపూజనీయున్‌
సరోజనాభున్‌ జతజద్విగోక్తిన్‌
దిరంబుగా నదియతి న్నుతింపన్‌
ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్‌.

34

జ, త, జ, గ,గ.

అంద ఉపజాతియనువృత్తము—

పినాకికోదండము బిట్టుద్రుంచెన్‌
జానొప్ప గెల్చెన్‌ జమదగ్నిసూనున్‌
అనంతసత్త్వుం డితఁ డంచు మెచ్చన్‌
జానైనవృత్తం బుపజాతి యయ్యెన్‌.

35

క.

సమపదము లింద్రవజ్రవి
షమపదము లుపేంద్రవజ్రఁ జను నుపజాతిన్‌
సమవిషమాంఘ్రులు తద్వ్య
త్క్రమమైనను నదియ పేరు కమలదళాక్షా!

36

అంద రథోద్ధతమనువృత్తము—

నందగోపవరనందనున్‌ రమా
నందుఁ బ్రస్తుతి యొనర్చి షడ్యతిన్‌
అందమై రనరవాహ్వయంబు లిం
పొందఁ జెప్పిన రథోద్ధతం బగున్‌.

37

ర, న, ర, లగ. (దీనిపేరే పరాంతికము.)

అంద గీతాలంబనమనువృత్తము—

నాళీకభవామరనాథు లొగిన్‌
శ్రీలోలుని గీర్తన సేయ నొగిన్‌
బోలంగఁ దజావలఁ బొందిన గీ
తాలంబన మై చను నద్రియతిన్‌.

38

త, జ, జ, వ. దీనిపేరే కలితాంతము. (కాంత యని, క.జ.)

అంద స్వాగతమనువృత్తము—

నారదాదిమునినాయక వంద్యున్‌
శౌరిఁ జేరుఁ డన స్వాగత మొప్పున్‌
సారమైనయతి షణ్మితి నొందన్‌
భూరిరేఫనభముల్‌ గగయుక్తిన్‌.

39

ర, న, భ, గగ.

అంద శాలినియనువృత్తము—
.

చేతో రాగం బుల్లసిల్లన్మతాగా
ద్యోతంబై షడ్వర్ణయుక్తిన్‌ విరామం
బేతేరంగా నిందిరేశప్రభావా
న్వీతంబైనన్‌ శాలినీ వృత్తమయ్యెన్‌.

40

మ, త, త, గగ.

అంద శ్యేనియనువృత్తము—

ఆరమాధినాథుఁ డక్షయంబుగాఁ
జీర లిచ్చె యాజ్ఞసేని కంచుఁ బెం
పారఁ జెప్ప శ్యేని యయ్యె షడ్యతిన్‌
స్ఫారమై రజంబుపై వరంబుగాన్‌.

41

ర, జ, ర, వ.

అంద వాతోర్మియనువృత్తము—

.

దేవాధీశున్‌ హరిఁ దేజో వనధిన్‌
భావింపంగా ఋతుభాస్వద్విరతిన్‌
ఈవాతోర్మిన్‌ మభలేపారుఁ దకా
రావాసంబై లగ మర్దిన్‌ గదియన్‌.

42

మ, భ, త, లగ.

అంద భద్రికయనువృత్తము—

నగణయుగమునన్‌ రవంబులన్‌
బ్రగుణరసవిరామసంగతిన్‌
తగిలి హరికథాసమేతమై
నెగఁడు గృతుల నిండి భద్రికన్‌.

43

వ, న, ర, వ. (దీనికే జంద్రికయని పేరుగలదు. క.జ.)

పండ్రెండవజగతీచ్ఛందంబునందు భుజంగప్రయాతమనువృత్తము—

భుజంగేశపర్యంక పూర్ణానురాగున్‌
భుజంగప్రభూతాఖ్యఁ బూరించుచోటన్‌
నిజంబై ప్రభూతావనీభృద్విరామం
బజస్రంబుగాఁ గూర్ప యాద్వంద్వ మొప్పన్‌.

44

య, య, య, య.

అంద తోటకమనువృత్తము—

జలజోదరనిర్మలసంస్తవముల్‌
విలసిల్లెడుఁ దోటకవృత్తమునన్‌
బొలుపై సచతుష్కముఁ బొండగ నిం
పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్‌.

45

స, స, స, స.

అంద తోవకమనువృత్తము—

చెలఁగి నజాయలఁ జెందిన నారీ
తిలకము లద్రియతిన్‌ మృదురీతిన్‌
వెలయఁగఁ దోవక వృత్తి విభాతిన్‌
బలుకుదు రిమ్ములఁ బంకజనాభున్‌.

46

న, జ, జ, య. (దీనిపేరే తామరసము)

అంద స్రగ్విణీవృత్తము—

దేవకీనందనున్‌ దేవచూడామణిన్‌
భూవధూవల్లభుం బుండరీకోదరున్‌
భావనాతీతునిం బల్కఁగా స్రగ్విణీ
భావ మాద్యంతరేఫంబగున్‌ షడ్యతిన్‌.

47

ర, ర, ర, ర.

అంద ఇంద్రవంశమనువృత్తము—

సొంపార నీ దేవుని సూనుఁడై కదా
ఱంపిల్లెఁ బుష్పాస్త్రుఁడు ఱాఁగ యౌననన్‌
ఇంపార భూభృద్యతి నింద్రవంశమున్‌
బెంపారఁ దాజంబులఁ బేర్చు రేఫతోన్‌.

48

త, త, జ, ర.

అంద వంశస్థమనువృత్తము—

నమో నమో దేవ జనార్దనాయ తే
నమో నమః పంకజనాభ నావుడున్‌
రమించు వంశస్థ విరామమద్రులన్‌
సమంచితంబై జతజంబు రేఫయున్‌.

49

జ, త, జ, ర.

అంద ద్రుతవిలంబితమనువృత్తము—

శ్రుతి మతాంగ నిరూఢమహాయతిన్‌
యతివర ప్రముఖార్యజనం బొగిన్‌
ద్రుతవిలంబిత తోషితరీతులన్‌
క్షితిధరున్‌ నుతిసేయు నభారలన్‌.

