చిరస్మరణీయులు, మొదటి భాగం/రహిమతుల్లా యం. సయానీ
75
29. రహిమతుల్లా యం. సయానీ
(1847-1902)
1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రప్రథమ సమావేశానికి మొత్తం 72 మంది ప్రముఖులు హజరు కాగా, అందులో ఇరువురు ముస్లింలున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు రహిమతుల్లా ముహమ్మద్ సయానీ కాగా మరోకరు అబ్దుల్లా ధర్మాసి.
బొంబాయిలోని ఒక అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంలో 1847 ఏప్రిల్ 5న జన్మించిన రహిమతుల్లా తండ్రి పేరు ముహమ్మద్ సయానీ. ఆంగ్ల భాష పట్ల ముస్లిం సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న రోజుల్లో 1868లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని సాధించిన తొలిముస్లింగా ఖ్యాతిగాంచిన సయాని 1870లో న్యాయశాస్త్రం పూర్తి చేసి బొంబాయిలో సమర్ధుడైన న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించారు.
న్యాయవాదిగా రాణిస్తూ సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ప్రజల మన్నన పొందిన ఆయన 1876లో బొంబాయి మున్సిపల్ కార్పోరేషనకు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1888లో బొంబాయి కార్పోరేషన్ మేయర్ పదవి చేపట్టారు. ఆ తరువాత ప్రాంతీయ రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల మీద దృష్టి నిల్పిన సయానీ 1885లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభోత్సవ సమావేశానికి హాజరయ్యారు.
చిరస్మరణీయులు 76
ఆనాడు సర్ సయ్యద్ అహమ్మద్ సాగించిన కాంగ్రెస్ వ్యతిరేకత ప్రచార హోరును తట్టుకుంటూ, సయ్యద్ సంధించిన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలిస్తూ, ముస్లింలు జాతీయ కాంగ్రెస్‌లో తప్పక చేరాలని, ఉమ్మడి పోరాటాలలో భాగస్వామ్యం ఉన్నప్పుడే ఉమ్మడి సంపద నుండి వాటా పొందాడానికి ముస్లింలకు అర్హత, హక్కు లభిస్తుందని వాదించారు. భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన నిలచిన ఆనాటిప్రముఖులలో రహమతుల్లా యం. సయానీ అగ్రగణ్యులుగా జాతీయోద్యమ నిర్మాణానికి గట్టి పునాదులు వేశారు.
1888లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సబ్యునిగా ఎంపికైన రహమతుల్లా 1896 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 1896లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజల పక్షం మాత్రమే వహించారు. ప్రజలకు
సంబంధించిన సమస్యల మీద బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా గొంతు
విన్పించడానికి ఏమాత్రం వెనుకాడని ఆయన ప్రజా సమస్యలను సాధికారికంగా విశ్లేషిస్తూ పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రజలచేత-అధికారులచేత భళీ అన్పించుకున్నారు.
1893లో బొంబాయి ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశాలకు, 1896 డిసెంబరులో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ 12వ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన దేశంలోని అన్ని సాంఫిుక జనసముదాయాల మధ్య ఐక్యత కోసం, మత సామరస్యం - శాంతి కోరుతూ ఆచరణాత్మకంగా విశేష కృషి సల్పారు.
భారతదేశ సంపద తరలింపునకు గురవుతున్నవిషయ, తద్వారా జరుగుతున్ననష్టాన్ని విశ్లేషణాత్మకంగా వివరించారు. ప్రతి సంవత్సరం భారతదేశం నుండి తరలిపోతున్న సంపదకు సమానంగా వాణిజ్య ప్రయాజనం భారతీయులకు దక్కడంలేదని గణాంకాలతో ప్రకటించారు. పన్నుల విధింపు విషయంలోబ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల మీద మోపుతున్న భారాన్ని, చూపుతున్న వివక్షను సాధికారికంగా నిలదీశారు. సివిల్, మిలటరీ వ్యవస్థలలో అనుత్పాదక వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరాన్ని ప్రకటించారు. వ్యవసాయం, కరువు తదితర సమస్యలను బాగా అధ్యయనం చేసి ఆకలిని మించిన తిరుగుబాటు ఉండదని సైద్ధాంతికంగా వివరిస్తూ రహమతుల్లా ప్రబు త్వాన్ని హెచ్చరించారు.
ఈ విధంగా భారతదేశాన్ని బ్రిటిషర్ల బానిసత్వం, దోపిడి నుండి విముక్తం చేసేందుకు, భారతీయుల స్థితిగతులలో మార్పు కోసం, సామరస్యం, శాంతి- సౌభాగ్యాల కోసం ఆహర్నిశలు శ్రమించి 'భారత దేశపు నిజమైన ముద్దుబిడ్డడు' గా ఖ్యాతిగాంచిన రహిమతుల్లా ముహమ్మద్ సయాని 1902 జూన్ 4న అంతిమ శ్వాస విడిచారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్