50

న, భ, భ, ర.

అంద జలధరమాలయనువృత్తము—

శ్రీతన్వీశుం దగిలితిఁ జిత్తం బారన్‌
మాతా యంచున్‌ జలధరమాలావృత్తం
బేతేరంగా మభనమ లింపొందంగాఁ
బ్రీతిం బల్క న్విరతి కరిన్‌ బ్రాపించున్‌.

51

మ, భ, స, మ.

అంద ప్రియంవదంబనువృత్తము—

త్రిభువనాభినుతు దేవదేవునిన్‌
బ్రభుముకుందు నిటు ప్రస్తుతింపఁగా
నభజర ల్గదిసినం బ్రియంవదా
విభవ మొప్పు గిరి విశ్రమంబులన్‌.

52

న,భ,జ,ర

అంద ప్రమితాక్షరమనువృత్తము—

కమనీయతేజుని నగణ్యయశున్‌
గమలాధిపుం బలుకఁగా సజసల్‌
క్రమమొప్పుఁ గూడఁగ సకారముతోఁ
బ్రమితాక్షరం బహివిరామమగున్‌.

53

స, జ,స,స.

అంద జలోద్ధతగతియనువృత్తము—

సరోరుహదళాక్ష శాశ్వతయశా
పురారినుత యంచు భూదరయతిన్‌
సరాగ మగుచున్‌ జసల్‌ జసలతో
నురుప్రభ యగున్‌ జలోద్ధతగతిన్‌.

54

జ,స,జ,స

అంద విశ్వదేవియనువృత్తము—

జానొందం గావ్యశ్రీకి సంప్రీతితోడన్‌
మానాథు న్నాథుం జేసి మాయాగణంబుల్‌
ధీనిత్యుల్‌ ధాత్రీభృద్యతిం గూర్తు రింపుల్‌
తేనెల్‌ సోనల్‌ గా విశ్వదేవీసమాఖ్యన్‌.

55

మ,మ,య,య

పదుమూఁడవయతి జగతీచ్ఛందంబునందు మత్తమయూరమనువృత్తము—

భోజాధీశుం డంచుఁ బ్రభూతాత్మకుఁ డంచున్‌
భ్రాజిష్ణుం డంచున్‌ యతి బాగౌ గిరి సంజ్ఞన్‌
ఓజస్స్ఫీతంబై మతయో పేతసగంబుల్‌
ఓజం బల్క న్మత్తమయూరం బలరారున్‌.

56

మ,త,యమస,గ

అంద జలదమనువృత్తము—

మ్రొక్కుల కెల్ల నెల్ల యగుమూర్తి గదా
యక్కమలాక్షుఁ డంచుఁ జతురాస్యయతిన్‌
దక్కక ప్రస్తుతింప జలదం బగు ని
ట్లొక్కటియై భరేఫనభ లొందు గురున్‌.

57

భ,ర,న,భ,గ

అంద మంజుభాషిణియనువృత్తము—

దివిజేంద్రుఁ డాదియగు దేవసంఘముల్‌
భువి మంజుభాషిణికి భోగిరాడ్యతిన్‌
సవరింపఁగా సజసజంబు గాంతమై
భువనోదరస్తుతి యపూర్వ మై చనున్‌.

58

స,జ,స,జ,గ

అంద ప్రహర్షిణియనువృత్తము—

ముక్తిశ్రీకరు భవమోచను న్మురారిన్‌
భక్తిం బ్రోడజనులు ప్రస్తుతింప నొప్పున్‌
వ్యక్త గ్రావయతిఁ బ్రహర్షిణి సమాఖ్యన్‌
యుక్తంబై మనజరగోజ్జ్వలద్గణాప్తిన్‌.

59

మ,న,జ,ర,గ

అంద ప్రభాతమనువృత్తము—

సరసిజనాభ భుజంగ రాజతల్పా
శరణము నీవని సన్మతిం దలంపన్‌
బెరయు నజారలు పేర్మి నొప్పగున్‌ గన్‌
జరగుఁ బ్రభాతము శైల విశ్రమంబున్‌.

60

న,జ,జ,ర,గ

అంద రుచిరమనువృత్తము—

అనంగకోటివిలసదంగవైభవున్‌
మనంబులో నిలిపిన మాను నాపదల్‌
అనన్‌ జభంబులు సజగానుసంగతిన్‌
దనర్చు నీరుచిరకు దంతి రాడ్యతిన్‌.

61

జ,భ,స,జ,గ

పదునాలుగవశక్వరీచ్ఛందంబునందు వనమయూరమనువృత్తము—

ఉన్నతములై వనమయూర కృతు లోలిన్‌
ఎన్నఁగ భజంబులపయి న్సనగగంబుల్‌
చెన్నొదవ దంతియతిఁ జెంది యలరారన్‌
వెన్నుని నుతింతురు వివేకు లతిభక్తిని.

62

భ,జ,స,న,గ,గ. (ఇదే యిందువదనయనువృత్తము.)

అంద వసంతతిలకమనువృత్తము—

గౌరీనితాంతజపకారణనామధేయున్‌
దూరీకృతప్రణతదుష్కృతు నంబుజాక్షున్‌
ధీరోత్తము ల్గిరియతిన్‌ తభజాగగ ల్పెం
పార న్వసంతతిలకాఖ్య మొనర్తు రొప్పున్‌.

63

త,భ,జ,జ,గ,గ, (దీనిపేరే సింహోన్నతమును, వృద్గర్తిణియును.)

అంద ప్రహరణకలితనువృత్తము—

వనరుహసఖుఁడున్‌ వనరుహరిపుఁడున్‌
గనుఁగవ యగు నాకరి వరదునకున్‌
ననభనలగము న్నగయతిఁ బలుకన్‌
బనుపడుఁ గృతులం బ్రహరణకలితన్‌.

64

న,న,భ,న,లగ

అంద సుందరవృత్తము—

కోరిన కోరిక లిచ్చుఁ గోమలి చూడవే
మారునితండ్రి యనం గ్రమంబున నీక్రియన్‌
భారసవంబుల నొప్పుఁ బన్నగరాడ్యతిన్‌
సూరిజనంబులు సెప్ప సుందరవృత్తముల్‌.

65

భ,భ,ర,స,వ

అంద అపరాజితమనువృత్తము—

మునిజనవినుతుం డమోఘజయోన్నతుం
డనితరసదృశుం డనంగ గురుం డనం
జను ననయుతమై రసంబు లగంబులై
తనరఁగ నపరాజితం బహిరాడ్యతిన్‌.

66

న,న,ర,స,లగ

అంద అసంబాధయనువృత్తము—

సౌమ్యంబై విష్ణుస్తుతులను నతి సేవ్యంబై
రమ్యస్ఫూర్తిన్‌ రుద్రవిరమణము రమ్యంబై
గమ్యాకారం బొప్పు మతనసగగ ప్రాప్తిన్‌
సమ్యగ్భావంబై పొలుపమరు నసంబాధన్‌.

67

మ,త,న,స,గగ

అంద భూనుతమనువృత్తము—

శ్రీనివాస పురుషోత్తమ సింధువిహారా
పూని మమ్ముఁ గృప జేకొని ప్రోవు మనంగా
భూనుతంబు రనభాగలఁ బొందిగయుక్తిన్‌
పూని సొంపుగ గ్రహాక్షరమున్‌ వడినొందన్‌.

68

ర,న,భ,భ,గగ

అంద కమలవిలసితమనువృత్తము—

నగణము నగణము నగణముఁ జేరన్‌
నగణము గగము నొసర నటమీఁదన్‌
దిగిభ విరమణము దిరమగునేనిన్‌
దగుఁ గమలవిలసితము కమలాక్షా!

69

న,ప,న,న,గగ

పదునేనవయతిశక్వరీచ్ఛందంబునందు మణిగణనికరముమనువృత్తము—

కనకపు వలువలుఁ గరకటకములున్‌
నునుపగు తుఱుమును నొసలితిలకమున్‌
దనరెడు హరిఁ గని తగననననసల్‌
నినిచిన మణిగణనికర మిభయతిన్‌.

70

న,న,న,న,స

అంద మాలినియనువృత్తము—

సకల నిగమవేద్యున్‌ సంసృతి వ్యాధివైద్యున్‌
మకుటవిమలమూర్తిన్‌ మాలినీవృత్త పూర్తిన్‌
సకలితసమయోక్తి న్నాగవిశ్రాంతియుక్తిన్‌
సుకవులు వివరింపన్‌ సొంపగున్విస్తరింపన్‌.

71

న,న,మ,య,య

అంద సుకేసరమనువృత్తము—

యతియవతారసంఖ్య నిడి యాదరంబుతో
నతిశయమై నజంబులు భజాంతరేఫలున్‌
వితతముగా నొనర్చి యరవిందలోచనున్‌
క్షితిధరు సంస్తుతించిన సుకేసరంబగున్‌.

72

న,జ,భ,జ,ర

అంద మణిభూషణమనువృత్తము—

హస్తిరాజభయనిర్హర యండజవాహనా
ధ్వస్తసంసరణ యంచుఁ బితామహవిశ్రమ
ప్రస్తుతంబుగ రనంబుల భారగణంబులన్‌
విస్తరింప మణిభూషణ వృత్తము చెల్వగున్‌.

73

ర,న,భ,భ,ర

అంద మనోజ్ఞయనువృత్తము—

అజశివశక్రనిరంతరార్చితపద్ద్వయున్‌
భుజగకులాధిపతల్పుఁ బూని నుతింపఁగా
నజయతి నొండి నజాభరార్చిత మైచనున్‌
ఋజు వగు నుర్వి మనోజ్ఞ ఋష్యనురాగమై.

74

న,జ,జ,భ,ర

పదునాఱవయష్టిచ్ఛందంబునందు ప్రియకాంతయనువృత్తము—

అవనియు శ్రీయు న్సతు లజుఁడాత్మోద్భవుఁ డాప్తుల్‌
దివిజులు దామోదరునకు దేవ ళ్ళిఁ కనేరి
సవతు గ నాఁగా నయనయనమ్యక్సగయుక్తిన్‌
గవినుతమై దిగ్యతిఁ బ్రియకాంతాకృతి యొప్పున్‌.

75

న,య,న,య,న,గ

అంద పంచచామరమనువృత్తము—

జరేఫలున్‌ జరేఫలున్‌ జసంయుతంబులై తగన్‌
గురూపరిస్థితిం బొసంగి గుంఫనం బెలర్పఁగా
విరించిసంఖ్య నందమైన విశ్రమంబులం దగున్‌
బ్రరూఢమైనఁ బద్మనాభ పంచచామరం బగున్‌.

76

జ,ర,జ,ర,జ,గ

అంద పద్మకమనువృత్తము—

నకలితంబు నభజాజగణంబులు గాంతమై
సకలదిగ్విరమణంబులు సన్నుతమై చనన్‌
శకట దైత్య మదభంజను సన్నుతిసేయఁగాఁ
బ్రకటమైకృతులఁ బద్మము పద్మకుఁ బట్టగున్‌.

77

న,భ,జ,జ,జ,గ

అంద ఫలసదనమనువృత్తము—

ననలును ననలును దనరఁగ సగయుక్తిన్‌
వనరుహ భవయతు లవహిత మతితోడన్‌
నినుపుచు సుకవులు మణివిలసదురస్కున్‌
గొనకొని పొగడఁగ నగు ఫలసదనంబుల్‌.

78

న,న,న,న,స,గ

అంద చంద్రశ్రీయనువృత్తము—

జగన్నాథున్‌ లక్ష్మీహృదయ జలజప్రోద్యదర్కున్‌
ఖగాధీశారూఢున్‌ సుకవిజనకల్ప ద్రుమంబున్‌
దగ న్వర్ణింపంగా యమనసయుతంబై రగంబుల్‌
మొగిం జంద్రశ్రీకి న్నిలుచు యతి ముక్కంటినొందున్‌.

79

య,మ,న,స,ర,గ

అంద మేదినియనువృత్తము—

నగణముతో జకారభగణంబుల్‌ జకార
ప్రగుణిత రేఫయున్‌ గురువుభాతిఁగాగ నోలిన్‌
దగ నవతార విశ్రమము దండిగా నొనర్పన్‌
మృగమదవర్ణుఁ డీయకొను మేదినీ సమాఖ్యన్‌.

80

న,జ,భ,జ,ర,గ

అంద నర్కుటమనువృత్తము—

కొలిచెద నందగోపసుతు కోమలపాదములన్‌
దులిచెదఁ బూర్వ సంచితపు దోషములన్‌ సుఖినై
నిలిచెద నన్న నర్కుటము నిర్మల వృత్తమగున్‌
సలలితమై నజంబుల భజావల దిగ్విరతిన్‌.

81

న,జ,భ,జ,జ,న

అంద శిఖరిణియనువృత్తము—

గజేంద్రాపద్ధ్వంసిన్‌ ముదిరసదృశుం గంజనయనున్‌
భజింతుం దాత్పర్యంబున ననినచో భాస్కరయతిన్‌
ప్రజాహ్లాదం బైనన్‌ యమనసభవ ప్రస్ఫురితమై
ద్విజశ్రేష్ఠు ల్మెచ్చన్‌ శిఖరిణి గడున్‌ విశ్రుతమగున్‌.

82

య,మ,న,స,భ,వ

అంద మందాక్రాంతమనువృత్తము—

చెందెం బాదాంబుజరజముచే స్త్రీత్వ మారాతికిం జే
యందెం జాపం బిరుతునుకలై యద్భుతం బావహిల్లన్‌
మ్రందె న్మారొడ్డి దశముఖుఁడున్‌ రాముచే నంచుఁ జెప్పన్‌
మందాక్రాంతన్‌ మభనతతగా మండితాశాయతుల్గాన్‌.

83

మ,భ,న,త,త,గగ

అంద పాలాశదళమనువృత్తము—

పదునయిదు లఘువులును బరఁగ గగ మొందన్‌
బదియగునెడ విరతులు బలసి పొడసూపన్‌
బొదలి హరినుతులఁగడు దొలుపగుచుఁ బాలా
శదళ మనఁబరఁగుఁ గవిజనులు గొనియాడన్‌.

84

15 లఘువులు గగ

అంద పృథ్వియనువృత్తము—

జసంబులు జసంబులున్‌ యలగ సంగతిన్‌ సాంగమై
పొసంగ నమృతాంశుభృద్యతులు పొందఁ బాదంబులై
బిసప్రసవలోచనా! వినుము పృథ్వినాఁ బృథ్విలో
నసంశయమగున్‌ భవద్వినుతులందు నింపొందినన్‌.

85

జ,స,జ,స,య,లగ

అంద హరిణియనువృత్తము—

జరగు నసమప్రోద్యద్రేఫల్‌ ససంగతమై లగల్‌
దొరయఁగ మురద్వేషిన్‌ సద్భక్తితో వినుతించెదన్‌
సరసిరుహగర్భే శానాదిత్యసత్తము నన్నచో
హరిణి యనువృత్తం బొప్పారున్‌ బురారి విరామమై.

86

న,స,మ,ర,స,లగ

పదునెనిమిదవధృతిచ్ఛందంబునందు మత్తకోకిలయనువృత్తము—

ఒక్కచేత సుదర్శనంబును నొక్క చేతను శంఖమున్‌
ఒక్కచేతఁ బయోరుహంబును నొక్క చేత గదం దగన్‌
జక్కడంబగుమూర్తికిన్‌ రసజాభరంబులు దిగ్యతిన్‌
మక్కువందగఁ బాడి రార్యులు మత్తకోకిల వృత్తమున్‌.

87

ర,స,జ,జ,భ,ర

అంద కుసుమితలతావేల్లితయనువృత్తము—

శ్రీనాథున్‌ బ్రహ్మాద్యమరవర సంసేవ్యపాదారవిందున్‌
దీనానాథ వ్రాత భరను గుణోదీర్ణునిం బాడి రోలిన్‌
గానారూఢాత్ముల్‌ మతనయయయల్‌ కామజిద్విశ్రమంబై
వీనుల్‌ నిండారం గుసుమితలతావేల్లితావృత్తమొప్పున్‌.

88

మ,త,న,య,య,య

అంద శార్దూలవిక్రీడితమనువృత్తము—

పద్మప్రోద్భవసన్నిభుల్‌ మసజస ప్రవ్యక్త తాగంబులన్‌
బద్మాప్తాంచితవిశ్రమంబుగ సముత్పాదింతు రుద్యన్మతిన్‌
బద్మాక్షాయ నిజాంఘ్రిసంశ్రిత మహాపద్మాయ యోగీంద్ర హృ
త్పద్మస్థాయ నమోస్తుతే యనుచు నీశార్దూలవిక్రీడితన్‌.

89

మ,స,జ,స,త,త,గ

అంద తరళమనువృత్తము—

జలరుహాహిత సోదరీ ముఖ చంద్ర చంద్రిక లాదటన్‌
గొలఁది మీఱఁగ లోచనంబులఁ గ్రోలి యొప్పు మహాసుఖిన్‌
బలుకుచో నభరంబులుం బిదపన్‌ సజంబు జగంబులున్‌
జెలువుగా దరళంబునోలి రచింతు రంధకజిద్యతిన్‌.

90

న,భ,ర,స,జ,జ,గ

అంద మేఘవిస్ఫూర్జితమనువృత్తము—

రమానాథున్‌ నాథున్‌ యదుకుల శిరోరమ్య రత్నాయమానున్‌
సముద్యత్తేజిష్ణున్‌ దనుజయువతిస్ఫారహారాపహారున్‌
మిముం బ్రీతిం బేర్కొం డ్రరుణ విరతిన్‌ మేఘ విస్ఫూర్జితాఖ్యన్‌
గ్రమంబొప్పన్‌ బెద్దల్‌ యమనసములున్‌ రాగముల్గా ముకుందా!

91

య,మ,న,స,ర,ర,గ

అంద భూతిలకమనువృత్తము—

వాఁడె వధూమణి చూడవే ద్రిదివద్రుమంబు ధరిత్రికిన్‌
బోఁడిమి దెచ్చిన శూరుఁ డీతనిఁ బోలలే రిల నెవ్వరున్‌
వీఁ డధికుం డని భీమవిశ్రమవృత్తి భూతిలకం బగున్‌
వేఁడి నుతింతురు భారసంబుల వెంట జాగము లొందఁగాన్‌.

92

భ,భ,ర,స,జ,జ,గ

అంద చంద్రకళయనువృత్తము—

వీనులారఁ బ్రసిద్ధపదంబుల్‌ వేడుకఁ గూర్చి దిశాయతిన్‌
గాన వచ్చి రపాతజజంబుల్‌ గల్గ దిటంబుగఁ జెప్పగన్‌
జానకీవదనాంబుజ శశ్వత్సౌరభలోల మధువ్రతా
దానవాంతక చంద్రకళా వృత్తంబు సభం గడు నొప్పగున్‌.

93

ర,స,స,త,జ,జ,గ

అంద మత్తేభవిక్రీడితమనువృత్తము—

భవరోగప్రవినాశనౌషధకలాప్రావీణ్యగణ్యుండు శై
లవిభేదిప్రముఖాఖిలామరదరోల్లాసుండు గోవిందుఁ డం
చు వివేకు ల్సభరంబులు న్నమయవస్తోమంబు గూడన్‌ సమ
ర విధిం జెప్పుదురా త్రయోదశయతి న్మత్తేభవిక్రీడితన్‌.

94

స,భ,ర,న,మ,య,వ

అంద అంబురుహంబనువృత్తము—

తారతుషారపటీరమరాళసుధాసమానమహాయశా
నీరదభృంగతమాలదళాసితనీరజేంద్రమణిద్యుతీ
హారకిరీటముఖాభరణాంచిత యంచు శ్రీపతిఁ గూర్చి భా
భారసవంబుల భాను విరామముఁ బల్క నంబురుహంబగున్‌.

95

భ,భ,భ,భ,ర,స,వ

అంద ఉత్పలమాలయనువృత్తము—

శ్రీరమణీముఖాంబురుహ సేవన షట్పద నాథ యంచు శృం
గార రమేశ యంచు ధృత కౌస్తుభ యంచు భరేఫనంబులన్‌
భారలగంబులుం గదియఁ బల్కుచు నుత్పలమాలికాకృతిన్‌
గారవమొప్పఁ జెప్పుదురు కావ్యవిదుల్‌ యతి తొమ్మిదింటఁగాన్‌.

96

భ,ర,న,భ,భ,ర,లగ

అంద ఖచరప్లుతమనువృత్తము—

వరద కేశవ దైత్యవిదారీ వారిజనాభ జగన్నిధీ
కరుణఁ జూడుము మమ్ముఁ బ్రసన్నాకార హరీయని పల్కినన్‌
వరుసతో సభభంబు మసావల్‌ వాలఁగ రుద్రవిరామ మై
యరుదుగా మునిపుంగవ వర్ణ్యంబై ఖచరప్లుత మొప్పగన్‌.

97

న,భ,భ,మ,స,వ,న

అంద చంపకమాలయనువృత్తము—

త్రిభువనవంద్య గోపయువతీజనసంచితభాగధేయ రుక్‌
ప్రభవసముత్కరోజ్జ్వల శిరస్స్థిత రత్న మరీచి మంజరీ
విభవ సముజ్జ్వలత్పదరవింద ముకుంద యనంగ నొప్పునా
జభములు జాజరేఫములుఁ జంపకమాల కగున్‌ దిశాయతిన్‌.

98

న,జ,భ,జ,జ,జ,ర

అంద స్రగ్ధరయనువృత్తము—

తెల్లంబై శైలవిశ్రాంతిని మునియతినిం దేజరిల్లున్‌ దృఢంబై
చెల్లెం బెల్లై మకారాంచిత రభనయయల్‌ చెంద మీఁదన్‌ యకారం

బుల్లం బారన్‌ బుధారాధ్యు నురగశయనున్‌ యోగివంద్యుం గడున్‌ రం
జిల్లం జేయం గవీంద్రుల్‌ జితదనుజగురం జెప్పుదుర్‌ స్రగ్ధరాఖ్యన్‌.

99

మ,ర,భ,న,య,య,య

అంద వనమంజరియనువృత్తము—

హరి పురుషోత్తమ కృష్ణ కృపానిధి యాదిమూలమ యంచు నా
కరిపతి పల్కఁగఁగాచె నితం డని కౌతుకంబునఁ బల్మరున్‌
జరగుఁ ద్రయోదశవిశ్రమముల్‌ నజజాజభాంచితరేఫలన్‌
మరుగురునిం బ్రణుతింతు రిలన్‌ వనమంజరిం గవిపుంగవుల్‌.

100

న,జ,జ,జ,జ,భ,ర

అంద మణిమాలయనువృత్తము—

శరణాగతార్తిహర ణాంబుజాతదళ సన్నిభాంబక యుగా
కరుణాసముద్ర జగదాదికారుణ పురాణమూర్తి యనుచున్‌
వరుసన్‌ సజత్రితయమున్‌ ద్రివారమొనరున్‌ సకారము తుదిన్‌
దిరమొంద దిగ్యతిఁ గవుల్నుతింప మణిమాలవృత్తమరున్‌.

101

స,జ,స,జ,స,జ,స,

అంద లాటీవిటమనువృత్తము—

సగణంబులునాల్గిటిపై మతయల్‌ సమ్యగ్భావంబై యరుదేరన్‌
బగలింటికి నేలిక యెవ్వఁడు నా భావింపంగా భాసురభంగిన్‌
మిగులన్మధురంబగు శబ్దములన్‌ విశ్రాంతిన్‌ లాటీవిటవృత్తం
బగునిందుకళాధరసన్నుత నామాంకాశంకాంతంకవిదారీ!

102

స,స,స,స,మ,త,య

ఇరువదిరెండవయాకృతిచ్ఛందంబునందు మానినియనువృత్తము—

కొన్నెలపువ్వును గోఱలపాఁగయుఁ గూర్చిన కెంజడ కొప్పునకున్‌
వన్నె యొనర్చిన వాహిని యీతని వామపదంబున వ్రాలె ననన్‌
జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విలసిల్లు రసత్రయ చిత్రయతుల్‌
పన్నుగఁ నొందఁ బ్రభాసురవిశ్రమ భంగిగ మానిని భవ్యమగున్‌.

103

భ,భ,భ,భ,భ,భ,భ,గ

అంద మహాస్రగ్ధరయనువృత్తము—

కొలిచెం బ్రోత్సాహవృత్తిం గుతలగగనముల్‌ గూడ రెండంఘ్రులం దా
బలిఁ బాతాళంబు చేరం బనిచెఁ గడమకై బాపురే వామనుండ
స్ఖలితాటోపాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకార మారన్‌ నతానో
జ్జ్వలసోద్యద్రేఫయుగ్మాశ్రయగురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్‌.

104

స,త,త,న,స,ర,గ

అంద భద్రకముమనువృత్తము—

ఆది భఁజేసియవ్వలరనద్వయంబు నొగి మూఁడు తానకములన్‌
బాదుకొనంగ నొక్కగురువొందఁ బైవిరతి రుద్రసంఖ్య నిడినన్‌

గాదనరాదు భద్రకమునాఁగ గాఢమగువృత్త మొప్పుఁ గృతుల
శ్రీదనరార నాశ్రిత వితాన చించిత ఫల ప్రదాన నృహరీ!

105

భ,ర,న,ర,న,ర,న,గ

ఇరువదిమూఁడవవికృతిచ్ఛందంబునందు కవిరాజవిరాజితమనువృత్తము—

కమలదళంబులకైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖప్రభలున్‌
సమధికవృత్తకుచంబులు నొప్పఁగ శైలరసర్తు విశాలయతిన్‌
సముచితనాన్వితషడ్జలగంబుల జానుగఁ బాడిరి చక్రధరున్‌
రమణులు సొంపలరం గవిరాజవిరాజితమున్‌ బహురాగములన్‌.

106

న,జ,జ,జ,జ,జ,జ,లగ

అంద అశ్వలలితమనువృత్తము—

ఇనవిరమంబున న్నజభజంబులింపుగ భజంబులున్‌ భవములై
చనఁ జన నొప్పునశ్వలలితంబు సత్కృతులఁ జెప్పఁగా విశదమై
యనుపమవైభవోజ్జ్వల హరీ సహస్రకరదోర్విదారణచణా
నినుఁగొనియాడ ధన్యుఁడు గదయ్య నీ కరుణ దాననంత మగుటన్‌.

107

న,జ,భ,జ,భ,జ,భ,వ

అంద పద్మనాభమనువృత్తము—

మున్నెవ్వరున్‌ లేని కాలంబునన్‌ సృష్టి మూలంబుగాఁ బద్మగర్భు సృజించెన్‌
మున్నీటిలోఁ బాఁపతల్పంబు పై వెన్ను మోపెం ద్రిలోకంబులుం గుక్షి నుండన్‌

ఎన్నంగ నీతం డనాద్యంతుఁ డంచున్‌ నిరీక్షింతు రెవ్వారి వాఁడెల్లనాఁడున్‌
నన్నేలు నా నర్కవిశ్రాంతమై పద్మనాభం బగున్‌ సప్తతంబు ల్గగంటున్‌.

108

త,త,త,త,త,త,త,గగ

ఇరువదినాలుగవసంకృతిచ్ఛందంబునందు అష్టమూర్తియనువృత్తము—

శ్రీనాథున్‌ సరసిజాక్షున్‌ సితసరోజాతనాభున్‌ జితనిశాటవరేణ్యున్‌
గానోదంచితరసజ్ఞుం గరిభయధ్వాంత భానున్‌ గనకవస్త్రవిలాసున్‌
జానొంద న్మనతయుక్తిన్‌ సరభజల్‌ యాంతమై కుంజరయతిద్వయ మొప్పం
గా నిట్లం పెసఁగఁ జెప్పెం గవిజనం బష్టమూర్తిన్‌ ఘనసమాగమరీతిన్‌.

109

మ,న,త,స,ర,భ,జ,య

అంద సరసిజమనువృత్తము—

మౌళిం బిల్లంగోలొకచేత న్మఱియొక కరమున మణిమయలతయున్‌
బాలశ్రేణుల్మ్రోల వసింపన్‌ బసులనొదిగి చనుపసగల ప్రభువున్‌
జాలం గొల్వంజాలినకోర్కుల్‌ సఫలములగు ననసరసిజమమరున్‌

బోలన్‌ బ్రహ్మవ్యాళవిరామ స్ఫురదురుమతయనములు నననసలున్‌.

110

మ,త,య,స,న,న,న,స

అంద క్రౌంచపదమనువృత్తము—

కాంచనభూషాసంచయ మొప్పన్‌ ఘనకుచభరమునఁ గవు నసియాడన్‌
జంచలనేత్ర ల్వంచనతోడన్‌ సముచితగతి వెనుచని తనుఁగొల్వన్‌
అంచితలీల న్మించినశౌరిన్‌ హరిదిభపరిమితయతు లొనఁగూడన్‌
ముంచి రచింపం గ్రౌంచపదం బిమ్మొగి భమసభననముల నయలొందున్‌.

111

భ,మ,స,భ,న,న,న,య

ఇరువదేనవయతికృతిచ్ఛందంబునందు బంధురమనువృత్తము—

ఋభువులు దితితనయులు సమబలులై యెంతయు మత్సరము ల్బెరయన్‌
రభస మలరఁ గలశనిధిఁ దఱవఁగం గ్రక్కునఁ గవ్వపుఁగొండకు నీ
ప్రభు వనువుగఁ గుదురుగ నిలిచె ననం బంచదశాక్షరవిస్రమమై
ప్రబ మిగులఁగ ననననసభభభగల్‌ బంధుర వృత్తము చెప్పఁదగున్‌.

112

న,న,న,న,స,భ,భ,భ,గ

అంద భాస్కరవిలసితమనువృత్తము—

గోపనికరముల నేలినవానిన్‌ గోవృషదనుజుల నడఁచినవానిన్‌
గోపికలను బ్రమయించినవానిన్‌ గుబ్జకు విలసన మొసఁగినవానిన్‌
గోపకులము వెలయించినవానిన్‌ గొల్చెద మని బుధు లినయతిఁ బల్కన్‌
బ్రాపుగ భనజయభాశ్రిత నాసల్‌ భాస్కర విలసితమగు గురుయుక్తిన్‌.

113

భ,న,జ,య,భ,న,న,స,గ

ఇరువదియాఱవయుత్కృతిచ్ఛందంబునందు భుజంగవిజృంభితమనువృత్తము—

స్వారాజారి వ్రాతారాతీశశిపనసమనయన సర్వదా మునివందితా
గౌరీశాద్యామర్త్యస్తుత్యా కమలభవజనక మధు కైటభాసురమర్దనా
శ్రీరామాహృత్స్వామీ యంచున్‌ జెలఁగి మమతనననలఁ జెంద రేఫసలున్‌ లగన్‌
ఘోరాఘౌషూభిద్వేషిం బేర్కొనఁగ వసుదశయతియగున్‌ భుజంగవిజృంభితన్‌.

114

మ,మ,త,న,న,న,ర,స,లగ

అంద మంగళమహాశ్రీయనువృత్తము—

చిత్తములఁ జూపులను జిత్తజుని తండ్రిపయిఁ జెంది గజదంతియతు లొందన్‌

నృత్తములతోడఁ దరుణీమణులు గానరుచు లింపుగను మంగళమహాశ్రీ
వృత్తములఁ బాడిరి సవృత్తకుచకుంభముల వింతజిగి యెంతయుఁ దలిర్పన్‌
మత్తిలుచు నబ్భజసనంబు లిరుచోటులఁ దనర్పఁగఁ దుదన్‌ గగ మెలర్పన్‌.

115

భ,జ,స,న,భ,జ,స,న,గగ

ఇవి సమవృత్తభేదములు.

వ.

మఱియు నర్థసమవృత్త విషమవృత్తంబు లెట్టి వనిన.

116


క.

ధరనొకటియు మూఁడును నగు
చరణంబులు మఱిద్వితీయ చాతుర్థిక వి
స్ఫురితాంఘ్రులుఁ దమలోనను
సరి యగునర్థసమవృత్తచయమునఁ గృష్ణా!

117


గీ.

జరగునందు స్వస్థానార్థసమ మనంగ
ఛంద మొకటన నిట్టిలక్షణముదగుల
నమరుఁ నట పరస్థానార్థసమము నాఁగ
నెలమిఁ దరువాతి ఛందంబు గలయఁ గృష్ణ.

118


సీ.

విషమవృత్తంబులు వెలయు బాదంబుల
                              గణములు వేర్వేఱుగా నొనర్ప
నవియు స్వస్థానంబు నటపరస్థానంబు
                              సర్వపరస్థానసంజ్ఞికంబు

నొక్క ఛందంబున నొగిఁ గొని పాదముల్‌
                              వేఱైన స్వస్థానవిషమ మయ్యె
నొకపాద మొక్కట నున్న పాదంబులు
                              క్రిందటి ఛందంబునందు నైన


తే.

మీఁది చందంబునందైన మెఱయఁ జెప్ప
నవి పరస్థాన విషయ వృత్తాహ్వయములు
వెండి సర్వపరస్థాన విషమమునకు
నన్నియునుఁ జెప్ప ఛందంబు లబ్జనాభ.

119

స్వస్థానార్థసమవృత్తములలో నారీప్లుతమనువృత్తము

క్షీరోదన్వన్మధ్యగేహ మతాగా
సారంబు నుద్యత్తతజ ల్గగంబున్‌
బూరింపంగాఁ బాదముల్‌ రెంట రెంటన్‌
నారీప్లుతం బయ్యె ననంతమూర్తీ!

120

పరస్థానార్థసమవృత్తంబులలోమనోహరమనువృత్తము

క్ష్మారాజ రమేశ జతావము లు
ద్ధుర మైనసకారచతుష్కముతోఁ
గూరంగ సగంబులు గూడి మనో
హరవృత్తము చెల్వగు నద్రిధరా!

121

స్వస్థానవిషమవృత్తములలో అంగజాస్త్రమనువృత్తము

భూరిభమంబుల్‌ పొందు సగం బిం
పారఁగ నర్థంబై యటసామున్‌
శౌరీ విన్మసజంబు గాంతమై
యారూఢం బగు నంగజాస్త్రమున్‌.

122

అంద వరాంగియనువృత్తము

సరిత్పదాబ్జా జతజల్‌ గగల్‌ బం
ధురం బగున్‌ రెంట జతుర్థకాంఘ్రిన్‌
గారాముతోఁ దాజగగల్‌ వరాంగిన్‌
హరార్చితా మూఁడవయంఘ్రి నొందున్‌.

123

అంద నదీప్రఘోషయనువృత్తము

నాగతల్పా మొద ల్నాల్గు రేఫంబులున్‌
జగన్నివాసా జతజంబు రేఫయున్‌
దగంగ నమ్మూఁడు పదంబులందు జా
తిగాఁ బ్రవర్తించు నదీ ప్రఘోషకున్‌.

124

పరస్థానవిషమవృత్తంబులందు శ్రీరమణమనువృత్తము

ధాత్రి భమంబుల్‌ తత్సగ మాదిన్‌
భత్రయగాగణపద్ధతి మూఁటన్‌
గోత్రధరా యిటు గూర్పఁ బదంబుల్‌
చిత్రగతిం జను శ్రీరమణంబుల్‌.

125

అంద రథగమనమనోహరమనువృత్తము

రథగమన మనోహరంబు రెండవాంఘ్రిన్‌
ప్రథితం బగున్‌ సజజంబు రప్రయుక్తయంబున్‌
ప్రథమపదమునందుఁ బైసగంబునందున్‌
గథితననరజంబు గద్వయంబుఁ గృష్ణా!

126

సర్వపరస్థానవిషమవృత్తములందు వీణారచనమనువృత్తము

వీణారచనం బయ్యె భువిన్‌ తయసాగల్‌
బాణప్రహరా తజనభభవ్యగగంబుల్‌

చాణూరహరా తజనభస ల్ప్రకటయతిన్‌
వేణుధర భననభసవిశ్రుత మగుచున్‌.

127

ఇత్తెఱంగు గాక సమవృత్తంబులలో పంచపాది యనువృత్తము—

క.

పాదచతుర్వృత్తంబున
నాదరమునఁ బంచపాది యనుసమవృత్తం
బైదవపదంబు గలిగిన
మాదయితా కృతులయందు మహనీయ మగున్‌.

128


ఉ.

శ్రీసతిఁ బేరురంబున ధరించినభోగి చతుర్ముఖుండు నా
భీసరసీరుహంబునకు బిడ్డఁడుగా విలసిల్లి మేటి కై
లాసనగాలయుండు జడలన్‌ సవరించినయేటిపుట్టినిల్‌
భాసురపాదపద్మ మగుబల్లిదుఁ డివ్విభుఁ డంచు సన్నుతుల్‌
సేసిరి సన్మునీంద్రు లనఁ జెన్నగువృత్తము పంచపాదియై.

129


క.

పరఁగఁగ నిఱువదియాఱ
క్షరములకును నధిక మగుచుఁ జరణంబుల ను
ద్ధురమాలావృత్తంబులు
జరగు లయగ్రాహి మొదలు జలరుహనాభా!

130

ఏకోనచత్వారింశ న్మాత్రాగర్భితంబుఁ ద్రింశదక్షరంబు నైన లయగ్రాహి—

ఎందు నిల దేజనులకుం దలఁపరానితప -
                              మందికొనిచేసిరొకొ నందుఁడు యశోదా

సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడుందొరసి
                              పొందగునుముప్పుతఱి నందనునిగా శ్రీ
మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసములు
                              గ్రందుకొని చెప్పుమునిబృందము లయగ్రా
హిం దనర నబ్భజసలుం దగ నకారమును
                              బొంద నిరుచోట్లని బిఱుంద భయ లొందన్‌.

131

ఏకోనచత్వారింశన్మాత్రాగర్భితపాదంబును చతుస్త్రింశదక్షరంబు నయిన లయవిభాతి—

పడయరె తనూభవులఁ బడయుదురు గాక పెర
                              పడఁతులును భర్తలను బడసిరె తలంపన్‌
బుడమి నలనందుఁడును బడఁతుక యశోదయును
                              గడుపున జగత్త్రయము నిడికొనిన పుత్రున్‌
బడసిరఁట యంచు బెడఁ గడరునసనత్రివృతి
                              గడనసగముల్‌ పొసఁగ నిడ లయవిభాతిన్‌
నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు
                              వడియు పగిదిన్‌ రసము కడలుకొనుచుండన్‌.

132

ఏకోనచత్వారింశన్మాత్రాగర్భితపాదంబును సప్తత్రింశదక్షరంబు నైన లయహారియనువృత్తము—

చదువులును గిదువులను జదువ ధన మొదవు నని
                              మదిఁ దలఁపవలదు మును చదివిరె ధరిత్రిన్‌
సదమలినహృదయుఁ డనఁ బొదలు దితిసుతసుతుఁడు
                              మొదలఁ బలికినపలుకు జదువఁగ ముకుందుం

డద నెఱిగిఁ కదిసెఁ గద! చదివినభృగువుకొడుకు -
                              చదువుతుది నొకపనికి నొదవెనె యటంచున్‌
పదునొకఁడు నగణములు గదిసి సగమెనయ భువి
                              విదితముగ బుధులు పలుకుదురు లయహారిన్‌.

133

అంద త్రిభంగియనువృత్తము—

నననన ననసస లును భమసగలును
                              దనరి నటింపఁ గణంకన్‌ నలువంకన్‌ బెంపుదొలంకన్‌
మునుకొని నఖముఖమున వెడఁగదలుపఁ
                              జనుఁ గడునొప్పగువీణల్‌ నెరజాణల్‌ వేలుపుగాణల్‌
వనరుహ జనితుని తనయులు మొదలుగ
                              ఘనమతులాదటతోడన్‌ శ్రుతిగూడన్‌ వెన్నునిఁబాడన్‌
వినఁగలిగిన నదిజననము ఫలమని
                              మునిజను లిందు శుభాంగున్‌ దగుభంగిన్‌ జెప్పుఁ ద్రిభంగిన్‌.

134

అంద అనియతాక్షరంబైన దండకము—

సిరి నేలు రసికుండు శ్రీవత్సవక్షుండు నీరేరుహాక్షుండు నిత్యాసదృక్షుండు త్రైలోక్య
సంరక్షణోపాయ దక్షుండు మాపాలి దేవుండు ధీరుం డుదారం డితం డిచ్చు మాయిచ్చకు
న్వచ్చు సౌఖ్యమ్ము లంచు న్మదిం గోరి పెద్దల్‌ స కారంబుతో సంగతం బై నహం
బాది నొండెన్‌ దకారాదిగా నైన; లో నెల్ల చోటన్‌ దకారంబులం బెల్లు చెందన్‌
గకారావసానంబు నై దండకాకార మేపారఁ గీర్తింతు రెల్ల ప్పుడున్‌.

135

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యతనుసంభవ సుకవిజనవిధేయ అనంతనామ
ధేయప్రణీతం బైన ఛందోదర్పణంబునందు నుభయభాషానురూపంబు లగు గద్యపద్యం
బులవిధంబును షడ్వింశతిచ్ఛందోనామంబులును, తదుద్భవంబు లగు సమ
వృత్తంబులును, వృత్తమిశ్రంబు లగు నర్థసమవిషమవృత్తంబులు
ను, ఛందోఽతిరిక్తంబు లగు మాలావృత్తంబులును,
తద్భేదం బగు దండకంబు నన్నది
ద్వితీయాశ్వాసము.

  1. దీనిపేరే మదనవిలసితము (చూ. కవిజనాశ్రయము)